Previous Page Next Page 
మౌనం పేజి 14

    జరజరా  షాపు  ముందున్న షట్టరు  క్రిందికి  లాగుతున్న  శబ్దం....

    తల తిప్పి  చూసిన ఆ షాపులోని  జనాలకు జరుగుతున్నదేమిటో  అర్ధంకాలేదు.

    ఇద్దరు వ్యక్తులు  షాపులోకి ప్రవేశించి  షట్టర్ని  క్రిందికి దించేశారు.

    "ఏయ్....ఎవరు మీరు?" అయోమయంగా అరిచాడు  ఓనరు.

    అతని  అరుపుకి గిర్రున  తల తిప్పి వెనక్కి  చూసి  అదిరిపడింది  సంజు.

    కారణం....ఆ వచ్చింది ఎవరో కాదు.

    నీగ్రోలాంటి వ్యక్తి....కత్తితో  తనని చంపాలని ప్రయత్నించిన  వ్యక్తి! ఆ వ్యక్తి  తన కోటు జేబులోంచి  రివాల్వరు బయటకి  తీశాడు.

    జరగబోయేదేమిటో  అర్ధమయిన  ఆమె మెదడు  సెకనులో వెయ్యోవంతు  కాలంలో  పనిచేసింది.

    మెరుపులా  అక్కడ్నించి కదలబోయింది.

    కానీ అప్పటికే ఆలస్యం అయింది.

    భీకరంగా ఘర్జిస్తూ  ఆమె వైపు  నిప్పులు  కురిపించిందా రివాల్వరు.

    "జుయ్...." అన్న శబ్దంతో  వెచ్చని  ఆవిరి ఆమె  చెవి  ప్రకక్గా దూసుకెళ్ళింది.

    అదే సమయంలో  మెరుపులా  పనిచేసిందామె  మెదడు.

    క్షణంలో పదోవంతు  కాలంలో  క్యాష్ కౌంటరు  మీదుగా  అవతలకు  దూకేసింది.

    అప్పుడే  మరోసారి  నిప్పులు  కక్కింది  రివాల్వరు.

    క్యాష్ కౌంటరు  మీద వున్న కంప్యూటరు  స్క్రీన్ కి  తగిలింది  బుల్లెట్.

    తునాతునకలయిపోయింది స్క్రీన్.

    మొదటి  బుల్లెట్  శబ్దం  వినపడగానే  గిర్రున  వెనక్కి  తిరిగి చూశాడు  కౌశిక్.

    అతని కళ్ళకి  ఇద్దరు వ్యక్తులు కనిపించారు.

    షట్టరు  మూసుంది. దాని  దగ్గర  నిలబడి  వున్నాడో దృఢకాయుడు.

    మరో వ్యక్తి  చేతిలో  రివాల్వరుంది.

    ఆ వ్యక్తి  ఎవరిని  ఉద్దేశించి  కాల్చాడో  అర్ధంకాలేదు  కౌశిక్ కి.

    కారణం....అక్కడ ముగ్గురు  వ్యక్తులున్నారు. క్యాష్ కౌంటర్లో ఓ వ్యక్తి ప్రక్కగా  మరో వ్యక్తి వారి ఎదురుగా  ఓ యువతి.

    బహుశ డబ్బు  దొంగతనానికి  వచ్చి వుండచ్చన్న  ఆలోచన వచ్చింది.

    క్షణకాలం తర్వాత  రెండోసారి  రివాల్వరు  పేలగానే  అదిరిపడి  ఎలర్టయ్యాడు  కౌశిక్.

    రెండవ బుల్లెట్  కూడా గురితప్పటంతో  క్యాష్ కౌంటరు  వైపు పరుగు సాగించాడతను. సంజుని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి  చంపాలని  అతని వుద్దేశ్యం.

    అతను క్యాష్  కౌంటర్ని  సమీపించి  ముందుకు వంగాడంటే  దాని వెనుక  దాక్కున్న మనుషులను  చూడటం ఖాయం. వాళ్ళకు చంపటం కూడా గ్యారంటీ ఇంక ఆలస్యం చేయలేదు  కౌశిక్.

    క్షణంలో వెయ్యోవంతు కాలంలో  జేబులోంచి రివాల్వరు  బయటికి లాగి  ఆ వ్యక్తి  వైపుగా గురిపెట్టి కాల్చాడు. అదే సమయంలో  సెల్ఫ్ డిఫెన్స్ కోసం  కౌంటరు  మీదుగా  అవతలకి  జంప్ చేశాడు.

    ఇప్పుడు  అతను  కూడా బట్టల  షెల్ప్లకి, కౌంటరుకి మధ్య  వున్న ఖాళీలో వున్నాడు.

    సన్నగా, పొడవుగా, ఇరుకు సందులా  వున్న ఖాళీలో  అతనికి ఓ పదడుగుల  దూరంలో  ఓ యువతి  కనిపించింది.

