మతిపోయినట్లనిపించింది నీరజకు. ఇంత స్పష్టంగా తన బలహీనతలు ఒప్పుకొనేవాళ్ళుంటారా? అతని ముఖంలోకి చూస్తూ పకాలున నవ్వేసింది....
ఆ నవ్వులో...సంకోచాలూ__సందేహాలూ అన్నీ ఎగిరిపోయినట్లనిపించింది.
ఆ తరువాత నీరజ, విశ్వానికి చాలా సన్నిహితురాలయిపోయింది. తల్లిదండ్రులు ఆటంకపరచటానికి ప్రయత్నించినాలాభం లేకపోయింది ...
విశ్వం సౌందర్యం మాత్రమేకాదు. అతని మాటలు, అల్లరి...చమత్కార ధోరణి...అన్నీ నీరజను ఎక్కడెక్కడికో తీసుకుపోతున్నాయి...
ఈ మధుర గానంలో అపశ్రుతిలా ఉంది యశోధర విశ్వంతో మాట్లాడాలని తాపత్రయపడటం... విశ్వం కూడా యశోధర పలకరించగానే అటువైపు తిరిగి నవ్వుతూ ఆర్ద్రంగా సమాధానం చెప్పటం నీరజకు చిరచిరగా ఉండేది !
ఆరోజు యశోధర విశ్వం బూట్స్ పాలిష్ చెయ్యటం... పైగా తన మనసు అలా బేలగా బయటపెట్టటం నీరజ మనసును దోలిచేస్తోంది__యశోధర మనసు స్పష్టంగా తెలిసిపోయాక విశ్వం యశోధరతో నవ్వుతూ మాట్లాడటం సహించలేకపోతోంది...
యశోధర తనతో ఏ విధంగానూ పోటీకి రాలేదు !
తన ముందు ఏ విషయంలోనూ యశోధర నిలవలేదు... తనను కాదని యశోధరను స్వీకరించే బుద్ధిహీనులెవరూ ఉండరు...
కానీ... కానీ... తనను కలవర పరుస్తున్నది. యశోధర పలకరించగానే విశ్వం కళ్ళలో కదిలే ఒక ఆర్ధ్రరేఖ... అది ప్రేమ కాదు... కామంకాదు... ఆరాధన కూడా కాదు... కేవలం కొద్దిపాటి సౌహార్ద్రత ! __ అంతే ! అంతేనని తెలిసినా, అది కూడా సహించలేకపోతోంది నీరజ మనసు...
"యశో! విశ్వంతో మాట్లాడాలని ఎందుకలా తాపత్రయ పడతావ్ ? అతను నిన్ను పెళ్ళి చేసుకుంటాడనే అనుకుంటున్నావా?"
యశోధరనే అడిగింది...
"విశ్వంగారా ? నన్నా ?__పెళ్లా__" తనను చూసుకొని తనే హేళనగా నవ్వుకొంది యశోధర. అలా నవ్వకుండా ఉంటే బాగుండును అనుకొంది నీరజ ... ఆ నవ్వుముందు నిలవలేకపోతోంది.
"మరి..." అంటూ ఆగిపోయింది.
"ఆయన కంఠం వింటోంటే నాకు కలిగే ఆనందం__ అది వదులుకోలేను..."
"కానీ ... కానీ ... ఆయనను గురించి రకరకాల కథలు...."
'ఛీ! ఛీ! అనిపించింది నీరజకు. తన మాటలు పూర్తి చెయ్యలేకపోయింది.
"ఆ కథలు నిజమయితే ఎంత బాగుండును ! క్షణిక వ్యామోహంలో నయినా, ఆయన నన్ను అనుగ్రహిస్తే ఎంత అదృష్టవంతురాలిని ! నన్ను పెళ్ళి చేసుకోనక్కర్లేదు, ప్రేమించక్కర్లేదు! ఒక్కసారి దయగా చూస్తే బ్రతుకంతా ఆయనకు బానిసలా ఉండగలను..."
వెఱ్ఱి ఆరాధనలో తల మునకలయిపోతూ అంది యశోధర...యశోధర మాటలు గుర్తుకొచ్చినకొద్దీ జాలితో మనసు తరుక్కుపోతోంది...కానీ దానిని మించిన అసూయ మనసును రగిల్చేస్తోంది!...
"విశ్వం! నువ్వు యశోధరతో అలా మాట్లాడటం నేను సహించలేను!" స్పష్టంగా చెప్పేసింది__తెల్లబోయాడు విశ్వం....
