Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 14

 

    వెంటనే రాధా చమేలీ మాట్లాడింది.
    "నేను మన చానెల్లో సీరియల్స్ అన్నీ డిజైన్ చేస్తుంటాను -- అయామ్ క్రియేటివ్ హెడ్ - ఫర్ సీరియల్స్ "
    "బెస్ట్ ప్రైమ్ టైం సీరియల్ ఏది?"
    "గుప్పెడు మనసు జానెడు హృదయం -- ' టోటల్ గా లేడీ ఓరియెంటడ్ స్టోరీ సర్! పెద్ద కోడలికీ - చిన్న కోడలికి మధ్య రివెంజ్ డ్రామా! సూపర్ డూపర్ సక్సెస్ సర్-"
    "రేటింగ్ ఎంత?"
    "టూ పాయింట్ త్రీ సార్-"
    "చిల్లర్-"
    రాధ మొఖంలో కోపం కనిపించింది.
    జైరాజ్ భవానీ కొట్టే ప్రతి డైలాగ్ నీ ఎంజాయ్ చేస్తున్నాడు.
    తర్వాత డాషింగ్ రంగా మాట్లాడాడు.
    "రియాల్టీ షో చేస్తుంటాను సర్! ప్లస్ న్యూస్-"
    "ఏంటా/ రియాల్టీ షో-"
    "ప్రతి తెలుగు సిటీలో ఒక సిటీ అయొడిల్ ని సెలక్ట్ చేయటం సార్ -చానెల్ మొత్తం మీద బెస్ట్ ప్రోగ్రాం సర్-"
    'ఆముదపు చెట్టు -- " అన్నాడు భవానీ.
    తరువాత భవానీ మాట్లాడాడు.
    "హాయ్! నా పేరు రాకేష్- డూ ఆర్ డై కేటగిరీ నాది! పది రోజుల్లో ఏదొకటి తేలిపోవాలి! తేల్చుకోడానికి రడీగా ఉన్నారా?"
    వాళ్ళకేం అర్ధం కాలేదు.
    జైరాజ్ మాట్లాడాడు.
    "మన చానెల్ లాస్ రోజు రోజుకి పెరిగిపోతున్నది. మూడు నెలల్లో చానెల్ బంద్ జేయాల్సోస్తది! ఏమంటున్న! మూయునికి మదద్ జేస్తరో, నిలబెట్టనికి కోషిష్ జేస్తరో మీ ఇష్టం మళ్ళా!"
    వాళ్ళు వెళ్లి పోయాక భవానీతో మాట్లాడాడు జైరాజ్.
    "రాకేష్ ! నేను క్లబ్ కి పోతన్నా! సబిత, రోజా గిట్ట ఫోన్ జేస్తే ఈడనే ఉన్నానన్జెప్పి ! ఈ చానెల్ నేం జేస్తావో జేసుకో! ఎట్లయినా క్లోజ్ జేసేదే! ఎంత జల్దీ చేస్తే అంతమంచిది నాకు - మస్తు పైసలు బబాయించొచ్చు! నువ్వేమయినా నీ అయిడియాల్తోటి సుధరాయించనికి కోషిష్ జేస్తే చెయ్- ఏమంటున్న?"
    "ఒకే అంకుల్ - ఇంక నా కోదిలేయ్-"
    "విష్ యూ బెస్టాఫ్ లక్-"
    జైరాజ్ వెళ్ళిపోయాడు.
    భవానీ శంకర్ రూమ్ లో నుంచి బయటి కొచ్చి న్యూస్ సెక్షన్ లో కొచ్చాడు.
    న్యూస్ డెస్క్ సాయంత్రం ఆరు గంటలకు కొచ్చే న్యూస్ తాలుకూ విజువల్స్ ని ఎడిట్ చేస్తున్నాడు. అప్పటికే రాకేష్ కొత్త బాస్ అని తెలిసి పోవడంతో అందరూ అలర్ట్ గా ఉన్నారు.
    "ఆ హోమ్ మినిష్టర్ క్లిప్పింగ్స్ ఏంటి?" అడిగాడు భవానీ ఆ విజువల్స్ చూస్తూ.
    "హోమ్ మినిస్టర్ గారు తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సార్-"
    మొత్తం క్లిప్పింగ్స్ అంతా చూశాడు భవానీ -
    "ఇది ఒకే -- కానీ ఆడియో మార్చాలి -"
    న్యూస్ డెస్క్ బాలాజీ ఫజిలయిపోయాడు.
    "ఆడియో మార్చాలా?"
