"నీకు అసలు బుద్ధిలేదే" కోప్పడింది సునాదమాల బామ్మను. "ఎవరేది ఇచ్చినా తీసేసుకోవడమే-"
"ఎవరో ఏమిటే- ఆ అబ్బాయిని చూస్తూంటే ఎంత ముచ్చటేస్తూంది" అంది బామ్మ.
"వయస్సులో ఉంటే మీరే ప్రేమలో పడతాననేట్లున్నారే బామ్మగారూ" చురక అంటించింది పక్కనున్న స్నేహితురాలు.
బామ్మ తక్కువ తినలేదు.
"మీ వయసులో ఉన్నవారు మాలా ఆలోచిస్తూంటే, మేం మీలా ఆలోచించక తప్పుతుందా అమ్మా" అంది.
ఆవిడ లోపలికి వెళ్ళాక "ఇంతకీ ఎవడే ఆ హీరో? పేరేమిటి?" అని అడిగింది స్నేహితురాలు.
"విహారి అని... నాటకంరోజు, తరువాత మరొకసారి చూశాను. అంతే!"
"ఏమన్నాడు? ఈ థాంక్సే ప్రేమలోకి దిగితే అంతకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ వుండరన్నాడా?"
"ఊరుకోవే. జరిగింది తల్చుకుంటే నాకు వళ్ళంతా కంపరంగా వుంది."
"నేనయితే, అలాంటి వాడెవడయినా నాకోసం అంత రిస్కు తీసుకుంటే వెంటనే ప్రేమించేస్తాను."
"నాకిటువంటి ప్రేమలమీద నమ్మకం లేదు".
"ప్రేమలో పడకముందు ఎవరయినా ఇలాగే అంటారు. ఒకసారి పడి చూడు తెలుస్తుంది"
"నాకు మొగవాళ్ళంటే భయం. అంతేకాదు అసహ్యం కూడా. మా అక్కా- మా అమ్మా- అందరూ మొగవాడివల్లే నాశనం అయ్యారు. నాకు ప్రేమ సంగతి చెప్పకు" మొహం చిట్లిస్తూ అంది సునాదమాల.
"పోనీ ఒక పని చెయ్యి. ఆ కుర్రాడెలాంటివాడో పరీక్షపెట్టు. నీ కోసం ఎంత కష్టపడగలడో చూడు. అతడి ప్రేమ నిజమయితే నువ్వూ ప్రేమించెయ్!"
"నాకు పరాయి మొగాళ్ళతో మాట్లాడాలంటేనే భయం. రిజిస్టర్ పోస్టు సంతకం పెట్టవలసి వచ్చినా, పోస్టుమాన్ కుర్రాడయితే కాళ్ళు వణుకుతాయి."
"ఎదుటపడి మాట్లాడకు."
"ఎదుట పడకుండా ఎలా మాట్లాడటం?"
"పోస్టుద్వారా."
"బాబోయ్! వద్దులేవే-"
"ఏదో నవలలో హీరోయిన్ అలాగే ఏడిపిస్తుంది. అఫ్ కోర్స్ అది దుఃఖాంత మనుకో-పాపం ఆ కుర్రవాడు నీకోసం అంత కష్టపడ్డప్పుడు, కాస్త కనికరించటం ఆడదానిగా నీ ధర్మం."
"ఇంకా నయం. కనికరించి పడకవేసి పాలగ్లాసు ఇమ్మనలేదు."
"పెళ్ళయ్యాక అవన్నీ ఎలాగూ తప్పవనుకో. అసలు పెళ్ళి వరకూ వస్తాడా రాడా అన్నది నిర్ణయించాలి."
"వచ్చినా, నాలాటి తెలివి తక్కువదాన్ని, భయస్తురాలిని చూసి పారిపోతాడు."
"తెలివి, ధైర్యం ఉన్నాయని నిరూపించు ఫోన్లో."
"అబ్బ, వద్దులేవే" అంది సునాదమాల తిరస్కరిస్తున్నట్టు.
మరికొంచెం సేపు వాదించి విసుగొచ్చి కమల వెళ్ళిపోయింది.
అప్పుడు పడింది సునాదమాల దృష్టి విహారి పంపిన ప్యాకెట్ మీద. అయిష్టంగానే విప్పింది.
లోపల పది పన్నెండు పుస్తకాలున్నాయి. అన్నీ తెలుగు నవలలు. "ఉప్పులేని పప్పుచారులాంటి అమ్మాయికి! ఏ ఒక్క హీరోయిన్ లానైనా మీరు తయారవ్వాలని కోరుకుంటూ- విహారి" అని వుంది చిన్న ఉత్తరం. ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఏమనుకుంటున్నాడు ఇతడు తన గురించి?
