"ఏం జరిగింది?" అడిగింది తుంగభద్ర.
"మన రాజాసాబ్ హయగ్రీవంగారి అమ్మాయిని చూశాడు!"
తుంగభద్ర మొహం పాలిపోగా "ఆ!" అంది.
సాంతం చెప్పే పనిలేకుండానే ఆమెకంతా అర్దమైపోయింది.
"ఆస్థాన పండితులవారి కూతురినే కోరుకున్నారా! ఎంత దారుణం! ఆయనకి ఏదో పోయేకాలం వచ్చినట్లుంది"
"ష్! ఎవరైనా వింటే మన పీకలు తెగుతాయి. ఇప్పుడేం దారి చెప్పు"
"నేను మాత్రం ఈ పాపంలో భాగం పంచుకోలేను" వెళ్లబోయింది తుంగభద్ర
చెయ్యిపట్టి జబర్దస్తీగా ఆపాడు సింగన్న. "కాదంటే ఎలా? రాజాజ్ఞ ఇది" అతడి గొంతు కరుగ్గా ధ్వనించింది.
"ఇంకెవరికైనా ఈ పని అప్పగించు. నావల్ల మాత్రంకాదు"
"నువ్వే వాళ్ల ఇంటికి దగ్గరదానివి. సందుచూసి, ఆమె చెవిలో వేసి రేపు రాత్రికి కృష్ణమహల్ కి తీసుకురా"
"గొడవ చేస్తే"
"సాధారణంగా అయినింటి ఆడవాళ్లు ఇలాంటి విషయాల్లో గొడవ చేయరు తమ పరువే పోతుందని, గొడవ చేసిందే అనుకో. ఏం జరుగుతుందో చెప్పు.
ఎదురు తిరిగినవాళ్లకి ఏం జరుగుతుందో కూడా చెప్పు"
"ఆచార సంపన్నులైన బ్రాహ్మల ఇంటిపిల్ల. పైగా వివాహితురాలు నేను రాయబారం నడపలేను సింగన్నా. ఇంకెవరినైనా పంపు" మనసు ఒప్పుకోనట్టుగా అంది.
"ఏం? తల బిరుసుగా వుందా? ఇది రాజాసాబ్ పని అనుకున్నావా? నా ఇంటి పని అనుకున్నావా?" సింగన్న కళ్లెర్రచేసి అన్నాడు.
"భగవంతుడా! బిచ్చమెత్తుకుంటూ బ్రతికినా బాగేకానీ ఇటువంటి బానిస బతుకు బతకకూడదు" గొణిగింది తుంగభద్ర. "తప్పుతుందా? వెళతాను"
చాటలిచచే నెపంతో మరునాడు ప్రొద్దుటే ఇంటికివెళ్లి ఎలాగో లలితా పరమేశ్వరి చెవిలో వేసింది తుంగభద్ర. "దొరవారు నీమీద మనసు పడ్డారు. నువ్వు ఇష్టపడితే గుట్టుచప్పుడు కాకుండా తీసికెల్ళి తిరిగి తీసుకువచ్చేస్తాను. ఈ విషయం నీకూ నాకూ తప్ప మూడో కంటికి తెలియనివ్వను!"
"నిలువు కళ్ళు వేసుకొని చూడసాగింది పరమేశ్వరి.
"నీ అదృష్టమో, దురదృష్టమో రాజాసాబ్ కళ్ళలో పడ్డావు! నువ్వు కాదంటే, లేక గొడవచేస్తే పరిణామాలు బాగుండవు! ఆయన ధనవంతుడు! బలవంతుడు! తిరస్కరించిన ఆడదాని మీద పగబట్టే మనిషి, బలవంతంగా ఎత్తుకుపోవడానికి ఆయన దగ్గర మనుష్యులున్నారు. గొడవచేసి రచ్చకెక్కితే కుటుంబమే సర్వనాశనమయ్యే అవకాశం ఉంది! గొడవచేసి అల్లరిపడే బదులు గుట్టుగా ఒక్కరాత్రికి ఈ శరీరం నీదికాదనుకుంటే........... ఈ పాపం నిన్నంటదు, కోరి నువ్వీ పని చేయడం లేదు కాబట్టి!"
