"ఐసీ!"
"అవున్సార్?"
"నిన్ను కూడా నీ బిల్లు కట్టుకోమని నీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడా?"
"సగం బిల్లయితే కట్టుకునేవాడినే సార్! మొత్తం బిల్లు టేబుల్ మీదుంచి కిళ్ళీ తెచ్చుకుంటానని వెళ్ళిపోయాడు సార్! మళ్ళీ ఇంతవరకూ కనిపించలేదు."
"చాలా క్లిష్టమయిన పరిస్థితి కదూ?"
"ఇంతకన్నా అసహ్యకరమయిన పరిస్థితి యింకోటి వుండదు సార్!"
"ఇంతకూ ఈ హోటల్ మేనేజ్ మెంటు యిప్పుడేం చేస్తుందంటావ్?"
"బిల్లు మొత్తాన్నిబట్టి పదిహేనురోజులో, నెలరోజులో రకరకాల పనులు చేయిస్తారండీ."
"ఉదాహరణకు?"
"మసాలా నూరే ఉద్యోగం మహా కష్టమయినదండీ. అదిగానీ, కూరగాయలు కోసే ఉద్యోగంగానీ."
భవానీశంకర్ కౌంటరు దగ్గర కూర్చున్న మీసాల వ్యక్తివేపు చూశాడు. అతని వళ్ళు జలదరించింది.
"మీరు నన్ను గుర్తుపట్టారా సార్!" అడిగాడు బేరర్ చిరునవ్వుతో.
"నిన్నా?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
"అవును గురూ! ఈ డ్రస్ లో గుర్తుపట్టలేదు కదూ?"
"ఎక్కడో చూచినట్లు అనిపిస్తోంది..."
"నీ బిల్ నేను కట్టేస్తాను గురూ! డోంట్ వర్రీ!"
"నువ్వు కట్టేస్తావా?"
"యస్ బాస్! జస్ట్ ఈ విధంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను."
"నీ పేరేమిటి?"
"పేరెందుకులే గురూ! బిల్ కట్టేస్తాను."
"థాంక్యూ వెరీమచ్ మైడియర్ ఫ్రెండ్! రేపొద్దున్నే నీ డబ్బు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను."
"అక్కర్లేదు గురూ! నేనే నీకు చాలా డబ్బు బాకీ వున్నాను"
"బాకీ ఉన్నావా?"
"అవును గురూ! వెయ్యి రూపాయలు"
భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు. "నువ్వు భరద్వాజ్ వి కదూ?"
"అవును గురూ!"
భవానీశంకర్ ఆనందంగా కరచాలనం చేశాడతనితో.
"సమయానికి నువ్వు లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది ఫ్రెండ్"
"నీ డబ్బు అలా కాజేసికెళ్ళిపోయినందుకు కోపం లేదా గురూ?"
"నో నో నెవర్! డబ్బు కోసం కాదు బ్రదర్! బట్టలు తీసుకుపోయినందుకు కోపం వచ్చింది"
"మీ మావయ్య లక్షాధికారి అని నాకు తెలుసు గురూ! టెలిగ్రాం కొడితే బోలెడు డబ్బు పంపుతాడు గదాని బట్టలు కూడా తీసుకెళ్ళిపోయాను"
"మళ్ళా మొఖంకూడా చూపించవద్దని పంపించేశాడు మా మావయ్య. ఇంక యం ఓ. ఎందుకు పంపుతాడు?"
"అలాగా! అయామ్ సారీగురూ! ఆ సంగతి తెలిస్తే ఓ జత బట్టలు వదిలేసేవాడిని"
"పోనీ! జరిగిందేదో జరిగిపోయింది."
"అయితే, నామీద ఏమీ కోపంలేదు అంతేనా?"
"అంతే."
"ఓ.కే. గురూ! నువ్వెళ్ళిపో బిల్లు నా జీతంలో ఎడ్జస్ట్ చేసేసుకుంటాను"
"థాంక్యూ భరద్వాజ్! చాలా గడ్డు సమయంలో సహాయం చేస్తున్నావ్!"
"అన్నట్లు ఆ పిల్ల ఏమయింది గురూ! కనిపించిందా? జేబులో కాగితం పెట్టుకుని తిరిగావ్ కదా? వెన్నెల_వెన్నెల"
"ఇంకా దొరకలేదు బ్రదర్_వేటలోనే ఉన్నాను"
"ఆ పిల్లను పట్టుకోవాలంటే ఒకే ఒక బెస్ట్ అయిడియా ఉందిగురూ"
"ఏమిటది?" ఆత్రుతగా అడిగాడు భవానీశంకర్.
