అంగీకరించడానికి ఇష్టంలేనిదాన్ని ఏదో ఒక కారణం ఏరి, దానితో ఖండించి, ఇష్టంలేనిదాంట్లో వుండే సత్యాన్ని లేదని తమ మనసులకూ, ఇతరులకూ చెప్పడానికి ప్రయత్నిస్తారు; మనుషులూ, ముఖ్యం విమర్శకులూ.
ముందు__ "ఇదంతా అసత్యం"
సత్యమని తెలిస్తే,
"సత్యం ఐతేమాత్రం, వాటి సంగతి వ్రాయడమెందుకు"
చదివేవాళ్ళున్నారు గనక. ఉన్నారు చదివేవాళ్ళూ ఆనందించేవాళ్ళూ. ఐతే తరవాత ఎత్తు...
"ఇదంతా శైలి చేసే ఇంద్రజాలం కాదు. ఇట్లాంటివి వున్నాయి."
"ఇవి మనదేశంలో కాదట పశ్చిమ దేశాల్లోవి."
పోనీలే. ఆ కథల్లో art ...
"అదంతా ఇంగ్లీషు పుస్తకాల్లోని art. ఇక్కడికి దిగుమతి చేశారు"
పోనీలే. ఏదో వొక ఆర్టు. ఎవరిదో వొకరిది. art ఉందా అసలు?
వుంటే వుంది, లేకపోతే లేదు. అసలు విషయం ఒప్పుకుంటున్నారా?
మళ్ళీ మొదటికి
"ఇదంతా అవినీతి..."
ఈ విధమైన దొంగ వాదనలు కొత్తకావు. ఆ విమర్శకులను ఎన్నటికీ నమ్మించలేరు ఎవరూ... కాని ఇంకా యీ కవుల మీదా, విమర్శకుల మీదా అభిమానం పోని అవివేకులూ, ఇంక చీకట్లో వెతుక్కునే పత్రికా పాఠకులూ, యీ వ్రాతలలో మోసపోతున్నారు. వాళ్లకోసం దిగులు.
"బాగా వ్రాస్తారు. కాని ఆయనే..."
"ఆయన మంచివారే కాని ఆ వ్రాతలే..."
ఏది వీలైతే అదీ.
ఆయనా వొద్దు, వ్రాతలూ వొద్దు.
నవీన ఆదర్శకాంతలని సృష్టించి ఆ పాతవి కాదు యీ కొత్త ఆదర్శాలు ఉత్తమమైనది అని చూపరాదా?" అని మిత్రులు, పూర్వ పతివ్రతల ఈనాటి హక్కుదార్లు అందరూ ప్రశ్నించారు, బతిమాలారు. నామీద అభిమానంతో నా ధవళ కీర్తిలో యీ వొక్క మలినాన్ని తొలిగించాలనే ఆదుర్దాతో నచ్చచెప్పాలని చూశారు.
మొదటసంగతి ఆదర్శపు మనుషులనే వాళ్ళు లేరు. అంతమాత్రం తెలిసిన వాళ్ళుగనకనే పూర్వ కవులు, పురాణాల యోధులకీ, పతివ్రతలకీ, దేవత్వాన్ని తగిలించారు, మన నోళ్ళు మూసేందుకు. కొందరి కొందరిలో ఒక్కొక్క గుణం అద్భుతంగా ప్రకాశిస్తుంది. అంతే. పాత పతివ్రతల్లోని అనుకరణీయమైన ఉత్తమ గుణాన్ని మాత్రమేగాక వారి లోపాలన్నీ ఆదర్శాలనడం వల్లనే వాళ్ళని తిరిగీ వ్రాయవలసి వచ్చింది.