ఆమె పుస్తకాలన్నీ కట్టకట్టి అటకమీద పారేసి చేతులు సబ్బుతో కడుక్కుంది. స్నేహితురాలు ఫోన్ చెయ్యమని ఇచ్చిన సలహా గుర్తొచ్చింది ఆ రాత్రి. ఆలోచన్లని పారద్రోలి గట్టిగా కళ్ళు మూసుకుంది. విహారి గుర్తొచ్చాడు నిద్రపట్టలేదు.
* * *
ఆ రాత్రి చాలాసేపటి వరకూ విహారికి నిద్ర పట్టలేదు.
మృత్యువు వెంట్రుకవాసిలో తప్పిపోవటం నుంచి, ప్రవల్లిక పొదచాటుకి పరుగెత్తటం వరకూ ప్రతీ సంఘటనా కళ్ళముందు తిరుగుతున్నాయి.
అతడు పక్కమీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.
టైమ్ పన్నెండున్నర కావొస్తూంది.
ఆ టైమ్ లో ఫోన్ మ్రోగింది.
విహారి ఫోన్ అందుకుని "హల్లో" అన్నాడు.
"హల్లో" అట్నుంచి తియ్యటి కంఠం వినిపించింది.
"ఎవరు?"
"మిమ్మల్ని ప్రేమించాలనుకుంటూన్న ఒక అమ్మాయిని."
విహారి ఉలిక్కిపడి "వ్వాట్!" అన్నాడు.
"అవును. ఉన్నమాట ఉన్నట్టు చెప్పటంలో తప్పేముంది?"
"ఎవరు మీరు?"
"చెప్పానుగా! ఐ.లవ్.యు. ఐ వాంట్ యు టు టెల్ మి వెదర్ యు లవ్ మి."
"పిచ్చాసుపత్రి నుంచా?"
"కాదు."
"కాకపోతే ఇలా ముక్కూ మొహం తెలియని వాళ్ళని ఫోన్ చేసి ప్రేమిస్తున్నానన్నారు."
"మీ ముక్కు అంగుళంన్నర పొడవు. మొహం కోలది. ఎవరన్నారు రెండూ తెలియవని? మీకు నేను తెలుసు, నాకు మీరు తెలుసు. అందుకే రిసీవర్ కి అడ్డుగా కాగితం పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు కనుక్కోగలరా నేనెవరో?"
విహారి వెంటనే సమాధానం చెప్పాలనుకున్నాడు. కానీ అప్పటివరకు ఆమె గురించి ఆలోచిస్తూ వుండటంవల్ల "ప్రవల్లికా?" అని నోరుజారి చప్పున నాలిక్కర్చుకున్నాడు.
"ఆవిడెవరు?"
"సారీ... మీకూ... మీకూ... సారీ... మీరూ... సునాద..." అతడి మాట పూర్తికాలేదు. అట్నుంచి "ప్రేమ ఎందులోంచి పుడుతుంది? సారీలోంచా, థాంక్స్ లోంచా?" అన్న ప్రశ్న వినిపించింది నవ్వుతో.
"నాకు తెలిసిపోయింది మీరెవరో- నిజం చెప్పమంటారా? మొదటి చూపులో ప్రేమ అంటే ఏమిటో, మిమ్మల్ని చూసాకే తెలిసింది. యు ఆర్ సో బ్యూటీఫుల్" ఏడిపించటం మొదలు పెట్టాడు.
"అయితే గుర్తుపట్టారన్న మాట".
"ఆహ, శుభ్రంగా" అన్నాడు.
తను పంపిన పుస్తకాల ప్రభావం అప్పుడే ఆ అమ్మాయిమీద పడిందన్నమాట! కాస్త మెదడు కదుల్తోంది.
"చెప్పుకోండి చూద్దాం" అంది.
"సునాదమాల".
"చూడబోతే మీరూ గోపాలకృష్ణుల్లా వున్నారే! ఇప్పటికి ఇద్దరి పేర్లు చెప్పారు. ఇంతకీ మీరు వెల్లకిలా పడుకుని మాట్లాడుతున్నారా? బోర్లా పడుకుని మాట్లాడుతున్నారా?"
"కూర్చుని మాట్లాడుతున్నాను".
"అమ్మాయితో మాట్లాడేటప్పుడు బోర్లా పడుకుని మాట్లాడాలి. అది మొదటి పాఠం. బోర్లా పడుకోండి. అన్నట్టు మీ బరువు నాకు తెలుసండోయ్!"
విహారి అదిరిపడి "వ్వాట్" అన్నాడు. అతడి కళ్ళముందు డ్రామా స్టేజి దృశ్యం కదలాడుతూ వుండగా "మీ బరువు 72 కేజీలు" అని అవతల్నుంచి వినిపించింది.
