Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 17


    "రాజభూషణం! మీట్ మై ఫ్రెండ్స్ మిస్టర్ మింగియార్ ఎండ్ ప్లెమింగ్" అంది. అప్పుడర్ధమైంది రాజభూషణంకి వాళ్ళెందుకొచ్చారో. వాళ్ళకి షేక్ హేండ్ ఇచ్చి టేబిల్స్ చూపించాడు కూర్చోమన్నట్లు. ఆమె తిన్నగా డాన్స్ డయన్ మీదకి వెళ్ళిపోయింది. ఆర్కెస్ట్రా స్వరం మారింది. పాశ్చాత్య సంగీతం ప్రారంభమైంది. స్టేజిమీద లైట్స్ ఒక్కసారిగా ఆరిపోయి డాన్స్ డ్రెస్ లో వున్న ఆమె సెంటర్ లోకి వచ్చి ముందుకు వంగి ఆడియన్స్ ని విష్ చేస్తూండగా పైనున్న షాండిలియార్స్ ఒక్కొక్కటిగా వెలగ సాగాయి. అవి వెలుగుతూండగా అయిదారుగురు అసిస్టెంట్స్ వచ్చి కలిసారు సెంటర్ లో వున్న డాన్సర్ ని. డాన్స్ ప్రారంభమైంది. అప్పటివరకు యెవరో ఫ్రెండ్ తో మాట్లాడుతూన్న భాగవతార్ అప్పుడు చూసాడు డాన్సర్ ని. అతడి చేతిలోంచి గ్లాస్ కిందికి జారిపోయి భళ్లున పగిలి మెత్తని ఖరీదైన కార్పెట్ మీద ప్రవహించింది. చుట్టుపక్కల వాళ్ళకి "సారీ" చెప్పడం కూడా మర్చిపోయి డాన్సర్ నే చూస్తున్నాడు భాగవతార్. ఆమె దేవకి. దేవకి కూడా అప్పుడే భాగవతార్ ని చూసింది. అరక్షణం ఆమె అడుగు కదలటం ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఆర్కెస్ట్రా సహకరించడం చేత అది కూడా డాన్స్ లో ఒక భాగంగా తోసింపజేసి స్టెప్స్ అందుకుంది. మళ్ళీ భాగవతార్ వైపు చూడలేదు. భాగవతార్ కి మాత్రం మనుష్యుల్లోకి రావడానికి పదినిముషాలు పైగా పట్టింది. అదీ ఒక ఫ్రెండ్ భుజంమీద తట్టి "మైడియర్. భార్య ప్రక్కనుండగా హోటల్ డాన్సర్ ని అలా కళ్ళప్పగించి చూడకూడదు." అంటూ మృదులవైపు చూసి నవ్వుతూ జోక్ చేసినప్పుడు_ 
    "ఏం లేదు - ఏంలేదు" అని ఖంగారు పడిపోతూ మృదులని చూసాడు. భాగవతార్ లా తబ్బిబ్బు పడకపోయినా ఆమె కూడా దేవకినే చూస్తోంది. అంతకు ముందు మృదుల ఆమెని డాన్సర్ గా చూడలేదు. దేవకి యే పరిస్థితుల్లో - ఎలా కనిపించినా ఆమెని స్నేహంతో, సహృదయంతో ఆదరించిన తన దగ్గరకి తీసుకురమ్మని చెప్పింది లాయర్ యశోధరా దేవి. అది తనవల్ల అవుతుందా? అని ఆలోచిస్తోంది మృదుల. మృదులని చూసీ చూడగానే ఆమె దేవకిని గుర్తుపట్టిందని అర్ధమైంది భాగవతార్ కి. మతిపోయినట్లయింది. తరువాత అతడికి తన్నెక్కడున్నాడో, యేం చేస్తున్నాడో- తెలియకుండా పోయింది. అతడి అదృష్టం బాగుండి వచ్చిన వాళ్ళలో మూడొంతుల మంది డాన్సులో లీనమైపోయారు. కాబట్టి సంభాషణలో అవకతవకలు దొర్లే ప్రమాదం తప్పింది.
