లాంఛనంగా భర్తను అడిగింది, అలవాటుగా "సరే" అన్నాడాయన. సుందరమ్మ మాటలు విని ఏదో అదృష్టదేవత తన మెడలో వరమాల వేసినట్లే పొంగిపోయి ఆవిడతో బయలుదేరింది యశోధర...
అయితే సుందరమ్మగారి గారాలకూతురు నీరజ మాత్రం ఈ వ్యవహారం ఇంత సవ్యంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోనివ్వలేదు...
"అంతా బాగానే ఉందమ్మా ! కొన్నాళ్ళు నీకు ఆసరాగా ఉంటుంది. నిజమే ! ఆ తరువాత ? అప్పుడేం చెయ్యదలచుకున్నావ్?" అంటూ తల్లిని నిలేసింది...
'ఆతరువాత' సంగతి ఏమాత్రం ఆలోచించని సుందరమ్మ తడబిడపడి "ఏముంది ? మామూలే ?" అంది.
"మామూలంటే పెళ్ళి చేస్తావా ? అదేదో ఇప్పుడే చెయ్యి, ఈవిడకి పెళ్ళి వయసు వచ్చేసింది. పదివేలో ఇరవై వేలో కట్నం పారేస్తే..."
గుండె పగిలింది సుందరమ్మకి. "నోరుమూసుకో !" అంది కసిరినట్లు ...
"పెళ్ళి చెయ్యవా ? అయితే చదువు చెప్పించు. తన కాళ్ళమీద తను బ్రతుకుతుంది..."
"బాగుంది ! నీకెందుకూ నోరు మూసుకో !"
"నా కెందుకేమిటి? నా సాటి ఆడదాని బ్రతుకు బుగ్గవుతోంటే చూస్తూ కూర్చోమంటావా ?"
"లోకంలో అందర్నీ మనం బాగు చెయ్యగలమా ?"
"లోకం సంగతి నాకు తెలియదు. నా కళ్ళముందు జరిగే ఘోరం మాత్రం నేను సహించలేను !"
అంతే నీరజ ! ఎప్పుడూ ఏ విషయమూ ఆలోచించదు. తన చదువూ తన అలంకరణ తన ఆటపాటలూ - అదే లోకం....ప్రత్యక్షంగా తన అనుభవంలోకి వచ్చినప్పుడు కాని సంచలించదు ! అలాంటి సంచలనం వచ్చినపుడు మాత్రం ఉప్పెనలాగే వస్తుంది__
యశోధర మెట్రిక్ పాసయింది ... పదిహేడేళ్ళు నిండని నీరజ బి.ఏ. చదువుతోంటే పాతిక పైబడిన తను ఇంటర్ చదవటానికి చాలా సిగ్గుపడింది యశోధర.
"మా అమ్మ బోలెడు కట్నంపోసి నీకు పెళ్ళి చెయ్యదు ! కట్నాలను గుమ్మరించకపోతే మనలను వరించటానికి ఎవరూ ముందుకురారు ! చదువుకోక ఏమయిపోతావ్ ?"
అభిమానంతో అదిలించింది యశోధరను నీరజ ...
"మనసు వరించడానికి..." అందు తనను కూడా కలిపి మాట్లాడిన నీరజ సౌజన్యానికి బానిసయిపోయింది యశోధర కృతజ్ఞతా హృదయం...
నీరజ బంగారు బొమ్మ...సంపన్నుల ముద్దుబిడ్డ __నీరజ తమను వరించడం అదృష్టంగా భావిస్తారే తప్ప నీరజను వరించని వాళ్ళుంటారా ?
కాలేజీలో చేరి చదువుతోన్నా సాధ్యమయినంత ఎక్కువగా సుందరమ్మగారికి ఇంటి పనులలో సహాయంగానే ఉండేది యశోధర... నీరజ వద్దన్నా మానేది కాదు. అంచేత సుందరమ్మగారికి యశోధర మీద సానుభూతి అలాగే నిలిచింది__
విశ్వాన్ని ఆ ఇంటి అల్లుడుగా నీరజ తలిదండ్రులేనాడూ ఊహించలేదు. అతనే ఒప్పుకున్నా అంగీకరించటానికి సిద్ధంగానూ లేరు. విశ్వం అందగాడు, అసిస్టెంట్ ఇంజనీర్ గా స్థిరమయిన ఉద్యోగంలో ఉన్నవాడు. మంచి కుటుంబంలో నుండి వచ్చినవాడు. ఏదో దూరపు బంధువు, అన్నీ బాగానే ఉన్నాయి. కాని వీటన్నిటినీ మింగేసేలా విశ్వం విలాస జీవితాల గురించి రకరకాల కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆ కారణం చేత విశ్వం తమ ఇంటికి వస్తున్నట్లు ఉత్తరం వ్రాయగానే సుందరమ్మగారు ఆనందించలేదు సరికదా బెంగ పడింది.... విశ్వం గుణ గుణాలు విన్నదానికి పదింతలుగా వర్ణించి చెప్పి "జాగ్రత్త" అని కూతుర్ని ఒకటికి పదిసార్లు హెచ్చరించింది.