    'అవును! డౌటా?"
    "అదెలా సార్ -అది అయన స్వంత గొంతు కదా - ఎలా మారుస్తాం ?"
    "మన చానెల్ మట్టి కొట్టుకు పోవడానికి నీలాంటి బఫూన్లు కారణం మిత్రమా! మైండ్ సెట్ మార్చుకో! మైక్ సెట్ ముందు హోమ్ మినిష్టర్ వాయిస్ ని మిమిక్రీ చేసే మిమిక్రీ ఆర్టిస్ట్ ని తీసుకురా!"
    బాలాజీ గాబరా పడిపోయాడు.
    "కానీ అసలు అయన ఆడియో మార్చాల్సిన అవసరం ఏమిటి సార్?"
    "నీ ఉద్యోగం పోకుండా ఉండాలంటే ఇంకో జాబ్ కోసం నువ్ రోడ్ల వెంబడి పడకుండా ఉండాలంటే మార్చాల్సిన అవసరం ఉంది కామ్రేడ్!
    "తెలుగు ప్రజలకునా విజయదశమి శుభాకాంక్షలు అని మాములుగా తన స్వంత గొంతుకతో చెప్పాక వెంటనే " త్వరలోనే మీ అందరి ఆశీస్సులతో నేను మీకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఫీటాన్ని అధిరోహించబోతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది అంటాడాయన-"
    బాలాజీ షాకయ్యాడు.
    "అదేంటి సార్ - ఆ మాట అయన చెప్పలేదు కదా!"
    "కానీ అయన చెప్పినట్లు మన మిమిక్రీ ఆర్టిస్ట్ చెప్తాడు బ్రదర్! అందుకే మనం మన మిమిక్రీ ఆర్టిస్ట్ ని పిలిపించేది -"
    "సార్! కొంపలు మునిగిపోతాయ్-"
    "నువ్ ఇప్పుడు మునిగిన కొంపలోనే ఉన్నావ్ కామ్రేడ్ - ఈ కొంప ఇంతకన్నా ఇంకా మునగలేదు -"
    "సారీ సార్ - ఆ రిస్క్ నేను తీసుకోలేను -"
    "నేను తీసుకుంటాను బాలాజీ -- నీ వల్ల కాకపోతే ఆ సీటు ఖాళీ చెయ్-" బాలాజీ వెంటనే లేచి ఆ పక్కనే ఉన్న ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డాషింగ్ రంగా రూమ్ లోకి పరుగెత్తి రంగాతో పాటు తిరిగి వచ్చాడు.
    "వాటీజ్ ది మేటర్ సర్?" చాలా పోలయిట్ గా అడిగాడు డాషింగ్ రంగా.
    "మేటర్ తెలీనట్టు ఫోజోద్దు! నీవల్ల అవుతుందా! బయటకు పోతావా/ అయిదు లేక్కెట్టే లోపల తేల్చు -- ఒకటి - మూడు -"
    "ఆ యామ్ సారీ సార్- మీరు చెప్పింది -- నేనే కాదు , ఈ చానెల్ లో ఎవరూ చేయరు!"
    "నాలుగు .....అయిదు! యూ ఆర్ అవుట్ డాషింగ్ రంగా! ఎకౌంట్స్ ఆఫీస్ కెళ్ళి నీకు ఇవాళ్టి వరకూ రాసిన జీతం తీసుకుని ఫో-"
    "సారీ -- నన్ను ఈ జాబ్ లో నుంచి తీసేసే అధికారం ఎవరికీ లేదు - మిస్ రోజాగారికి తప్ప -"
    "అయితే ఆవిడతోనే చెప్పుకో - ఇప్పుడు బయటకు వెళ్తావా! సెక్యురిటీని పిలవమంటావా కామ్రేడ్-"
    రంగా అతని లాంగ్వేజ్ కి కన్ ఫ్యూజయిపోతున్నాడు.
    రోజాకి సెల్ జేయడానికి ప్రయత్నించాడు డాషింగ్ రంగా! కానీ సెల్ కవరేజ్ ఏరియాలో లేదు.
    ఏం చేయాలో అర్ధం కాక భవానీ వేపు చూసేసరికి అతను కనిపించలేదు గానీ అతని ప్లేస్ లో సెక్యూరిటీ వాళ్ళు కనిపించారు.

 Previous Page Next Page