Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 14


    ఘంటసాల పాడిన ఓ లలిత గీతం అది. అందరూ నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా వినసాగారు. అచ్చం ఘంటసాల పాడినట్లే ఉంది. "తల నిండ పూదండ దాల్చిన రాణి ..." అంటూ రాధనే చూస్తూ పాడుతున్నాడు మురళి.

    అందరికన్నా ఎక్కువ పరవశం చెందిన రాధ మనసంతా మురళీ రూపంతో నిండిపోయింది. అతను అంత అద్భుతంగా అచ్చం ఘంటసాల లాగా పాడగల విద్యార్ధి అని తనకు తెలీనే తెలీదు. అంత ప్రతిభ ఉన్న గాయకుడినా తను చెంప దెబ్బ కొట్టింది !

    ఎంత దారుణం ! అలాంటి వ్యక్తి తనను ముద్దు పెట్టుకున్నా సహించాలి ! సంగీతమంటే అంత గౌరవం తనకు.

    ఈ లోపులో రామలింగం నెమ్మదిగా కర్టెన్ వెనుకకు చేరుకున్నాడు. ఓ మూలగా గ్రామ్ ఫోన్ కనిపించిందతనికి. దాని దగ్గరకు నడిచి తన నెవరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకున్నాక పాట స్పీడుని 90 మీదకు మార్చాడు. అంతే !

    రికార్డు వేగంగా తిరగటం ప్రారంభించింది. "తల్నిండ్పూదన్ డదాల్చిన్రాణీ ..." అంటూ హటాత్తుగా పాట స్పీడు మారేసరికి మైకు ముందు నిల్చున్న మురళి కంగారుపడి పెదాల వేగం పెంచేశాడు. ఆడిటోరియం అంతా నవ్వులు, కేకలు వినిపించినయ్.

    అతని వంకే ఆరాధనా పూర్వకంగా చూస్తున్న రాధ మొఖంలో అసహ్యం కనిపించింది. "ఇడియట్ !" అంది కసిగా.

    రామలింగం అక్కడితో తృప్తి పడలేదు. ఈసారి వేగాన్ని 33కి తగ్గించాడు. దాంతో రికార్డ్ నెమ్మదిగా తిరగటం మొదలయింది. "తా ... లా ... నిడ్డా ... పూ ... దన్ డా ..." అంటూ !

    మురళీకి చెమటలు పట్టేయసాగినయ్.

    ఆ తరువాత రామలింగం వేగాన్ని వెంటవెంటనే ఇష్టమొచ్చినట్లు 33 నుంచి తొంభయ్ కీ, 90 నుంచి 33 కీ మార్చటం మొదలు పట్టాడు. ఈ గొడవంతా చూచి అమితాబ్ బచన్ పరుగుతో గ్రామ్ ఫోన్ దగ్గరకు చేరుకున్నాడు. రామలింగం చేస్తోన్న పని చూడగానే అతనికి వళ్ళు మండిపోయింది. రామలింగాన్ని ఒకే ఒక్క తన్ను తన్నాడు. వెనుక నుంచీ ! వేగానికి రామలింగం గ్రామ్ ఫోన్ తో సహా రెండు మొగ్గలు వేసి గోడకు కొట్టుకుని కింద పడ్డాడు. పాట ఆగిపోయింది. పాట హటాత్తుగా ఆగిపోయేసరికి మురళికేం చేయాలో అర్ధం కాలేదు. "థాంక్యూ" అనేసి స్టేజి దిగిపోయాడు.

    "ఇడియట్ !" అని మరోసారి అనుకుంది రాధ కసిగా.

    రామలింగం మూలుగుతూ, కుంటుతూ రిక్షాలో యింటికి బయలుదేరాడు.

   
                        *    *    *   

    తన గదిలో దిగాలుపడి కూర్చుని ఉన్నాడు మురళీ. అతని గాంగ్ మెంబర్స్ అందరూ తలో విధంగా సానుభూతి చూపుతున్నారు.

    "ఆ రామలింగంగాడిని మనం ఎంత దారుణంగా నమ్మేశాం ! నమ్మించి గొంతు కోసేశాడు" అన్నాడు మురళి.

    ఆంజనేయులు పరుగుతో వచ్చాడు గదిలోకి.

    "గురూ ! నీకు ఫోనొచ్చింది !"

    "మగ ఫోనే !"

    "అయితే లేనని చెప్పు."

    "చెప్పాను గురూ ! కానీ వాడు మాట్లాడదల్చుకున్నది 'ఆడపిల్ల వ్యవహారం గురించి అట ..."

    ఆ వాక్యం పూర్తవకుండానే మురళి బులెట్ లా దూసుకుపోయి ఫోన్ అందుకున్నాడు. పక్కనే రామలింగం వింటున్నాడు. అతడిని గమనించలేదు మురళి. అతడి కాలికి బ్యాండేజి వుంది.

    "హలో మురళీ హియర్ ! ఎవరు మాట్లాడుతున్నారు ?"  

    "నీ నీడను !"

    "నీడా ! అలాంటి పేరు గల పక్షులెవరూ మన లిస్ట్ లో లేరే !"

    "నీ డూప్లికేట్ ని !"

    మురళి గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్.

    "అంటే ..." అన్నాడు.

    "అవునోయ్ పక్షీ ! మీ ఫ్రెండ్ దగ్గర అప్పూ - బార్బరు షాపూ - చాలా ?"

    "చాల్చాలు ! గుర్తు కొచ్చేశావ్ ! ఎవర్నువ్వు ? ఎందుకిలా చేస్తున్నావ్ ?"

    "అదంతా చెప్పటానికి నేను నీలాంటి ఫూల్ ని కాదు !"

    "అయితే మరెందుకు ఫోన్ చేసినట్లు ?"

    "నీ పిరికితనం తెలివి తక్కువతనం చూచి జాలిపడి-"

    "నేను పిరికి వాడినా - నా సంగతి నీకు తెలీదింకా -"

    "ఆపరా ఫూల్ ? ఎంత పిరికివాడివి కాపోతే ఆ రోజు ఆ పిల్ల నేను ముద్దు పెట్టుకున్నందుకు నీ చెంప పగలగొడితే - భోరున ర్డుస్తూ రూమ్ కెళతావా ? దమ్ముంటే, తెలివుంటే, ఇంకేదయినా పైఎత్తు వేసి అసలు విషయం ఋజువు చేసి ఉండే వాడివి ! అవునా ?"

    "అవును."

    "చూశావా 'అవును' అని వప్పుకున్నావ్! నువ్వు తెలివి తక్కువ, పిరికి ఎక్కువ అనడానికి ఇది మరో ఋజువు."

    ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది.

    "హలో  హలో" అన్నాడు మురళి.  

    హటాత్తుగా అతని మెదడులో ఓ మెరుపు మెరసింది..

    "ఎవరు తెలివిగల వాడో రుజువు చేస్తాను-" అంటూ రూమ్ వేపు పరుగెట్టాడు.


                        *    *    *

 Previous Page Next Page