స్త్రీల కళాశాల అన్న బోర్డులకింద ఒక క్షణం నిలబడ్డాడు దార్కా. సమయం పది కావొస్తుంది. రకరకాల చీరల్లో అమ్మాయిలు ఒద్దికగా నడుచుకుంటూ ఆవరణలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళకు తెలీదు మనుషుల రక్తాన్ని దేవతలకు తర్పణంగా ఇచ్చే మహామాంత్రికుడు తమలో ఒకరికోసం రాత్రింబవళ్ళు అన్వేషిస్తున్నాడని.
అతడు లోపలకు ప్రవేశించబోతూవుంటే గూర్ఖా ఆపుచేసేడు.
"ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారు. కావాలంటే నేనిక్కడే నిలబడి వుంటా, వెళ్ళి అడిగిరా" అన్నాడు దార్కా. ఎంతకాలం నుంచో ప్రయోగిస్తున్న ట్రిక్ అది ఎక్కడా ఫెయిల్ అవలేదు.
రెండు నిముషాల తర్వాత అతడు ఆఫీసు రూమువైపు వెళుతున్నాడు. పెద్ద కాంపౌండు మధ్యలో అక్కడక్కడా బిల్డింగ్స్ విసిరేసినట్టు వున్నాయి. బయట బస్సులరొద లోపలికి వినిపించడంలేదు. రోడ్డు కిరువైపులా చెట్లు.
అమ్మాయిలు అతడిని చిత్రంగా చూస్తున్నారు. సెక్స్ గురించి తెలిసినవాళ్ళు ఆ దృష్టితోనూ -తెలియని వాళ్ళు ఆరాధనా పూర్వకంగానూ.
అతడు ఆఫీసులోకి ప్రవేశించాడు. ఉన్న నలుగురు ప్యూన్లలోనూ ముసలివాణ్ని ఎన్నుకున్నాడు యువకులకన్నా ముసలివాళ్ళు డబ్బుకు తొందరగా లొంగుతారని అతడి అనుభవం నేర్పింది.
"పెళ్లి చూపులుంటాయిగా బాబూ - దానికన్నా ముందే తొందరెందుకు" పది రూపాయలు కాగితం అందుకుంటూ అన్నాడు ఫ్యూను. అతడు నవ్వి వూరుకున్నాడు. ఫ్యూన్ లోపలికి వెళ్ళాడు.
అయిదు నిమిషాల తర్వాత ఓ పది రిజిస్టర్లు తీసుకొచ్చి ముందు పడేశాడు. ప్రిన్సిపాల్ కన్నా అతడే ఆ కాలేజీలో ఎక్కువ పలుకుబడి వున్నవాడిలా వున్నాడు. "వెతికి ఏ క్లాసో చెప్పండి బాబూ, క్షణాలమీద చూపిస్తాను" అన్నాడు.
"అంత సులభం కాదు" అనుకున్నాడు దార్కా తనలో తానే. కొన్ని వందల రోజుల్నుంచీ, కొన్నివేల రిజిస్టర్లు వెతగ్గా దొరికినది, క్షణాల్లో దొరుకుతుందా!
అతడు ఫైనలియర్ తో ప్రారంభించేడు. ఆమె వయసు ఇరవై అని అతడికి తెలుసు కాబట్టి.
ఆర్ట్సులో ఎవరూ లేరు. బై.పి.సి చూసేడు చూపుడు వేలుతో చాలా వేగంగా చదువుతూ పోతున్నాడు. ఆ పని చేసీ చేసీ అతడికి బాగా అలవాటు అయిపోయింది. లక్ష్మీ, లలిత, సుశీల ఈ పేర్లే ఎక్కువగా తగిలేవి.
రిజిస్టర్లో ఎక్కడా తులసి పేరు లేదు.
**********
రాత్రి పదిన్నరయింది. సత్రంలో ఒకమూల పడుకున్న దార్కా లేచి కూర్చున్నాడు.
అతడు తన నడుము గుడ్డలోంచి ఒక పుల్లకట్ట తీసేడు. నిజానికి అవి పన్నెండు కట్టలు. ఒక్కో కట్టలోనూ ముప్పై పుల్లలున్నాయి. ఒక్కొక్క పుల్లకి అయిదు కణుపులున్నాయి. ఆ కట్టని విషాచి ఇచ్చాడు. బిస్తాలో మంత్రగాడిగా వున్న రోజుల్లో అమావాస్య పూర్ణిమ తప్ప ఇంకేమీ తెలీదు. అయిదు సంవత్సరాల కాలాన్ని గుర్తు వుంచుకోవడం కోసం విషాచి ఆ కట్టని ఇఛ్చాడు.