    "ఇంక వెళదాం" అన్నాడు మృదులతో నెమ్మదిగా. వినిపించుకోనట్లు కూర్చుంది మృదుల. ఎలాగైనా దేవకితో ఒక్కసారి మాట్లాడకుండా అక్కణ్నుంచి కదలదల్చుకోలేదు. భాగవతార్ లో మృదులని బలవంతపెట్టే శక్తిలేదు. ఆమెచేత బలవంతంగా యెవరూ యే పనీ చేయించలేరు. విధిలేక తన నెర్వస్ నెస్ మర్చిపోవడానికి గ్లాసు మీద గ్లాసు తాగుతూ కూర్చున్నాడు. అప్పుడొక విచిత్రమైన సంఘటన జరిగింది. మింగియార్ పక్కన కూర్చున్న ప్లెమింగ్ లేచి మృదుల చెయ్యిపట్టుకు లాగుతూ ఇంగ్లీషులో_
    "నువ్వు మళ్ళీ వచ్చి వీడిపక్కన కూర్చున్నావా? నన్ను వొదిలి వెళ్ళనని ప్రామిస్ చెయ్యలేదూ_ కమాన్", అని గొడవ ప్రారంభించాడు. జర్మన్ వచ్చిన వాళ్ళకి అతడి ఇంగ్లీషు ఉచ్చారణలో జర్మన్ యాస వుందని అర్ధమౌతుంది.
    తల గిర్రున తిరిగింది భాగవతార్ కి. అలవాటు లేకుండా ఎక్కువగా తాగిన అతడి కళ్ళకి ఆ హాలులోవున్న షాండిలియర్స్, మనుష్యులు, టేబిల్స్, గ్లాసులు అన్నీ యెన్నెన్నో రూపాలుగా కనిపిస్తున్నాయి. మృదుల మొదట తన చెయ్యి మృదువుగా విడిపించుకోడానికి ప్రయత్నించింది. ప్లెమింగ్ వదల్లేదు. "యూ ఛీట్", అంటూ మరింత గట్టిగా లాగుతూ మరో భాషలో తిట్లు ప్రారంభించాడు. బిత్తరపోయి చూడటం తప్ప యేమీ చెయ్యలేకపోతున్నాడు భాగవతార్. మృదుల చాచి అతడి చెంపమీద కొట్టింది. ప్లెమింగ్ దిమ్మెర బోయినట్లు అరక్షణం కళ్ళుమూసుకుని తను కూడా చెయ్యెత్తాడు. ఆ యెత్తిన చెయ్యిగాలిలో వుండగానే తన అరచేయి అడ్డంగా తిప్పి ఆచేతిమీద కొట్టింది. అతడి చెయ్యిపట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి యీడ్చు కెళ్ళింది. ప్లెమింగ్ శరీరాన్ని గాలిలో పైకి లేపి, గాలిలోనే రెండు మూడు మెలికలు తిరిగి తన కాళ్ళతో మృదులని తన్నబోయాడు. ఆహ్వానితుల్లో యెవ్వరూ ఊహించని విధంగా మృదుల కూడ గాల్లో గిరికీలు కొడుతూ ప్లెమింగ్ ని యెదుర్కొంది. అంతకుముందు దేవకి చేసిన డాన్స్ కంటే మృదులకీ, ప్లెమింగ్ కీ మధ్య జూడో విన్యాసాలతో జరుగుతూన్న ద్వంద యుద్ధమే అందరికీ అద్భుతంగా వుంది. ప్లెమింగ్ చూపు అటూ యిటూ చెదరనీయకుండా తనచూపులతో ఆకట్టుకొని అతడిమీద దెబ్బ తీస్తోంది మృదుల. పది నిముషాల్లో పూర్తిగా మృదుల ప్రభావంలోకి వచ్చేసాడు తాగివున్న ప్లెమింగ్. కుడి అరచేతిని కత్తిలా మెలిపి, "వెనక్కి తిరుగు, అంది ప్లెమింగ్ తో. అతడి మెడ వెనక నరం మీద కీలక స్థానంలో వొడుపుగా నొక్కింది. తెలివితప్పిపోయి కుప్ప కూలిపోయాడు ప్లెమింగ్, జనంలోంచి ఈలలు - చప్పట్లు - హుర్రేహుర్రేలు!
