Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 14

 

    "నవ్వుతూ , అక్కడ ఓ హోటలు ముందు కనిపించింది రాజమ్మ. యాత్రకి వచ్చిందట. 'ఇక్కడున్నారా?' అంటూ పలకరించింది. 'అవును, పెళ్ళి చేసుకున్నాను. అందుకే ఇక్కడి కొచ్చాను. పెళ్ళి ఇక్కడే జరిగిందని చెప్పాను రాజమ్మ ను ఉడికించాలని, ఈ వార్తా రాజమ్మ ద్వారా బట్వాడా అయి మీ అక్కయ్య విని ఏడవాలనీను. నాకు అప్పట్లో అందరి పైనా కసే! ఓ నేల అలాగ గడిచింది తిరుపతి లోనే. ఏం తినేవాడినో, ఎలా తిరిగే వాడినో గుర్తు లేదు, గోపీ! మాసిన బట్టలూ, ఎదిగిన గడ్డమూ -- బికారిలా ఉన్న నన్నో చిన్ననాటి స్నేహితుడు గుర్తు పట్టాడు యాత్ర కొచ్చి. అప్పటి నా పరిస్థితెలా ఉందొ తెలుసా? ఎవరైనా నా ఆత్మీయులు కనుపిస్తే వారి గుండెల్లో తల దూర్చి భోరున ఏడావాలనిపించేది. అదే చేశాను. వాడు నన్ను ఓ ఏకాంత స్థలానికి తీసుకుపోయి నా వివరాలన్నీ అడిగి తెలుసుకుని, సానుభూతి తో నాకు అభయ హస్తం ఇచ్చాడు. నా పొట్ట పోషించుకునే ఉద్యోగం ఏదన్నా చేస్తానన్నాను. తక్కువ పని చెయ్యవలసి ఉంటె నా డిగ్రీ చెప్పోద్దన్నాను. మా షాపు ఓనరు కి రికమెండ్ చేసింది వాడే. బస్సు కండక్టరు ఉద్యోగం చేశాను అయిదేళ్ళు. ఆరోగ్యం దెబ్బతింది. మా ఓనరు నాకు స్నేహితుడయ్యాడు. అవసరమయి ఓరోజు అకౌంట్లు వ్రాశాను. తెల్లబోయి చూస్తూ "ఏం చదివారు అన్నారు ఓనరు. నా డిగ్రీ చెప్పాను నవ్వేస్తూ. అతను నొచ్చుకున్నాడు కొన్ని క్షణాలు. 'బస్సులో మరి తిరగొద్దు . అకౌంట్లు వ్రాయండి.' అన్నాడతను. గుమస్తానయ్యాను. యధాలాపంగా లాటరీ టిక్కెట్ కొన్నాను. నాలుగేళ్ళ క్రితం. పది వెలోచ్చింది." అంటూ టక్కున ఏదో జ్ఞప్తి కి వచ్చినట్టు, "నేనిల్లు వదిలి వచ్చిన తరవాత అందిన నా డబ్బూ, సామాన్లు వస్తువులూ అన్నీ విరాళాల కిచ్చారట. నిజమేనా, గోపాలం?' అని అడిగాడు ప్రసాదరావు. ఆ గొంతు కటువుగా ఉంది.
    "అవును, అదంతా నాన్నగారి అవివేకం.' ఇబ్బందిగా అన్నాడు గోపాలం.
