"బహుశా మందు ప్రభావంవల్లే వాళ్ళూ ఇంకేమీ గుర్తు తెచ్చుకోలేక పోతూండి వుంటారు."
"తాగుడు నిజంగా ఇంత హారిబుల్ అని నేననుకోలేదు బ్రదర్!"
"నేను మొన్నే అనుకున్నాను."
"నన్నడిగితే అసలు తాగుడు బాన్ చేయాలంటాను."
"కనీసం హైద్రాబాద్ లోనయినా బాన్ చేయాలి."
"ఓ.కే. పద వెళదాం."
"ఎక్కడికి?"
"ఇవాళ నువ్ నా గెస్ట్ వి."
భవానీశంకర్ అతనితోపాటు నడిచాడు. ఇద్దరూ ఆటోలో బయలుదేరారు.
ఆటో క్రిస్టల్ బార్ ముందాగింది.
"పద_" అన్నాడు దీపక్ దిగి.
"ఎందుకు?"
"మందు కొడదాం బ్రదర్!"
"కానీ..." అనుమానంగా అన్నాడు భవానీశంకర్.
"ఇవాళ నేనే పార్టీ ఇస్తాను బ్రదర్! ఆ రోజు నా గదిలో నుంచి నిన్ను గెంటివేసినందుకు విచార సూచకంగా_ కమాన్. కమాన్_" అతని చేయి పట్టుకుని లోపలకు లాక్కెళ్ళిపోయాడు దీపక్.
విస్కీ ఫుల్ బాటిల్ తెచ్చిపెట్టాడు బేరర్. బేరర్ మొఖం ఎక్కడో చూసినట్లనిపించిందిగానీ ఎక్కడ చూశాడో గుర్తురావటంలేదు భవానీశంకర్ కి. ఆ డ్రస్, తలకు తెల్లటోపీ చీకటి వల్ల గుర్తించడం సాధ్యం కావటంలేదు.
"నినెక్కడో చూశాను..." అన్నాడు భవానీశంకర్.
"చూసే వుంటారు సార్! ఈ బార్ లో చేరి వారం రోజులయింది."
"కమాన్_కమాన్_తాగ్గురూ! తాగు__ బేరర్లనూ, మేనేజర్లనూ గుర్తుపట్టటానికి కాదు మనం వచ్చింది! ఓల్డ్ ఫ్రెండ్స్ కలుసుకున్న సందర్భంలో మందు కొట్టేయటానికొచ్చాం."
భవానీశంకర్ ఓ గ్లాస్ తాగేలోపల మూడు గ్లాసులు తాగేశాడు దీపక్.
"నీకు మన బాచ్ లో నరసింహారావుగాడు తెలుసా?"
"తెలుసు. ఎక్కడున్నాడు వాడు?"
"మిలటరీలో మేజర్. ఆ మధ్య కనిపించాడు. ఇద్దరం బార్ కెళ్ళాం. తమాషా యేమిటంటే_ఓ గ్లాస్ తాగాక చూస్తే వాడు కనిపించలేదు."
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
"ఏమయ్యాడు?"
"తెలీదు. బార్ అంతా వెతికాను. మేనేజర్ని అడిగితే తెలీదన్నాడు. తమాషాగా లేదూ?"
"చాలా తమాషాగా వుంది."
భవానీ మళ్ళీ ఓ గ్లాస్ తాగేలోపల తను మూడు గ్లాసులు తాగేశాడు దీపక్.
బాటిల్ ఖాళీ అయిపోయింది.
"బేరర్!"
"యస్సార్!"
"బ్రాందీ హాఫ్ బాటిల్."
"ఆల్ రైట్ సర్!"
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు. "ఫుల్ బాటిల్ చాల్లేదా?"
"మన కోటా ఒకటిన్నర గురూ!"
మరో గంటలో బ్రాందీ బాటిల్ కూడా ఖాళీ అయిపోయింది. కొద్దిక్షణాలు తల సోఫా మీదకు వాల్చేశాడతను.
భవానీశంకర్ టైం చూసుకున్నాడు. పదవుతోంది. ఆకలి!
"దీపక్!" పిలిచాడతను.
దీపక్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
"ఎవరు నన్ను పిలిచింది?"
"నేనే"
"నువ్వా!"
"అవును."
"నువ్వెవరు?"
భవానీశంకర్ నిర్ఘాంతపోయాడు.