ఫోన్ కట్ అయింది.
* * *
"బోర్లా పడుకోమందా? అయితే ఆ అమ్మాయి వయసు నిశ్చయంగా పాతిక దాటి వుంటుంది" అన్నాడు పద్మాకర్.
"నోర్ముయ్యి!"
"లేదు బాస్. వాత్స్యాయనుడి సూత్రాల ప్రకారం ఆ వయసు దాటాకే మొగాళ్ళని బోర్లా..."
"నీ సూత్రీకరణ అవతల పెట్టి ముందు నాకు కంగ్రాట్స్ చెప్పు. అసలు అంత అందమైన అమ్మాయి అంత ధైర్యంగా ఫోన్ చెయ్యటం- ఐ యామ్ లక్కీ యార్!"
"మరి? ఎంతో తెలివి తేటలుంటే తప్ప చేసుకోను, అందం కాదు ముఖ్యం అన్నావ్".
"ఆ అమ్మాయికి తెలివితేటలు కూడా వుండే వుంటాయ్."
"ఉండే వుంటాయ్...." వెక్కిరించాడు. నువ్వు చెప్పినదంతా వింటూంటే ఆ అమ్మాయికి అంత ధైర్యంకానీ, తెలివితేటలుగానీ వుంటాయని నేననుకోవటం లేదు."
"కొంతమంది అంతే బాస్. ఎదురుపడితే ఏమీ మాట్లాడలేరు. అలా అని వాళ్ళకి ఆ రెండూ లేవనుకోకూడదు. రేప్రొద్దున్నే తేల్చేస్తాగా" అన్నాడు విహారి.
* * *
మరుసటిరోజు కాలేజీ దగ్గర కాపు వేశాడు విహారి. దూరంనుంచి సునాదమాల వస్తూంది. దగ్గిరకొచ్చాక "థాంక్యూ" అన్నాడు చనువుగా.
ఆ అమ్మాయి చేతిలో పుస్తకాలు కూడా వణకటం స్పష్టంగా కనిపించింది.
"ఎ..ఎ...ఎందుకు?" అంది.
"ని...ని...నిన్న రాత్రి ఫోన్ చేసినందుకు."
"నే...నే...నేను ఫోన్ చేశానా?"
"కా...కా...కాదా?"
"చూడండి మీరేదో విధంగా నాతో మాటలు కలిపి పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారేమో. నేనలాంటిదాన్ని కాను."
"ఎలాంటివారు కారు మేడమ్ మీరు?" అల్లరిగా అన్నాడు.
సునాదమాల వళ్ళంతా చెమట్లు పడుతున్నాయ్. రక్షించే వాళ్లు ఎవరూ లేరా అన్నట్టు చూసింది.
"నేను గోపాలకృష్ణుడిలా కనిపించటం దురదృష్టకరం. ఇప్పటివరకూ కేవలం మీ ఒక్కరిమీదే బోర్లా పడుకున్నాను నేను. అదీ యాదృచ్చికం."
"మీకలా మాట్లాడడానికి సిగ్గు లేదూ?"
"రాత్రి మీరు ఫోన్ లో అడగ్గా లేనిది నేను ఇప్పుడు మాట్లాడితే వచ్చిందా?"
"దయచేసి నన్ను వదిలిపెడతారా?"
"ఈరాత్రికి మళ్లీ ఫోన్ చేసి 'ఐ లవ్యూ' అంటానంటే వదుల్తాను."
"చచ్చినా అనను."
"అయితే వదలిపెట్టను" అని చెయ్యిపట్టుకున్నాడు. సునాదమాల కెవ్వున అరిచింది. సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు అందరూ నిశ్చేష్టులయ్యేలా అరిచింది. వదిలే వరకూ అరుస్తూనే వుంది.
ఇంటికి రాగానే ఆ సాయంత్రం, బామ్మ "ఏమిటే- ఆ చేతిని అలా తోముతున్నావు?" అని అడిగినప్పుడు మాత్రం "ఏంలేదు బామ్మా" అని కొబ్బరిపీచు దాచేసింది.
9
ఆఖరిక్షణంలో టెర్రరిస్టులు దొరికి, మంత్రివర్గం రాజీనామా చేయవలసిన అవసరం తప్పిపోవడంతో చిన్న అభినందన సభలాంటిది జరిగింది. ముఖ్యమంత్రి తన ఉపన్యాసంలో పోలీసులు, సి.బి.ఐ. డిపార్ట్ మెంట్ లని, ముఖ్యంగా ప్రవల్లికని పొగిడారు. చిత్రమేమిటంటే, ఆ సభకు ముఖ్యవక్త సూర్యారావు. విహారికి కూడా ఆహ్వానం వచ్చింది. వెనుక ఎక్కడో నిల్చున్నాడు.