Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 15


    చర్చిగేటు ప్రాంతాలలో వున్న హోటల్ ఎంబాసిడర్ లో భాగవతార్ ని దింపి మలబార్ హిల్స్ లో కరదీపిక కార్యాలయానికి వచ్చింది మృదుల. మృదుల ఒక్కర్తే రావడం చూసి, "దేవకి రాలేదా?" అని అడిగింది యశోధరాదేవి. ఇప్పుడిప్పుడు ఆవిడ యెక్కువసేపు కుర్చీలో కూర్చోలేక వాలుకుర్చీలో "యు" పోమ్ దిళ్ళు వేసుకుని కూర్చుంటోంది. ముగ్గు బుట్టలాంటి తల, పండుతమలపాకులాంటి శరీరఛాయ, నిర్మలంగా ప్రశాంతంగా వుండే చూపులు, అభిమానం - ఆప్యాయత పుట్టిన చిరునవ్వు.
    "దేవకిగారు రాలేదు. అనుకోకుండా భాగవతార్ వచ్చారు. ఆయన్ని హోటల్ ఎంబాసిడర్ లో దింపి యిలా వచ్చాను" అంది మృదుల నిట్టూర్చింది యశోధరాదేవి.
    "కరదీపిక కార్యవర్గ సభ్యులే ఆ సంఘంలో ఆశ్రితులుగా చేరే దురవస్థ రావచ్చునని నేనెన్నడూ ఊహించలేదు. మన దురవస్థలకి వ్యవస్థ మాత్రమే కారణం కాదు. మన ఆశలు-మన ప్రలోభాలు- మన బలహీనతలు కూడా మనల్ని ఊబిలోకి లాగుతున్నాయి. ఈ సూత్రం స్త్రీ పురుషులిద్దరికీ వర్తించినా ఊబిలో పడ్డ మగవాడు బయటపడగలిగినట్లు ఆడది బయట పడలేదు. అక్కడ వ్యవస్థ మరింత క్రూరంగా- కఠినంగాఅడ్డు పడుతుంది ఆడదానికి, దేవకి చికాగోనించి బయలుదేరిందని ఇందిర ఫోన్ చేసింది. ఇక్కడికి రాకుండా ఎక్కడికెళ్ళిందో మరి?"
    "ఇంత చిన్న విషయానికి మీరు ఆందోళన పడవలసిన అవసరం మేముంది మేడమ్?"
    "చికాగోలో బయలుదేరిన దేవకి బోంబేకి రానందుకు నేనాందోళన పడ్డంలేదు. ఇందిర నాకు చాలా విషయాలు వ్రాసింది. ఫారిన్ సైంటిస్ట్ అనే వ్యామోహంలో దేవకి పెళ్ళి చేసుకున్న యూరోపియన్ ప్లెమింగ్ కొన్నాళ్ళుగా కనబడటంలేదట. దేవకి ఒకసారి ఫైవ్ స్టార్ హోటల్లో డాన్స్ చేస్తూ కనపడిందట. "ఇక్కడి హోటల్స్ చాలా ఎక్స్ పెన్సివ్. అందుచేత మేము తరచుగా వెళ్ళం. దేవకి రెగ్యులర్ గా హోటల్స్ లో డాన్స్ చేస్తూందేమో నాకు తెలియదు. ఇప్పుడు కరదీపిక కార్యాలయానికి కూడ తను రావడం లేదు. ఏదో గుంభనగా ప్రవర్తిస్తోంది." అని వ్రాసింది ఇందిర. అందుకే దేవకికోసం ఆరాటంగా యెదురు చూస్తున్నాను. దేవకి రాలేదని ఆందోళన పడుతున్నాను."
    "దేవకి ధైర్యంగా పరిస్థితుల నెదుర్కోగలదని మనకి తెలుసు గదా!! ఏదయినా సమస్య యెదురైనా తనే పరిష్కరించుకుంటుందిలెండి."
    "నీకు తెలియదమ్మా!! పసిదానివి. ఎంత ధైర్యమున్నా ఏమాత్రం యెదుర్కోలేని సుడిగుండాలెన్నో. అన్ని రకాల సమాజాల్లోను యెదురుచూస్తూనే వున్నాయి. నేను చాలా దేశాలు తిరిగొచ్చాను కదా!! ఎంతో వెనుకబడి వున్నామని భావిస్తున్న మన దేశంలోనే ఆడదానికి యెక్కువ రక్షణ వున్నట్లుగా తోచింది నాకు. ఆడవాళ్ళకొకటే రోగం, వాళ్ళు ప్రేమించగలరు. తల్లిని, తండ్రిని_ మొగుడ్ని, పిల్లల్ని- అందర్నీ ప్రేమిస్తారు. ఈ ప్రేమజ్వాలల్లో దహించుకుపోతూ కర్పూరంలా కరిగిపోతారు."