ఈ కథలూ హెచ్చరికలూ నీరజ మనసులో జాగ్రత్తకు బదులుగా ఒక విచిత్రమయిన కుతూహలాన్ని ప్రవేశపెట్టాయి, సాధారణంగా ఏ విషయమూ పట్టించుకోని నీరజ అతని రాక కోసం ఒక విధమైన ఉత్సుకతతో ఎదురు చూడ ప్రారంభించింది.
విశ్వాన్ని చూడగానే కళ్ళు చెదరినట్లయింది నీరజకు !
ఏమి అందం ! ఎక్కడుంది అంత అందం ?
అంతకంటె ఒడ్డు పొడుగు యున్న వాళ్ళను__మంచి ఛాయతో మెరిసే వాళ్ళను__అంతకంటె కను ముక్కు తీరు గల వాళ్ళను...ఎంతో మందిని చూసింది. వాళ్ళందరిలో లేనిది...ఇతనిలో ప్రబలమయి ప్రకాశిస్తున్నది... ఆ సౌందర్య రేఖ ఏమిటో?
తాను విన్న కథలనుబట్టి విశ్వం తన చుట్టూ తిరుగుతాడనీ__పనికట్టుకుని పదిసార్లు పలకరిస్తాడనీ ఊహించింది నీరజ... తనకు తెలియకుండానే ప్రత్యేకించి అతి శ్రద్ధగా అలంకరించుకొంది...కానీ విశ్వం మర్యాదగా కుశల ప్రశ్నలు వేసి ఊరుకున్నాడు ... ఆ తరువాత అసలు పలకరించలేదు ...
క్షణక్షణమూ ఊపిరి బిగబట్టి అతని రాకకోసం... అతని పలకరింపుకోసం ఎదురు చూసిన నీరజకు ఒక విధమైన నిరుత్సాహం కలగసాగింది. దానికితోడు యశోధర నవ్వుతూ విశ్వంతో మాట్లాడటం గమనించేసరికి ఏదో తిక్క రేగింది__
యశోధరమీద మొదటిసారిగా చిరాకు పడుతూ మాట్లాడింది.
"ఎందుకతనితో అలా నవ్వుతూ మాట్లాడ్ తావ్ ?"
"నవ్వుతూ మాట్లాడానా ? హాయిగా నవ్వగలిగానా."
పేలవమైన యశోధర కళ్ళలో తళుక్కుమన్న కాంతి చూసి తెల్లబోయింది నీరజ...
"యశో ! అతను ... ఆ విశ్వం మంచివాడు కాడు తెలుసా ?"
"ఏమో ! నాకేం తెలీదు. తెలుసుకోవాలనీ లేదు. అయినా అతడెలాంటి వాడయితే నాకేం? నన్నెవరూ పాడు చెయ్యరు. పాడు చెయ్యాలనిపించేటంత ఆకర్షణ కూడా లేనిదాన్ని..."
ఆ పైన యశోధరతో ఏంమాట్లాడాలో అర్ధంకాలేదు నీరజకు. తన మనసులో చెలరేగే ఆ అసహనం ఏమిటో కూడా అర్ధం కాలేదు.
ఆరోజే తనంత తానే విశ్వం దగ్గిరకు వెళ్ళింది...
తలెత్తి తనను చూసిన విశ్వం కళ్ళలో తన అందంపట్ల ప్రశంస స్పష్టంగా ప్రతిఫలించి మనసు చల్లబడింది...
"విదేశాలలో అయితే అతి మామూలుగా "మీరు చాలా అందంగా ఉన్నారు__" అనెయ్యచ్చు....ఇంకా మనదేశంలో అలా అనటం అమర్యాదగానే భావిస్తున్నారు. అందుకే మిమ్మల్ని చూస్తూ అనాలనుకున్న మాటలు అనలేకపోతున్నాను..."
మెప్పుదలతో అన్నాడు విశ్వం.
ఆ మాటతీరుకు మరింత ముగ్ధురాలయింది నీరజ.
"అందుకనేనా, వచ్చి మూడు రోజులయినా నాతో మాట్లాడకుండా దాక్కుంటున్నారు.
"అవును ! దాక్కుంటున్నాను !... మీ అందానికి భయపడి...నేను మంచివాణ్ని కాదు...నేను మీకు సన్నిహితంగా రావటం మీకే మంచిది కాదు !"