"డియర్! నీకు పిల్లలంటే అంత ఇష్టమా?"
అవునన్నట్టు తల ఆడించాడు.
"అయితే దానికి ఇంతకుముందు నేను వివరించిన పరిష్కారం ఒక్కటే మార్గం! ఓ అనాదాశ్రమానికి వెళ్ళి మనకు నచ్చిన ఓ మంచి పిల్లవాడ్ని తెచ్చుకుందాం. ఇక ఆ విషయాన్ని వదిలేయి. అసాధ్యాన్ని గురించి ఆవేదన పడటంకంటే అవివేకం మరొకటి వుండదు. ఇక ముందు ఎలాంటి విచారాన్ని నీ ముఖంలో నేను చూసినా...ఆత్మహత్య చేసుకుంటాను" అంది.
దస్తగిరి ఆ మాటలకు కదిలిపోయాడు.
"నో మై ఏంజిల్! అంతమాత అనొద్దు! నీకు అన్ని రకాలుగా సుఖాన్ని ప్రసాదించటమే నా ధ్యేయం."
మరలా దస్తగిరి మెలికలు తిరుగుతూ ఆమెను బ్రతిమలాడాడు. ఆమె పాదాల్ని గట్టిగా పట్టుకున్నాడు. తరువాత ఇరువురూ పెనవేసుకుపోయారు.
* * * *
రెండు నెలలు గడిచాయి.
తిరిగి ఆ రోజు మరలా దస్తగిరి ఒక సంతోషకరమైన వార్తను తెచ్చాడు. తనకు తండ్రియోగం లేదని తెలిసిన రోజు ఎంత విచారాన్ని వ్యక్తం చేశాడో....ఆ రోజు అంత ఆనందంగా వచ్చాడు.
"మై ఏంజిల్! అనాధను పెంచుకుందాం అన్నావ్! కానీ అంతకంటే మెరుగయిన పరిష్కారాన్ని మోసుకొచ్చాను.
నీకిష్టమైతే వెంటనే చెప్పు. ఈ రోజే ఫాలో అవుదాం.
నేను 'జై గొట్స్ బ్యాంక్ కెళ్ళి, వివరాల్ని సేకరించాను. అందమైన జంటల నుండి 'జై గొట్స్' తయారు చేసి మనకు యిస్తారు. అందుకు క్లబ్ కు కొంత మనం పే చేయాల్సి వుంటుంది.
అయితేనేం! అనాధను తెచ్చుకోవటంకంటే ఈ పద్దతి అన్ని రకాలుగా మెరుగవుతుంది. ఆ జైగోట్ ను నీ గర్భసంచిలో అమర్చటం జరుగుతుంది. నీవు రక్తం యిచ్చి కంటావు. పాలిచ్చి పెంచుతావు. చుట్టూ వున్న జనానికి ఎలాంటి అనుమానమూ రాదు. ఆ పుట్టిన బిడ్డ అక్షరాల మనకే చెందుతాడు" అంటూ బదరి వంక ఆశగా చూశాడు.
'జైగోట్'....ఎవరో స్త్రీ అండాన్ని- మరో మగ మనిషి వీర్యకణంలో సంయోగము జరిపి...కణవిభజన మొదలవ్వగానే తీసి తన గర్భసంచిలో పెడతారు.
ఇటీవల తనూ ఆ ప్రాసెస్ ను ఓ మెడికల్ మాగజైన్ లో చదివింది.
అప్పట్లో ఆ విషయం తమకు అవసరము లేనిదిగా కనిపించింది. ఇప్పుడు అది తమకు సంబంధించిందే అయి కూర్చుంది.
ఒక రకంగా ఈ ప్రాసెస్ మంచిదే.....దస్తగిరికీ ఇష్టమయింది. ఎవరో అనాధను తెచ్చి పెంచుకున్నా....తనకు మాతృత్వం అందదు.
తను ఈ రకంగా తల్లి అవుతుంది.
బేబీని గర్భంలో మోసేటప్పుడూ, నెలలు నిండేప్పుడూ ఒక తల్లి పొందే అనుభూతులు తనూ పొందుతుంది.
తనూ ప్రసవవేదన పడుతోంది.
తనూ ప్రేవుతెంచుకుంటుంది.
తనకూ 'బేబీ బుజ్జి నోటికి పాలిండ్లని అందించి, పాలు త్రాగించే అదృష్టయోగం పడుతుంది.
ఓ తల్లిలా తనకూ 'లుల్లాచీలు' పాడే యోగం వస్తుంది.