    "సారీ మేడమ్! ప్రేమ- స్నేహం- ఇలాంటివి పరస్పర సహకారాలతో మరింత వృద్దిలోకి రావడానికి తోడ్పడాలికాని కరిగిపోడానికి_ హరించుకు పోడానికి కాదు. ఈ రకమైన రొమేంటిక్ ఐడియాలజీ నేను భరించలేను." నవ్వుతూ మృదుల భుజం తట్టింది యశోధరాదేవి.
    "నీకున్న ఆత్మవిశ్వాసం- దార్డ్వము- స్థిర సంకల్పము యీనాటికీ ఆడవాళ్ళల్లో చాలామందికి లేవు. ఇప్పటికి మనలో తొంభైశాతము తిండి, బట్టలు- భర్త, పిల్లలు- అవసరమయితే ఉద్యోగము- ఇదే జీవితమనుకొంటున్నారు. ఆడవాళ్ళకోసం ప్రత్యేకించి పత్రికలు రావడం బాగానే వుంది కాని ఆ పత్రికల్లో యెక్కువభాగం, వంటా- వార్పూ! అందాలు, అలంకరణలు- కుట్లూ, అల్లికలు- మొదలైన కుటుంబ జీవన ధోరణులకే పరిమితమై పోతున్నాయి. బహుశ అలా వుంటేకాని ఆడవాళ్ళ పత్రికలని ఆడవాళ్ళు కూడ చదవరేమో?? నువ్వూ నేను ఏం చెయ్యగలము? ఈ మహాయజ్ఞంలో నువ్వే నాకు వారసురాలిగా రాగలవని అనుకుంటున్నాను."
    "థాంక్యూ మేడమ్!"
    "మరోమాట దేవకి ఎప్పుడు ఏపరిస్థితుల్లో కనపడ్డా చిన్నబుచ్చుతూ మాట్లాడకు. అవమానించి నిరసించకు. ఏమీ జరగనట్లు- ఏమీ తెలియనట్లు స్నేహంగా పలకరించి ఇక్కడికి తీసుకురా. మనవాళ్ళందరితోనూ నామాటలుగా యీ విషయాన్ని చెప్పు.
    యశోధరాదేవి దృక్పధాన్ని మనసులో మెచ్చుకుంది మృదుల. ఇంతటి ఉదార హృదయము_ దురాలోచన_ ఉండబట్టే ఎంతో సామాన్యంగా ప్రారంభమైన కరదీపిక సంస్థ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
                              *    *    *
    పోటోలున్న ఎన్వెలాప్ నెగిటివ్స్ తో సహా సోమనాథ్ టేబుల్ మీదుంచాడు సహదేవ్.
    "ఇవన్నీ మింగియార్ ఇంటిలోంచి బయటకు వచ్చిన వాళ్ళ పోటోలు" చెప్పాడు.
    "వెరీగుడ్."
    పోటోలు ఒక్కొక్కటీ తీసి చూడసాగాడు. వాటిలో కొన్ని పరిచయస్థుల మొహాలు కనిపించాయి. అలా చూస్తూ ఒక పోటో చేతుల్లోకి తీసుకొని సంభ్రమంగా, "ఈ పోటో- ఈవిడ కూడా మింగియార్ ఇంటిలో నుంచే వచ్చిందా?" అడిగాడు.
    "అవును సార్. ఈ పోటోలో వున్న ప్రతి ఒక్కరూ ఆ ఇంటిలోంచి వచ్చినవారే."
    సన్నగా ఈల వేసుకున్నాడు సోమనాథ్. అతి సామాన్యమైన వ్యక్తిగత విషయంగా ప్రారంభమైన ఇన్ వెస్టిగేషన్ సెన్సేషనల్ గా మలుపు తిరిగేలాగ వుంది. సోమనాథ్ స్నేహితుడు జర్నలిస్టు మహావీర్. అతడు ప్రత్యేకించి ఏ పత్రికల్లోను పనిచేయడు కాని ఎంతో ఆసక్తికరమైనవి- అత్యంత రహస్యమయినవి. సమాచారాలు సేకరించి కొన్ని ప్రముఖ దినపత్రికలకు పంపిస్తూంటాడు. న్యూస్ పేపర్స్ ప్రొప్రయిటర్స్ అతడు సేకరించిన సమాచారం కొనడానికి పోటీలు పడుతూ రెమ్యూనరేషన్స్ చెల్లిస్తారు.
    మహావీర్ ఒక అమ్మాయి ఫోటో చూపించి, "ఈ అమ్మాయి పేరు దేవికి. కొన్నాళ్ళుగా చికాగోలో వుంటూ ఇండియాకి వచ్చిందని తెలిసింది. ఈమె ఆచూకి తెలుసుకోగలిగితే నాకు ఫోన్ చెయ్యండి. బిల్లు ఎంతయినా ఫరవాలేదు" అన్నాడు.