"నేనేరా! భవానీశంకర్ ని!"
"ఏ భవానీశంకర్?"
"అదేమిట్రా? మన కాలేజీలో..."
"లెట్ ది కాలేజ్ గో టూ హెల్. నువ్వెవరు?"
"నువ్వేగదరా నన్ను యిక్కడికి తీసుకువచ్చావ్, ఓల్డ్ ఫ్రెండ్స్ అని."
"నువ్వు నా ఓల్డ్ ఫ్రెండ్ వి కాదు."
"అయితే మరెందుకు నన్ను తీసుకొచ్చావ్?"
"నేనెవర్నీ తీసుకురాలేదు."
"దిసీజ్ టూమచ్" అన్నాడు భవానీశంకర్.
"యస్! దిసీజ్ టూమచ్! ఎవరెవరో వచ్చి నీ ఫ్రెండ్ నిరా అని చెప్పేసి నా మందంతా తాగేయడం అలవాటయిపోయింది. నేను తాగినంత మాత్రాన ఫ్రెండెవడో, ఎవడు కాదో తెలీదనుకుంటారు. అహ్హహ్హహ్హ! అయామ్ టూ క్లవర్ మిస్టర్!"
భవానీశంకర్ లేచి నిలబడ్డాడు. "ఆల్ రైట్! రేపు మాణింగ్ మాట్లాడతాన్లే."
"ఎందుకు మాట్లాడటం?"
"ఊరికే."
"అవసరం లేదు."
"సరే."
"ఏమిటి సరే?"
"ఏమీలేదు."
"ఏమీ లేకపోతే 'సరే' అనికూడా అనొద్దు."
"ఓ.కే."
"ఓ.కే. అనికూడా అనొద్దు."
భవానీశంకర్ నాలుగడుగులు వేశాడు. "ఆగు" అరిచాడు దీపక్.
భవానీశంకర్ ఆగిపోయాడు.
"బేరర్! బిల్లులో ఇద్దరికీ చెరో సగంవేసి పట్టుకురా" బేరర్ తో అన్నాడు దీపక్.
"ఆల్ రైట్ సర్" వెళ్ళిపోయాడు బేరర్.
"అదేమిట్రా? సగం బిల్లు నేను కట్టాలా?"
"అవును. నా మందు నువ్వే తాగేశావ్ కాబట్టి బిల్ సగం కట్టాల్సిందే. మొత్తం బిల్లు నేను కట్టను."
భవానీశంకర్ మళ్ళీ వచ్చి అతనికెదురుగా కూర్చున్నాడు.
బేరర్ రెండు బిల్లులు తీసుకొచ్చి ఇద్దరిముందూ ఉంచాడు. భవానీశంకర్ గుండెలు ఝల్లుమన్నాయ్. ఇద్దరికీ చెరో నూట పదిరూపాయలూ ఉంది బిల్. తనదగ్గర జేబులో యాభయ్ రూపాయలకంటే ఎక్కువ లేదు.
దీపక్ చప్పున లేచి తన బిల్ కట్టేసి తూలుకుంటూ బయటికెళ్ళిపోయాడు.
భవానీశంకర్ దిగులుగా బేరర్ వంక చూశాడు.
"బేరర్" నెమ్మదిగా పిలిచాడతను.
"యస్సార్!"
"నా దగ్గర ఇంత డబ్బు లేదు."
"అలాగా సార్!"
"వాడు మా ఫ్రెండే. వాడే నన్ను ఇక్కడకు తీసుకొచ్చి, బలవంతంగా తీసుకొచ్చి మందు కొట్టేయడంవల్ల అంతా మర్చిపోయి ఇంతపని చేశాడు."
"ఇలాంటి సంఘటనలు చాలా కామన్ సార్ బార్స్ లో."
"నువ్వు చాలా బార్స్ లో పనిచేశావు కదూ?"
"పధ్నాలుగు బార్స్ లో చేశాన్సార్."
"ఇలా నేనున్న పరిస్థితుల్లో మేనేజ్ మెంట్ ఏంచేస్తుంది సాధారణంగా?"
"ఒకో బారులో ఒకో ప్రాక్టీస్ వుంటుంది సార్! అసలు నేను మొట్టమొదట బేరర్ గా పనిచేయాల్సి వచ్చింది అచ్చం ఇలాంటి పరిస్థితిలోనే సార్!"