అరుంధతమ్మ మైల పనులన్నీ ముగించుకుని స్నానానికి వెళ్ళబోతున్నది.
పరమేశ్వరి పరుగెత్తుకువచ్చి ఆమె గుండెలమీదవాలి వెక్కి వెక్కి ఏడవసాగింది.
"ఏమిటే? ఏమైందే? అమ్మేమైనా అందా? లేక మీ అత్తారు తీసికెళ్ళడానికి వచ్చారా?" ఆవిడ గాబరాగా అడిగింది.
"యముడొచ్చాడమ్మమ్మా తీసికెళ్ళడానికి!"
"ఛ! ఏం మాటలే అవి?"
"నిన్న ఆ పేరంటం వెళ్ళకపోయినా బాగుండేది. అమ్మమ్మా!"
"ఏం జరిగిందే?"
"జరగాల్సిందే జరిగింది! తుంగభద్ర వాయినం చాటలివ్వడానికి వచ్చి........" చెప్పి భోరుమంది.
"భగవంతుడా! ఇప్పుడేం దారి?" ఆవిడ తలపట్టుకు కూర్చుండిపోయింది.
"నువ్వు ఏదైనా దారిచూపుతావని వచ్చాను అమ్మమ్మా!"
"నేనేం దారి చూపగలనే? వెళ్ళి వాడి తల పగుల గొట్టడానికి శక్తి చాలనిదాన్ని! ముసలిదాన్ని!"
"తుంగభద్ర చెప్పినట్టు ఈ విషం నేను మ్రింగక తప్పదా?"
"శరీరం పాపపంకిలమయ్యాక ఇక ఆ బ్రతుకు ఏం బ్రతుకు? కాని, ఎలా చెప్పనే నిన్ను చచ్చిపోమని? నాకు తెలుసు, బ్రతికి ఉంటే తప్పించుకోలేవు ఆ కామాంధుడి నుండి! అతడినెదిరించిన ఆడవాల్లబ్రతుకు లేమయ్యాయో, వాళ్ళ కుటుంబాలు ఎలా సర్వనాశనమయ్యాయో నేను చూశాను "ఆక్రోశంగా అంది అరుంధతమ్మ. "బ్రతుకుమీద తీపివుంటే తుంగభద్ర చెప్పిన విషాన్ని గుట్టుగా మ్రింగు! లేకుంటే ఇదేదారి చెరువుగట్టుకు! చెరువు నిండుగా ఉందమ్మా. నిన్ను ఎక్కువ బాధ పెట్టకుండా గుట్టుగా తన కడుపులో దాచుకొంటుంది!"
పరమేశ్వరి ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా కళ్ళు తుడుచుకొంది. దుఃఖం దిగమింగుకుంది మనసు రాయిచేసుకొన్నట్టుగా.
"బిందె ఇవ్వు, అమ్మమ్మా!"
"అదేమంచిది! మంచినీళ్ళకు వెళ్ళి కాలుజారి పడ్డావనుకోవడమే మంచిది!" అరుంధతమ్మ గొణికినట్టుగా అని బిందె ఇచ్చింది.
చెరువు ఈ గుట్టను ఆనుకొనే ఉంది. గుడివెనుకనుండి వెడితే చెరువులోకి దిగడానికి మెట్లున్నాయి.
పరమేశ్వరి బిందె చంకలో పెట్టుకొని గుడివెనుకనుండి చెరువువైపు సాగిపోతుంటే చూస్తూ నిలబడ్డ అరుంధతమ్మ నెమ్మదిగా కదిలింది. తలమీదుగా బిందెడు నీళ్ళు గ్రుమ్మరించుకొని పరుగులాంటి నడకతో గుడిలోకి వచ్చి స్వామిముందు సాష్టాంగపడింది. 'భగవంతుడా నన్ను క్షమించు! ఒక నిండు జీవితాన్ని అర్ధాంతరంగా చాలించమని సలహా ఇచ్చినందుకు నన్ను క్షమించు శీలవతికి శీలంకంటే ప్రాణం ముఖ్యం కాదు కదయ్యా? అందుకే ఈ సలహా ఇవ్వాల్సి వచ్చింది!'
మలి సంజవేళ.............
చెరువు కట్టమీద పడుకోబెట్టిన పరమేశ్వరి శవంప్రక్కన కూర్చొని, 'తల్లీ నిన్ను నేనే చంపాను కదా?' అని భోరున ఏడవసాగింది అరుంధతమ్మ.
పరమేశ్వరి శవం ప్రక్కన విలపిస్తున్న వాళ్ళలో తుంగభద్రకూడా వుంది.
'భగవంతుడా! ఈ లేతమ్రొగ్గను త్రుంచడంలో నాకూ భాగముంది! నేను ఈమె పాలిట మృత్యువునయ్యాను కదా?' అని కుమిలిపోయింది తుంగభద్ర.
శవపంచనామాలాంటి తతంగాలు పూర్తి అయ్యాయి.
ప్రమాదవశాత్తూ కాలుజారి చెరువులో పడిందన్న నిర్ణయానికి వచ్చారు.
అది ఆత్మహత్య అని ఎవరికీ అనుమానం రాలేదు.
ఎందుకంటే ఆ పిల్లకు పుట్టింట్లోనూ, అత్తింట్లోనూ కష్టాలేం లేవు కాబట్టి! తల్లిదండ్రులకు ఒక్కతే ఆడపిల్ల! అంతా గారాబమే! అత్తారింట్లో అందరూ సహృదయులైన వాళ్ళే! ఆ పిల్లను పన్నెత్తుమాట అని నొప్పించలేదింతవరకు! భర్తకు ఆమె ఆరోప్రాణం!
అది ఆత్మహత్యే అని ఎవరనుకొంటారు?
దహనకాండ అయిపోయింది. భర్త చేతులమీదుగా.
చితిలో పవిత్రమైన బూడిదగా మిగిలింది పరమేశ్వరి
కర్మకాండ కూడా అయిపోయింది.
కాలచక్రం ఎవరికోసం ఆగకుండా కదిలిపోతూంది!
ఎందరి గాయాలనో మాన్చే కాలచక్రం, ఎందరివెతలనో తీర్చే కాలచక్రం తుంగభద్ర మనస్తాపాన్ని మాత్రం మాన్పలేదు! ఎవరికీ చెప్పుకోలేని వేదనతో క్రుంగిపోసాగింది తుంగభద్ర. రేయింబవళ్ళు ఒకే ధ్యాస, తనే పరమేశ్వరి చావుకి కారణమయ్యానని!
ఎందుకంటే ఇటువంటి శీలవతిని ఆమె ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు! ఇష్టంతోనో, భయంతోనో లొంగిపోయినవాళ్ళనే చూసింది. అలా లొంగిపోయిన వాళ్లకి రాజాసాబ్ నుండి ఖరీదైన కానుకలు అందడం చూసింది. కాని, ఇంత గుట్టుచప్పుడు కాకుండా శరీరాన్ని త్యాగం చేసిన స్త్రీని చూడలేదు!
మనోవ్యాధి ఒక వ్రణంలా పరిణమించి ఇక భరించలేని దశకి వచ్చింది! కొద్దిరోజులు ఇలాగే సాగితే తనకి పిచ్చెక్కిపోతుందేమో అనిపించింది. తనగుండెలో బడబాలనంలా రగులుతూన్న రహస్యం ఎవరిముందైనా గ్రుమ్మరించి, పశ్చాత్తాపం ప్రకటిస్తే తప్ప ఈ వ్రణం మానదు అనుకొంది.