ఒక సాయంత్రం హయగ్రీవం ఇంటిమెట్లు ఎక్కి లోపలకు వెళ్లింది తుంగభద్ర.
పరమేశ్వరి మరణంతో పరధ్యానంలో పడ్డట్టుగా అయింది హయగ్రీవం భార్య తులశమ్మ
బలవంతంగా తన దినచర్యలో మునిగిపోతున్నాడు హయగ్రీవం. పూజలు పునస్కారాలు ఏదో చేస్తున్నాడు.
"కూర్చో తుంగభద్రా" చెప్పాడు హయగ్రీవం ఉదాసీనంగా.
ఆయన కాళ్ల దగ్గర తల దించుకుని కూర్చుంది తుంగభద్ర.
"పదహారో ఏట పరమేశ్వరికి నీటిగండముందని మా నాన్నగారు చెప్పేవారు తుంగభద్రా. అది అక్షరాలా జరిగింది" అన్నాడు హయగ్రీవం.
"అందుకే దాన్ని నూతి దగ్గరికి, చెరువు దగ్గరికి వెళ్లనిచ్చేదాన్నికాదు" కళ్ళు తుడుచుకుంది తులశమ్మ.
"మృత్యువు తరుముకొస్తుంటే ఎవరేం చేయగలరు? దానికలా కాలు జారిపడి మరణించే యోగమున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏం లాభం?" విరక్తిగా అన్నాడు హయగ్రీవం.
"ఆ తల్లి కాలు జారిపడలేదు అయ్యగారూ....... కాలుజారిన బ్రతుకు బ్రతకడం ఇష్టంలేక చెరువులో పడింది. ఆమె పాలిట మృత్యుదూతను నేనే. నేనే హంతకురాలిని నన్ను చంపేయండి అయ్యగారూ! ఈ మనోవ్యధ నేను భరించలేను. కళ్లు మూసినా అమ్మాయి రూపం నా కళ్లముందు నిలిచనట్టుగా అవుతుంది"
తుంగభద్ర దుఃఖిస్తూ చెప్పిన విషయాన్నంతా విని నిర్లిప్తంగా అన్నాడు హయగ్రీవం. "నువ్వు సేవకురాలివి. నీ సేవా ధర్మం నువ్వు నిర్వహించావు. ఈ పాపంలో నీకేమీ భాగస్వామ్యం లేదు. వెళ్లు"
తులశమ్మ మాత్రం శాపనార్ధాలు పెట్టకుండా వుండలేకపోయింది.
"ఓసి పాపాత్మురాలా! కూతురులాంటి పిల్లను తీసుకుపోయి నీ దొర పక్కన పడుకోబెడదాముకున్నావా?"
"నా పాపానికి నీ కసిదీరా శిక్ష విధించు తల్లీ" తుంగభద్ర కన్నీరు మున్నీరుగా ఆమె పాదాలమీద పడిపోయింది.
"కూతురులాంటి పిల్లను కామించినవాడు మనిషా? పశువా? వాడి కళ్లు కాకులు పీకా? వాడ్ని మృత్యువు గద్దలా ఎత్తుకుపోను" చేతులు విరిచింది. "ఇటువంటి కామాంధుడి కొలువా మీరు చేసింది. అయ్యో!" హయగ్రీవం గుండెలు మండిపోతున్నాయి.
ఆయన కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. ఆ మంటలు తుంగభద్రను తాకలేదుగాని రాజ్యలక్ష్మిని తాకాయి.
ఎప్పుడూ పరమశివుడిలా ప్రసన్న దరహాసం ఒలికే ఆయన ముఖంలో ఆ రోజు అగ్నికీలలు కనిపించి హడలిపోయింది రాజ్యలక్ష్మి. హయగ్రీవంపట్ల ఆమెకు పితృవాత్సల్యం వుంది. అంతకుమించి గొప్ప పండితుడని, విజ్ఞాన ఖని అని, పరమ నిష్టా గరిష్టుడని గౌరవమూ వుంది.
ఎప్పటిలా రాజ్యలక్ష్మి నమస్కారం స్వీకరించలేదాయన.
