"సార్! మీరు రేసిస్ట్ చేయకుండా బయటికెళ్తే మంచిది సార్! లేకపోతే మెడ మీద చేయి వేసి మెయిన్ రోడ్ లోకి గెంటాల్సి వస్తుంది -"
"వ్వాట్- ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ని నన్నే మెడ మీద చెయ్యేసి గెంతుతారా? అయ్ విల్ కాల్ పోలీస్ - ' మాట పూర్తీ కాకుండానే అతనిని ఈడ్చుకుంటూ మెయిన్ రోడ్ మీదకు తీసుకెళ్ళి రోడ్ మధ్య డివైడర్ మీద పడేశారు.
కింద నుంచి బట్టలు దులుపుకుంటూ లేచి నిలబడే సరికి భవానీ శంకర్ అతని చేతికో కవర్ అందించాడు.
"బృందావనం చానెల్ నీ రుణం పైసల్తో సహా తీర్చేందుకు కంకణం కట్టుకుంది బ్రదర్! ఇదిగో ఈ కవర్లో నీ జీతం తాలూకూ చెక్ వుంది - విజిలేసుకుంటూ ఇంటి కెళ్ళిపో-"
కవర్ అతని చేతిలో పెట్టి భవానీశంకర్ వెళ్ళి పోతుంటే కసిగా పళ్ళు కొరికాడు డాషింగ్ రంగా-
"నీకు పిచ్చెక్కింది! డాషింగ్ రంగా కి ఆ డాషింగ్ అన్న పేరెందుకొచ్చిందో నీకింకా దేలీడు- నిన్ను సర్వనాశనం చేస్తా - " అని అరుస్తూంటుటే ఒక వాన్ స్పీడ్ గా వెళ్ళడంతో రోడ్ మీదు చెరువులా ఉన్న డ్రైనేజ్ వాటరంతా అతనికి స్నానం చేయించేసింది.
తిరిగి తన రూమ్ కొచ్చేసరికి బాలాజీ భవానీ కాళ్ళ మీదపడ్డాడు.
"సార్! నన్ను కూడా గెంటించకండి సార్-"
"అయితే మరి మిమిక్రీ ఆర్టిస్ట్ ని పిలిపించావా."
"అవున్సార్- వచ్చేశాడు-"
భవానీ జేబులో నుంచి ఒక కాగితం తీసి అతనికిచ్చాడు.
"ఈ మేటర్ హోమ మినిష్టర్ చెప్పినట్లు చెప్పాలతను. మాట్లాడేప్పుడు లిప్స్ కరెక్ట్ గా సింక్రనైజ్ అవాలి - ఒకే?"
"ఓకే సార్-"
"ఈ పని సక్సెస్ పుల్ గా చేశావనుకో! ఆ డాషింగ్ రంగా గాడి సీటు నీది - ఓకే?"
"థాంక్యూ సర్-"
హడావుడిగా వెళ్ళిపోయాడతను.
భవానీ తిన్నగా కెమెరా యూనిట్ ఇన్ చార్జ్ దగ్గర కొచ్చాడు.
అతను టక్కున లేచి సెల్యూట్ కొట్టాడు. అప్పటికే డాషింగ్ రంగా మేటర్ తెలిసి స్టాఫ్ అంతా టెర్రరైజ్ అయిపోయారు.
"నీ పేరేమిటి?"
"భాస్కర్ సర్-"
"భాస్కర్ - వెంటనే ఒక కెమెరా ని జూబిలీ హిల్స్ కి పంపించు!"
"అలాగే సర్ - రమణా! కెమెరా తీసుకుని జూబిలీ హిల్స్ వెళ్ళిపో-"
"ఓకే సర్-" అంటూ కెమెరా సర్దుకుంటున్నాడు రమణ. కాసేపయిన తర్వాత రమణ సెల్ కి రింగ్ చేశాడు భవానీ!
"జూబిలీహిల్స్ వెళ్లి ఏం కవర్ చేస్తావ్?" రమణ నడిగాడు భవానీ -
"పొరబాటయింది - తెలుసుకోకుండా వచ్చేశాను -"
"గుడ్! మంచి బాలుడికి మొదటి లక్షణం అది ! నీ బాస్ ల మీద అంత గురి ఉంటె చాలు! ఎక్కడికో వెళ్ళిపోతావ్!"
"రోడ్ మీద వెళ్ళకుండా ఉంటే చాల్సార్-"
"ఓకె!- సరిగ్గా రాత్రి ఏడింటికి - అంటే ఇంకో అరగంటకి హోమ్ మినిస్టర్ ఇంటి బయట రోడ్ కి అవతల వేపు చెట్ల చాటున కూర్చుని హోమ్ మినిస్టర్ ఇంటిని ఏడుగంటల నుంచి ఏడున్నర వరకూ కవర్ చెయ్!"