    "అవివేకం కాకపొతే? నాకు పుట్టిన పసివాడు కావలసి వచ్చాడు మీ అక్కయ్య కి. దబు అవసరం లేకపోయింది. ఎందుకులే? ఏదో జరిగిపోయింది. అదంతా ఎందుకు! ఆ డబ్బు రక్షణ నిధికి ఇచ్చేడ్డామనుకున్నాను. అదే సంగతి ఒనరుకి చెప్పాను. అతను నమ్మలేనట్టు కొంతసేపూ, అలా ఎందుకు చేస్తారని కొంతసేపు వాదించాడు. 'నా కెవ్వరూ లేరు. నా కెందుకు డబ్బన్నాను. 'మీరు బతికున్నంత కాలం డబ్బుండాలి. మీరు పోయేటప్పుడలాగే ఇచ్చేద్దురు గాని, నా వ్యాపారంలో వాటా ఇస్తాను మదుపు పెట్టండి' అన్నాడు. రెండు వేలు రక్షణ నిధికి, మిగతాది వ్యాపారంలో పెట్టాను-- సన్యసించబోయి సంసారం కూర్చున్నట్టు. అలా డబ్బు ఆర్జించాలని నాకూ బుద్ది పుట్టింది మా ఓనరు స్నేహం వల్ల కాబోలు. వ్యాపారంలో , రైసు మిల్లు లో మనకి వాటాలు ఉన్నాయి. మొన్న ఓ బిల్డింగు కాంట్రాక్టు తీసుకున్నాను. ప్రస్తుతం ఇది అద్దె ఇల్లే. ఇదీ కధ. మరి పడుకుందామా? ఇది వరకైతే ఇది ఒకటే మంచం. మావాడు వచ్చి వెళుతూంటాడుగా ఇటు పైన? ఆ మంచం, నువ్వు కూర్చున్న మంచం, పరుపూ కొన్నాను. ఓసారి సెలవేదన్నా ఉంటె రమ్మను, గోపాలం . ఆరోజు సరిగా చూడనే లేదు.' అంటూ మంచం మీద వాలిపోయాడు ప్రసాదరావు.
    "మీరొకసారి మా ఊరు రారాదా , బావా?' అన్నాడు గోపాలం తానూ పడుకుంటూ, తల అడ్డంగా ఊపి, "రాలేను....మరేం అనుకోకు. నా బ్రతుకిలా అందరికీ దూరంగానే రాలిపోవాలి. వాసు చదువుకి డబ్బు నేను పెడుతున్నానని మీ అక్కయ్య కేమాత్రం తెలిసినా ఆ రోజుతో మరి నా డబ్బు, నా మొహం మీరు చూడరు.' అన్నారు ప్రసాదరావు. ఆగొంతులో పట్టుదల, పగ.
    "పోనీలే, బావా, మా అక్కయ్య గొడవెందుకు? మీ కొడుకుని ప్రయోజకుణ్ణి చేసుకోండి. అంతే నేకోరేది." బాధగా అన్నాడు గోపాల్రావు.
    మరునాటి ఉదయం స్టేషను వరకు గోపాలం వెనక వెళ్ళాడు ప్రసాదరావు. "మా వాణ్ణి తొందరగా ఓసారి పంపిస్తావు కదూ?" కదిలిపోతున్న రైలు పెట్టెలో గోపాలాన్ని చూస్తూ అన్నాడు ప్రసాదరావు.
    "అలాగే చెపుతాను. మరి మీ రుండండి." నవ్వుకున్నాడు గోపాల్రావు.
    'తన జీవితం మరొక మలుపు తిరిగి పయనిస్తుంది.' నవ్వుకుని ఇంటి ముఖం పట్టాడు ప్రసాదరావు.

