Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 15

                                             మా భక్తి వినరండహో
    అద్దంలో దీక్షగా మొహం చూస్కుంటూ ఫేవ్ చేస్కుంటున్న వెంకటరత్నం ఒక్కసారిగా ఉలిక్కిపడి కుర్చీలోంచి ఆరంగుళాలు ఎగిరిపడ్డాడు. అట్లా ఎగిరిపడ్డం వల్ల అతని చెంప మీద కూసింత రేజర్ గాటు పడింది.
    "వయమ్మోవ్..." అన్నాడు చెంప రుద్దుకుంటూ వెంకటరత్నం.
    అతనలా ఎగిరిపడ్డానికి కారణం హఠాత్తుగా పెద్ద శబ్దం రావడమే.
    ఆ శబ్దం మైకులోంచి పాట రూపంలో వస్తూంది... గాఠిగా...
    "ఓ దేవా..."
    బోవగ రావా?...
    భక్తజన రక్షకా
    కావగ రావా...
    మమ్మేలగ రావా    హరహర శంకర మహాదేవా   
    భక్త జనాలకు భళిదేవా (ఇది కోరస్)"
    ఒక్కసారిగా ఇంతగా భక్తి ఇంత పెద్ద శబ్దంతో పెల్లుబుకుతుందేంటబ్బా?.... అని ఆశ్చర్యంతో ముక్కున వేలేస్కున్నాడు వెంకటరత్నం.
    కానీ అక్కడే పెద్ద పొరబాటు జరిగిపోయింది. అతను ముక్కున వేలేస్కున్నాను అని అనుకున్నాడు కానీ... వేస్కున్నది వేలు కాదు... గెడ్డం చేస్కుంటున్న రేజర్!
    అంతే... కసక్...
    "హమ్మో!..." ముక్కు తడుముకున్నాడు వెంకటరత్నం. చేతికి రక్తం అంటుకుంది.
    సరిగ్గా అప్పుడే మైకులోంచి పాట ఆగిపోయి నిశ్శబ్దంగా మారింది వాతావరణం.
    "హమ్మయ్య!..." అనుకుని రేజర్ తో చెంపమీద రెండుసార్లు గీక్కున్నాడు.
    ఇంతలో మళ్ళీ ఘోరం జరిగిపోయింది. మైకులో పెద్ద సౌండుతో ఇంకో పాట మొదలైంది.
    ఆ సౌండుకి మళ్ళీ ఉలిక్కిపడ్డాడు వెంకటరత్నం... ఫలితం?
    కసక్...
    ఈసారి ఎడమ చెంప మీద గాటుపడింది.
    మళ్ళీ కేర్ ర్ ...బేర్ ర్... అన్నాడు వెంకటరత్నం ఎడమచెంపని తడుముకుంటూ.
    మైకులో పాట యమజోరుగా వస్తూంది.
    "రారండీ భక్తులారా   
    రంగరంగ వైభోగాన
    భళి దేవుని కొలవండీ"
    చెక్క భజన చేయండి...
    "హుం!..." ముక్కుతూ రేజర్ ని మెడమీద పెట్టాడు వెంకటరత్నం.
    కానీ అప్పుడే ఎవరో భుజం మీద దభీమని చరిచారు.
    హంతే... ఆ కుదుపుకి మళ్ళీ మెడమీద కసక్..."
    "వాయవ్వోవ్..." గట్టిగా అరిచాడు వెంకటరత్నం.
    ఓసారి మెడని బాధగా తడుముకుని తనకు ఏర్పడిన కుదుపునకు కారణం ఏమిటా అని పక్కకి తిరిగి చూశాడు.
    పక్కనే కాఫీ కప్పు పట్టుకుని భార్యా కాంతామణి నిల్చుని ఉంది.
    "గెడ్డం గీస్కునేప్పుడు ఇలా సరసాలాడొద్దని చెప్పానా?..." పళ్లు కొరుకుతూ అన్నాడు వెంకటరత్నం.
    "సరసమా నా బొందా?... ఇందాకట్నుండీ పిలుస్తుంటే పలకరేం?... కాఫీ తీస్కోండి" అంది ఆమె అతనికంటే ఎక్కువగా పళ్ళు కొరుకుతూ.
    "అసలు నువ్వు పిలిచింది ఈ మైకు గోలలో వినిపిస్తేగా?... ఆ కాఫీ అక్కడ తగలెయ్!!..." అన్నాడు విసుక్కుంటూ.
    కాంతామణి కాఫీ అక్కడ పెట్టేసి వెళ్లిపోయింది.
    వెంకటరత్నం ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి మళ్లీ అద్దంలో తన మొహం చూస్కుంటూ గెడ్డ గీస్కోడానికి ఉపక్రమించాడు.
    మైకులో గోలగోలగా మరోభక్తి పాట వస్తూంది.
    "భం భం భం భం భళి దేవా...
    నీ భజన సేతము భళి దేవా..."
    ఆ గోలకీ... ఆ శబ్దానికి వెంకటరత్నంకి ఏదో కంగారుగా... అదేదో గాభరాగా అనిపించింది... కాస్త పిచ్చిపిచ్చిగా అనిపించింది.
    ఫలితం...మరోసారి కసక్...
    "వామ్మోవ్..." గడ్డం తడుముకుని చేతికి అంటిన రక్తం చూసి ఘోల్లు మన్నాడు వెంకటరత్నం.
    మరుక్షణం ఇంట్లోంచి వెంకటరత్నం కూతురు సుబ్బలక్ష్మి కూడా గొల్లుమంది.
    "నువ్వెందుకే ఘోల్లుమంటున్నావ్?... నీ గెడ్డం కూడా తెగిందా?..." ఇంట్లోకి చూస్తూ అరిచాడు వెంకటరత్నం.
    కానీ మరుక్షణం తన తప్పును గ్రహించు నాలుక కొరుక్కున్నాడు.
    ఆడాళ్ళకి గడ్డం ఉండదు కదా... హర్రె!
    "నాన్నా... త్వరగా రా నాన్నా..." గోడు గోడున అంది సుబ్బలక్ష్మి.

 Previous Page Next Page