బేబీకి నెలలు గమనిస్తుంటేనూ-
అది మొదటిసారిగా 'మాడ్, డాడ్' అంటుంటేనూ, తప్పటడుగులు వేస్తుంటేనూ చూసి తరించే తరుణం తన బ్రతుకులోనూ తలెత్తుతుంది.
బదరి మనసులో ఆనుకుని, దస్తగిరి తెచ్చిన ప్రపోజల్ కి తన అంగీకారాన్ని తెలియజేసింది. మరుదినం దస్తగిరి, బదరి ఆ సైంటిఫిక్ క్లబ్ కు వెళ్ళారు.
బదరీ కోర్కె ప్రకారం వేరే జైగోట్ ను ఆమె గర్భంలో ఆ క్లబ్ డాక్టర్లు అమర్చారు.
ఆ తర్వతః వారు ఓ బాబుకి తల్లిదండ్రులయ్యారు.
ఆ బాబు చాలా అందంగా వున్నాడు.
కొన్ని సంవత్సరాలు గడిచాయి.
* * * *
ఆ రోజు సాయంత్రం ఏడు గంటలయింది.
బస్ షెల్టరులో జనమెవరూ లేరు. వర్షం మొదలయింది. ఒకమ్మాయి రెండు సంచుల్లో సరుకులు నింపుకుని, మార్కెట్ కి దగ్గరగా ఉన్న ఓ కార్నర్ బస్ షెల్టరులో నిలబడి వుంది.
ఆమె వెళ్ళే దిశగా ఓ కారు వస్తోంది. దాన్ని ఓ లేడీ డ్రయివ్ చేస్తోంది. లోపల ఎవరూ లేనట్టుంది. షెల్టర్లో నిలబడిన అమ్మాయి "ఆగితే ఆగుతుంది - లేకుంటే పోతుందనుకుంటూ తన చేయి ఎత్తింది. డ్రయివ్ చేసే అమ్మాయి అలా చేయి ఎత్తటం చూసింది.
కారు నేరుగా వచ్చి ఆ అమ్మాయి ముందు ఆగింది.
"ఎటువైపు?"
ఆమె చెప్పింది.
"థాంక్ గాడ్! నేనూ అటువైపే. ఇటీవల ఒక అపార్టుమెంటుకొనుక్కున్నాం. ఇంకా కారు అమరాలేదు. దయచేసి లిఫ్ట్ యిస్తారా? ఇప్పటికే ఆలస్యమయింది. ఇంటి దగ్గర ఆయన గాభరాపడుతుంటారు."
కారు లోపలి అమ్మాయి తలుపు తెరిచింది.
ఈసారి కారు నడిపే అమ్మాయికి థాంక్ చెప్పి, తన రెండు సంచులతో ఆమె ఫ్రంట్ సీతులోకి వచ్చి కూర్చుంది,
అలా ఎక్కిన అమ్మాయిని నడిపే అమ్మాయి పరిశీలనగా చూసింది.
ఎక్కినా అమ్మాయి బొద్దుగా, ముద్దుగా వుంది. కొత్తగా పెళ్ళయినట్టుంది.
కారు నడిపే అమ్మాయి అడిగింది.
"మీ పేరు?"
"పినాకిని."
"మీ భర్త ఏం చేస్తుంటారు?"
"ఓ ప్రైవేట్ కంపెనీలో జూనియర్ అసిస్టెంటు."
"కొత్తగా పెళ్ళయిందా?"
"యా!"
"మీరేం చేస్తుంటారు?"
"కంప్యూటర్ టెక్నాలజీలో డిప్లొమా తీసుకున్నాను. ప్రస్తుతం ఓ సైంటిఫిక్ క్లబ్ కో అదే జాబ్."
"సైంటిఫిక్ క్లబ్బా?"
"ఎస్ మేడమ్!"
"క్లబ్ ఏక్టివిటీస్?"
"ఒక్క మాటలో చెప్పాలంటే- అందమయిన పేరెంట్స్ నుండి జైగోట్స్ ని తీసుకుని అగ్లీగా వుండే దంపతులకూ, డిఫెక్టు వున్నవారికీ వాటిని అమర్చి- కొంత ఫీజు వసూలు చేస్తారు. క్లుప్తంగా ఆ ప్రాసెస్ ని 'ఇన్ విట్రో పెర్టిలైజేషన్ ఎంబ్రియో ట్రాన్స్ ఫర్' అంటారు."
"ఆ క్లబ్ ఎక్కడ వుంది?"
ఆ అమ్మాయి చెప్పింది.
అంతే...కారు నడిపే అమ్మాయి అమాంతం తను నడిపే కారును ఓ పక్కకు తీసి ఆపింది.