    ఈ ఫోటోలో అమ్మాయి ముమ్మూర్తుల దేవకే.
                                *    *    *
    మృదుల దినచర్యకి సంబంధించిన ఫైల్ ముందేసుకొని దాన్ని ఒక క్రమంలో పెట్టడానికి నానా అవస్థ పడుతున్నాడు భాగవతార్. ఒకటోపేజీ తరువాత యాభైయో పేజీ, ఆ తరువాత తొమ్మిదో పేజీ అలా చిందరవందరగా వున్నాయి. అవన్నీ పేజీలవారీగా పెట్టుకోడానికి ప్రయత్నిస్తూ, సహజంగా వుండే పరాకు- ఖంగారు కారణంగా మరల కన్ ఫ్యూజ్ అయిపోతున్నాడు. మధ్యలో కొన్నికొన్ని పేజీలు పోయినట్లుగా తోస్తోంది. చదవడం మొదలుపెడితే మధ్య మధ్యలో అక్షరాల ఎయిర్ పోర్ట్ లో నేల మీది బురదకి అలుక్కుపోయి, "మృదుల....పీకేసి.... గాంధీ....బోంబే.... ఎటు జడ్ ....పగ సాధిస్తా...." ఈ ధోరణిలో కనిపిస్తున్నాయి అక్షరాలు. తలతోకా అర్ధంకావడం లేదు. అర్ధమైనంతవరకూ గాభరా కలిగిస్తున్నాయి గాంధీ ఎవరు? బోంబే ఎప్పుడెల్లింది? తనని రిసీవ్ చేసుకోడానికి వచ్చినట్లుగానే వూళ్లో లేనప్పుడు బోంబే వెళ్ళి వస్తూండేదా? ఎందుకు? అక్కడెవరున్నారు_ ఓ దేవకి.... దేవకి బొంబాయిలో వుందా? "పగసాధిస్తా" _ దేవకితో కలిసి పగ సాధించాలనుకుంటోందా? వంటినిండా చెమటలు పట్టి, భయంతోనూ_ కోపంతోనూ వొణికిపోయాడు నిలువునా.
    "నమస్కారం సార్! లోపలికొచ్చి కూర్చున్నాడు నక్షత్ర.అరగంట నుంచి ప్రయాసపడుతూ నంబర్ల ప్రకారం వరుసక్రమంలో పేర్చుకుంటున్న కాగితాలన్నీ హడావిడిగా కలిపేసి చేత్తో గట్టిగా పట్టుకుని "ఇప్పుడెందుకొచ్చారు?" అన్నాడు కోపంగా.
    "అదేమిటిసార్! మీకు రమ్మని ఫోన్ చేస్తేనే కదా వచ్చాను."
    "ఆ, నేను రమ్మని పోన్ చేసానా?.... ఆ.... అవునవును నేను లేనప్పుడు మృదులకేం కావాలో కనుక్కున్నారా?"
    "ఆ రోజూ వస్తూనేవున్నాను. ఆవిదకేం కావాలో నేను కనుక్కోవడమేమిటి? లోకాలన్నీ పాలించే లక్ష్మీదేవిలాంటిది మీ యిల్లాలు. ఆవిడే నాకేంకావాలో చూసేది. ఎంత అదృష్టవంతులండీ మీరు! ఎంతో పుణ్యం చేసుకుంటేగాని...."
    భాగవతార్ మొహం చూసిన నక్షత్ర వాక్ ప్రవాహం మధ్యలో ఆగిపోయింది. కనుబొమ్మలు చిట్లించి గుర్రుమంటూ చూస్తున్నాడు భాగవతార్. తను పొరపాటుగా ఏం మాట్లాడాడో అర్ధంకాలేదు నక్షత్రకి.
    "నిజం చెప్పండి! నేనూళ్ళో లేనప్పుడు మృదుల ఎన్నిసార్లు బొంబాయి వెళ్ళింది?"
    "ఒక్కసారి. నిన్ననే బయలుదేరి యివాళ మీతో వచ్చారు. నిజమే చెపుతున్నాను."
    "పచ్చి అబద్ధం. అయిదారుసార్లు వెళ్ళినట్లు నాకు రూఢిగా తెలిసింది."
    "అయ్యా! ఆవిడకి పాదలేపనం లాంటి దివ్యశక్తులేమైనా వుండి బొంబాయికి ఎగిరివెళ్ళి వచ్చిందేమో నాకు తెలియదు కాని నేను మాత్రం హైదరాబాద్ లో యీ యింట్లో ప్రతిరోజూ ఉదయం చూస్తూనేవున్నాను. మాట్లాడుతూనే వున్నాను."

 Previous Page Next Page