Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 14


    "అదుగో కన్యక" అన్నాడతను ఆనందంగా. శరత్ బాబు చటుక్కున బయట గేటువేపు చూశాడు.
    "అక్కడ కాద్సార్! ఆ ఫోటోలో."
    "అదా! అది 'మల్లెలు' ప్రధమ సంచిక ఆవిష్కరణ సమయంలో తీసింది."
    "ఆ ఫోటో ఒకటి నాకిస్తారా?"
    "ఎన్ని కావాలంటే అన్ని యిస్తాను. ఆల్బమ్ నిండా అవే" లోపలికెళ్ళి అయిదునిమిషాల తర్వాత ఓ గ్రూప్ ఫోటో తెచ్చియిచ్చాడతను. అందులో కన్యక మరింత అందంగా, దగ్గరగా కనబడుతోంది.
    "థాంక్యూ సార్! కన్యక మీ దగ్గరకొస్తే నాకు ఫోన్ చేయటం మర్చిపోరు కదూ?"
    "మర్చిపోను."
    "థాంక్యూ సార్" అన్నాడు రాజు కూడా లేచి నిలబడుతూ.
    ఇద్దరూ బయటకొచ్చేశారు.
    "గురూగారూ! మరి నా కవితలు..."
    "డోంట్ వర్రీ మైడియర్ ఫ్రెండ్! వచ్చేవారం నుంచే ఆంధ్రదీపిక అశేషాంధ్ర పాఠకుల కోరికపై ప్రారంభం. 'కవితల రాజు' మిస్టర్ రాజు కవితలు అన్న ఎనౌన్సు కొడుతున్నాను ఈ వారమే."
    "థాంక్యూ సార్!"
    "డోంట్ మెన్షన్!"
    అతను వెళ్ళిపోయాడు. భవానీశంకర్ ఫుట్ పాత్ మీద నడువసాగాడు. రోడ్డుమీద జనం వరదొచ్చిన నదిలా ప్రవహిస్తున్నారు. "ఇన్ని లక్షలమందిలో ఏ ఒక్కరూ కన్యక ఎందుకవలేదు?" అనుకున్నాడు అతను విచారంగా. ఎదురుగా వస్తున్న పెద్దవాన్ ఆగింది. అందులోనుంచి దీపక్ దిగాడు. "హలో బ్రదర్! ఆరోజు ఆఫీస్ కొచ్చి మళ్ళా కనిపించకుండా పోయావేమిటి?"
    భవానీశంకర్ గతుక్కుమన్నాడు.
    "దేవతా పబ్లికేషన్స్ జాబ్ లో చేరాను కదా! అందుకని..."
    "లెట్ ది జాబ్ గో టు హెల్! జాబ్ వచ్చినంత మాత్రాన మన ఫ్రెండ్ షిప్ అలా ఎండిపోవాలా? నో! వీల్లేదు! అసలు నిన్ను మా ఇంట్లోనే ఉండమన్నాను కదా! ఎందుకు రాలేదు మా ఇంటికి?"
    "రాకపోవటం ఏమిట్రా! ఆ రోజే వచ్చాను"
    "మరి నాక్కనిపించలేదేం?"
    "ఎందుక్కనిపించలేదు? ఆ రాత్రి నువ్వు తాగివచ్చి నన్ను గెంటేశావ్."
    "నేనా?" ఆశ్చర్యంగా అడిగాడు దీపక్.
    "అవును."
    "గెంటేశానా?"
    "యస్! ఫిజికల్ గా!"
    "నేన్నమ్మను_"
    "నేను నమ్ముతాను_"
    "నా బెస్ట్ ఫ్రెండ్ భవానీగాడిని బయటకు గెంటడమా? కలలో కూడా జరగదది."
    "కలలో జరగకపోవచ్చుగానీ_నిజంగా మాత్రం జరిగింది."
    "ఇంపాజిబుల్! మన బాచ్ వాళ్ళందరూ ఇలాగే అబద్ధాలు చెపుతున్నారు. నేనెందుకు గెంటుతాను మనాళ్ళను? అయ్ లవ్ దెమ్."
    "కాదనటం లేదు"
    "ఆల్ రైట్. పాస్ట్ ఈజ్ పాస్ట్! వానెక్కు! ఇంటికెళదాం."
    భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు "మళ్ళీనా?"
    "యస్! యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్! నా దగ్గరే ఉండాల్సిందే! పద."
    "నేను వేరే రూమ్ తీసుకున్నానులే గురూ."
    "లెట్ ది రూమ్ గో టూ హెల్! త్వరగా వాన్ ఎక్కు."
    భవానీశంకర్ ని బలవంతంగా వాన్ లోకి లాగేయబోయాడతను.