"ఆ పిల్ల ఫోటో పేపర్లో వేయించేసి అర్జంటుగా భవానీశంకర్ అనే వ్యక్తికి ఫోన్ చేయమంటే సరిపోతుంది"
భవానీశంకర్ ఉప్పొంగిపోయాడు.
"కానీ మనదగ్గర ఫోటోలేదుగా?"
"నీదగ్గరున్న కాగితం మీద ఫోటోచాలు! బ్రహ్మాండంగా ప్రింటవుతుంది"
"థాంక్యూ భరద్వాజ్. రెండు సహాయాలు చేశావు ఇప్పటికిప్పుడే_"
"డోంట్ మెన్షన్ గురూ!"
భవానీశంకర్ గదికి బయలుదేరాడు.
భరద్వాజ్ చెప్పిన ఉపాయం బాగానే ఉంది. కానీ న్యూస్ పేపరులో ఫోటో వేస్తే ఆ అమ్మాయి చూస్తుందా అనేది తెలియటంలేదు.
హఠాత్తుగా అతనికి మరో ఆలోచన వచ్చింది.
కన్యక ఫోటో తమ వీక్లీలో కవర్ పేజీగా వేసేస్తే? అన్ని సెంటర్స్ లో అన్ని దుకాణాల్లో తన ఫోటో కనిపించేసరికి కన్యక తమ ఆఫీస్ కే రావచ్చు. లేదా ఆమె తల్లిదండ్రులుగాని, ఇంకెవరయినాగానీ అభ్యంతరం తెలియజేయడానికయినా ఆఫీస్ కొస్తారు.
బోలెడు ఉత్సాహం వచ్చేసిందతనికి. విజిల్ వేసుకుంటూ ముందుకి నడవసాగాడు వడివడిగా.
* * * *
మర్నాడు రంగారావ్ హడావుడిగా భవానీశంకర్ దగ్గరకొచ్చాడు.
"ఏమిటిది? ఈ అమ్మాయి ఎవరిదో ఫోటో మనవచ్చే సంచికలో కవరుపేజీగా వేయాలన్నారట" అన్నాడు ఆశ్చర్యంగా.
"యస్ మైడియర్ రంగారావ్! ఎప్పుడూ సినిమా తారల ముఖాలు చూచి చూచి పాఠకులు విసుగెత్తిపోతున్నారు డియర్. అంచేత వెరైటీ కోసం అందమయిన అమ్మాయిల ముఖచిత్రాలు వేస్తున్నాను"
"కానీ ఇది పత్రిక పాలసీకి..."
"డోంట్ వర్రీ ఎబౌట్ పాలసీ ఫ్రెండ్! ఏ పత్రికకయినా 'వెరైటీ' పాలసీగా ఉండాలి బ్రదర్! అదిలేకే మన వీక్లీ సర్క్యులేషన్ పెరగటంలేదు"
రంగారావ్ కేం మాట్లాడాలో తెలీలేదు.
"అయినా బ్లాక్ అండ్ వైట్ లో కవర్ పేజీ వేయటం"
"అదే వెరైటీ బ్రదర్. పాఠకులంతా మన సంచిక చూడగానే 'స్టన్' అయిపోవాలి! తరువాత కోలుకుని అమ్మాయి మొఖంవంక చూస్తారు. "అబ్బ! ఏం అందం" అనుకుంటారు. ఆ క్షణం నుంచీ ఉత్తరాలూ, టెలిగ్రాములూ గుప్పించేస్తారు ముఖచిత్రం అద్భుతం అంటూ_"
"ఈ ఫోటో వేయడానికి ఈ అమ్మాయి అంగీకారం తీసుకున్నారా మరి?"
"అదంతా నాకొదిలెయ్ ఫ్రెండ్! మీరు ప్రూఫ్ రీడింగ్ సరిగ్గా చూసుకోండి! కిందటి సంచికలో 26వ పేజీలో 'హ'కు బదులు 'భో' అని పడింది. గమనించారా? బోలెడుమంది పాఠకులు ఆ విషయం ఉత్తరాలు గుప్పించేశారు."
రంగారావ్ నెమ్మదిగా అక్కడనుంచి జారుకున్నాడు. మరో రెండు రోజుల్లో కన్యక ముఖచిత్రంతో వారపత్రిక రిలీజయిపోయింది.
* * * *
"ఏమయింది? కాయా, పండా?" అడిగింది రాధ ఆత్రుతగా.
"వాడు వట్టిరోగ్" అంది కన్యక నీరసంగా కుర్చీలో కూలబడుతూ.
"ఏమన్నాడు?"
"ఉద్యోగం ఇవ్వనేలేదు. అప్పుడే వెకిలిచేష్టలు మొదలుపెట్టాడు. సాయంత్రం సినిమాకెళదామా అన్నాడు ఇడియట్..."
"మరి నువ్వేం చేశావ్?" నవ్వుతూ అడిగింది రాధ.