ముప్పై పుల్లలూ ముప్పై రోజులకు సూచన! పన్నెండు కట్టలూ ఒక్కోకట్ట ఒక్కొక్క నెలకి, ఒక్కొక్క కణపూ ఒక్కొక్క సంవత్సరానికి అంటే అయిదు కణుపులు అయిదు సంవత్సరాలు.
ప్రతిరోజూ పుల్లలో ఒక్కొక్క కణుపుని విరుచుకుంటూ వస్తున్నాడు. దార్కా. రోజు దాటి రోజు వస్తే పుల్ల చిన్నదవుతూంది.
అన్ని పుల్లలూ విరిగిపోయిన రోజు.
అయిదు సంవత్సరాలూ అయిపోయినట్టన్నమాట. ఆఖరి పుల్ల విరిగేరోజున కాష్మోరా నిద్ర లేస్తాడు. ఆ తులసిని విరుచుకు తింటాడు. ఎక్కడున్నా సరే.
ఈ లోపులో తులసిని పట్టుకోవాలి. తన దగ్గరున్న వెంట్రుకతో ఆ తులసిని నిరూపించాలి లేకపోతే తన కడుపు తనే చీల్చుకుని చచ్చిపోతానని అతడు ప్రతిజ్ఞ చేసేడు.
చేతిలో పుల్లలకట్ట చిన్నదై పోయింది.
చాలా చిన్నదై పోయింది.
6
సిద్దేశ్వరీ ఆలయం నాలుగు అంతస్థుల భవనం
తెల్లవారుఝామున నాలుగున్నరకి అక్కడి భక్తులు నిద్రలేస్తారు. సిద్దేశ్వరికి స్నానం చేయించి, అర్చన చేస్తారు. ఆ తరువాత ఆమె పూజలో కూర్చుంటారు. దాదాపు ఎనిమిదింటికి ఆమె అతిధి గృహంలోకి వస్తారు. అప్పటికే అక్కడ జనం తండోపతండాలుగా వేచి వుంటారు. మంత్రులు , రాజకీయ నాయకులు, భక్తులు, ఐ.ఏ.యస్. ఆఫీసర్లు ఒకరనేమిటి - అందరూ అక్కడ ఆమె దర్శనం కోసం వేచి వుంటారు. ఆమె ప్రదాన శిష్యుడు, సదానంద చక్రవర్తి అక్కడ నిజిటర్స్ ని లోపలికి పంపుతాడు.
సిద్దేశ్వరిలో మహిమాన్విత మైన శక్తి వుంది.
ఆమె ప్రశ్నలకి సమాధానం చెబ్తారు. ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెప్పగలరు. అదికాదు గొప్పతనం. ఆమె ప్రశ్న చూడకుండానే జవాబు చెప్పగలరు అదీ విశేషం.
మానవుల్లో అతీతశక్తులు చూపించగలవారంటే, వారికి ఎంత ప్రాచుర్యం లభిస్తుందో అందరికీ తెలుసు. అందులో సిద్దేశ్వరి దేవీ ఉపాసకురాలు.
మొదట్లో ఆమెకంత ప్రాచుర్యం లభించలేదు కానీ ఒక మంత్రి గారి మనవడు మరణశయ్య మీద వుండగా ఆమె 'ఏమీ ఫర్లేదని' చెప్పింది. ఆ అబ్బాయికి తర్వాత నయం అవటంతో, ఆ మంత్రిగారు సిద్దేశ్వరీ భవనానికి విరివిగా విరాళాలు అందజెయ్యటమే గాక, తన శక్తిమేర ఇప్పించాడు కూడా. ఆ తరువాత దేశ ప్రజల్ని మరింత మూర్ఖత్వం వైపు నడిపించడానికి అలవాటుపడ్డ రాజకీయ నాయకుడు ఒకాయన దేవీ దర్శనంకోసం రావడంతో కథ మలుపు తిరిగింది.
మూడు నెలల్లో సిద్దేశ్వరీ ఆలయంకు ఎంత ప్రాదాన్యత లభించిందంటే - ప్రభుత్వమే ఆ భవంతి వరకూ రోడ్డు వేయించి, కరెంటు పెట్టించేసింది. తీర్ధయాత్రలకు వచ్చే ప్రజల్ని అదుపులో పెట్టడం కోసం చిన్న పోలీసు స్టేషను వెలిసింది. దుకాణాలూ, హోటళ్ళ సంగతి చెప్పక్కర్లేదు.