"అవును! అంతేకాదు. నేను మిమ్మల్ని పిలిపించడానికి ఇంకో కారణంకూడా వుంది."
"ఏమిటది?"
"అయ్ లైక్ యూ మిస్టర్ విజయ్ కుమార్! మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ చాలా తక్కువమంది వుంటారు. అలాంటివాళ్ళ సంఖ్య ఒకటి తగ్గటం నాకిష్టం లేదు. మనజాబ్ వేరు - పాలిటిక్స్ వేరు. మనం ఎప్పుడూ రెండింటినీ మిక్స్ చేయకూడదు. చేస్తే మనకే చాలా ప్రమాదం! పాలిటిక్స్ అనేది ఎవర్ గ్రీన్. దానికి చావు లేదు. దానికి వెనుకంజ లేదు. అయ్ థింక్ అయామ్ క్లియర్".
"థాంక్యూ వెరీమచ్, మీ దృక్పథానికీ నా దృక్పథానికీ చాలా తేడా వుంది. ఉద్యోగ ధర్మం అనేది ఒకటుంది. నాకు అదే ముఖ్యం. పొలిటీషియన్స్, పాలిటిక్స్ లేకుండా దేశం మనగలుగుతుంది. కానీ బ్యూరోక్రసీ లేకుండా దేశం ఒక్క అడుగు కూడా ముందుకి వెళ్ళలేదు. ఇంకో విషయం ఏమిటంటే నాకెలాంటి ప్రమాదం సంభవించినా ఫరవాలేదు. నాకు సంసారం అనేదే లేదు ఒకే ఒక్క కొడుకున్నాడు. వాడిని మా అమ్మ పెంచి పెద్దచేస్తుంది. కనుక భయపడాల్సినంత బాదరబందీ నాకేమాత్రం లేదు."
తను వచ్చేశాడు.
ఆ రోజునే సి.బి.సి.ఐ.డి.కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఎవరికీ తెలీకుండా రహస్యంగా జిరాక్స్ తీయించి ఆ సెట్ మొత్తం రిజిస్టర్ద్ పోస్టులో జస్టిస్ శ్రీమతి ఇందిరాదేవికి పంపించాడు. ఒకవేళ తన దగ్గరున్న ఫైల్స్ ని ఎవరయినా తస్కరిస్తారేమోనన్న భయంతో ఆ పని చేస్తున్నట్లు ఆమెకు వుత్తరం రాసి వుంచేడు.
ఆ తర్వాత రెండు రోజులకు తనూహించినట్లే ఆ ఫైల్స్ అన్నీ మాయమయ్యాయ్. వాటి స్థానంలో కొత్త ఫైల్స్! అదే నెంబర్ తో - కానీ కొత్త రిపోర్టులతో - కొత్త సాక్ష్యాలతో, ఆధారాలతో-
తను నవ్వుకున్నాడు.
తను ఐ.పి.ఎస్ -వాళ్ళు చదువూ, సంస్కారం లేని రోడ్ సైడ్ ట్రిక్ స్టర్స్- ప్రజల మూర్ఖత్వంవల్ల వాళ్ళకు పదవులు లభించాయ్. తనను ఫూల్ చేయటం వాళ్ళ తరమా? తను ఈ విషయాలన్నీ ఆలోచిస్తూంటే ఇప్పుడు తన మెదడుకి మరింత మేత పెడుతూ సంగీత-
* * *
సడెన్ గా మెలకువ వచ్చింది రజనికి. ఎప్పుడు నిద్ర పట్టిందో తనకే తెలీదు. కానీ చాలా గాఢంగా, ప్రశాంతంగా నిద్రపోయింది. బహుశా పెళ్ళయిన తర్వాత ఈ రోజేనేమో ఇంతహాయిగా నిద్రపోయింది.
అందుక్కారణం తన జీవితంతో పాటు తను భరిస్తోన్న బాధలుకూడా శాశ్వతంగా తమకు దూరమవుతాయనేమో.
ఆమె కళ్ళు తెరచిచూసింది. నైట్ బల్బ్ కాంతిలో మిగతా అన్ని బెర్తుల మీద కూడా ఎవరెవరో పడుకుని నిద్రపోతున్నారు. వాళ్ళంతా ఏ స్టేషన్ లో ఎక్కింది కూడా తనకు తెలీదు. తల దగ్గర వున్న కిటికీ అద్దంలో నుంచి బయటకు చూసిందామె. అప్పుడే ఓ చిన్న స్టేషన్ దాటుతోంది బండి. ఫ్లాట్ ఫారం మీదున్న లైట్ల కాంతిలో వర్షం కురవటం కనబడుతోంది.
నిజానికి తనకే ఆలోచనవచ్చింది - ఆత్మహత్య చేసుకుని జీవితం ముగించాలని.