    ఆపాదమస్తకం  కంపించిపోతోందామె.

    మరో రివాల్వరు సౌండ్  వినపడటంతో  అదిరిపడి  చూశారు  ఆ అగంతకులు  ఇద్దరూ.

    ఆ అగంతకుడికి  భూమి మీద యింకా  నూకలున్నాయి.

    గురితప్పిన  ఆ బుల్లెట్ కుప్పగా పోసి  వున్న బట్టలలోకి నిశ్శబ్దంగా  దూసుకుపోయింది.

    మరోసారి  నిప్పులు  కురిపించింది  కౌశిక్  చేతిలోని  రివాల్వరు.  

    ఈసారి గురితప్పలేదు.

    కెవ్వుమని  అరిచాడు  ఆ వ్యక్తి.

    ఆ వ్యక్తి కుడి  తొడభాగంలోకి  దిగబడింది  తూటా.

    భీకరంగా  అరుస్తూ  క్రిందపడ్డాడా  వ్యక్తి. అతని చేతిలోని రివాల్వరు క్రిందపడిపోయింది.

    కౌశిక్  అది అదనుగా  తీసుకుని  అతన్ని  అదుపులోకి  తీసుకునేవాడే కానీ షట్టర్ దగ్గరున్న  వ్యక్తి చేతిలో  రివాల్వరు  మెరవడంతో  ఆగాడు.

    కౌశిక్  వున్న కౌంటరు  దిశగా  రెండుసార్లు  కాల్చాడు.

    ఇప్పుడు  పైకి  లేచి  ఎదురుకాల్పులు  జరిపే  అవకాశం లేదు  కౌశిక్ కి.

    కొద్ది క్షణాలు నిశ్శబ్దం.

    కౌశిక్ కి ఎదురుగా  కూర్చున్న  ఆమె గజగజ వణుకుతోంది.

    కౌంటరు మీద నుండి లేచి  చూద్దామంటే  కుదరలేదతనికి.

    షట్టర్ పైకి  లాగుతున్న  శబ్దమయ్యింది.

    కొంచెం  ముందుకు  జరిగితే  కౌంటరు  మీద వున్న బట్టల చాటు నుండి  అవతల  ఏం జరుగుతోందో  చూడవచ్చు.

    ఐదారు  అడుగుల  దూరం  నేలమీద  పిల్లిలా  పాకాడు.

    ఇప్పుడు  అతను ఆమెకు రెండడుగుల  దూరంలోకి వచ్చాడు.

    పెనుతుఫానులో  వణికే  లేత  చిగురుటాకులా  వుందామె.

    కౌంటరు మీద బట్టల  చాటునుంచి తొంగిచూశాడు.

    అప్పటికే  ఆ గాయపడిన  వ్యక్తి  బయటికి  వెళ్ళిపోయాడు.

    రెండో  వ్యక్తి  కూడా  బయటకు  వెళ్ళిపోయి  షట్టర్ని  క్రిందికి  లాగుతున్నాడు.

    ఆ వ్యక్తులు అంత త్వరగా  వెళ్ళిపోతారని  వూహించలేదు  కౌశిక్.   

    ఆ అగంతకులు  పారిపోవడానికి ఛాన్స్  యివ్వకూడదని అతని వైపు  మరోసారి  షూట్ చేశాడు కౌశిక్.

    అతను  రివాల్వరు  ట్రిగ్గర్  లాగటం....ఆ వ్యక్తి  షాపు  బయట నుండి తిరిగి షట్టర్ని  క్రిందికి  లాగటం రెండూ  ఒకేసారి  జరిగిపోయాయి.

    ఖంగుమన్న  శబ్దంతో గుండు  షట్టర్ కి  తగిలింది. "షిట్....తప్పించుకున్నారు" కసిగా  అనుకున్నాడు.

    రివాల్వరు  పేలిన  శబ్దానికి  కెవ్వుమని  అరిచి నిలబడి  వున్న కౌశిక్ కాలిని  గట్టిగా  వాటేసుకున్నట్లుగా  పట్టుకుంది  సంజు.

    తన కాలిని ఎవరో గట్టిగా పట్టుకోవడంతో  నిలబడి  వున్న అతను తలవంచి  క్రిందికి  చూశాడు.

    ఆ యువతి  గజగజా  వణుకుతూ  తన కాలు పట్టుకుని  వుంది.

    సున్నితంగా  ఆమె చేతులు  విడిపించుకుని  పక్కకు  కదిలాడతను.

    ఇప్పుడు  బయటికి  పరుగెత్తి  వాళ్ళని  ఛేస్ చేయాలనుకోవటం  ప్రమాదం, వృధా కూడా.

    కారణం....

