Previous Page Next Page 
8 డౌన్ పేజి 14

    విజయ్ కుమార్ తలెత్తి తనవేపు చూశాడు.    
    చప్పున తలపక్కకు తిప్పుకుంది సంగీత. నిజంగా జీవితంలో ఎలాంటి తమాషాలు జరుగుతుంటాయ్?    
    ఇన్నేళ్ళ తరువాత ఇద్దరూ ఒకే కంపార్టుమెంటులో కలిసి ప్రయాణం చేయగలగటం- విజయ్ కుమార్ మనసులో విపరీతమయిన కుతూహలం ప్రారంభమయింది.    
    తమ కూతురు తనపైన వున్న బెర్తుమీద నిద్రపోతోంది. మూడేళ్ళవయసులో సుష్మాను తీసుకెళ్ళిపోయింది సంగీత. అంతే! ఇన్నేళ్ళకు ఇప్పుడే తిరిగి వాళ్ళనుచూడటం- మధ్యమద్యలో ఏదోసందర్భంలో ఆమె పేరు పేపరులో రావటం -ఎక్కడ మెడిసిన్ సూపరింటెండెంట్ గాపని చేస్తోందో తనుగమనించటం జరుగుతూండేది.    
    ఇప్పుడు సుష్మ ఎంత పెద్దదయివుంటుంది? ఒక్కసరి ఆమెనుచూడాలని వుంది!   
    కానీ ఎలా? సంగీత ముందుతనలా బయటపడిపోవటం తనకిష్టంలేదు.    
    "వర్షం మొదలయిందే" అన్నాడు హోం మినిస్టర్ రఘునాథ్ స్వగతంగా.    
    విజయ్ కుమార్ కర్టెన్ తొలగించి కిటికీలోనుంచి బయటకు చూశాడు. వర్షం బాగానే పడుతోన్నట్లు అప్పుడే దాటుతోన్న ప్లాట్ ఫాం లైట్లకాంతిలో తెలుస్తోంది.    
    ఆ రోజూ ఇలాగే వర్షంకురుస్తోంది-    
    అయిదేళ్ళ క్రితం తామిద్దరం విడిపోయినరోజు- రాత్రంతా వర్షంకురుస్తూనే వుంది. రాత్రంతా తామిద్దరూ పోట్లాడుకుంటూనే వున్నారు. రాత్రి పదకొండింటివరకూ సంగీత ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీలో గడిపారిద్దరూ కొన్ని జంటలు డాన్స్ చేయడం ప్రారంభించాయి. అందులో ఒక డాక్టర్ వచ్చి సంగీతను కూడా ఆహ్వానించాడు.    
    ఆమె ముందు వప్పుకోలేదుగానీ తరవాత అంగీకరించింది.    
    చాలాసేపటి తర్వాత తను సంగీత కోసం డాన్స్ జరుగుతున్న చోటకెళ్ళేసరికి తనకు మతిపోయే దృశ్యం కనిపించిందక్కడ.    
    అతనూ, సంగీతా ఓ మూలనిలబడి బిగికౌగిలితో ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. తను బయటకువచ్చి కారులో కూర్చున్నాడు. అరగంట తర్వాత వచ్చిందామె.    
    ఇంటికి చేరుకున్నాక అడిగాడా విషయం!    
    "అతను ఎమ్బీలో నాక్లాస్ మేట్. అప్పట్లో ఇద్దరం చాలా క్లోజ్, అందుకని-"    
    "అంటే?"    
    "ఓ.కే! అతను అప్పట్లో నా బాయ్ ఫ్రెండ్"    
    తనకు ఆమె మీద అనుమానం అప్పుడు ప్రారంభమయింది.    
    "ఫిజికల్ ఇంటిమసీ ఉండేదా?"    
    "అప్పట్లో - యస్"    
    "మరి నాకెందుకు చెప్పలేదా విషయం?"    
    "ఆ టాపిక్ ఎందుకొస్తుందసలు? పాత విషయాలన్నీ మాట్లాడుకోవాలని ఎక్కడుంది?"    
    "నమ్మకద్రోహం కింద రాదా అది?"    
    "నమ్మకం అనేది మన మారేజ్ అయాక ఏర్పడింది. ఆ తర్వాతనే నేమయినా నమ్మకద్రోహంచేస్తే మీరు ప్రశ్నించాలి"    
    "అయామ్ సారీ! ఈ విషయం అంతతేలిగ్గా తీసుకోలేను నేను"    
    "ఎందుకని?"    