ఒకటి రెండుసార్లు కిరసనాయిలుకోసం ప్రయత్నించింది కూడా. కానీ తను కిరసనాయిలు పోసుకుని కాల్చుకు ఛస్తే పోలీసులు తమని వదలరని తన అత్తకు, తన భర్తకుకూడా తెలుసు. అందుకే అది తనకు దొరక్కుండా కట్టుదిట్టాలు చేశారు.
ఆ కారణంగానే ఇప్పుడీ ప్లాన్ ఆలోచించారు. తనుఅర్దరాత్రి లేచివాళ్ళు ముగ్గురూ రహస్యంగా మాట్లాడుకోవడం వింది.
తను గోదావరిలో స్నానం చేస్తూండగా అందులోనే ముంచిప్రాణాలు పోయేవరకూ అదిమివుంచితే సమస్య తీరిపోతుందని వాళ్ళ ప్లాన్. పోలీసులు తమనేం చేసేందుకూ ఋజువువుండదు. పొరబాటున కాలుజారి నదిలో మునిగిచనిపోయిందంటే ఎవరయినా నమ్ముతారు. అందుకే ఈ యాత్ర ప్రారంభింపజేశారు.
ఆమె మనసు మళ్ళీ విశ్వం మీదకు మళ్ళింది.
తనకు అతని తమ్ముడికి ట్యూషన్ చెప్పడానికెళ్ళినరోజుల్లో అతను పరిచయమయాడు. పరిచయమయిన రెండోరోజే తనకు ప్రేమలేఖ రాశాడతను.
"రజనీ! మీ అంత అద్భుతమయిన అందాలరాశిని చూడటం ఇదే ప్రధమం. మిమ్మల్ని ప్రేమించాను. మనం పెళ్ళి చేసుకోవాలని నా కోరిక. మరి మీ అభిప్రాయం ఏమిటి? వెంటనే చెప్తారు కదూ? మీ విశ్వం".
తనకు మతిపోయినట్లయింది.
ఉత్తరం చింపి పారేసింది. కానీ మనసు ఆ ఉత్తరం నుంచి మళ్ళించలేకపోయింది. తనకు అప్పటికే సంబంధాలు చూశారు తల్లిదండ్రులు. కానీ అన్ని సంబంధాలు కేవలం కట్నకానుకల విషయంలోనే కాదని వెళ్ళిపోతున్నారు. అంటే అందరికీ కావాల్సింది డబ్బేగానీ తనుకాదన్న మాట! భార్యంటే ఒక గొర్రెలాంటి జంతువని వాళ్ళ ఉద్దేశ్యం.
మగాళ్ళందరి మీదా అసహ్యం కలిగిన ఆ తరుణంలో అతని ఉత్తరం ఓ సంతృప్తినీ, ఆనందాన్నీ కలిగించింది. తనను డబ్బుకోసం కాకుండా కేవలం తనను ఓ అందమయిన అమ్మాయిగా గుర్తించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడతను. తనెందుకు ఒప్పుకోకూడదు? అతనికి జవాబు రాసి మర్నాడు ట్యూషన్ కెళ్ళినప్పుడు అందజేసింది.
"నాకూ మీరంటే ఇష్టమే" అంతే!
ఆ సాయంత్రం ట్యూషన్ నుంచి వస్తుంటే రోడ్ మీద తనను కలుసుకున్నాడతను.
"ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి! వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడమంటారా?"
"మాట్లాడండి"
రెండుగంటల తరువాత తన తండ్రిదగ్గర కొచ్చాడతను.
చాలాసేపు మాట్లాడాక తిరిగి వెళ్ళిపోయాడు.
మర్నాడు తను మళ్ళీ ట్యూషన్ కెళ్తోంటే వెళ్ళవద్దని ఆపేసింది తల్లి. తనుసంగతేమిటని అడిగింది.
"అతనిదీ - మనదీ ఒక కులం కాదు! అందుకని మనకా సంబంధం వద్దు" అందామె. కొద్దిరోజులు తను ఇల్లు కదలలేదు. ఆ తర్వాత కొద్ది రోజులు అతని విషయాలేమీ తెలీలేదు.
అతనికి వివాహంఅయిపోయిందన్న వార్త చాలా ఆలస్యంగా తెలిసింది.
తిరిగి అతనిని కలుసుకోకూడదని నిశ్చయించుకుంది. కానీ హఠాత్తుగా తన తండ్రికి బదిలీ అవటంతో అక్కడ తను ఇంటి వెనుకే ఉన్న పెంకుటింట్లో కాపురం ఉంటూండటం చేత కనిపించాడు. ముందతని భార్యే వచ్చి తనతో పరిచయం చేసుకుంది. ఆమె పేరు శైలజ. ఆమె మంచితనం తనను ఆకట్టుకుంది. కొద్దిరోజులలోనే ఇద్దరూ ప్రాణ స్నేహితురాళ్ళయిపోయారు.
అప్పుడు చెప్పిందామె-
విశ్వం మనసులో ఇంకా తనే ఉందట!
