Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 14

                                        రామేశం రైలు ప్రయాణం
    ప్రతిరోజూ ఉదయం లేవడం, పళ్ళు తోముకుని కాఫీ తాగడం, స్నానం చేసి భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం గదికి వచ్చి పడడం... రోజూ రామేశం ప్రోగ్రాం ఇదే.
    రామేశానికి విసుగు పుట్టేస్తోంది. జీవితం రొటీన్ గా వుంది. ఏదైనా కాస్త మార్పు కావాలి.లేకపోతే జీవితం అంటేనే విరక్తి పుట్టేలా వుంది.
    సర్దాగా ఏదైనా ఊరు వెళ్తేనో? అనుకున్నాడు.
    ఏ ఊరు వెళ్ళాలి?... ఏ ఊరు వెళ్ళాలి??..
    ఆలోచించాడు.
    వెంటనే అతని మనసుకు ఢిల్లీ  తట్టింది.
    'నేను మద్రాసు చూశా, బొంబాయి చూశా... కలకత్తా చూశా... చూడంది ఢిల్లీనే. ఉండేది ఎలాగూ హైదరాబాదే... కాబట్టి ఢిల్లీ వెళ్ళాలి!!" అనుకున్నాడు రామేశం.
    ఆ నిర్ణయం తీసుకున్నరోజే సాయంత్రం ఆఫీసు అయిన తరువాత తిన్నగా రైలుస్టేషన్ కి వెళ్ళాడు ఢిల్లీకి టికెట్ రిజర్వేషన్ చేయించుకోడానికి.
    రిజర్వేషన్ ఆఫీసులోకి అడుగు పెట్టగానే రామేశంకి కొన్ని గొంతులు ఇలా వినిపించాయ్... ఏదో అమ్ముతూ.
    "ఆ... లడిబిడిగిడి... బిడిబిడి హై..."
    ఆ... గుడి మడి తడి బుడి బుడీ..."
    రామేశంకి చాలా ఆకలిగా ఉంది.
    "వాళ్ళేదో అమ్ముతున్నారు... అది తిన్నాక కాస్త ఓపిక వస్తుంది... ఆ తర్వాత క్యూలో నిలబడి టికెట్ తిస్కోవచ్చు..." అనుకున్నాడు.
    రామేశం ఒకడి దగ్గరికి వెళ్ళి అడిగాడు.
    "చూడబ్బీ... నీ దగ్గర తినడానికేమున్నాయ్?"
    వాడు రామేశంవంక వింతగా చూశాడు.
    "అలా చూస్తావేం? తినడానికేమున్నాయో త్వరగా చెప్పు ... నాకసలే ఆకలిగా వుంది..." అన్నాడు రామేశం విసుగ్గా మొహం పెట్టి.
    "మొట్టికాయలూ, జల్లకాయలూ, చెంపకాయలూ, డిప్పకాయలూ, కొత్తెంలూ ఉన్నాయ్... కావాలా?" చిలిపిగా చూస్తూ అడిగాడు వాడు.
    రామేశం దేభ్యం మొహం వేస్కుని వాడివంక చూశాడు.
    "అదేంటి తినడానికేమున్నాయ్ అని అడిగితే మొట్టికాయలూ, జల్లకాయలూ అని అంటావ్?" అన్నాడు తేరుకుని.
    "మరి రిజర్వేషన్ ఆఫీసులో తినడానికేముంటాయ్... ఏమైనా తినాలని ఉంటే రైల్వే క్యాంటీన్ కి వెళ్ళాలి... లేదా ఏదైనా హోటల్ కి వెళ్ళాలి!!" అన్నాడు వాడు సీరియస్ గా.
    "మరి ఇందాక ఏదో అమ్ముతున్నావే?!..." తెల్లబోయి చూస్తూ అడిగాడు రామేశం.
    ఆ మాట వినగానే వాడు క్రిందపడి పొర్లి పొర్తి నవ్వుతూ గిలగిల్లాడి పోయాడు.
