Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 14

 

    ముఖ్యంగా తన దేవత స్వప్న కోసం.
    తనకోసం తల్లిదండ్రుల్ని, డబ్బు యిచ్చే అనేక సుఖాలనూ వదిలేసి వచ్చిందామె. అందుకు ఆమె పశ్చాత్తాప పడే పరిస్టితి రాకూడదని తన కోరిక! ముఖ్యంగా బీదతనం వల్ల అసలే రాకూడదు.
    కానీ స్వప్న కసలు ఇష్టం లేదా ప్రయత్నాలు.
    ఇలాంటి షరతులు ఆంక్షలు, ఉన్న ఆస్తి అనవసరమని ఆమె అభిప్రాయం. అంతకుముందు రోజు ఉదయం నుంచి ఇద్దరికీ ఆ విషయంలో వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయ్.
    "గుడ్ మాణింగ్ సర్!' సెల్యూట్ కొట్టాడు వాచ్ మన్.
    "గుడ్ మాణింగ్ ....' లోపలకు నడిచాడు చిరంజీవి.
    చీఫ్ ఎడిటర్ శివతాండవం అతనిని చూసి చూడనట్లు నటించాడు.
    కొద్ది క్షణాలు అతని కేదురుగ్గా ఉన్న కుర్చీలోనే కూర్చున్నాడు చిరంజీవి.
    "అరే! చిరంజీవా? ఎప్పుడొచ్చావ్?" ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు , కాసేపటి తర్వాత చేతిలోని పేపరు చదవటం ఆపి.
    "అయిదు నిమిషాలయింది."
    "ఓ! అలాగా! ఏమిటి విశేషం.
    "ఇవాళ్టి నుంచి ఆఫీసు కొచ్చి 'తెలుగు కిరణం' వ్యవహారం చూడాలని నిర్ణయించుకున్నాను."
    శివతాండవం మరింత ఆశ్చర్యంగా చూశాడు.
    "నువ్వు ఆఫీస్ కొస్తావా?"
    "అవును! ఏం?"
    "మరేం లేదు! నీకు అన్నీ కొత్తే కదా అని....." గొంతులో అవహేళన అస్పష్టంగా ధ్వనిస్తోంది.
    "అందరూ అన్నిటికీ ఒకప్పుడు కొత్తేగా?"
    శివతాండవం తను చూస్తున్న పేపరు పక్కకు నెట్టి కుర్చీలో వెనక్కు వాలి కూర్చున్నాడు.
    "చిరంజీవి ! నీకు కొన్ని నిజాలు చెప్పనా?"
    "ఏమిటవి?"
    "ఆరునెలల్లో 'తెలుగు కిరణం' సర్క్యులేషన్ ని మిగతా దిన పత్రికలన్నిటికంటే ఎక్కువ చేయాలన్న నీ ప్రయత్నం మంచిదే! ఎందుకంటె ఇది కోట్ల ఆస్తికి సంబంధించిన విషయం! నువ్వు సక్సెస్ కావాలనే నేను కోరతాను. కానీ దటీజ్ జస్ట్ ఇంపాజిబుల్! ఎవరివల్లా సాధ్యం కాని పని అది!...."
    "ఎందుకని?" పౌరుషంగా అడిగాడతను. అతని కళ్ళలో పట్టుదల, కసి, కోపం - అన్నీ మిళితమయినాయ్.
    "ఎందుకంటె - ఇంతకాలం నుంచీ - న్యూస్ పేపరే ఊపిరిగా బ్రతుకుతున్న వాళ్ళం - ఇంతమందిమి - మీ మావయ్యతో సహా - రాత్రింబవళ్ళు తలలు బద్దలు కొట్టుకున్నా - మావల్ల కాలేదది!"
    చిరంజీవికి ఇంక అతనితో మాట్లాడాలనిపించలేదు. లేచి నిలబడ్డాడు.
    "మావయ్య ఆఫీస్ గది తెరిచే ఉందా?' శివతాండవాన్ని అడిగాడతను.
    "తాళం వేసి వుంది!"
    "తీయించండి!"
    శివతాండవం మొఖంలో అయిష్టత స్పష్టంగా కనిపించిందిసారి.