    తను వాళ్ళ వెనుకనే షట్టరు  లిఫ్ట్  చేసి బయటకు  వస్తానన్న  ఆలోచన  వాళ్ళకు వుంటుంది. అందుకు తగినట్లుగా  సిద్ధపడే  వుంటారు వాళ్ళు.

    తను  షట్టరు తెరిచే  సమయంలో తన మీద కాల్పులు  జరపవచ్చు  అటువంటి  ఉద్దేశ్యం  వాళ్ళకి  లేకపోతే  ఈపాటికి  పారిపోయే  వుంటారు.

    "మీరందరూ  బయటికి  రావచ్చు. వాళ్ళు వెళ్ళిపోయారు. మీకేం భయంలేదు" అందరికీ వినిపించేలా గట్టిగా  అన్నాడతను.

    నిమిషం తరువాత  ఒకరొకరుగా కౌంటర్స్  వెనుక నుండి  పైకి  లేవసాగారు. ఎవరి ముఖంలోనూ  కత్తివేటుకు నెత్తురుచుక్క లేదు.

    ఆ క్షణంలో  వాళ్ళ  మానసికస్థితి  అర్ధంచేసుకోగలడు  అతను.

    అతని కాళ్ళ దగ్గరే  కూర్చుని గజగజ  వణుకుతున్న  ఆమెను చూసి "మీరూ లేవవచ్చు  మీకొచ్చిన   భయమేమీ లేదు" అన్నాడు ధైర్యం చెబుతూ.

    మెల్లగా  లేచి నిలబడిందామె.

    ఆమె శరీరం  ఇంకా  కంపించుతోంది.

    క్యాష్ కౌంటరు  దగ్గరున్న  షాపు ఓనరు  ఎదురుగా వున్న వెంకటేశ్వరస్వామి  ఫోటోని  నమస్కరిస్తున్నాడు.

    బహుశా  తిరుపతి  కొండకు  కాలినడకన  వచ్చి  తలనీలాలు  ఇచ్చుకుంటాను  అని మొక్కుకుంటున్నాడేమో  అనుకున్నాడు  కౌశిక్.

    షాపు  మూసే సమయంలో  వచ్చి ఎటాక్  చేశారంటే  అది ఖచ్చితముగా  డబ్బుల కోసం  అయివుండాలి. కారణాలు  ఆలోచించసాగాడతను.

    "సార్! దేముడులాగ  వచ్చి కాపాడారు" ఆనందమో, దుఃఖమో తెలియని  ఏడుపు  గొంతుతో అన్నాడు షాపు  ఓనరు.
    "మీకు  అతను శత్రువా?" అడిగాడతను.

    లేదన్నట్లు  తలూపాడు షాపు ఓనరు. అతని శరీరంలో  వణుకు  తగ్గలేదు. క్షణంక్షణం  షట్టరు వైపు  చూడసాగాడు_మళ్ళీ  లోపలికి  ఎవరయినా వస్తారేమో అన్న భయంతో.

    "మీకు వచ్చిన భయం ఏమీ లేదు. వాళ్ళు  పారిపోయారు. ఇంకరారు" వాళ్ళలో  ధైర్యం కలిగేలా  అన్నాడు కౌశిక్.

    "ఇక్కడున్న  వ్యక్తులని ఎవరినీ చంపే ఉద్దేశ్యంతో  రాలేదు కదా!" తిరిగి సందేహం  వ్యక్తం చేస్తూ అన్నాడు. అక్కడున్న వ్యక్తులందరినీ  కలియచూస్తూ.

    "దె....కేమ్ టు కిల్ మి"

    ఆ మాట విని  అటుగా తిరిగి  చూశారు  అందరూ.

    మిడ్డీ  టాప్ లో వున్న సంజు  అంది ఆ మాట.

    ఆశ్చర్యంతో  ఆమె వైపు చూశారు అందరూ.

    ఒక్కక్షణం బ్లాంక్  ఫేస్  పెట్టి  తిరిగి  సర్దుకున్నాడు  కౌశిక్.

    "మీరు....ఐమీన్....వాళ్ళు  మిమ్మల్ని  చంపడానికి  వచ్చారా?" తిరిగి అడిగాడు.

    అవునన్నట్లు  తల వూపింది  సంజు.   

    భయంతో  ఆమె కళ్ళలో  నీళ్ళు  గిర్రున  తిరుగుతున్నాయి.

    "వాళ్ళు  మిమ్మల్ని వెంటాడుతుంటే....తప్పించుకోవటానికి  ఈ షాపులోకి  వచ్చారా?" తాను ఊహించిన విషయాన్నే అడిగాడు కౌశిక్.

    "కాదు సార్! ఈవిడ  మా షాపులో  బట్టలు  కొంటున్నారు. ఇదిగో యీ చీరలన్నీ  ఈ మేడం  కొనుక్కున్నవే" సమాధానంగా అన్నాడు  ఓ  వర్కర్.

 Previous Page Next Page