అలా కారు ఆపిన అమ్మాయి రేఖ.
రేఖ మరోసారి పినాకిని వంక ఆసక్తిగా చూసి-
"డియర్ పినాకినీ! నా పేరు రేఖ. నా భర్త బిజినెస్ చేస్తుంటారు. నీవు ఒక రకంగా నాకు కలవటం దైవికం. ఒక సహాయం చేయగలరా?"
"ఏం? మీకూ మా క్లబ్ తరఫుగా ఓ జైగోట్ కావాలా?" పినాకిని అడిగింది.
"అక్కర్లేదు. నేనే మీ క్లబ్ కి జైగోట్ ని అందించాను. నా భర్త కళ్యాణ్. నాకంటే అందంగా వుంటారు. మీ క్లబ్ అప్పట్లో ప్రారంభదశలో వుంది. నేను మీ క్లబ్ కు ఏ తేదీన వచ్చానో కూడా చెప్పగలను.
మేం అందించిన జైగోట్ ని ఎవరికివ్వటం జరిగింది? ఆ వివరాలు ఒకసారి నీవు చెప్పగలవా? ప్లీజ్!" అనగానే పినాకిని తత్తరపడింది.
"మేడమ్! అది క్లబ్ రూల్స్ కి విరుద్దం."
"అది నాకూ తెలుసు! నేను ఇప్పుడే వెళ్ళి ఈ మీ బిడ్డ పుట్టుకకు కారణమయిన 'జైగోట్' నాది- నేనే అసలైన తల్లినని తగవు పెట్టుకోను. ఎందుకంటే- నాకూ పిల్లలున్నారు. అప్పట్లో కొత్తగా మారేజ్ అయినా మేము కొన్నాళ్ళపాటు పిల్లలు వద్దనుకున్నాం. హాబీగా జై గోట్ ని దానంచేశాం.
నీవూ స్త్రీవి! తల్లిగా అదో విచిత్రానుభూతి. తను దానంచేసిన ఎగ్ నుండి ఎలాంటి బాబు లేక పాప కలిగింది? ఆ బిడ్డకూ-ఇప్పటి నా పిల్లలకూ ఏమైనా పోలికలున్నాయా అనేది చూడటం నిజంగా థ్రిల్!
ఆ థ్రిల్ ను దూరంగా వుండి ఎంజాయ్ చేస్తానే తప్ప- నేనెవరినో ఎవరికీచెప్పను. దేవుని మీదా, నా పిల్లల మీదా, నా భర్త మీదా ప్రమాణం చేసి చెపుతున్నా" అంది.
పినాకినికి ఈ పరిణామం కాస్త ఇరుకున పడేసినట్టయింది. తను చేయి వూపకపోయినా పోయేది. మరి కాసేపటికి తమ రూట్ బస్ వచ్చేది.
ఏ స్త్రీ కూడా పిల్లల మీద ప్రమాణం చేశాక మాట తప్పదు. తనకది పెద్ద విషయం కాదు. ఆమె తేదీ ఇస్తానంది కనుక- రెండు మూడు బటన్స్ నొక్కితే వీరి పరంగా తయారయిన జైగోట్ కి ఎవరి అమర్చిందీ, వారికి ఏ బిడ్డ కలిగిందీ-ఇప్పుడు వారెక్కడ వుంటుందీ వివరంగా చెప్పగలదు.
ఆ విషయం బయటపడితే మాత్రం తన ఉద్యోగం వూడిపోతుంది. బయటపడదనే గ్యారెంటీ ఆమె చేసిన ప్రమాణాలు ఇస్తున్నా నేరం నేరమే అవుతుంది.
పినాకిని ఆలోచనలో పడింది.
"పినాకినీ! ఈ క్షణంనుండీ మనం ఫ్రెండ్స్ కంటే ఎక్కువయిన వాళ్ళం. మీరు కారు కొనుక్కునే ఏర్పాట్లు నేను చేసిపెడతాను, ఎలాంటి ఇంటరెస్ట్ లేకుండా నీకు లోన్ అంటే ఏర్పాటు ఎరేంజ్ చేస్తాను. మన స్నేహం "ఏ పునాది" మీద మొలకెత్తిందో...ఆ పునాది భూగర్భంలోనే పునాదిగా వుంటుంది. బయటకు రాదు. ఆ విషయం నీకు, నాకూ తప్ప మన భర్తలకు కూడా తెలియకుండా జాగ్రత్తపడదాం. మనం ఫామిలీ ఫ్రెండ్స్ గా మారదాం."