"గాంధీ ఎవరు?"
"మీరు నాతో వేళాకోళం ఆడుతున్నారా? గాంధీ ఎవరో మీకు తెలియాకపోవడమేమిటి? అతను మన జాతిపిత. మనకి స్వాతంత్ర్యము తెచ్చిపెట్టిన మహానుభావుడు."
"ఆ గాంధీ గురించి కాదయ్యా!! ఆ మహానుభావుడు పేరుపెట్టుకున్న చవటవెధవలు చాలామంది వున్నారుగా! వాళ్ళ గురించి అడుగుతున్నాను."
"తమరు నన్ను క్షమించాలి. చవట వెధవల్ని తెలుసుకోవడం అంత తేలికకాదు. పైకి తెలివైనవాళ్ళల్లా_ గొప్పవాళ్ళల్లా కనిపించే వాళ్ళల్లో ఎందరో చవట వెధవలున్నారు. ఎంతో సన్నిహిత పరిచయం వుంటేగాని గుర్తించలేము."
మరోసారి గుర్రుమన్నాడు భాగవతార్.
"గాంధీ అన్నవాడెవడూ యిక్కడికి రాలేదా?"
"నాకు తెలిసినంతలో రాలేదు. అయినా మీకో మాట చెపుతాను. మీరేమనుకున్నా సరే! మీ అదృష్టంకొద్దీ దీపంలాంటి బంగారుతల్లి భార్యగా దొరికితే అదృష్టాన్ని అభినందించుకుంటూ ఆనందంగా జీవించవలసిందిపోయి లేనిపోని అనుమానాలతో జీవితాన్ని చిందరవందర చేసుకోవడం అవివేకం."
నోటమాట రాలేదు భాగవతార్ కి.
"ఇదేమిటి? ఈ నక్షత్ర కూడా మృదుల వలలో పడిపోయాడా?" లోకమంతా ఒకటై మృదులవైపు చేరిపోయి తనని హేళన చేస్తున్నట్లు అనిపించింది. చేతులు కట్టుకుకూర్చున్న నక్షత్ర తనలో నవ్వుకుంటున్నట్లు తోచింది.
"స్టాపిట్! గట్టిగా అరిచారు. "మీరు అబద్ధాలు ఆడినా నిజం నాకు తెలుసు. మృదులనే వెళ్ళినప్పటినుంచి వచ్చేవరకు ఏ క్షణంలో ఏం చేసిందో ఆ రిపోర్టు అంతా నా దగ్గరుంది."
"ఘటం బింద్వాత్, పటం చింద్వాత్ కుర్యాద్వా.
గార్ధబస్వరం ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధః పురుషోభవేత్"
అంటే కొందరు మనుష్యులు ప్రసిద్ధులు కావటంకోసం కుండలు పగలగొడతారు. బట్టలు చింపుకుంటారు. గాడిదల్లా కూస్తారు. ఎలాగైనా నలుగురు దృష్టిలోకి వచ్చి ప్రసిద్ధులు కావడమే వారిధ్యేయం. అందుకవలభించే మార్గం మంచిదా పిచ్చిదా అనే ఆలోచనరాదు. అలాంటి మహానుభావులెవరో మీరు రిపోర్టు రాయమనేసరికి "రాయడానికి ఏమీ లేదు_" అని చెప్పటం చేతకాక వున్నవీ లేనివి రాసి మీకిచ్చివుంటారు. యిది నమ్ముకుని మీ సంసారం పాడుచేసుకుంటే తరువాత మీరెంత బాధపడినా ప్రయోజనంలేదు. మీరు తనని అనుమానిస్తున్నారని గ్రహిస్తే మృదులగారు మిమ్మల్ని క్షమించరు."
చివరి మాటలకు ఖంగారుపడిపోయారు భాగవతార్.
"ఛ. ఛ. నాకేం అనుమానం! అనుమానం వుంటే ఇంత స్వేచ్చగా తిరగనిస్తానా? భార్యలను అనుమానించే భర్తలంటె నాకసహ్యం."
