వెంకటరత్నం కంగారుగా లోపలికి పరిగెత్తాడు. అక్కడి దృశ్యం చూసి నిరుత్తరుడైపోయాడు వెంకటరత్నం.
కాంతామణి మంచం మీద పడుకుని ఉంది జబ్బు మనిషిలా. ఆమె ఆయాసపడ్తూ ఎగశ్వాస పీలుస్తుంది. ఆమె కాళ్ళ దగ్గర పదారేళ్ల సుబ్బలక్ష్మి కూర్చుని ఉంది.
"ఏమైందే... ఇప్పటిదాకా బాగానే ఉన్నావ్ కదా?..." కంగారుగా అడిగాడు వెంకటరత్నం.
"ఏమైందేమిటండీ... నేనసలే బి.పి. పేషంటుని కదా?... ఆ మైకు గోలకి నాకు గందరగోళం అయిపోయి... గుండెల్లో గాభరా అయిపోయి ఇలా మంచం మీద పడిపోయా... ఇహ ఈవాల్టికి వంటా గింటా లేదు... మీరే వంట చేస్కోండి..." అంది కాంతామణి రొప్పుతూ.
వెంకటరత్నం గుండెలు బాదుకుని లబ్బున మొత్తుకున్నాడు.
కాంతామణి అతని వంక ప్రేమగా చూసింది.
"ఆహా?... నేనంటే మీకెంత ప్రేమండీ... నాకు చిన్న కష్టం రాగానే మీరెట్టా లబ్బులబ్బున మొత్తుకుంటున్నారో!!" అంది ఆనంద భాష్పాలు రాలుస్తూ.
"ఛాల్లే ఊర్కో... ఇప్పుడు వంట మొదలెడ్తే నేనాఫీసుకు ఎట్టా వెళ్ళాల్రా నాయనా అని నేను గోలెడ్తుంటే నీ సోది ఒకటి!!..." విసుక్కున్నాడు వెంకటరత్నం.
ఇంతలో పక్కగదిలోంచి వెంకటరత్నం పన్నెండేళ్ళ కొడుకు నారాయణ "నాన్నోయ్..." అంటూ ఘోల్లుమన్నాడు.
వెంకటరత్నం కంగారుగా ఆ గడిలోకి పరుగెత్తాడు.
అక్కడ... అతని తండ్రి వెంకట్రామయ్య మంచం మీద పడుకుని రెండు చేతులూ గుండెల మీద పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు.
"ఏమైంది నాన్నా?..." తండ్రిని ఆందోళనగా అడిగాడు వెంకటరత్నం.
"ఇంకేం కావాల్రా నాయనా... నీకు తెల్సు కదా... నేను హార్ట్ పేషంట్ ననీ...
ఈ మైకు గోలకి నాకు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉందిరా... ఈ మైకు కట్టేసేలోగా నేను పోతానో ఏంటో...?" అన్నాడు వెంకట్రామయ్య.
"అట్లాగయితే లాయర్ ని తీస్కురానా నాన్నా... విల్లు గురించి చెప్పొచ్చు...."
అది వింటూనే వెంకట్రామయ్య మండిపడ్డాడు.
"లాయర్ సంగతి తర్వాత... ముందు ఆ భక్త సమాజం వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ మైకు సౌండు తగ్గించేలా చెయ్... అబ్బా... హమ్మా..." గుండెల మీద చేత్తో రుద్దుకున్నాడు వెంకట్రామయ్య.
వెంకటరత్నం వెంటనే బయటికి పరిగెత్తి భక్తసమాజం దగ్గరికి వెళ్ళాడు.
కాలనీలోని భక్తులంతా చిలకాకుపచ్చ చొక్కాలు ధరించి హడావిడిగా తిరిగేస్తున్నారు అక్కడ.
వాళ్ళంతా భళి దేవుడి భక్తులు. దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు అలా పచ్చచొక్కాలు ధరిస్తారు.
"సార్... సార్... అర్జంట్... ఇక్కడ మీ భక్త సమాజం సెక్రటరీ ఎవరు సార్?..." ఒకాయన్ని హడావిడిగా అడిగాడు వెంకటరత్నం.
"నేనే... యేం?..." ఆ పక్కనే ఉన్న ఒకాయన మీసాలు దువ్వుతూ ముందుకు వచ్చాడు.