    "ఒరే- శ్రీరాములు !" ప్యూన్ ని పిలిచాడు.
    శ్రీరాములు వడివడిగా నడుస్తూ లోపలికొచ్చాడు వినయంగా.
    "పెద్దయ్యగారి గది తలుపులు తెరువు -- చిరంజీవి కూర్చుంటాడట...."
    చిరంజీవికి అతని ప్రవర్తన చాలా కోపం కలిగిస్తోంది.
    తనను ఏమాత్రం విలువలేనివాడిలా చూస్తున్నాడు.
    శ్రీరాములు వెనుకే ఆఫీస్ రూమ్ కి వెళ్ళాడతను. గది తాళం తెరచి వెళ్ళిపోబోయాడు శ్రీరాములు.
    "శ్రీరాములు!" పిలిచాడు చిరంజీవి.
    "ఏం సార్?"
    "టేబులూ, కుర్చీ అన్నీ క్లీన్ చెయ్- ఆ కిటికీలు, వెంటిలేటర్లు తెరు...."
    శ్రీరాములు నిర్లక్ష్యంగా చూశాడు.
    "శివతాండవం వేరే పని చెప్పారండీ! చాలా అర్జెంట్ అది - " అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
    చిరంజీవికి రక్తం ఉడికిపోయింది.
    ఆప్ట్రరాల్ ఓ ఫ్యూన్ - ప్రస్తుతం యజమాని అయిన తన మాటను అంత నిర్లక్ష్యం చేయడమా?
    వాడి చొక్కా పట్టుకుని బలంగా మొఖం మీద ఒక పిడిగుద్దు వేయాలన్న కోరికను ఏంతో కష్టం మీద అణుచుకున్నాడు.
    తన టేబుల్, కుర్చీ కర్చీఫ్ తో తుడిచి పక్కనే ఉన్న ఫోన్ అందుకున్నాడు.
    టేబుల్ మీదున్న ఆఫీస్ డైరెక్టరీ నెంబర్ చూసి మేనేజర్ వెంకటేశ్వర్లుకి ఇంటర్ కమ్ లో రింగ్ చేశాడు.
    "వెంకటేశ్వర్లు హియర్ ....' అన్నాడతను.
    "నేను చిరంజీవిని మాట్లాడుతున్నాడు-"
    అతను విష్ చేస్తాడేమో ఎదురు చూశాడు చిరంజీవి. కానీ అలాంటిదేమీ వినిపించలేదు.
    "ఒకసారి నా రూమ్ కి రండి !" అనేసి ఫోన్ పెట్టేశాడు చిరంజీవి. లేకపోతే అతను 'రాను' అన్నమాట వినాల్సి వస్తుందేమోనన్న అనుమానంతో.
    ఆ తరువాత శివతాండవానికి ఫోన్ చేశాడు.
    "చిరంజీవిని మాట్లాడుతున్నాను! ఓసారి రూమ్ కి రండి! మాట్లాడాలి!" అనేసి ఫోన్ పెట్టేశాడు.
    రెండు నిమిషాల్లో వెంకటేశ్వర్లు, వచ్చి ఎదురుగ్గా నిలబడ్డాడు.
    "గుడ్ మాణింగ్ సర్-"
    "గుడ్ మాణింగ్ కూర్చోండి!"
    వెంకటేశ్వర్లు కూర్చున్నాడు.
    "నేను ఇవాళ్టి నుంచీ ఆఫీస్ కొస్తున్నాను. కనుక నాకోసం ఇక్కడొక కుర్రాడినె వర్నయినా ప్యూన్ గా వేయాలి!"
    "కాని మన ప్రెస్ లో కుర్రాళ్ళేవరూ లేరండి...." నిర్లక్ష్యంగా చెప్పాడతను.
    "లేకపోతే ఒక కుర్రాడిని ఎపాయింట్ చేయండి...." కొంచెం కఠినంగా అన్నాడు చిరంజీవి.
    వెంకటేశ్వర్లు ఏమీ జవాబివ్వకుండా వెళ్ళిపోబోయాడు.
    "ఆగండి!" గట్టిగా అరచాడు చిరంజీవి.
