"అదంతా నాకెందుగానీ జరిగినదంతా పొరబాటున జరిగిందనీ - నిజానికి ఆ స్టేట్ మెంట్ రెండేళ్ళ కిందటి దనీ - మళ్ళీ చానెల్లో ఎనౌన్స్ చేయించు -"
"వీలయినంత త్వరగా ఆపని చేయిస్తాను సార్- మా పొరపాటుకి ఇంకొక్క సారి క్షమించమని అడుగుతున్నా సార్'-"
"ఓకే ఓకే - త్వరగా కానీ-"
ఫోన్ పెట్టేసేపటికి ఎదురుగ్గా మొత్తం స్టాఫ్ అందరూ భయంగా చూస్తూ కనిపించారు.
"రోడ్ ఇంజన్ కింద పడ్డట్టు ఏంటా ఫేస్ లు?" అడిగాడు భవానీ.
"హోమ్ మినిస్టర్ క్లిప్పింగ్ ఎత్తేయమంటారా సార్?"
"ఎవడా కొశ్చేనేసింది?"
"నేనే సార్ - " బాలాజీ ముందు కొచ్చాడు.
"ఇదిగో -- ఒరే బాలాజీ నీకిందాకేం చెప్పాన్రా?"
"చెప్పింది చెయ్యమన్నారు సార్-"
"మరి చెప్పందే ఆ లూజ్ టాక్ ఏంట్రా?"
"మరి హోమ్ మినిస్టర్ గారు మీతో .........."
"ఆళ్ళెం చెప్తే అదే చూపించడానికి దూరదర్శనుంది కదరా! మళ్ళీ మన ప్రవేట్ చానెల్స్ ఎందుకురా?"
"నా కర్ధం కాలేదు సార్-"
"మొత్తం మన ఇతర ప్రోగ్రామ్స్ అన్నీ ఆపి ఇందాక టెలికాస్ట్ చేసిన హోమ్ మినిస్టర్ క్లిప్పింగ్సే - ఒక గంట పాటు - రిపీట్ చేసేయ్ - అంతేగాకుండా పెద్ద అక్షరాలతో అదే డైలాగ్ స్క్రోలింగ్ చేయించు మేటరర్దమయిందా?"
వాళ్ళంతా మతి పోయినట్లు ఒకరి మోఖాలోకరు చూసుకున్నారు.
"సార్- మన కొంపల మీద కొస్తుంది సార్ -" భయంగా అన్నాడు భాస్కర్.
'అక్కడే నీకూ నాకూ తేడా వస్తుంది! మేటర్ మన కొంపల మీదకు ఎప్పుడో వచ్చింది. వందల కోట్ల లాస్ అంటే అదే - మీలో ఎవడికే ప్రాబ్లం వచ్చినా నాపేరు చెప్పండి - అవతలో డేవడయినా సరే - నేను చూసుకుంటా -- ఇంకేమయినా డౌట్లున్నయా?"
"లేనట్లే సార్"
"మరింకా ఎందుకు నిలబడ్డారిక్కడ - ఫొండి - మీ మొఖాలు చూడడం తప్ప నాకింకా వేరే పనేం లేదనుకున్నారా?"
అందరూ బయటి కెళ్ళిపోయారు కంగారుగా-
అప్పుడే భవానీ సెల్ మోగింది.
"హలో -"
'అన్నా నేను విజయ్ యాదవ్ ని -"
"యస్ కామ్రేడ్ - అంతా ఓకేనా?"
"అంతా ఓకే బాస్-"
"ఎంతమంది ?"
"నాలుగు మోటార్ సైకిళ్ళు - ఎనిమిది మంది -"
"ఇంకా లేటెందుకు మరి ? - టాప్ లేపేయండి -"
ఫోన్ కట్ చేసి మళ్ళీ రమణ కి రింగ్ చేశాడు.
"సార్ - రమణ -"
"ఎక్కడున్నావ్?"
"హోమ మినిస్టర్ ఇంటి ముందుండమన్నా-"
"ఇప్పుడు టీమ్ మొత్తం ఇంట్లో కేల్లండి- ఇందాక మన చానెల్లో టెలికాస్ట్ అయిన స్టేట్ మెంట్ -- తనివ్వలేదనీ - బృందావనం చానెల్ వాళ్ళు చేసిన పొరబాటనీ హోమ్ మినిస్టర్ గారి రిజాయిండర్ షూట్ చేయడానికి వచ్చామనీ చెప్పండి -- వాళ్ళు వప్పుకుంటే ఓకే - లేకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి -"
"ఓకే సార్-"
వెంటనే రమణ , అతని ఇద్దరు అసిస్టెంట్లూ , ఒక జర్నలిస్ట్ హడావుడిగా హోమ్ మినిస్టర్ ఇంటి వేపు నడిచారు.