    "ఇదంత చిన్న విషయం కాదు కాబట్టి"    
    "మరి మీ సంగతేమిటి? నేనూ మీ హిస్టరీ అంతా అడిగి తప్పుపడితే మీరేం చేస్తారు?"    
    "నాకెప్పుడూ ఎవరితోనూ ఇలాంటి ఇంటిమసీలేదు-"    
    "ఇంటిమసీ అనేది ఫిజికల్ గానే వుండనవసరంలేదు. మానసికంగానయినా మీరు ఎవరో ఒకరితో ఇన్ వాల్వ్ అయుంటారని నాకు నమ్మకం"    
    "అలాంటిదేమీ లేదు- "   
    "దయచేసి అబద్దంచెప్పకండి. మిసెస్ సంపూర్ణగురించి మీరే నాతో ఓ సారి చెప్పారు"    
    "సంగీతా! నువ్ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోడానికి మిగతా వారందరినీ తప్పుగాభావించవద్దు, మా మధ్య రిలేషన్ షిప్ ఎలాంటిదో నీకు తెలుసు-"    
    "అదే నేనూ అంటున్నాను. నిజానికి మన మారేజ్ తర్వాత ఎన్నోసార్లు అతను నన్ను ఎన్నో కాన్ఫరెన్సెస్ లో కలుసుకున్నాడు. ఎన్నోసార్లు అతని రూమ్ కి రమ్మని ఇన్ వైట్ చేశాడు. కానీ నేనెప్పుడూ అంగీకరించలేదు. ఎందుకోతెలుసా? జస్ట్ బికాజ్ అయామ్ మారీడ్! మారేజ్ తర్వాత ప్రతి ఒక్కరూ సిన్సియర్ గా వుండాలని నేననుకుంటాను".    
    "అలా అనుకునేట్లయితే ఇందాక అలా ప్రవర్తించేదానివికాదు"    
    "ఓకే - అయామ్ సారీ! ఇంకొకసారి అలా ప్రవర్తించినని హామీ ఇస్తున్నాను. ఇన్ ఫాక్ట్ - అతనే బలవంతంగా-"    
    "సంగీతా! నేను ముందే చెప్పాను. ఈ విషయం అంత తేలిగ్గా తీసుకోలేను"    
    సంగీతకు అప్పుడు కోపం వచ్చింది.    
    "ఓకే! నీ ఇష్టం వచ్చినట్లుతీసుకో అయ్ కాన్ట్ హెల్పిట్"    
    "అంటే - నువ్వు ముందే అన్నిటికీ రడీ అయ్యావన్నమాట! ఇలా జరుగుతే అతనిదగ్గరకెళ్ళి అతనితోనే వుండిపోదామని కదూ?"    
    "నువ్వింత క్రూకెడ్ గా మాట్లాడతావని నాకింతవరకూ తెలీదు. అలాంటి కోరిక ఉంటే ఇంతకాలం నీ దగ్గర ఉండేదాన్ని కాదు".    
    రాత్రంతా ఇలాంటివాదనలతోనే గడిచింది. తెల్లారుజామున ఇదే సమయానికి ఇద్దరూ నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలనీ -ఆమె సుష్మనూ, తను మగపిల్లాడినీ తీసుకోవాలనీనూ-    
    అంతా చాలా స్మూత్ గా జరిగిపోయింది.    
    "రాత్రిళ్ళు కారు ప్రయాణం వీలయినంతవరకూ 'ఎవాయిడ్' చేయటమే మంచిది. ఈ రోజుల్లో చాలా రిస్కీ వ్యవహారం అది! విజయవాడ, హైద్రాబాద్ మధ్య ఉండేంత హెవీ లారీ ట్రాఫిక్ ఇంకెక్కడా వుండదు" అన్నాడు రఘునాథ్.
    విజయ్ కుమార్ ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు.    
    "అఫ్ కోర్స్, యూ ఆర్ కరెక్ట్"    
    విజయ్ కుమార్ కి తెలుసు- పైకి తనతో తేనెపూసిన కత్తిలా మాట్లాడుతున్నాడు హోమ్ మినిస్టర్. లోలోపల తన మీద పగ రగిలిపోతూంటుంది.    