    కాస్సేపలా నవ్వి, మెల్లగా నేలమీంచి లేచి బట్టలకంటిన దుమ్ము దులుపుకుని "ఓర్ని... అవి తినేవానుకున్నారా?" అన్నాడు మళ్ళీ తన్నుకుని వస్తున్న నవ్వును ఆపుకుంటూ.
    "కావా?...అయితే మళ్ళీ అను... ఏం అమ్ముతున్నావో చూస్తా..." కుతూహలంగా ముందుకు వంగి అడిగాడు రామేశం.
    వాడు మెల్లగా అన్నాడు.
    "ఆ... లడిబిడిగిడి... బిడిబిడి హై... బిడొడబడ... గడబిడహై..."
    "ఏంటో... నువ్వేమంటున్నావో నాకస్సలు అర్ధం కావడంలేదు... కాస్త స్పష్టంగా అమ్మొచ్చుకదా?... ఏదీ... కాస్త స్పష్టంగా చెప్పు!..."
    "రైలు టిక్కెట్లమ్ముతాం... రిజర్వేషనిప్పిస్తాం... ఎక్కడికైనా సీటూ, బెర్తూ ఇప్పిస్తాం..." ఈసారి స్పష్టంగా అన్నాడు వాడు.
    రామేశం కప్పలా నోరు తెరిచాడు.
    "ఏంటీ?... ఇప్పుడు కొత్త పద్దతి వచ్చిందా?... టిక్కెట్లు కౌంటర్లో కాకుండా ఇలా కారిడార్లలో అమ్ముతున్నారా?
    ఆ దెబ్బకి వాడు మళ్ళీ కిందపడి పొర్లి పొర్లి నవ్వేసి నిలబడ్డాడు.
    "ఏంటిసార్... మీరిలా మాటిమాటికి నన్ను కిందపడేసి నా బట్టలన్నీ ఖరాబ్ చేస్తున్నారు?... కౌంటర్ లో టిక్కెట్లు అమ్ముతారు... మేం కూడా టిక్కెట్లు అమ్ముతాం...
    కానీ మేం బ్లాకులో అమ్ముతాం... టిక్కెట్టుకి ఇరవై ఐదు రూపాయలు. ఎక్స్ ట్రా ఇవ్వాలి! ఏ రోజుకైనా ఇస్తాం... ఏ ఊరికైనా ఇస్తాం... రిజర్వేషన్ తో సహా... చెప్పండి... ఏ ఊరికి టిక్కెట్టు కావాలి? ఏ రోజుకి కావాలి?... ఏసీయా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా?..." గబగబా అన్నాడు వాడు.
    "కౌంటర్లో టిక్కెట్లు ఇస్తున్నప్పుడు నీ దగ్గర ఎందుకు కొంటానూ... హమ్మా... ఆశ, దోశ, అప్పడం, వడ... వారెవ్వా... ళక్ ళక్..." అన్నాడు రామేశం.
    "అయితే నా దగ్గర టిక్కెట్ కొనరన్నమాట?" సీరియస్ గా అడిగాడు వాడు.
    "కొనను!"
    "అయితే ఇంతసేపూ నా టైమెందుకు బర్ బాద్ చేశావ్?... ఛల్..." అంటూ వాడు రామేశం మెడమీద చెయ్యేసి ఒక్కతోపు తోశాడు. దెబ్బకి రామేశం క్యూలో పోయిపడ్డాడు.
    క్యూ కాస్త పెద్దగానే వుంది.
    క్యూలో పడ్డ రామేశం లేచి నిలబడి కాస్త సర్దుకు నించున్నాడు.
    క్యూలో ఉన్న అందరూ బుస్ స్... బుస్ స్ మని నిట్టూరుస్తూ ఉన్నారు.