                           *    *    *    *
    
    "మనిద్దరం అన్నం తినేద్దాం , వస్తావా, వాసూ?" పద్మజ గొంతు . పది పదిహేను రోజులై ఒకటి రెండు మాటలతో ఏర్పడ్డ చనువు మాత్రమే. ఇంకా కొన్ని సంవత్సరాలు ఓ దగ్గర ఉండవలసినవారిగా? ఆ అమ్మాయి దగ్గర తనకు బిడియమెందుకు? 'మామయ్యా కూతురు.' అనుకోగానే అతనిలో అదొక రకమైన ఆత్మీయత తొంగి చూచింది.
    "అత్తయ్య లేదా?' అప్రయత్నంగా ప్రశ్నించాడు.
    "అమ్మా, శీను సినిమాకి వెళ్ళారు. నాన్న భోజనం చెయ్యరట." అ అమ్మాయి జవాబు.
    ఎంత మామయ్య కూతురనుకున్న అతని కేదో బిడియంగా ఉంది. రాజశేఖరం కూతురు జయ కూడా ఈ వయస్సుదే. జయతో చనువుగా తిరిగేసే తను, పద్మజ ను చూస్తూనే వెనక్కి తగ్గిపోతున్నా డెందుకనో? పుట్టిన దగ్గరనుంచీ ఓ చోట పెరిగారు-- తనూ జయా. ఇప్పుడు పరిచయమైంది పద్మజ. అందుకని కాబోలు! ప్రశ్న, జవాబులు వాటంతటవే స్పురించాయి.
    మౌనంగా రెండు క్షణాలు దొర్లిన తరవాత, "నువ్వెందుకని వెళ్ళలేదు సినిమాకి?' అని ప్రశ్నించాడు. తన కక్కర్లేని ప్రశ్న.
    "నాకు పరీక్షలు ఉన్నాయి. చదువుకోవాలి! వస్తావా, రావా? అమ్మ తను వచ్చేసరికి మనిద్దర్నీ తినెయ్యమంది." పద్మజ గొంతులో చిరాకు.
    "నువ్వేం చదువుతున్నావ్?' ఆమె వెనక వెళుతూ అన్నాడు వాసు.
    "ఫోర్టు ఫారం ! చాలా రోజుల క్రితం చూశాను. తానెలా ఉంటుందో అసలు నాకు గుర్తు లేదు. జయ ఏం చదువుతుంది, వాసూ?' అంది పద్మజ.
    "ఫోర్టు ఫారమే....తెల్లగా బొద్దుగా చాలా బాగుంటుంది జయ. బాగా మాట్లాడుతుంది కూడా!" అన్నం ముందు కూర్చుంటూ అన్నాడు వాసు.
    అతనలా అనడం బాగనిపించలేదు పద్మజ కి. మౌనంగా ఇద్దరికీ వడ్డన చేసి, అతని పక్కన కూర్చుంది. 'చాలా బాగుంటుంది జయ. బాగా మాట్లాడుతుంది కూడా.' సన్నని బాధేదో రేగింది పద్మజ లేత హృదయంలో. వాసు అన్నంలో పెరుగు వేస్తూ, "వాళ్ళింట్లో భోజనం కూడా చాలా బాగుటుంది కదూ?' అంది కసిగా.
    "ఎవరి ఇంట్లో?" తెల్లబోయాడు వాసు.
    "జయా వాళ్ళింట్లో!"
    "ఎందుకలా అంటున్నావ్? నేనేం తప్పుగా మాట్లాడానా పద్మజా!' అన్నాడు కలవరంగా ఆ పిల్ల వైపు చూస్తూ.
    తానూ భోజనం ముగించి , మౌనంగా అతని మాట విననట్టు కంచాలు, గిన్నెలు సవరిస్తుంది పద్మజ.
    "చెప్పు, పద్మజా, ఎందుకలా అన్నావ్? నాకు పెద్ద మామయ్యా ఇంట్లో ఇంత చొరవ లేదే! చిన్న మామయ్య అంటే నాకు చాలా ఇష్టం. నేనెప్పుడూ భోజనం, ఇంకేమీ కూడా బాగులేదని అనలేదే! నువ్వెందు కలా అన్నావ్? అమ్మా వాళ్ళూ ఏమన్నా అనుకున్నారా నా గురించి?' అత్రతగా , కలవరపడే  గొంతుతో ప్రశ్నించాడు వాసు. 'తన ప్రవర్తనలో ఏదన్నాలోపముందా?' అని గాభరా పడి పోతున్నాడు వాసు.
    "అమ్మావాళ్ళు అనుకుంటే మాత్రం నేను చెప్పాలా ఏం నీతో?' మూతి బిగించింది పద్మజ.
    "నిజంగా అనుకున్నారా? ఏమని?...." వాసు గుండె దడదడ కొట్టుకుంటుంది.
    "పెద్ద మామయ్యా కూతురు జయంటే వాసుకి చాలా ఇష్టమని!" నవ్వే పెదవులు బిగబట్టింది పద్మజ.
    ఫకాల్న నవ్వి, "చంపావ్. ఇదంతా నీ కవిత్వమా!" అన్నాడు వాసు.
    "నిజంగా నీకు ఇష్టం కాదా జయంటే?' అడిగేసింది మనస్సు తెలికయ్యేలా.
    "ఎవరంటే నాకు ఇష్టం కాదు? అందరూ ఇష్టమైన వారే! ఇష్టమంటే ప్రత్యేకమైన అర్ధాలే ముంటాయ్?' అనుకుంటూ గోపాల్రావు గదికి వెళ్ళాడు వాసు.
    పేపరు చూస్తున్న గోపాల్రావు , "రా. మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చాను. నువ్వు కాలేజీ కి వెళ్ళావు" అన్నాడు పేపరు మడిచి పక్కన పెడుతూ.
    మౌనంగా అతను చెప్పే మాటలు వినడానికే వచ్చినట్టు గోపాల్రావు పక్కన కూర్చున్నాడు వాసు.
    "విశేషాలెం లేవు. సెలవులు ఇచ్చాక అతని దగ్గరి కెళ్ళాకే మీ అమ్మ దగ్గరి కెళ్ళు. అంతే. నిన్ను తొందరగా చూడాలనుందట మీ నాన్నకి. ఉత్తరం వ్రాయి, సెలవు లివ్వగానే వస్తున్నానని" అన్నాడు గోపాల్రావు.