"గుడ్ మార్నింగ్ ఎవ్వ్రిబడీ!" అంటూ నవ్వుతూ వచ్చింది మృదుల.
"ఏమిటి? అసహ్యం అంటున్నారు?" అడిగింది.
నక్షత్రకి మాట్లాడే అవకాశం యివ్వకుండా "భార్యలనుమానించే భర్తలంటే నాకసహ్యం అని చెపుతున్నాను." అన్నాడు భాగవతార్. అంటూనే తన వళ్ళో చిందరవందరగా వున్న కాగితాలు మృదుల చూస్తుందేమోనని లుంగచుట్టి వేస్ట్ పేపర్ బేస్కెట్ లో పడేశాడు.
"అసహ్యం అని యింకా నెమ్మదిగా అంటున్నారా! అలాంటి మనుష్యులని వింత మృగాలుగా స్టాంప్ వేసి "జూ" లో పెట్టాలి." కోపంగా అంది మృదుల. నక్షత్ర గంభీరంగా వున్నా అతడి మొహంలోకి బెరుగ్గా చూసి వెర్రినవ్వు నవ్వేడు భాగవతార్.
"అయినా! ఈ అనుమానించడం అనే రోగంకంటే దౌర్భాగ్యమైనదేదీ నాకు కనపడ్డంలేదు. ఒకరిపట్ల ప్రేమానురాగాలు, విశ్వాసాలు వుంటే కలిసిమెలిసి వుండాలి. లేకపోతే హాయిగా విడిపోవాలి. పెళ్ళనేది స్త్రీ పురుషులు కలిసిమెలిసి జీవించడానికి ఏర్పాటు చేసుకున్నది. ఒకరిమీద పెత్తనం చెలాయించే హక్కు మరొకరికిలేదు. వుండడానికి వీల్లేదు."
భాగవతార్ గుటకమింగి "ఔనౌను" అన్నాడు.
"ఇంతకీ అలా భార్యననుమానించే గాడిద వెధవ ఎవరో నాకు చెప్పు. వాడి పని పడతాను."
"ఏం చేస్తావు?" ఏడుపుమొహంతో అడిగాడు భాగవతార్.
"వాళ్ళావిడను కలుసుకుని ఆవిడకి నచ్చజెప్పి ఆ మొగుడిమీద దావా వేయించి విడాకులు యిప్పిస్తాను. ఆస్తిలో భాగం యిప్పిస్తాను. టింగ్ రంగా మని హాయిగా బతుకుతుంది ఎడ్రస్ తెలుసా?"
నక్షత్ర లేచి ఇలాబడ్డాడు. "అయ్యా! నేను వెళ్ళొస్తాను" అన్నాడు చేతులు జోడిస్తూ. అతడు తనని వెక్కిరిస్తున్నట్లుగా తోచింది భాగవతార్ కి.
"కూర్చోండి. కాఫీ తాగి వెళుదురుగాని" అంది మృదుల. వెంటనే కూర్చున్నాడు నక్షత్ర. వంటమనిషిని పిలిచి కాఫీలు తెమ్మంది. వంటమనిషి ట్రేలో కాఫీ కప్పులతో వచ్చి ట్రే టీపాయిమీద పెట్టింది. పక్కనేవున్న కాగితాలతో వున్న వేస్ట్ పేపర్ బేస్కెట్ బయట పారెయ్యడానికి తీసుకెళ్ళబోయింది.
"ఆ బకెట్ దేనికి? అక్కడ పెట్టు" గాభరగా అన్నాడు భాగవతార్.
"హాల్లో వున్న వేస్ట్ పేపర్ బేస్కెట్ ఎప్పటికప్పుడు ఖాళీ చెయ్యాలని నేనే చెప్పాను. తీసుకెళ్ళిపో!" చెప్పింది మృదుల.