ఆమె చూపిన ఆసనంలో కూర్చోనూలేదు.
"నువ్వు సాధ్వివి. కానీ నీ సాధ్వీతనం ఒక కామాంధుడికి విచ్చలవిడిగా తిరిగేందుకు దోహదపడుతోందనీ, నువ్వు చేస్తున్న నోములు, పూజలు ఒక దుర్మార్గుడికి ఆయుర్ధాయాన్ని పోస్తున్నాయని నువ్వు గుర్తించడంలేదు. పెదవివిప్పి ఒక్కమాట మన్నించలేని నీ సాధ్వీతనం నీసాటి ఆడవాళ్ళ శీలంతో నీ భర్త చెలగాటమాడేందుకు సాయం చేస్తుందని గుర్తించు."
పాలిపోయిన ముఖంతో కళ్లు అప్పగించి చూస్తున్నది రాజ్యలక్ష్మి.
"భర్త ఎలా వ్యభిచరించినా చూస్తూ సహించడం పాతివ్రత్యం కాదని, తప్పుదారిన నడిచే భర్తను సరిదిద్దుకోవడమే అసలైన పాతివ్రత్యమని గుర్తించు. వెడుతున్నాను రాజ్యలక్ష్మీ. ఇదే నా ఆఖరిమాట. ఆఖరి రాక. ఈనాటితో మీకూ నాకూ వున్న సంబంధం అంతమైపోయింది" వచ్చినంత దూకుడుగా వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
ఏం జరిగింది అని అడిగే అవకాశం కూడా ఆమెకివ్వలేదు.
ఏం జిరగిందో ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడగాలి?
రాజ్యలక్ష్మి మనసు కల్లోల సాగరమైంది.
భర్త రసికుడని తెలుసు. ఊరవతల గుట్టలమీద కోరి కట్టించుకున్న పాలరాతి మందిరం కృష్ణమహల్ ఆయన తెచ్చుకున్న ఆడవాళ్లతో, వాళ్ల గానా భజానాతో తరచూ కలకలలాడుతూంటుందని ద్రౌపది అన్న దాసి నోరు జారగా వింది.
తన సౌభాగ్యాన్ని శపించేంతగా ఆయన రసికత చెలరేగిందా? స్త్రీల శీలంతో చెలగాటమాడేంతగా ఆయన దిగజారిపోయాడా?
తుంగభద్ర ఆమె పాదాలమీద పడింది.
"మీరైనా నన్ను క్షమించండమ్మా! ఈ మనోవ్యధను భరించలేను. ఈ పాపం నన్ను చిత్రవధ చేస్తున్నది"
ఏడుస్తున్న తుంగభద్రను పైకి లేపింది "ఏం జరిగిందో చెప్పవే" ఆందోళనగా అడిగింది.
"వరలక్ష్మి వ్రతం పేరంటానికి వచ్చిన లలితా పరమేశ్వరి చెరువులో పడి చనిపోయిందమ్మా. ఆత్మహత్య చేసుకుంది"
స్థాణువైపోయింది రాజ్యలక్ష్మి. పరమేశ్వరి చనిపోయిందా? అదీ ఆత్మహత్యా? రెండువారాల క్రితం పేరంటంకి వచ్చి ఎంతో చక్కగా అమ్మవారి కీర్తన పాడిన అమ్మాయి, అప్పుడే వికసిస్తున్న పువ్వులా వున్న అమ్మాయి ఈరోజు లేదు. చనిపోయిందంటే నమ్మశక్యంగాలేదు. ఆ అమ్మాయి పాట ఇంకా తన చెవిలో గింగురుమంటున్నట్లుగా ఉంది.
"నిజం దొరసాని. ఆమె పాలిట యమదూతను నేనే అయ్యాను"
"విషయమేమిటో వివరంగా చెప్పు"
"పేరంటం నుండి తాంబూలం తీసుకుని వెళ్లిపోతున్న పరమేశ్వరిని దొరవారు మనసుపడి........"
"మనసుపడి?" ఉద్విగ్నస్వరంతో అడిగింది.