                          *    *    *    *
    గబగబా బట్టలు సర్దుకుంటున్న వాసుని, "మళ్ళీ సెలవు లయిపోగానే వచ్చేస్తావు కదూ?' అని ప్రశ్నించింది పద్మజ. జయని చూస్తాడు వాసు..... 'పెద్ద మామయ్య దగ్గరే ఉండిపో! మరి మా ఇంటికి రాకు. జయ అందంగా ఉంటుంది. బాగా మాట్లాడుతుంది. వాళ్ళంతా మంచివాళ్ళు. నీకు ఇష్టమైన వాళ్ళు. మరి మా ఇంటికి రాకు' అనేయ్యాలని పించింది! అతని వైపు చూస్తె ఆ పిల్ల కళ్ళెందుకో వర్షించబోతున్నాయి. 'అత్తయ్యని రమ్మంటే తానే వస్తుంది. ఇతనేందు కెళ్ళాలో ఇప్పుడు?' అతను వెళ్ళడం ఆ పిల్ల సహించలేక పోతుంది.
    "ఇంకెందుకు? మరి రానే! అక్కడ కాలేజీ లో సీటు వచ్చింది రమ్మని పెద్దమామయ్య వ్రాశాడుగా? అక్కడే చదువుకుంటాను హాయిగా!" ఆ పిల్ల వైపు కొంటెగా చూస్తూ కవ్వించాడు వాసు!
    "నిజం?!" నమ్మలేనట్టు చూసిందతని వైపు.
    "అబద్దమాడవలసిన అవసరం నాకేమిటి?"
    "అలాంటప్పుడు మరి....మరి ఇక్కడి కెందుకొచ్చావ్?' గొంతు చిన్నగా వణికింది.
    "బాగుంది! వచ్చాను. మళ్ళీ వెళ్ళిపోతున్నాను. అది నా ఇష్టం." అతను మొహం చాటు చేసుకున్నాడు, నవ్వే పెదవులు పద్మజ గమనించకుండా.
    "ఒట్టు?!"
    "తాతయ్య మీద ఒట్టు!" నవ్వేశాడు వాసు.
    "తాతయ్య మీదనా ఒట్టు!" తనూ నవ్వింది పద్మజ.
    వెల్;వెళ్ళిపోతున్న అతని వైపు చూస్తున్న పద్మజ ఏదో పోగొట్టుకున్నదానిలా దిగాలుగా ఉండిపోయింది కొన్ని క్షణాలు. అనిర్మలమైన కన్నులలో ఏదో తియ్యని ఆరాధన.

                                   *    *    *    *

 Previous Page Next Page