తనతో ఒక్కసారైనా మాట్లాడే అవకాశం కల్పించమని అతను భార్యనుకోరటం!
తనకు ఆశ్చర్యం, ఆనందంకూడా కలిగినయ్.
అతని మనసులో ఇంకా తను ఉన్నందుకు ఆనందం- అతని భార్యే తామిద్దరూ కలుసుకునేందుకు సాయపడటం ఆశ్చర్యం! తను మొదట్లో అంగీకరించలేదు. కానీ ఆమె బ్రతిమాలటం ప్రారంభించేసరికి గత్యంతరం లేక ఒప్పుకుంది. మొదటిసారి ఆమె ఇంట్లోనే కలుసుకున్నారిద్దరూ. తామిద్దరినీ గదిలో ఉంచి బయట తలుపుకి గొళ్ళెం పెట్టిందామె. అతను చాలా సేపు మాట్లాడాడు.
అతను ఇంకా తననేప్రేమిస్తున్నాడనీ, ఇప్పటికయినా తను అంగీకరిస్తే తనను కూడా వివాహం చేసుకోగలడనీ- ముగ్గురూ కలిసే సంసారం చేయవచ్చనీ- తనకు ఆ మాటలు భయం కలిగించినాయ్! తనను కౌగలించుకోబోయిన అతనిని దూరంగా తోసివేసి తలుపులు తెరవగానే పారిపోయి వచ్చేసింది.
ఆ తరువాత తన వివాహం నాగరాజుతో సెటిలయింది.
నాగరాజు తననెందుకు చేసుకుంటున్నాడో వాళ్ళు చేసే బేరాలను చూస్తూనే అర్ధమయిపోయింది. అతని మీద, ఆ వివాహ వ్యవస్థ మీదా తనకు ఏహ్యభావం కలిగింది. ఆ రాత్రేతనను నిద్రలేపాడు విశ్వం. వెన్నెలలో చాలాసేపు తనను బ్రతిమాలాడతను.
"రజనీ! నిన్ను పూలలో పెట్టి పూజించుకుంటాను. నాకు పెళ్ళయిపోయిందని సంశయం పెట్టుకోకు. శైలజ ఎంత మంచి మనిషో నువ్వే చూశావ్ కదా! నా మనసులో నువ్వున్నావని తెలుసుకుని తనే స్వయంగా నిన్ను పరిచయం చేసుకుని మనిద్దరం కలుసుకునేందుకు సహాయం చేసింది కనుక ఇద్దరు భార్యలతో సమస్యలు ఎదురవుతాయన్న ఆలోచన కూడా నీకక్కరలేదు-"
తను అంగీకరించలేకపోయింది. ఆ తరువాత తన వివాహం జరిగిపోయింది. ఇప్పుడనిపిస్తోంది. ఆ రోజు విశ్వం మాటలు విని అతనికి భార్య అయితే జీవితం ఎంత ఆనందమయంగా వుండేది? తనను ఓ స్త్రీగా, ప్రియురాలిగా భావించే విశ్వం సరసన ఎంత గౌరవప్రదమయిన జీవితం లభించేది?
గాఢంగా నిట్టూర్చిందామె.
దుఃఖపూరితమయిన జీవితం గడపాలని తన నొసట రాసి వుంటే తను విశ్వం కోరిక ఎందుకు అంగీకరిస్తుంది?
తనకు ఎదురుగా వున్న మిడిల్ బెర్త్ మీద వ్యక్తి నిద్రలోనే అటు వేపునుంచి ఇటువేపు తిరిగి పడుకున్నాడు.
అతని చేతికున్నవాచ్, ఉంగరం చూస్తూనే త్రుళ్ళిపడి పరీక్షగా అతని మొఖం వంక చూసిందామె సందేహం లేదు. అతను విశ్వమే! ఆమె గుండెవేగంగా కొట్టుకోసాగింది. మనసంతా అలజడి ప్రారంభమయింది. ఎంతకాలం తర్వాత? సరిగ్గామూడేళ్ళు!
మూడేళ్ళ తరవాత తిరిగి అతనిని చూస్తోంది తను! జీవితంలో ముఖ్యమయినమూడు ఘట్టాల్లోనూ అతనిని చూడగలగటం ఎంత అదృష్టం? తనను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తిని! యవ్వనంలోనూ, తన పెళ్ళి సమయంలోనూ, తిరిగి తన జీవితం అంతం కాబోతున్నప్పుడూ-
అతని భార్య శైలజకూడా వుందా అతనితో?
పై బెర్తు మీదకు చూసిందామె. ఇంకెవరో ముసలతను - తెల్లారగానే అతను తనను చూస్తాడు. ఇద్దరూ కళ్ళతోనే మాట్లాడుకోవాలి! తామిద్దరూ ఒకనాటి ప్రేమికులమన్న విషయం తెలిస్తే తనను ఇక్కడే చంపేస్తారు తన అత్త ఆడబిడ్డలు-