Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 14


    ఆ మాటలు విని జానకి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. ఆ వచ్చినావిడని ఎవరూ కూచోమనికూడా అనలేదు. ఆవిడే ఒక చాప పరుచుకొని కూచుంది. సూర్యం చిన్న సంచీ చేత్తో పట్టుకుని "తులసీ! నేను వెళ్తున్నాను" అని తులసితో మాత్రం చెప్పాడు.
    తులసి మాట్లాడలేదు. వంచిన తల కూడా ఎత్తలేదు.
    "తులసీ! విడిపోబోయే ముందు నాకొక కానుక ఇయ్యగలవా?"
    "నేనా! నీకు నేనేం ఇయ్యగలనూ?"
    తులసి కనుకొలుకులలో నీటిబిందువులు నిలిచాయి. అవి దాచుకోటానికి తులసి ఏమాత్రం ప్రయత్నించలేదు. సూర్యం సాహసించి తన వేలితో ఆ నీటి బిందువులను చిమ్మాడు.
    "ఆ రోజు కోపంగా నా దగ్గర నుంచి లాక్కున్నావే, ఆ స్వెటర్ ఇయ్యి."
    తులసి నవ్వి ఆ స్వెటర్ సూర్యాని కిచ్చి "ఎందుకూ పనికిరాని ఈ స్వెటర్ తీసుకున్నందుకు చాలా థాంక్స్" అంది.
    "ఇది ఎందుకూ పనికిరాదని నీకెవరు చెప్పారు? వాతావరణం బాధాకరంగా ఉన్నప్పుడు హృదయానికి హత్తుకుంటే సుఖంగా ఉంటుంది. నేను కూడా నీకు థాంక్స్ చెప్పాలి. నాకోసం కన్నీళ్ళు పెట్టుకున్నందుకు...."
    తులసి సిగ్గుపడి ఓణీతో కళ్ళు తుడుచుకుంది.
    "ఇంక మనం కలుసుకోగలమా?"
    "గుర్తు తెచ్చుకుని నీ పెళ్ళికి పిలిస్తే వస్తాను."
    ఈ చివరి మాటలు విన్న జానకి కోపంగా "ఏయ్ తులసి! ఏవిటా అనవసరపు ప్రసంగం?" అని కసిరింది.
    కృష్ణారావు వచ్చి సూర్యాన్ని చూసి ఆశ్చర్యంగా "ఎక్కడికి ప్రయాణం?" అన్నాడు.
    "ప్రస్తుతం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను."
    క్లుప్తంగా విషయం వివరించాడు సూర్యం. కృష్ణారావు కన్నీళ్ళతో సూర్యాన్ని గట్టిగా కౌగలించుకుని, "సూర్యం! ఐ విల్ మిస్ యు.... ఇంక చచ్చినట్లు లెక్కలు పంతులుగారి దగ్గరే నేర్చుకోవాలి! ఈ జన్మలో నాకు లెక్కలొచ్చే గీత లేదు. దట్సాల్ రైట్! విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ మై బోయ్! నా అడ్రస్ తీసుకో! వెళ్ళగానే నీ అడ్రస్ తో ఉత్తరం రాయి. నన్ను మరిచిపోయావంటే తంతా!" అన్నాడు.
    కృష్ణారావు తనపట్ల చూపిస్తున్న స్నేహానికి సూర్యం మనసు కృతజ్ఞతతో కరిగిపోయింది. తనుకూడా కృష్ణారావును కౌగలించుకుని, "నిన్ను ఎప్పటికీ మరిచిపోలేను కృష్ణా! నా జీవితంలోని అత్యంత మధురమైన స్మృతుల్లో ఒకటి నువ్వు" అన్నాడు.
    కృష్ణారావు తన జేబులోంచి రెండు వందలు తీసి సూర్యం జేబులో పెట్టాడు.
    "ఛ! ఛ! ఎందుకివి? నాకు నీ స్నేహం చాలు కృష్ణా. డబ్బుకోసం....."