    "మీరెందుకట్టా రైలింజన్ శబ్దం చేస్తున్నట్టుగా నిట్టూరుస్తున్నారు?..." రామేశం అందర్లోకి కాస్త ఎక్కువగా నిట్టూరుస్తున్న వాడిని అడిగాడు.
    "ఎందుకంటావేంటి?... ఇదివరకు టిక్కెట్లు ఎంచక్కా మామూలుగా ఇచ్చేవారు... ఇప్పుడు కంప్యూటర్ సిస్టం పెట్టేరుగా... అందుకే మేమంతా ఇంత చేటున నిట్టూరుస్తున్నాం..." అని సమాధానం చెప్పాడతను.
    "అందులో బాధపడాల్సిందేముందీ?... కంప్యూటర్ సిస్టం అయితే మరీ మంచిదిగా... టిక్కెట్లు త్వరగా ఇచ్చేస్తారు..."
    రామేశం ఇలా అనగానే క్యూలో వున్న జనం మొత్తం వెనక్కి తిరిగి రామేశం వంక చూసి ఘొల్లున నవ్వారు.
    రామేశంకి కాస్త దగ్గర్లో వున్నవాళ్ళయితే అతని వీపుమీద గుభేల్... గుభేల్ మని గుద్ది మరీ నవ్వి"భలే అమాయకుడివి గురూ..." అన్నారు.
    కానీ కౌంటర్ లో కూర్చుని టిక్కెట్లు ఇచ్చే వ్యక్తి మాత్రం నవ్వలేదు.
    అతను రామేశం వంక సీరియస్ గా చూసి "ఏం... వేళాకోళంగా ఉందా? నేను టిక్కెట్లు స్లోగా ఇస్తున్నానని వ్యంగ్యంగా అంటున్నావ్ కదూ?... నీ వొంతు రానీ... నీ పనిచెప్తా. టిక్కెట్లు లేవు... రిజర్వేషన్ పుల్ అయిపోయిందని చెప్తా..." అన్నాడు.
    రామేశం బిక్కమొహం వేశాడు.
    "అయ్యో... నా ఉద్దేశం అది కాదు సార్... కంప్యూటర్ సిస్టమ్ అయితే టిక్కెట్లు ఇవ్వడం త్వరగా అవుతుందనీ... నీళ్ళు నముల్తూ అన్నాడు.
    "అదుగో... మళ్లీ అదే కూతా?" కోపంగా అన్నాడు కౌంటర్లో మనిషి.
    రామేశం చెంపలేస్కుని నోరు మూస్కున్నాడు.
    తర్వాత కౌంటర్లో మనిషి పక్క కౌంటర్లో వాడితో సరసాలాడ్తూ, మధ్య మధ్యలో కాఫీకి, టీకీ, చిటికెన వేలికీ వెళ్తూ, ముక్కుతూ మూలుగుతూ టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించాడు.
    రామేశం వంతు వచ్చేసరికి గంటన్నర పట్టింది.
    రామేశం అప్లికేషన్ తీస్కుని కంప్యూటర్ బటన్స్ ఏవో టకటక నొక్కి స్ర్కీన్ వంక చూసి  పెదవి విరిచాడు కౌంటర్ లోని మనిషి.
    "రిజర్వేషన్ లేదు..." అన్నాడు.
    "సార్...సార్... సారీ సార్... ఇందాక మిమ్మల్ని వేళాకోళం చెయ్యలేదు సార్... ఏదో తెలీక అలా అన్నాను సార్... కంప్యూటర్ సిస్టం పెట్టింది టిక్కెట్లు చచ్చేంత ఆలస్యంగా ఇవ్వడానికే సార్... నాకు టిక్కెట్ ఇవ్వండి సార్..."
    రామేశం దీనంగా మొహం పెట్టి అన్నాడు.
    కౌంటర్లో మనిషి ఘొల్లున నవ్వాడు.