    చేతులు దులుపుకుని యేమీ యెరగనిదాన్లా భాగవతార్ పక్కన వచ్చి కూర్చుంది. అప్పటివరకు జనంతో కలిసి "హుర్రే హుర్రే" అని అరుస్తూన్న భాగవతార్ తన పక్కన కూర్చున్నది. మృదులేనా అన్నట్లు తెల్లబోయి చూసాడు. అప్పటివరకు స్టేజి పక్కకి తప్పుకున్న దేవకి ప్లెమింగ్ పడిపోగానే అతడి పక్కన మోకాళ్ళమీద కూర్చుని అటూ ఇటూ కదుపుతూ "ప్లెమింగ్, ప్లెమింగ్" అంది చెవిదగ్గర, ఎటుదొర్లితే అటు పడిపోతున్నాడు ప్లెమింగ్. జనంలో సందడి తగ్గలేదు. మృదుల లేచి నిలబడి "ఆగండి," అన్నట్లు చెయ్యి చాపాక నిశ్శబ్దంగా అయిపోయారు. మృదుల రాజభూషణం దగ్గిరకి వెళ్ళి, "ఆయన్ని హాస్పిటల్లో చేర్పించండి. ప్రమాదం యేమీలేదు. త్వరలోనే కోలుకుంటారు" అంది.
    కలలోంచి తెప్పరిల్లిన వాడిలా, "ఆ! ఆ! అవునవును. డ్రైవర్ ఈయన్ని ముందు హైదరాబాద్ నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళి నాపేరు చెప్పి స్పెషల్ రూమ్ లో ఎడ్మిట్ చేయండి," అన్నాడు. ఇద్దరు ముగ్గురు సాయం పట్టి ప్లెమింగ్ ని కారు వెనుక సీటులో పడుకోబెట్టారు. దేవకి కూడా వెనుక సీటులోనే కూర్చోబోతూండగా మృదుల ఆవిడ చెయ్యిపట్టుకుని, "దేవకీ! ఒకసారి నువ్వు మా యింటికి రావాలి. లేకపోతే నీ ఎడ్రస్ చెప్పు, నేనే నీ దగ్గరకొస్తాను. మనం మాట్లాడుకోవాలి," అంది. కొయ్యబొమ్మలా నిలబడిపోయింది దేవకి. ఇదివరలో ఆవిడకి మెడ్రాసులోనూ, హైదరాబాద్ లోనూ కూడా చాలామంది స్నేహితులుండేవాళ్ళు. దేవకిని డాన్సర్ గా చూసాక వాళ్ళల్లో యెవరూ ఆవిణ్ని స్నేహంగా పలకరించలేదు సరికదా చూసీ చూడనట్లు ముఖం తిప్పుకుని వెళ్ళిపోయారు.
    "నా ఎడ్రస్ యిస్తాను. ఫోన్ నంబరుకూడా యిస్తాను. ఫోన్ చేసిరా! "ఎందుకూ," "ఏమిటి" - అని అడక్కుండా నాకు కొంత సాయం చెయ్యగలవా?" అడిగింది దేవకి.
    "ప్రామిస్ చెయ్యలేను. ప్రయత్నిస్తాను. ఐయామ్ యువర్ ఫ్రెండ్," దేవకి భుజంమీద చెయ్యి వేసింది మృదుల. ఆ చేతిమీద చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కి తన ఎడ్రసు, ఫోన్ నెంబర్ స్లిప్ మీద రాసిచ్చింది. కారు వెనకసీట్లో ప్లెమింగ్ తల తన వొళ్ళో పెట్టుకుని కూర్చుంది. గాఢమైన ప్రేమ-దుర్భరమైన విషాదము రెండూ కలగలిపి కనిపిస్తున్నాయి. ఆమె మొహంలో, కారు కదిలాక రిసెప్షన్ హాల్లోకి వచ్చింది మృదుల. ఏకోశానా జీవమనేది లేనట్లు తెల్లగా పాలిపోయి వుంది భాగవతార్ మొహం.