    ఎందుకంటే ఆ రోజుజరిగే న్యాయ విచారణలో తను ఇటీవల రాజకీయ హత్యల్లో హోమ్ మినిస్టర్ హస్తం వుందన్న విషయం ఋజువులతో సహా న్యాయమూర్తి ముందుంచబోతున్నాడు. ఈ విషయం తను చీఫ్ సెక్రటరీతోనూ, ముఖ్యమంత్రితోనూ చెప్పాడు. కానీ తర్వాత తను చాలా పెద్దతప్పు చేశాడన్న విషయం తెలిసింది. ముఖ్యమంత్రికే ఆ హత్యలతో సంబంధం వుందనీ- హోమ్ మినిస్టర్ ద్వారా కొంతమంది పోలీస్ అధికారులను ఉపయోగించుకుని ఆ హత్యలు చేయించాడనీ - చీఫ్ సెక్రటరీయే ఆ రాత్రి తనను ఆయనింటికి పిలిపించి చెప్పాడు.    
    "ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు విజయ్ కుమార్. అయినా నేను చూసీ చూడనట్లు ఊరుకుండిపోయాను. మనం ఉద్యోగస్థులం, రౌడీయిజంతోనూ, ముఠాహత్యలతోనూ పదవులు సంపాదించుకున్నవారితో మనం సరితూగలేం. అయిదేళ్ళకో ముఖ్యమంత్రితో మనం డీల్ చెయ్యాలి. మన సర్వీసులో ఏడెనిమిదిమంది ముఖ్యమంత్రులను చూస్తాము. మనఖర్మ కాలితే పది, పదిహేనుమందినికూడా చూడవచ్చు. ఇందులో ఏ ఒక్కరితో పేచీపడ్డా మన శాల్తీయే గల్లంతయిపోతుంది. అందుకే చాలామంది ఎవరికి వారు రాజకీయనాయకులు చేసిన పాపాలను కనిపెట్టి, వారిని బ్లాక్ మెయిల్ చేసి తమక్కావలసిన పనులను తాముచక్కబెట్టుకుంటూంటారు. మిగతావారు కళ్ళు మూసుకుని వుండిపోతారు - ఈ రాజకీయహత్యలగురించి నీకు తెలిసిన విషయాలన్నీ నువ్వు న్యాయ విచారణలో బయటపెడుతున్న విషయం ముఖ్యమంత్రికి చెప్పటంవల్ల మీరెంత దారుణమైన ప్రమాదంలో ఇరుక్కున్నారో తెలుసా?"        
    అప్పుడు తెలిసిందితనకు తను చేసిన తెలివితక్కువపని!
    "అంటే ఎలాంటిప్రమాదంలో చిక్కుకున్నానంటారు?"    
    "చెప్పలేను! మీ దగ్గరున్న ఫైల్స్ అన్నీ వాళ్ళు టేంపర్ చేయవచ్చు. లేదా మీరు న్యాయం విచారణలో మీకు తెలిసినవన్నీ చెప్పనీయకుండా చేయవచ్చు."    
    "చెప్పనీయకుండా ఎలాచేస్తారు?"    
    "మీకు తెలీందేముంది? నయానా, లేక భయానా-"    
    "అంటే నన్ను బెదిరిస్తారంటారా?"    
    "చెప్పలేను. మూర్ఖుడి చేతిలో 'పవర్' అనే రాయి వుంది. అదెటు విసురుతాడో ఎలా విసురుతాడో వాడికే తెలీదు-"    
    "సరే! ఈ విషయంలో మీ సలహా ఏమిటి?"    
    "మీరు రేపు న్యాయవిచారణకు వెళ్ళకుండా వుండటం"    
    "కానీ సమన్స్ వచ్చాక వెళ్ళకుండా ఎలావుండగలను?"    
    "ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోడానికే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయ్! ఏదొక జబ్బుపేరుతో ఎడ్మిట్ అయిపోండి"    
    "తర్వాత ఏం జరుగుతుంది?"    
    "మీరు మీ వర్షన్ మార్చుకోవాలి. మిగతా అందరిలాగానే మీకేమీ తెలియదని చెప్పాలి"    
    "అయామ్ సారీ సర్! అయ్ కాన్ట్ డూ ఇట్"    
    చీఫ్ సెక్రటరీ మతిపోయినట్లు చూశాడు "మిస్టర్ విజయ్ కుమార్! మీరు స్ట్రెయిట్ ఫార్వార్డ్  వ్యక్తి అన్న విషయం నాకు తెలుసు"
    "అయితే మరింతసేపు మీ సమయం నా దగ్గర ఎందుకు వృధా చేశారు?"
    "ఆ విషయం కూడా నీకీపాటికి అర్ధమయ్యే వుంటుందనుకుంటాను"
    "ఎస్! నాకర్ధమయింది. మిమ్మల్ని ముఖ్యమంత్రిగారే స్వయంగా నాతో మాట్లాడమని ఆదేశించారు".

 Previous Page Next Page