    అతను వెనుతిరిగి ఆశ్చర్యంగా చూశాడు.
    "ఓ కుర్రాడిని నాకు ప్యూన్ గా ఎపాయింట్ చేయమని చెప్పాను, దానికి సమాధానమివ్వకుండా వెళ్ళటంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?"
    "శివతాండవం గారి అనుమతి తీసుకొందే నేనేం చెప్పగలను?"
    "మిస్టర్ వెంకటేశ్వర్లూ-" మరింత కోపంగా అన్నాడు చిరంజీవి.
    "ఈ సంస్థకు యజమానిని నేను! నేను చెప్పినట్లు మీరు చేయాలి! అంతే! ఇంకొకరి అనుమతి అవసరం లేదు-"
    "ఆ సంగతి శివతాండవం గారు చెప్పాలండీ..." వినయంగా చెప్పాడు వెంకటేశ్వర్లు. "మీ మావయ్యగారు కూడా శివతాండవం గారి అనుమతి లేకుండా ఏపనీ చేసేవారు కాదండీ!"
    సరిగ్గా అప్పుడే శివతాండవం గదిలో కొచ్చాడు బట్టతల సవరించుకుంటూ.
    "ఏదో మాట్లాడుతున్నారు?" తనంతట తనే కుర్చీలో కూర్చుంటూ అడిగాడు శివతాండవం.
    చిరంజీవి అతికష్టం మీద ఉద్రేకం అణచుకున్నాడు.
    "చిరంజీవి గారికి ఒక ప్యూన్ కావాలిటండీ! ఏపాయింట్ చేయమంటున్నారు...." అన్నాడు వెంకటేశ్వర్లు వెటకారం ధ్వనింపజేస్తూ.
    "దానికి ఎపాయింట్ మెంటెందుకు? నా 'ప్యూన్ ' నే మీ దగ్గర కూడా పనిచేయమంటాను సరిపోతుంది...." అన్నాడు శివతాండవం చిరంజీవితో.
    చిరంజీవికి తనను తను అదుపులో పెట్టుకోవడం కష్టంగా ఉంది. అటు వెంకటేశ్వర్లు, ఇటు శివతాండవం - ఇద్దరూ తన సహనాన్ని పరీక్షిస్తున్నారు. అయినా తను తొందరపడకూడదు. తన ఈ సంస్థకు సర్వాధికారి అని తనకు తెలుసు. కానీ ఆ అధికారం ముప్పై ఏళ్ళ నుంచి ఇంతకుముందు రోజు వరకూ శివతాండవం చేతిలో ఉంచాడు మావయ్య. కనుక దానిని మళ్ళీ తన చేతిలోకి తీసుకోవటం హటాత్తుగా ఒక్కరోజులో జరగటం కంటే నెమ్మదిగా జరగటమే మంచిది. ఈ సమయంలో తను నిగ్రహం కోల్పోయి వెంకటేశ్వర్లు, చొక్కా పట్టుకుని ఒకే ఒక్క పిడి'గుద్దుతో గేటు బయట పడేలా చేయగలడు! కానీ అదే జరగకూడదు. మరొక్కసారి లాయర్ రంగనాధన్ తో మాట్లాడాలి. తన చేతలు సరయినవో కావో ద్రువపర్చుకోవాలి.
    వెంకటేశ్వర్లు ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు.
    "శివతాండవంగారూ !" నెమ్మదిగా పిలిచాడు చిరంజీవి.
    శివతాండవం కుర్చీలో వెనక్కు వాలి "యస్?" అన్నాడు ప్రశ్నార్ధకంగా.
    "నాకు మన 'తెలుగు కిరణం' సర్క్యులేషన్ ఫిగర్స్, మిగతా దినపత్రికల సర్క్యులేషన్ ఫిగర్స్ కావాలి! మన పత్రిక కంటే ఏ దినపత్రిక ఎంత ఎక్కువ సర్క్యులేషన్ తో ఉందొ కూడా వివరాలు కావాలి?"
    శివతాండవం జవాబివ్వకుండా లేచి నిలబడ్డాడు.
    "ఇదేనా మాట్లాడాలంది?"
    "అవును!"

 Previous Page Next Page