                             *    *    *
    సోమనాథ్ డిటెక్టివ్ ఏజన్సీస్ లో ప్రయివేట్ రూమ్ లో చీఫ్ డిటెక్టివ్ సోమనాథ్ పక్కన కూర్చుని టి.వి. స్క్రీన్ మీద సోమనాథ్ ప్రెజెక్టు చేస్తూన్న వీడియో ఫిలిం చూస్తున్నాడు భాగవతార్. అమ్మాయి మోకాళ్ళ కిందనించి మాత్రమే కనిపిస్తోంది. టి.వి. స్క్రీన్ మీద శరీరచ్చాయ తెలియదు. అయినా తనింట్లో మృదుల తప్ప మరెవ్వరుంటారు? అమ్మాయి పక్కనే ఓ అబ్బాయి కూడా నడుస్తున్నాడు. ఫుల్ పాంట్ లో వున్నాడు. పాంట్ మడతలు తప్ప యేమీ కనపడ్డం లేదు. కొంతసేపటికి అబ్బాయి వీపుమాత్రం కనిపించింది. కొంతసేపు నల్లని నీడలు తప్పయేం కనపడలేదు. సోమనాథ్ క్షమాపణ కోరుకున్నట్లు నవ్వి, "వీడియో రికార్డింగ్ విదేశాల్లో డెవలప్ అయినట్లుగా మన దేశంలో కాలేదు. వీడియో కేసెట్ రికార్డు చెయ్యాలంటే లైటింగ్ ఎరేంజిమెంటు పకడ్బందీగా వుండాలి. ఎదుటివాళ్ళకి తెలియకుండా కొద్దిపాటి లైట్ లో టి.వి. స్క్రీన్ మీద ప్రొజెక్టు చేసే సేఫిన్ కేటిడ్ వీడియో కెమేరాలు మనకి లేవు. అయినా మీ యింటికి ఎవరెవరొస్తారో మీకు తెలుసుగదా! వెనకనుంచి చూసినా వాళ్ళని గుర్తుపట్టగలరు." అన్నాడు. గుటక మింగాడు భాగవతార్. వెనకనుంచి కనిపిస్తోన్న ఆ ఆకారం నిలబడినప్పుడు ఏండెటో లాగ- ముందుకు వొంగినప్పుడు అనంగ్ లాగ కనిపిస్తున్నాడు. ఒక దృశ్యంలో ఒక పురుషవ్యక్తి సాక్స్ బూట్స్ లేకుండా నడిచాడు. అప్పుడు ఎడమకాలి మడమకింద పెద్ద సొట్ట యెవరికుంది? మింగియార్ కాస్తకుంటుతున్నట్లు నడుస్తున్నాడు. అతని పాదాలాయివి? టి.వి. స్క్రీన్ మీద నల్లని నీడలు కదుల్తూంటే పిచ్చివాడిలా చూస్తూ కూర్చునుండి పోయాడు. ఇంత ఖర్చు పెట్టి, ఇంత జాగ్రత్తగా ప్లాన్ వేసినందుకు అతడికి దొరికిన ఒకే ఒకాధారం తన యింటికొచ్చే మగవాడి యెడమకాలి మడమ కింద సొట్ట వుందని మాత్రం. ఎప్పుడూ సాక్సులు బూట్స్ తో వుండే మగవాళ్ళపాదాల్లో యీ సొట్ట యెవరికుందో యెలా తెలుసుకోవడం?
    వీడియో కేసెట్ పూర్తయింది. భాగవతార్ కి షేక్ హేండ్ యిచ్చి "విష్ యూ ఆల్ ద బెస్ట్," చెప్పాడు సోమనాథ్.
                             *    *    *   

 Previous Page Next Page