"ఒక్కరాత్రికి ఈ శరీరం నాది కాదనుకోవాలా? ఎంత తేలిగ్గా చెప్పావు. తుంగభద్రా! మొత్తానికి ఆడపాపి వనిపించుకొన్నావు! ఛీ!"
పరమేశ్వరి చేసిన ఛీత్కారానికి తుంగభద్ర మనసు కలుక్కుమంది. "పాపిష్టిదాన్ని! తప్పలేదమ్మా నాకు! దొరవారి ఉప్పు తింటున్న దాన్ని! వారు ఏం చెబితే అది చేయాలి కదమ్మా?" గుడ్ల నీరు త్రిప్పుకొని అంది తుంగభద్ర.
"ఈ శరీరం ఎంగిలిపడితే అది మళ్ళీ నా భర్తకీయగలనా? ఆ కామాంధుడికి ఒక్కరాత్రి సుఖమివ్వడం కోసం నన్ను జీవితాంతం పతితగా బ్రతకమంటావా? నువ్వు ఈ వార్త తెచ్చి నా చెవిలో వేసేకంటే గుక్కెడు విషంతెచ్చి నాగొంతులో పోస్తే సంతోషంగా మ్రింగేదాన్ని!"
"ఇదీ విషంతో సమానమే! నువ్వు మ్రింగక తప్పదమ్మా! రాత్రి పదకొండు గంటలకు మీ దొడ్డిగుమ్మం దగ్గరికి వస్తాను! నువ్వు తలుపు తీసుకువచ్చెయ్యి!"
"............."
"తెలివి తక్కువగా గొడవచేశావంటే నీ కుటుంబమే సర్వనాశనమౌతుంది ఆయన చేతిలో. చీకటి తప్పు చీకటిలోనే దాగిపోతుంది! వస్తాను జాగ్రత్త! మరోసారి హెచ్చరించి తుంగభద్ర వెళ్ళిపోయింది.
హఠాత్తుగా ఏదో సుడిగుండంలో చిక్కుపడ్డట్టుగా అయ్యింది పరమేశ్వరికి 'ఎలా ఈ విషయం నుండి బయటపడాలి? ఏది దారి?' పరమేశ్వరి కళ్లముందు అంధకారం అలముకుంది.
పేరంటానికి వెళ్ళకపోయినా ఎంత బాగుండేది? వెళ్ళినా ఆ దుష్టుడి కళ్ళబడకుండా వచ్చేస్తే ఈ సంకట పరిస్థితి వచ్చేది కాదుగా? అమ్మకీ, నాన్నకి చెప్పేస్తే? అమ్మ పెద్ద గొంతుతో అరిచి ఊరూవాడా ఏకం చేస్తుంది! ఇలాంటి వి,యం పదిమందిలో పడితే ఎంత అసహ్యంగా ఉంటుంది? ఈ విషయం తన అత్తవారి చెవిని పడితే ఒక కామాంధుడి దృష్టి పడినపిల్ల మాకక్కరలేదు అని వదిలిపెట్టినా వదిలిపెట్టేస్తారు. అంతా గొడవగొడవ అవుతుందేగాని తనను రక్షఇంచడానికి ఎవరూ ముందుకు రారు! నాన్నయినా ఏం చేస్తాడు? ఒక కావ్యం రాయమంటే రాస్తాడు. ఒక కవిత్వం అల్లమంటే అల్లుతాడు. ఒక ఆశువు చెప్పమంటే చెబుతాడు. కాని, బలవంతుడైన ఒక దుష్టుడిని ఎలా ఎదిరించాలో ఆయన నేర్చుకోలేదు. గొడవచేస్తే కుటుంబమే, సర్వనాశనం అవుతుందని హెచ్చరించింది తుంగభద్ర!
అరుంధతి అమ్మమ్మ దగ్గరికి వెడితే ఏదైనా సలహా ఇస్తుందా ఈ విషమ పరిస్థితినుండి బయట పడడానికి?
అరుంధతమ్మ వాళ్ళు ఊరవతల ఆంజనేయస్వామి వారి గుడిదగ్గర సత్రంలో కాపురముంటున్నారు. ఆమె భర్త ఆ గుడిపూజారి, మోహనవంశీ ఇంటి పూజారి కూడా.