ఒక్కొక్క గుణం ఆదర్శంగా చూపగల పాత్రల్ని సృష్టించాను. నూతన నీతి ఆదర్శాలని. పాతివ్రత్యాన్ని కిరాతకులనించి, వేషాలేసుకున్న దేవతలనించి, పవిత్రులైన రుషులనించి, లేక రౌడీల నించి, జమీందారులనించి, పోలీసుల నించి, దుర్మార్గుడైన భర్తమీది భక్తివల్ల, భద్రంగా దాచిపెట్టుకుందని మామూలు రకంగా వ్రాస్తేనే గాని మీకు ఆదర్శం కనబడుతుందా? త్యాగం కింద తన శీలాన్ని అర్పించిందని వ్రాయగల దారుఢ్యం పూర్వ కవులకి వుండేది. ఈనాటి నిస్సత్తువ నీతి కళేబరాలకి కలం ముందుకి నడవదు. నేను స్త్రీల చేత చేయించిన ధీరకార్యాలన్నీ లోకానికి పాపాలుగా కనబడతాయి కదా! ఎట్లా ఆదర్శాలు కల్పించగలను మీకు నచ్చేట్టు! తన ప్రేమ కోసం, భర్తనీ, పిల్లల్ని, కులాన్ని, గౌరవాన్ని వదిలిన స్త్రీ ఆదర్శ వ్యక్తి అంటాను నేను. ఏమైనా అఘోరత్యాగం ఆదర్శమంటాను. మీరు కాదంటారు. సీత రాత్రులు ఒంటరిగా పడుకోలేక రాముడి వెంట అడవికి పోయింది. ఏమిటా మహా త్యాగమని అడుగుతున్నాను. రావణున్ని నిరాకరించిందా? నలుగురిలో తల ఒంపులనీ, పాపమని నరకంలో కాలుస్తారనీ భయమేసింది. వుత్త పిరికిమనిషి అని అంటే యేమిటి జవాబు?
అశోక వృక్షం కింద అనుభవాల తరవాత గాక, అంతకుముందు అన్నేళ్లు అడవిలో రాముడితో తిరిగేప్పుడు సీతకి సంతానం ఎందుకు లేదు? అని ఆలోచించారా?
ఓనాటి రాత్రి నేను పంతులుకి చెట్టుకింద చీకట్లో మిణుగురు పురుగుల వెలుగులో రేడియో సంగీతం కింద తాయారు కథ చెపితే_
"ఒరే! ఇట్లాంటివాళ్ళు నీకే కనపడతారేంరా? ఇంతదేశం తిరిగే మాకు కనపడరేం"
అని కొంచెం అపనమ్మకం గొంతుకతో అడిగాడు. సహృదయుడు తేటనీటివంటి మనస్సువాడు, నా మాటలో వేదవాక్యమంటి విశ్వాసమున్నవాడు పంతులు. ఇంక తక్కినవాళ్ళు నమ్ముతారా! నేను నా ఆవేశాన్ని దిగమింగుకోలేక పోయినాను.
"వున్నారు. నీ చుట్టూ, ప్రతి చోటా, ప్రతిరోడ్డుమీదా వున్నారు. ఆ దృష్టిలేదు నీకు! పలకరు, చెప్పుకోరు ముందుకు రారు. గాయపడ్డ నెత్తురు కారుతుందని భయం. వాళ్ళకా? అందం ఎప్పుడో పోయి వుంటుంది. హృదయ సౌకుమార్యం యీ ప్రపంచం కాళ్ళకిందపడి యెప్పుడో నలిగి వుంటుంది. భరించలేవు వాళ్ళని దగ్గిరిగా! కాని ఆ మలినంలోంచీ, ఆ ధీనత్వంలోంచీ ఆ మౌనంలోంచీ__ ఎక్కిరిస్తివా, అవిశ్వాసంతో చూశావా, గట్టిగా ప్రశ్నించావా? మాట్లాడకుండా గుంపులో కలిసిపోతారు. సానుభూతిని చూపి హృదయమిచ్చావా...యిచ్చావా ఇవ్వగలవా? ఎంత పుణ్యయజ్ఞం చేసినవాడివౌతావు?"
* * * *