Previous Page Next Page 
8 డౌన్ పేజి 16

    ఓ సారి తన అత్తవంకా, ఆడబిడ్డ వంకా, భర్తవంకా చూసిందామె. ముగ్గురూ గాఢ నిద్రలో ఉన్నారు. నెమ్మదిగా లేచి అతని చేతికి పెదాలు ఆన్చి ముద్దు పెట్టుకుందామె. అతను చటుక్కునకళ్ళు తెరిచాడు.    
                                                              * * *    
    భవానీ శంకర్ కి మెలకువవచ్చేసరికి ఇంకా చీకటిగానే వుంది బయట బండి శరవేగంతో వెళ్తోన్నట్లు తెలుస్తూనే వుంది. తన పక్క బెర్తుమీదే జయసుధ నిద్రపోతోంది. ఆమెపైన మిడిల్ బెర్తుమీద బాలక్ పడుకున్నాడు. తన పై బెర్తు మీదముసలాయన- అతనెవరయివుంటాడు? జయసుధ ఫాదరా? ప్రపంచమంతా మునిగిపోయినట్లు అలా దిగాలుగా వున్నాడేమిటి?    
    జయసుధ కళ్ళుతెరచి అతనివేపు చూసి, అతనూ తనవంకేచూడటం గమనించి తల పక్కకు తిప్పిపడుకుంది.    
    భవానీ శంకర్ కి అర్ధమయిపోయింది. ఆమెక్కూడా నిద్ర పట్టడం లేదు.    
    "ఏవోయ్ మైడియర్ షేక్స్ పియర్, మొఖం వేలాడేశావ్? నాన్సెన్స్ మీ మాష్టారికినన్ను చూస్తే గిట్టదు. అంచేత నిన్ను ఫెయిల్ చేశాడు గానీ లేకపోతే నువ్వేమిటి, ఫెయిల్ కావటమేమిటి? డామిట్, ఇలాంటి మాటలంటే నాక్కోపమొస్తుంది. ఆ మాటకొస్తే నాతో మాట్లాడ్డమే ఓ ఎడ్యుకేషన్. విడో మారేజ్ విషయమై, నాచ్ కొశ్చెన్ విషయమై ఎన్నెన్ని లెక్చర్లిచ్చాను. నా దగ్గర చదువుకున్నవాడెవడూ అప్రయోజకుడు కాలేదు".    
    నెమ్మదిగా మంత్రాలుచదివినట్లు మాట్లాడాడతను.    
    జయసుధకు ఆశ్చర్యంగా వుంది. ఈ డైలాగ్ లన్నీ అతనికేలా వచ్చు? తప్పకుండా అతనూ తన క్లాస్ మేటే అయుంటాడు ఆరో క్లాస్ లో అందుకే తను గుర్తుతెచ్చుకోటానికి చెప్తున్నాడు. అప్పట్లో తనకు నలుగురు మగపిల్లల పేర్లు బాగా తెలుసు.    
    భవానీ శంకర్, సత్యం, మురళి, పాండురంగారావ్.    
    ఆ నలుగురి రూపాలు కూడా ఇప్పుడు తనకు సరిగ్గా గుర్తులేవు. తామందరూ కలసి స్కూలుకి వెళ్ళివస్తూండేవారు. అందులో ఎవరితను? అతనినే అడగాలనుంది. కానీఏదో బెరుకు, సిగ్గు-    
    "ఆహా! చట్టనేర్పినందుకు థాంక్స్ చేయాలోయ్. అంటే అభినందించాలి! ఈ చుట్ట పంపిణీ విధానం మీదనే  తెల్లవాడు స్టీమ్ యంత్రంవగైరా కనిపెట్టాడు. లేకపోతే పట్టుబడేనా? శాస్త్రకారుడేమన్నాడు?
    కగపతి అమృతముతేగా
    భుగ భుగమని చక్క భూమిని వ్రాలెన్
    పొగ చెట్టయ్ జన్మించెన్
    పొగ తాగనివాడు దున్నపోతైపుట్టున్.
    అంటే పూర్ బఫెలో!    
    ఇది బృహన్నారది నాలుగో అశ్వాసంలో వుంది. అది సరే నేను కూడా మీ ఊరొచ్చి మీవాడు పరీక్ష పాసయ్యాడని చెప్తాన్లే! అన్నట్లు నీ దగ్గర కాపర్సేమయినా వున్నాయా అయితే ఓ శేరు కాశీ మిఠాయి కొని పట్టుకురా! గో ఎట్ వన్స్ మైడియర్ లాడ్! నువ్ నేను చెప్పినట్లల్లా వింటూంటే సురేంద్రబెనర్జీ అంతటివాడిని చేస్తానోయ్-"    
    జయసుధకు నవ్వాగటంలేదు "ఏయ్ మిస్టర్! ఏమిటా మోత?" కోపం తెచ్చుకుంటూ అంది.    