    "నేన్నీమీద పగబట్టి అంటంలేదయ్యా బాబూ... నిజంగానే రిజర్వేషన్ పుల్ అయిపోయింది. కావాలంటే టిక్కెట్టు ఇస్తాగాని వెయిటింగ్ లిస్టులో వుంటుంది. వెయిటింగ్ లిస్టు నెంబర్ నూట పదకొండు. మీ ప్రయాణం రోజుకు ఏమైనా కాన్సిలేషన్స్ ఉంటే బెర్త్ దొరుకుతుంది... ఇవ్వనా?"
    "సరే ఇవ్వండి..." నీర్సంగా అన్నాడు రామేశం.
    "ఇస్తాగానీ ఇప్పుడివ్వను..."
    "ఏం?" తెల్లమొహం వేశాడు రామేశం.
    కౌంటర్లో మనిషి రామేశానికి వేళ్ళు చూపించి చిలిపిగా నవ్వాడు.
    రామేశం "హా..." అన్నాడు బాధగా.
    కౌంటర్లోని మనిషి కౌంటర్ వదిలివెళ్ళిపోయి దాదాపు అరగంట తర్వాత వచ్చాడు.
    "అంతా సుఖంగా జరిగిందా?..." లోపల్లోపల పళ్ళు నూర్తూ, పైకి తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు రామేశం.
    "ఆ..." అంటూ రామేశానికి ఢిల్లీకి టిక్కెట్ ఇచ్చాడు అతను.
    రామేశం ప్రయాణం ఆ పైవారమే.
    ఆ మర్నాడు ఆఫీసులో వారంకోసం లీవ్ అప్లయ్ చేశాడు.
    ప్రయాణంరోజు సూట్ కేసు పట్టుకుని బయటికి వచ్చిన రామేశం ఏ ఆటోవాడినడిగినా మీటర్ కి రానన్నాడు. ఒక్కోడు ఇరవై, ముప్పయ్ లు అడుగుతున్నాడు స్టేషన్ కి రావడానికి.
    "మీరూరెళ్తుంటే మేం మీటర్ మీద ఎందుకొస్తాం... ఆహా... అమ్మా... హబ్బా... మీరు సూట్ కేసుతో సిటీ బస్సెక్కలేరు... చచ్చినట్టు ఆటో ఎక్కాలి... హి... హిహి... హిహిహి..." అన్నారు వాళ్ళు.
    చివరికి ఓ ఆటోవాడికి ఇరవై రూపాయలిచ్చి స్టేషన్ కి వెళ్ళి ఎ.పి. ఎక్స్ ప్రెస్ ఎక్కాడు.
    రైలు బయలుదేరిన రెండు గంటలకు టిక్కెట్ కలెక్టర్ చెకింగ్ చేయడానికి వచ్చాడు. కంపార్ట్ మెంట్లో బెర్తులు లేనివాళ్ళు మొత్తం అతని వెనకాల పడ్డారు. రామేశం కూడా అతని వెనకాల పడ్డాడు. టిక్కెట్ కలెక్టర్ కంపార్ట్ మెంటు అటూ ఇటూ పరిగెత్తి వీళ్ళతో దొంగాట, చెడుగుడూ మొదలైన ఆటలు ఆడి తర్వాత బెర్త్ లు లేనివాళ్ళకి ఒక్కోబెర్త్ ఎలాట్ చేశాడు. అయినా ఆ కంపార్ట్ మెంట్ లో రిజర్వేషన్ లేనివాళ్ళు ఇంకా చాలామంది మిగిలిపోయారు. వాళ్ళుకాక ప్రతీ స్టేషన్ లో రిజర్వేషన్ లేకుండా ఇంకా చాలామంది ఎక్కేయసాగారు.
    రామేశం ఒళ్ళో ఒకడూ, నెత్తిమీద మరొకడూ కూర్చోగా ఢిల్లీ చేరాడు ఒళ్ళు పచ్చడి చేస్కుని...
    ఇది రామేశం సర్దాగా చేసిన ప్రయాణం!
                                                      *    *    *

 Previous Page Next Page