"ఎందుకు సార్?"
"ఇలాంటి కోశ్చన్సే - నిన్ను రోడ్ న పడేసేది-"
"ఇంక మాట్లాడితే వట్టు సార్-"
***
బాలాజీ బృందావనం చానెల్ తాలుకూ లేటెస్ట్ న్యూస్ ప్రోగ్రాం లో వార్తలు టెలికాస్ట్ అవుతుంటే భయం భయంగా చూస్తున్నాడు.
హోమ్ మినిస్టర్ అయిటమ్ రానే వచ్చింది.
తెలుగు ప్రజలందరికీ మన పెద్ద పండుగ దసరా సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతున్నా! ఈ సందర్భంగా తెలుగు ప్రజల ఆశీస్సులు, కోర్కెల మేరకు త్వరలో నేను ముఖ్యమంత్రి పదవి నలంకరించడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా!"
బాలాజీకి కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయ్.
ముఖ్యమంత్రి పదవి కోసం- ప్రస్తుత ముఖ్యమంత్రి , హోమ్ మినిష్టర్ సిద్దారెడ్డి పోటీ పడటం - హైకమాండ్ సిద్దారెడ్డిని కొంతకాలం ఆగమని బుజ్జగించటం - బాలాజీకి తెలుసు -
వాళ్ళిద్దరికీ మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనటం కూడా అతనికి తెలుసు . ఆ పరిస్థితుల్లో ఇలాంటి స్టేట్ మెంట్ కావాలని మిమిక్రీ ఆర్టిస్ట్ తో చెప్పించటం చాలా సీరియస్ మేటరవుతుంది. అలాంటి బోగస్ న్యూస్ -- కావాలని వక్రీకరించి - టెలికాస్ట్ చేయటం ఒక క్రైం. తన మీద ముఖ్యమంత్రి చెంచాలు క్రిమినల్ కేస్ లు పెట్టినా పెట్టవచ్చు.
అతనూహించినట్లే స్టేట్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిఎం కార్యాలయంలో ఫోన్లన్నీ ఇన్ కమింగ్ కాల్స్ తో జామ్ అయిపోయినాయ్. సెల్ ఫోన్స్ నెట్ వర్క్ లన్నీ జామ్ అయాయ్. వాటితో పాటు బృందావనం చానెల్ ఫోన్లన్నీ కూడా మోతెక్కిపోతున్నాయ్.
ఎవరికి వాళ్ళే ఫోన్ తీయడానికి భయపడుతున్నారు. ఆపరేటర్ ఒక్కర్తే ఫోన్ అందుకుంటోంది.
"హలో ! బృందావనం చానెల్"
"ఏయ్! నేను హోమ్ మినిస్టర్నీ మాట్లాడతన్నా - ఏడీ - నీ ఏమ్ డిని ఫోన్ లోకి రమ్మను -"
"ఎండికీ జ్వరం సార్- చానెల్ కి రాలేదు -"
"అక్కడ ఇన్ చార్జ్ ఎవరుంటే ఆళ్ళని మాట్లాడమను-"
ఆమె భయంగా భవానీ రూమ్ కి కనెక్ట్ చేసింది.
"గుడ్ మాణింగ్ ! నేను చానెల్ ఇన్ చార్జ్ రాకేష్ ని మాట్లాడుతున్నా!"
"రాకేష్ - న్యూస్ లో నేను మాట్లాడని మాటలన్నీ మాట్లాడినట్టు చూపించారేంటి? ఎలా జరిగిందది?"
"సారీ సార్- నేనే ఇప్పుడు జరిగిన పొరబాటు గురించి మీకు ఫోన్ చేసి క్షమార్పణలు చెప్దామనుకుంటున్నా సార్-"
"ఇదిగో -- నీకేమయినా తెలివుందా? ఏందయ్యా నువ్ మాట్లాడేది? అలాంటి పోరాబాట్లేలా జరుగుతాయ్?"
'సార్ జరిగిందేంటంటే రెండేళ్ళ క్రితం ఎలక్షన్స్ అవగానే మీరే ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకున్నారు గద్సార్- ఆ టైమ్ లో మీరు మాట్లాడిన క్లిప్పింగ్స్ ని పొరబాటున మా వాళ్ళు ఇవాళ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ కి జత చేశారు సార్- ఇది టోటల్ గా మా స్టాఫ్ ఫాల్ట్ సార్! ఇంత పెద్ద పొరబాటు చేసిన మా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డాషింగ్ రంగా ని వెంటనే ఉద్యోగంలో నుంచి డిస్ మిస్ చేశాం సార్-"