***
రోజా టెలిఫోన్ ముందు మండిపడుతూ కూర్చుని ఉంది. ఎదురుగ్గా డాషింగ్ రంగా నిలబడి ఉన్నాడు. బురద కొట్టుకుపోయిన ఆకారంతో - ఆమె కేదురుగ్గా ఉన్న టీవీలలో బృందావనం చానెల్లో హోమ్ మినిస్టర్ క్లిప్పింగ్స్ పదేపదే చూపిస్తున్నారు. "నేను అక్కడికీ చెప్తూనే ఉన్నా మేడమ్! మన చానెల్ ని రోజా మేడమ్ చాలా డిసిప్లిన్ద్డ్ చానెల్ గా డిజైన్ చేశారు. కాంట్రవర్సీస్ గానీ , వివిధ వర్గాలకు ఇబ్బంది కలిగించే వార్తలు గానీ, ప్రజల మనోభావాలు దెబ్బతినేందుకు ఆస్కారం ఉన్న మేటర్ గానీ టెలికాస్ట్ చేయగూడదు సార్- అని! కాని వింటేనా? ఆ హోమ్ మినిస్టర్ ఆడియో మార్చడానికి వప్పుకోలేదని నన్ను బయటకు గెంటించాడు మేడమ్-"
సబిత అతని మాటలు ఆశ్చర్యంగా వింటోంది.
"రాకేష్ గసంటి పోరగాడు కాదే - ' అంటోందామే.
రోజాకి తిక్కరేగింది ఆ మాటలకు -
"మమ్మీ! నువ్వూరికే మొఖాల్ని బట్టి మనుషుల్ని జడ్జ్ చేయకు ! నాకెందుకో మొదటి నుంచీ ఆ రాకేష్ వాలకం నచ్చలేదు. పైగా అన్నీ తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు - నువ్వూ డాడీ -- చెప్పాక అబ్జెక్ట్ చేయటం బాగుండదని ఊరుకుండిపోయా!" అంది ఆవేశంగా.
అప్పుడే రోజా సెల్ మోగింది.
"హలొ - " అందామె.
"హలో - నేను రేఖాని మాట్లాడుతున్నా రోజా-"
"హాయ్ రేఖా! ఎక్కడి నుంచి ? హైదరాబాద్ వచ్చావా?"
"లేదే - వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా! ఏంటి ? ఇవాళ మీ చానెల్ ఇంకే చానెల్ కీ దొరకనీ సెన్సేషనల్ న్యూస్ బ్రేక్ చేస్తున్నారు?" వైజాగ్ రోడ్ల మీద షాప్స్ లో హోటళ్ళలో జనం గుమికూడి మరీ మీ చానెల్లో ఆ హోమ్ మినిస్టర్ స్టేట్ మెంట్ చూస్తున్నారు - తెలుసా?"
రోజా షాకయింది.
అది తప్పుడు న్యూస్ అని చెప్పాలనుకుంది గానీ - అందువల్ల తమ చానెల్ పరువు ప్రతిష్టలు దెబ్బ తింటాయని భయపడింది.
"ఓకే - ఓకే - ఇంకేంటి విశేషాలు ?" అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించింది . త్వరగా ఆమెతో మాట్లాడటం ముగించి తండ్రికి మరోసారి ఫోన్ చేసిందామె.
అరగంట నుంచీ తండ్రి ఫోన్ అవుటాఫ్ కవరేజ్ ఏరియా అనటం వినబడుతోంది.
'డాడీ - ఏమైపోయారు మమ్మీ! ఫోన్ ఆఫ్ ఎందుకు చేశారు ?' చిరాకుగా అంది .
సబిత కూతురి మీద జాలిపడింది.
"నువ్వూరికే వర్రీ అవకు బిడ్డా! అసలే నీ తబీయత్ మంచిగ లేదు -"
"వర్రీ అవకుండా ఎట్లా ఉంటా మమ్మీ! అవతల మన చానెల్ తప్పుడు న్యూస్ టెలికాస్ట్ చేస్తోందని పబ్లిక్కి తెలిసిందంటే చానెల్ పరువు పోతుంది -"