    "ఆల్ రైట్. ఇప్పుడు కుదరదు. సాయంత్రం ఆఫీసయ్యాక వస్తాను."
    "నిజంగా వస్తావా_ ఇలా చెప్పి తప్పించుకుందామనా?"
    "నిజమేరా? తప్పకుండా వస్తాను. నీకెప్పుడయినా అబద్ధాలు చెప్పానా?"
    "ఒకసారి చెప్పావ్!"
    "ఎప్పుడు?"
    "కాలేజ్ లో ఉండగా శ్రీదేవిని నేను ప్రేమిస్తే_ ఆ అమ్మాయికి పెళ్ళయిపోయిందని అన్నావ్."
    "కాలేదా?"
    "ఇంతవరకూ కాలేదట!"
    "మరారోజు ఆమె ఓ పాపాయి నెత్తుకుని సినిమాకొచ్చింది కదా! ఆ పాపెవరు?"
    "ఆమె పాపే కానీ ఆమెకు అప్పటికి పెళ్ళవలేదింకా!"
    "అయ్ సీ! అయితే అయామ్ సారీ!"
    "దట్సాల్ రైట్! సాయంత్రం తప్పకుండా మా ఆఫీస్ కొస్తున్నావ్! అవునా?"
    "అవును."
    "ఎన్ని గంటలకు?"
    "అయిదింటికి."
    "ఓ.కే."
    "అన్నట్లు నీకో విషయం చెప్పాలి."
    "ఏమిటది?"
    "నీ దగ్గర నేనారోజు వెయ్యిరూపాయలు తీసుకున్నాను. నీకు చెప్పకుండా_"
    "ఛట్! నేనెవ్వరికీ ఇవ్వలేదు."
    "నువ్ నిద్రపోతూంటే నేనే తీసుకున్నాను."
    "ట్రాష్! నేన్నమ్మను."
    "నిజం బ్రదర్! బిలీవ్ మీ."
    "నో. అయ్ డోన్ట్! ఇది కూడా నీకారోజు వచ్చిన కలే అయుంటుంది."
    భవానీశంకర్ కేం మాట్లాడాలో తోచలేదు.
    "ఓ.కే. సాయంత్రం మా ఆఫీస్ కొస్తున్నావ్! అంతేగదా."
    "అంతే."
    అతను వెళ్ళిపోయాడు వాన్ లో. భవానీశంకర్ ఆఫీస్ కి చేరుకున్నాడు. సాయంత్రం అయిదవకుండానే దీపక్ హడావుడిగా వచ్చేశాడు.
    "సారీ బ్రదర్! మధ్యాహ్నమంతా ఆలోచిస్తూంటే గుర్తుకొచ్చింది. ఆ రోజు రాత్రి నేనెవర్నో గెంటేసిన మాట నిజమేగానీ నిన్నేనని తెలీలేదు. నిజంగా నిన్నే గెంటానా?"
    "అవును"
    "ఎందుగెంటాను?"
    "తెలీదు."
    "దట్ వజ్ టూ మచ్__పోనీ మనం కాలేజీలో చదివిన విషయం గుర్తుచేయకపోయావా?"
    "చేశాను_ అసలు నువ్వు కాలేజ్ లోనే చదవలేదన్నావ్."
    "వెరీ బాడ్." పశ్చాత్తాపపడుతూ అన్నాడతను. "పోనీ మనిద్దరం ప్రాణస్నేహితులమనీ_ లాస్ట్ బెంచీలో కూర్చునేవాళ్ళమనీ చెప్పావా?"
    "చెప్పాను. అసలు నన్ను నీ జన్మలో చూడలేదన్నావ్."
    "ఎంత నికృష్టం?"
    "చాలా నికృష్టం!"
    "ఆల్కహాల్ మూలాన ఇన్ని నష్టాలున్నాయన్నమాట."
    "ఇంకా చాలా ఘోరమయిన నష్టాలున్నాయ్."
    "మరా విషయం ఈ టి.వి. వాళ్ళూ, రేడియోవాళ్ళూ చెప్పిచావరేం? ఎప్పుడూ తాగినవాడు గుండెజబ్బుతోనో, లేక మరో జబ్బుతోనో చచ్చిపోతాడనీ, లేదా పెళ్ళాన్ని చావగొట్టినట్టూ_ ఇవే నష్టాలుగా చూపిస్తారెందుకని? మనిద్దరిమధ్యా వున్న అద్భుతమయిన స్నేహం కూడా ఈ తాగుడు వల్ల మర్చిపోయి, స్నేహితుడిని ఇలా ఇంట్లోనుంచి అర్ధరాత్రి గెంటివేసే ప్రమాదం కూడా ఈ తాగుడువల్ల జరుగుతుందని ఎందుకు చూపించరు?"

 Previous Page Next Page