    "ఆ రోజు మీరు స్టేజ్ మీద ఇదే మోత పెడుతూంటే నేనేమయినా అడ్డుపడ్డానా?"    
    ఆమెకు ఋజువయిపోయింది.    
    "అది స్టేజ్-"    
    "నాకిదే స్టేజ్- ఎందుకంటే నిజం స్టేజ్ అంటే స్టేజ్ ఫియర్ నాకు-"    
    "కానీ మిగతావాళ్ళ నిద్రపాడు చేస్తున్నారు మీరు"   
    "మీరు నా నిద్ర పాడు జేశారు. రాత్రంతా కంటిమీద కునుకు లేదు-"    
    ఆమె అదిరిపడింది "నేనా? నేనేం చేశాను?"    
    "పాత రోజులన్నీ గుర్తుకి తెచ్చారు. కాలువగట్టు వెంబడే రోజూ కలిసి స్కూలు కి వెళ్ళిరావటం, మీకు సీమా చింతకయలు కోసి పెట్టటం, మీరు-గీతా పోట్లాడుకున్నప్పుడు నేను గీత జట్టున్నానని మీరు నా జత పచ్చికొట్టేసి 'నా రంగు పెన్సిల్ నాకు తెచ్చిమ్మని'గొడవ చేయటం, ఎప్పుడో ఏప్రిల్ ఫస్ట్ నాడు మీ ఫ్రాక్ మీద ఇంకు కొట్టానని ఆ రోజు హెడ్ మాస్టర్ కి రిపోర్టు చేయటం, నా చిన్న సైకిల్ టైర్ కి దబ్బలంతో పంక్చర్ చేయటం-"    
    "పంక్చర్ చేసింది నేనుకాదు" రోషంగా అందామె.    
    "మరెవరు?"    
    "సత్యం"    
    "దొంగరాస్కెల్! వాడినడిగితే మీ పేరు చెప్పాడు"    
    "అంతా అబద్దం"    
    "అఫ్ కోర్స్! నాకూ అదే అనుమానంవచ్చింది. కానీ అప్పటికే ఆ కోపంతో మీ జడ కొస కత్తిరించేశాను నేను- మీకు తెలీకుండా"    
    ఆమె ఉలిక్కిపడింది.    
    "ఆ పని చేసింది మీరా?"    
    "అవును! కోపం కొద్దీ అలా చేసేశాను, కానీ తరువాత చాలా పశ్చాత్తాప పడ్డాను-మీరు నాలుగు రోజులు స్కూలుకి రాకపోయేసరికి-"    
    "మరి ఆ పని చేసింది మురళీ అనుకుని నేను హెడ్మాష్టర్ కి రిపోర్టు ఇచ్చి అతనిని చావగొట్టిస్తూంటే మీరు సైలెంట్ గా ఊరుకున్నారే    
    "అందుక్కారణం వుంది. మురళీగాడు అంతకుముందురోజే నాతోపోట్లాడి మాట్లాడటం మానేశాడు"    
    ఆమె నవ్వేసింది. ఆమెమనసంతా చిన్ననాటి జ్ఞాపకాలతో నిండిపోయింది.    
    "ఇఫయామ్ కరెక్ట్ - మీరు భవానీ శంకర్! కదూ"    
    "సెంట్ పర్సెంట్"    
    "అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు మీరు! అందుకే గుర్తుపట్టలేకపోయాను."    
    "అప్పటికీ ఇప్పటికీ మీరూ చాలా మారిపోయారు. మీ ముక్కు ఎప్పుడూ కారుతూండేది ఆ రోజుల్లో! అందుకేనేమో గుర్తుపట్టలేకపోయాను. బై ది బై ఆనాటి మీ జలుబు తగ్గిందా? లేదంటే విక్స్ ఇస్తాను. అప్పట్లో నే మీకివ్వాలని కొని వుంచాను. కానీ మన స్నేహంకట్ అయిపోయేసరికి కోపం వచ్చి దాచేశాను".        
    "అవసరం లేదు, తగ్గిపోయింది- థాంక్యూ వెరీమచ్" నవ్వేస్తూ అందామె.    
    "నిజంగా మీరు చేసిన గిరీశం ఏకపాత్రాభినయం వండర్ ఫుల్! మీరు చదివిన డైలాగ్ లే రిహార్సల్స్ లో విని నేనూ ఇప్పటివరకూ గుర్తుంచుకున్నాను" ఆమె ఆనందంతో పొంగిపోయింది. "నిజంగా అద్భుతమయిన కారెక్టర్ అది. నాకెప్పుడూ అనిపిస్తూండేది- నేనే మగపిల్లాడినయితే గిరీశంలా వుండే అవకాశం దొరికేదని"    
    "బావుంది, నేనెప్పుడూ ఏమనుకొనేవాడినో తెలుసా? నేనేస్వరాజ్యలక్ష్మి నయితే బావుండేదని"    
    జయసుధ నవ్వేసింది.    
