Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 14


    "అమ్మో. ఇంటికివస్తే మా అన్నయ్యని అడిగి ఇస్తాను-" అంది లత....
    మంజు సాధారణంగా తల్లితో కలిసి తప్ప ఎక్కడికీ వెళ్ళదు. అలాంటిది పుస్తకాల కోసం లత ఇంటికి వెళ్ళింది.
    "లత ఏవేవో పెయింటింగ్స్ వేసిందట! నన్ను చూడటానికి రమ్మంది. లత ఇంటికివెళ్ళి కాస్త ఆలస్యంగా వస్తాను." అని తల్లితో చెప్పింది. అలా చెప్పకపోతే, ఆలస్యంగా వచ్చినందుకు సుమతి ఊరుకోదు.
    ఆ సాయంత్రం మంజుని తల్లికి పరిచయం చేసింది లత. ముచ్చటగా వున్న మంజుని చూసి మంచి స్నేహం అని ఆనందించింది సత్యవతి.
    "నీ పేరు మంజులత-మా అమ్మాయి హేమలత ఇద్దరూ లతలే!" అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. సత్యవతి మంజుకి కాఫీ ఫలహారాలిచ్చి "మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?" అని అడిగింది యధాలాపంగా....
    "మన మురళి కాలేజిలోనే తెలుగు లెక్చరర్. వాళ్ళ అమ్మగారు కూడా కొన్నాళ్ళు ఏదో ఆఫీసులో స్టెనోగా పనిచేశారు. ఇప్పుడు చెయ్యటంలేదు." అని చెప్పింది లత.
    చంద్రశేఖర్ మురళికి లెక్చరర్ అని వినగానే ఆ కుటుంబంతో పరిచయం చేసుకోవాలనుకుంది సత్యవతి.
    "నేను మీ ఇంటికి వస్తాను" అంది మంజుతో....
    "తప్పకుండా రండి." అని ఆహ్వానించింది మంజు.
    ఆదివారం నాడు లతని కూడా తీసుకుని చంద్రశేఖర్ ఇంటికి వచ్చింది సత్యవతి. మంజు లతనీ, సత్యవతినీ తన తలిదండ్రులకి పరిచయం చేసింది.
    "మీరు మా మురళికి లెక్చరర్ అని తెలియగానే మీతో పరిచయం చేసుకోవాలని వచ్చాను. వాడు ఎటూకాని వయసులో వున్నాడు. ఈ కాలేజీల్లో చదువుకంటె అల్లరులు ఎక్కువయిపోతున్నాయి రోజురోజుకీ.... వాడిని కాస్త ఒక కంట కనిపెట్టి ఉండాలి మీరు...."
    కొడుకు బాగోగులు గురించి అంత ఆరాటపడుతోన్న సత్యవతిని చూస్తే గౌరవం కలిగింది చంద్రశేఖర్ కి.
    మర్యాదకోసం "మురళికేం? మంచి పిల్లవాడు. బాగా చదువుతాడు" అన్నాడు. ఏ లెక్చరర్ అయినా తలిదండ్రుల ముందు విద్యార్ధి గురించి అలాగే మాట్లాడతారని సత్యవతికి తెలుసు.
    "మంచివాడేలెండి_కానీ ఈ స్నేహాలతో పాడయిపోతున్నాడు. ఈ రోజుల్లో పిల్లలు ఎన్నెన్ని రకాలుగా ఉన్నారు?"
    "మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నాడు. మురళి విషయం నేను కనుక్కుంటూ ఉంటాలెండి."
    "థాంక్స్!"
    సత్యవతి సుమతికి కూడా చాలా నచ్చింది. లత అంటే కూడా మంచి అభిప్రాయం ఏర్పడింది.
    "మీరు మా యింటి కొకసారి రావాలి. మావారికి ఆ ఫాక్టరీ పనితో ఎప్పుడూ తీరికే ఉండదు. ఆదివారం వచ్చిందంటే స్నేహితులతో పేకాటలో కూర్చుంటారు. వారానికి ఒక్కరోజు ఆ మాత్రం కులాసాగా గడపనీ అని నేనేం మాట్లాడను. లేకపోతే ఆయనేవచ్చి పిలిచేవారు." అని ఆహ్వానించింది సత్యవతి. సుమతి "తప్పకుండా మీరు అంతగా చెప్పాలా?" అంది.... చంద్రశేఖర్ కూడా "ఇంజనీర్ గారే వచ్చి ఆహ్వానించవల్సిన అవసరంలేదు లెండి. ఏ ఆహ్వానమూ లేకుండానే మీ ఇంటికి వస్తాం మేము" అన్నాడు.
    అలా ఆ రెండు కుటుంబాలకూ మధ్య స్నేహం కలిసింది. అప్పుడప్పుడు లత చంద్రశేఖర్ ఇంటికి రావటమూ, మంజు, లత ఇంటికి పోవటమూ కూడా సామాన్యమయి పోయింది.
    మంజు ఎప్పుడు తమ ఇంటికి వచ్చినా ఒక దొంగచూపు చూసి వాళ్ళదగ్గర ఉండకుండా వెళ్ళిపోయేవాడు మురళి. అక్కడే కూచుని మంజుతో మాట్లాడాలని మనసులో ఉబలాటం ఉన్నా, సాహసం ఉండేది కాదు. మంజు చాలా మొహమాటంగా ముక్తసరిగా మాట్లాడేది. అదీగాక ఏ పనిచేస్తున్నా సత్యవతి కళ్ళు తమను పరీక్షిస్తూనే ఉంటాయని మురళికి తెలుసు.... కాంతారావుకి పిల్లలు తనను ఎప్పుడు ఏది అడిగితే అది ఇయ్యటమే తెలుసు అంతకుమించి ఏదీ పట్టించుకోడు. వాళ్ళ బాగోగులన్నీ సత్యవతి చూసుకుంటుందని అతని నిశ్చింత....

 Previous Page Next Page