బోల్డెంత బిల్లు చెల్లించి సోమనాథ్ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ తో తయారు చేయించిన రిపోర్టు చెత్త బకెట్ లో చూసుకుంటూ బయట పారెయ్యడానికి వంటమనిషి తీసుకెళుతూంటే కళ్ళప్పగించి వుండిపోయాడు భాగవతార్.
కాఫీ తాగేసి ట్రేలో వుంచేసి "అయ్యా! కాఫీ తాగండి చల్లారిపోతుంది" చెప్పాడు నక్షత్రం.
ప్రముఖ వ్యాపారస్తులు కొందరుకావాలని భాగవతార్ తో స్నేహం చేసుకుంటారు. భాగవతార్ వున్న పేరు ప్రఖ్యాతుల్ని, అతని కంఠమాధుర్యాన్ని తమ వ్యాపార ప్రకటనకుపయోగించుకుంటారు. వాళ్ళు ఏర్పాటు చేసుకునే పెద్ద పెద్ద పార్టీలకి తరచుగా అతన్ని ఆహ్వానిస్తుంటారు. ఆరోజు ఫార్మక్యుటికల్స్ ప్రొప్రయిటర్ హోటల్ నాగార్జునలో భారీ ఎత్తున పార్టీ ఏర్పాటు చేసాడు. ఆహ్వానితులైన అనేకమంది ప్రముఖుల్లో భాగవతార్ కూడా వున్న్నాడు. తన వెంట మృదులని తీసుకెళ్ళడం భాగవతార్ కి చాలా గర్వకారణం. అయితే మృదుల తను భాగవతార్ కి మాత్రమే చెందిన వ్యక్తి అన్నట్టు భాగవతార్ ని అంటిపెట్టుకుని వుండిపోదు. అందరితోనూ స్నేహంతో కలివిడిగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ తిరుగుతుంది. అప్పుడు మాత్రం భాగవతార్ కి కొంత కష్టం తోచినా తన భార్య మృదులని సగర్వంగా అందరిముందు పరిచయం చేసుకోవడంలో గొప్ప ఆనందం వుంది భాగవతార్ కి. హోటల్ నాగార్జునలో పార్టీకి మృదుల కూడా వచ్చింది భాగవతార్ తో. రిసెప్సెషన్ హాల్ ఇంద్రలోకంలా డెకరేట్ చేసారు, లేత నీలిరంగులు విరజిమ్మే షాండిల్యార్స్ రూఫ్ నుంచి తోరణల్లా వేళాడుతున్నాయి. ఫాన్స్ గాలులకి నెమ్మదిగా అటూ యిటూ వూగుతూ ఒక వింత అందాన్ని విరజిమ్ముతున్నాయి. డాన్స్ ఫ్లోర్ కొంత డిమ్ షేడ్ లో వుంది. అక్కడ ఆర్కెస్ట్రా గ్రూప్ మంద్ర స్వరంతో రకరకాల వాయిద్యాలను వినిపిస్తున్నారు. పూర్తి పాశ్చాత్య పద్ధతిలో యేర్పాటైన ఆ పార్టీలో సర్వర్స్ యెవరిక్కావలసిన హాట్ డ్రింక్ వాళ్ళకి సప్లయి చేస్తున్నారు. ఆడవాళ్ళల్లో చాలామంది ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారు. అతి కొద్దిమంది మాత్రమే మగవాళ్ళతోపాటు హాట్ డ్రింక్ సిప్ చేస్తున్నారు. అక్కడ సమావేశమైన స్త్రీలంతా అత్యంత ఆధునికంగా అలంకరించుకున్న వాళ్ళే. స్లీవ్ లెస్ బ్లౌజ్ లమీద అతి పల్చని ఫారిన్ సిఫాన్ పైటలు సగానికి పైగాకిందకి జారిపోతూ విశృంఖలంగా ఎగురుతున్నాయి. నాగరిక దేవత విచ్చలవిడిగా తాండవం చేస్తూన్నట్లు పంజాబీ డ్రెస్సులమీది చున్నీలు వాటి స్థానంలో వుండకుండా రెపరెపలాడుతున్నాయి. చాలా స్త్రీల నాభీ ప్రదేశాలు పల్చని చీరల్లోంచి మెరుస్తూ కనిపిస్తున్నాయి. జీన్స్ పేంట్ మీద బ్లౌజ్ తో వచ్చింది మృదుల. అంచేత ఆమె దుస్తుల్లో యెగిరేవి- జారేవి యేమీలేవు. ఆమె శరీరంలోని ఆకర్షణీయమైన భాగాలేమీ ఎదుటి వాళ్ళని వూరిస్తూ కవ్విస్తూ బయటపడటం లేదు. అయినా అక్కడ చేరిన స్త్రీల గుంపులో మృదుల రూపమే ఆకర్షణీయంగా_ ఆధునికంగా అగుపిస్తోంది. ఆ ఆధునికత కేవలం వేషదారణంలోనే కాక చూపులో__ మాటలో_ ఆకర్షణలో_ నడకలో మృదుల వ్యక్తిత్వానంతా ఆవరించుకునే వుంది.