    "ఎందుకలా?"    
    "నేను స్వరాజ్యలక్ష్మి నయితే మీరు నా జత పచ్చికొట్టేవారు కాదు కదా అని"    
    "నేనంటే అంత ఇష్టమయితే మరిగీత జత ఎందుకున్నారప్పుడు?"    
    "తనే బ్రతిమాలింది! నిజానికి నా కిష్టం లేదసలు- నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఏడుపు మొఖంతో అడిగేసరికి-"    
    ఆమె అతనిమీద రాంగ్ నోషన్ ఏర్పరచుకున్నందుకు తనను తనే నిందించుకుంది. ఇద్దరూకొద్దిక్షణాలు మళ్ళీ మధురమయిన చిన్ననాటి జ్ఞాపకాలలో మునిగిపోయారు.   
    "నిజంగా అవన్నీ గోల్డెన్ డేస్! ఇప్పుడెన్ని సుఖాలు అనుభవించినా, ఎంత ఐశ్వర్యం సంపాదించినా ఆనాటి ఆనందానికి సాటిరాదు"    
    "అఫ్ కోర్స్! ఆనాటి ప్రాణస్నేహితులు సరసన వుంటే ఆ రోజుల్ని తలుచుకుంటూ గడపగలిగితే ఆ ఆనందం వేరు-"    
    "మీ మాట నిజమే! ఆ విషయం నాకిప్పుడే అనుభవమవుతోంది"    
    "నిజం చెప్పండి! ఇన్ని సంవత్సరాల్లో మీకెప్పుడయినా నేనుగుర్తుకొచ్చానా?"    
    "గుర్తుకొచ్చానా ఏమిటి? గుర్తుకురాని క్షణం లేదు. ముక్కుకి చీమిడి కారే ఏ అమ్మాయిని చూసినా మిమ్మల్నే తలుచుకునేవాడిని"    
    జయసుధ మనసారా నవ్వేసింది.    
    "నేనూ మిమ్మల్ని అనేకసార్లు తలుచుకున్నాను. అంతకాలం నాతో ఫ్రెండ్ షిప్ చేసి సడెన్ గా పార్టీమారినట్లు గీతజట్టులోకి ఎందుకెళ్ళిపోయారా అని ఎంత ఆలోచించినా నాకు అర్ధమయేదికాదు"    
    "నిజంగానే నాకూ ఆశ్చర్యంగా వుంటుందది! గీత ఏడుపు మొఖంతో నా కళ్ళలోకి చూస్తూ నువ్వు నాజట్టు వుండవా? అనేసరికి జాలివేసి సరేననేశాను."    
    "మీకో తమాషా తెలుసా? గీత ఓ సారి నేను కాలేజీలో వుండగా కనిపించింది మార్కెట్ లో! నేను పరుగుతో వెళ్ళి పలుకరిస్తే ఏం చేసిందో తెలుసా?- మూతి తిప్పుకుని నాతో మాట్లాడకుండావెళ్ళిపోయింది."    
    "వెరీ స్ట్రేంజ్! అంటే ఆమె మెదడు మాత్రం ఆరేళ్ళ వయసులో వుండిపోయి శరీరం పెరిగిపోయిందన్నమాట"    
    ఇద్దరూ నవ్వేశారు. "నిజంగానాకు చాలా గిల్టీగా వుంది! అలాంటి గాళ్ జట్టు ఎందుకున్నానా అని" అన్నాడతను దిగులుగా.    
    "మీరు మాత్రం ఏం చేస్తారు లెండి! అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఏడుపు మొఖంతో అడిగితే ఎవరయినా వప్పుకుని తీరాల్సిందే. మీ స్థానంలో నేనున్నా అదే పని చేసేదానిని-"    
    "ఏదో - మీరు అభిమానంకొద్దీ అలా అంటున్నారుగానీ నేను చాల ఘోరమయిన అన్యాయం చేశాను మీకు - గీత కళ్ళల్లోకి చూసినా, ఏడ్చి పెట్టినా ఆమె జత చేయకుండావుండాల్సింది నేను! తప్పు చేశాను"    
    "నోనో! అలాంటిదేమీలేదు. అసలు ఆ రోజుతప్పంతా నాదే అనిపిస్తోంది. నా వల్లే ఆ గొడవంతావచ్చి మనంవేరుపడిపోయాము."    
    "ఊహు! నేనొప్పుకోను. తప్పంతా నాదే"

 Previous Page Next Page