"ఏం లేద్సార్... మా ఇంట్లో మా ఆవిడకి బి.పి.సార్... మా నాన్నగారు హార్ట్ పేషంట్ సార్..."
"అయితే?"
"మీరు మైక్ తీసేసి భక్తి పాటలు వేస్కోవచ్చు కద్సార్?"
"నువ్వేం మనిషివయ్యా?... భక్తి పాటలు వద్దంటావేమిటి?... మనిషికి అంతో ఇంతో పాపభీతి, భక్తీ ఉండాలయ్యా...ఇలా అనడం చాలా తప్పు... చెంపలేస్కో.... లేకపోతే కళ్ళుపోతాయ్" అన్నాడు సెక్రట్రీ సీరియస్ గా.
వెంకటరత్నం నాలుక కొరుక్కుని చెంపలేస్కున్నాడు.
"నిజమేగానీ సార్... పోనీ మైకు సౌండు తగ్గించుకోవచ్చు కద్సార్... ఇంత గందరగోళంగా లేకుండా... హి?...హిహి?..."
"భలేవాడివే! మైకు సౌండు తగ్గిస్తే కాలనీ మొత్తం వినిపించదు... అలా వినిపించకపోతే కాలనీ జనాలకి మాకు భక్తి ఉందని ఎలా తెలుస్తుంది?"
"నువ్వు దేవుడికీ, మతానికీ విరుద్ధం లాగున్నావే?!!" అన్నాడు సెక్రట్రీ పక్కమనిషి.
"అది కాద్సార్... నేను ఏ దేవుడికీ ఏ మతానికీ విరుద్ధం కాద్సార్... ఏ మతం వాళ్ళకయినా మనసులో భక్తిభావం ముఖ్యంగానీ .... తమకి భక్తి ఉన్నట్టు ఇలా బయటికి ప్రదర్శించనవసరం లేదు కద్సార్... దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిం..." స్పీచ్ ఇవ్వబోతున్న వెంకటరత్నంని మధ్యలోనే టెంకి జల్లకొట్టి వెళ్ళిపోయాడు సెక్రట్రీ.
వెంకటరత్నం బిక్కమొహం వేసి "ఇంకా ఈ మైకు ఎంతదాకా ఉంచుతారు?" అని అడిగాడు అక్కడ ఉన్న రెండో వ్యక్తిని.
"ఈ రోజుంతా ఉంటుంది... అంతేకాదు. రాత్రి భక్తులమంతా కల్సి గోలగోలగా భజన కూడా చేస్తాం ఎంచక్కా..." నవ్వుతూ సమాధానం చెప్పాడు అతను.
"భజన కూడా మైకు పెట్టుకుని చేస్తారా?"
"ఓ... ఫస్టుగా!" అన్నాడు అతను.
వెంకటరత్నం గుండెలు బాదుకున్నాడు.
ఆ రోజు వంట చేస్కుని ఆఫీసు కెళ్ళేసరికి బాగా ఆలస్యం అయ్యింది. ఆఫీసరుతో బాగా చివాట్లు తిన్నాడు. సాయంత్రం ఇంటికొచ్చాక మళ్ళీ వంటపని!...
మైకుందిగా?... పరీక్షలున్నా మేం చదవనే చదవం!" అంటూ పకపకా నవ్వారు పిల్లలు.
ఆ రోజు రాత్రి తొమ్మిదికి భజన మొదలైంది. మైకు సౌండ్ పుల్ గా పెట్టి ఒక యాభై మంది దాకా భజన చేశారేమో... కాలనీ జనం మొత్తం పిచ్చెక్కి జుట్లు పీక్కేస్కున్నారు.
దాదాపు రాత్రి పన్నెండు దాకా ఆ భజన కార్యక్రమం కొనసాగింది.
తర్వాత నిశ్శబ్దం.
హమ్మయ్య... మైకు గోల తప్పింది" అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుని నిద్రపోడానికి సిద్దపడ్డాడు వెంకటరత్నం.
కానీ... మర్నాడు తమ తరపున మైకు పెట్టి భజన కార్యక్రమం నిర్వహించాలని అదే కాలనీలో వేరే భక్త సమాజం వాళ్ళు నిర్ణయం తీస్కున్నారని పాపం వెంకటరత్నానికీ తెలీదు... కాలనీవాసులకీ తెలీదు.
* * *