ఆహ్వానితులందరూ వారి వారి పరిచయాలను_ స్నేహాలను పురస్కరించుకుని ఒక్కొక్క టేబిల్ చుట్టూ కూర్చుంటున్నారు. అప్పుడప్పుడు ఒక టేబిల్ ముందు కూర్చున్నవాళ్ళు మరొక టేబిల్ ముందుకు వెళ్ళి ఫ్రెండ్స్ ని పలకరించి_ మాట్లాడి మళ్ళీ తమ టేబిల్ దగ్గర కొచ్చేస్తున్నారు. టేబిల్స్ ముందు కూర్చున్న వాళ్ళతో_ గ్లాసులు పట్టుకు తిరుగుతున్నవాళ్ళతో నిలబడి కబురులు, చెప్పుకుంటున్న వాళ్ళతో సందడిగా వుంది రిసెప్షన్ హాల్. హోస్ట్ రాజభూషణం ఒక్కొక్కరి పేరు పేరున పలకరించి ఏం కావాలో అడిగి వెయిటర్స్ కి సూచనలిస్తున్నాడు. పార్టీ సాగుతుండగా వచ్చారు మింగియార్. పూర్తిగా లామా వేషంలోనే వున్నాడు. అతడి వెంట నోట్లో పైప్ పెట్టుకుని పొగ వొదులుతూ మరొక యూరోపియన్ కూడా వున్నాడు. వాళ్ళిద్దరూ లోపలికడుగు పెట్టగానే అరక్షణం ఆర్కెస్ట్రా ఆగిపోయింది. మాట్లాడుతూన్న ఆహ్వానితుల నోళ్ళు మూతపడ్డాయి. అందరూ వాళ్ళవంకే చూసారు వింతగా. రాజభూషణం కూడా మిగిలిన వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్లు వెంటనే వాళ్ళని రిసీవ్ చేసుకోలేదు. కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా చూసి మర్యాదకోసం అన్నట్లు. "కమిన్" అని ఆహ్వానించాడు. సరిగ్గా అప్పుడు పైనించి కిందిదాకా ధగధగ మెరిసే వెస్ట్రన్ డాన్స్ డ్రస్స్ లో వున్న మెరుపుతీగలాంటి అమ్మాయి ప్రత్యక్షమైంది వాళ్ళమధ్య. ప్రత్యేకించి డాన్స్ కోసం చేసుకున్న ఆమె అలంకరణ అక్కడున్న మగవాళ్ళనందరినీ కవ్విస్తూ, ఆహ్వానిస్తున్నట్లుగా వుంది. అందరికళ్ళు అటు తిరిగాయి, తన ఆకర్షణశక్తి యెంత శక్తివంతమైనదో అందులోనూ డాన్స్ డ్రెస్ లో వున్నప్పుడు_ ఆమెకి బాగా తెలుసు. ఎవరివైపు ప్రత్యేకించి చూడకుండా వయ్యారంగా నడుస్తూ రాజభూషణంని సమీపించి_