"యశోధరతో...నీకు మతిపోయిందా ? యశోధర అంటే నాకు..."
విసుగ్గా అడ్డుకొంది నీరజ...
"అదంతా నాకు తెలుసు ! కానీ నువ్వు తనతో మాట్లాడటానికి వీల్లేదు ! అలా మాట్లాడితే ఇంక నేను నీతో మాట్లాడను!"
"హమ్మ బాబోయ్ ! అంత శిక్షవద్దు నీ దాసాను దాసుణ్ని, నీ ఆజ్ఞ ఏ పరిస్థితుల్లోనూ అతిక్రమించను."
నీరజ నవ్వేసింది.
ఆ తరువాత యశోధర విశ్వాన్ని పలకరించబోయినపుడు నీరజ ప్రక్కనే ఉంది.
కనురెప్ప లెత్తకుండా తలవంచుకుని కూర్చున్నా నీరజ అణువణువూ తననే పరిశీలిస్తోందని విశ్వానికి తెలుసు.
మామూలు ఆర్ధ్రస్వరంతో యశోధరకు సమాధానం చెప్పలేకపోయాడు__పొడిగా ఏదో అని ఊరుకున్నాడు. యశోధర చిన్నబుచ్చుకుని మళ్ళీ ఏదో అనబోయింది. విసుగ్గా ముఖం తిప్పుకున్నాడు విశ్వం...
బిత్తరపోయి చూసింది యశోధర... తల్లి దగ్గిరకు గారాబంగా వెళ్ళినప్పుడు తప్పులేకపోయినా తల్లి కొడితే పసిపిల్లవాడు చూసే లాంటి చూపు...
నీరజ మనసు గిలగిలలాడి పోయింది. చరాలున అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది...
వెనకాలే వెళ్ళాడు విశ్వం...
"నీరజా నా మీద కోపం వచ్చిందా ? నేనేం చెయ్యను చెప్పు! మాట్లాడలేదుగా! నేను మాట్లాడకపోయినా తనే పలకరిస్తోంది! నువ్వు అలిగితే భరించలేను! నేను బలహీనుణ్నని నేనే ఒప్పుకున్నాను! నిజం చెపుతున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను కాదని ఎప్పుడూ ఏదీ చెయ్యలేను__"
ఎందుకో ఏమిటో తెలియకుండా వెక్కి వెక్కి ఏడ్చింది నీరజ...మరింత అయోమయంలో పడిపోయాడు విశ్వం...
"ఏడవకు నీరజా! ఇంకమీదట యశోధర ముఖం చూస్తే వట్టు!"
దిగ్గున తలెత్తింది నీరజ...
"నేను యశోధర ముఖం చూడద్దని అన్నానా? నీ యిష్టం! నాకేం!" రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.
మరొకసారి కాఫీ తీసుకొచ్చింది యశోధర. విశ్వానికి ఎంతకీ అందుకోకపోతే అక్కడ బల్లమీద పెట్టింది. ఆ కాఫీ వైపు చూడకుండా అక్కడి నుండి లేచి యశోధర చూస్తుండగానే వంటవాడితో మరోకప్పులో కాఫీ తెప్పించుకుని త్రాగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వం...
నీరజ కాళ్ళముందు కుప్పలా కూలిపోయింది యశోధర...
"నేనేం తప్పుచేసాను? ఏం కావాలని కోరాను ? ఒక పనిమనిషిలా కాఫీ ఇవ్వటానికి కూడా పనికిరానా ?"
దెబ్బతిన్న పిట్ట ఆర్తనాధం లాంటి ఆ స్వరం వినలేక వణికింది నీరజ... విసురుగా వెళ్ళబోయిన విశ్వం మధ్యలో వెనక్కు తిరిగి యశోధరను చూచి ఒక్క క్షణం తటపటాయించి అంతలో ముందుకు సాగటం కూడా గమనించింది__
"నీకెందుకొచ్చిన యాతన యశో ! హాయిగా ఉండక! అతనికి కాఫీ ఎవరో ఒకరిస్తారులే!" అంది అనునయంగానే...
"ఉహు! నేనే అందిస్తాను. వదిలెయ్యచ్చు! త్రాగకపోవచ్చు!... కానీ నేను ఎంత ఆర్తితో ఆ కాఫీ అందించానో.... అది గుర్తించకపోడు!"