    "ఏడిశావ్ లే! నువ్వు డబ్బుకోసం నా స్నేహం కోరటంలేదని నాకు తెలుసు. తులసి వైద్యం కోసం ఉన్న డబ్బంతా వేస్ట్ చేశావని కూడా నాకు తెలుసు. అంచేత నోరు మూసుకుని ఈ రెండు వందలూ ప్రస్తుతం నీ జేబులో ఉంచుకో! నాకు అవసరమయినపుడు ఇంతకు పదిరెట్లు నీ జేబులోంచి లాక్కుంటానులే!"
    "నా దగ్గర ఉండాలేకాని, నీకు ఇయ్యనంటానా కృష్ణా!"
    "ఆ సంగతి నాకు తెలుసు గనుకనే నీకిస్తున్నాను. బ్రదర్! ఈ కృష్ణారావుకు డబ్బు జాగ్రత్త లేదనుకుంతున్నావా? ఒక్క నయాపైసా కూడా వృధాగా ఖర్చుపెట్టడు."
    మిత్రులిద్దరూ నవ్వుకున్నారు.
    "నాయనా! బయల్దేరదామా?" అంది నడివయసు యువతి అసహనంగా.
    "పదండి!" అని ఆవిడతో బయలుదేరిపోతూ ఒక్కసారి వెనక్కు తిరిగి చూశాడు సూర్యం. తల్లి అదలింపులను కూడా లక్ష్యపెట్టకుండా గుమ్మందగ్గర నిలబడి ఉంది తులసి. సూర్యం వీడ్కోలుగా చెయ్యి ఊపి ముందుకు సాగిపోయాడు.
    ధనలక్ష్మికి పెళ్ళయిపోయిందని విన్న దగ్గరనుంచీ, తన కూతురి పెళ్ళి గురించి బెంగ మరింత ఎక్కువయింది జానకికి. మొగుణ్ణి రాత్రింబవళ్ళు సతాయించటం మొదలుపెట్టింది. ఆ పోరు పడలేక, జగన్నాథం పంతులు రెండు నెలలు చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి, రెండో పెళ్ళివీ, మూడో పెళ్ళివీ రెండు మూడు సంబంధాలు తీసుకొచ్చాడు. జానకి విరుచుకుపడి గొడవ చెయ్యటంతో మొండికెత్తి అసలు సంబంధాలే తేవటం మానేశాడు. జానకి భరించలేక బంధువర్గంలో వాళ్ళ కాళ్ళూ, వీళ్ళ కాళ్ళూ పట్టుకొని ఎలాగో నీలకంఠం సంబంధం కుదిర్చింది. నీలంకంఠం బి.ఏ. పాసయి యు.డి.సి. గా పనిచేస్తున్నాడు. నీలకంఠానికి కంఠం మాత్రమే కాక, శరీరమంతా నీలమే. ముఖంలో చెప్పుకోదగిన కళాకాంతులూ లేవు. ఒక కంట్లో కాస్త మెల్లకూడా ఉంది. అయినా సుమతి పెళ్ళికొడుకు నచ్చాడని కాని, నచ్చలేదని కాని ఒక్కమాటైనా అనలేదు. పెళ్ళయిందే చాలన్నట్లుగా ఉంది ఆ అమ్మాయి మనసు. ఆ పెళ్ళికి జగన్నాథం పంతులు అయిదువేల రూపాయలు అప్పు చెయ్యవలసి వచ్చింది. దొరికిన చోటల్లా అప్పులు చేసేసాడు. ఫలితంగా తులసి యస్.యస్.సి. పాస్ కాగానే చదువు మానేసి ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. అయినా తులసి నిరుత్సాహపడలేదు. ఒక ప్రైవేట్ స్కూల్లో కె.జి. సెక్షన్ కి టీచర్ గా చేరి ప్రైవేట్ గా ఇంటర్, బి.ఏ. పాసయింది. తరువాత టైపు, షార్టు హాండు కూడా పాసయి ఉద్యోగాల వేట ప్రారంభించింది.

 Previous Page Next Page