అందం
కన్నీళ్ళలో ఒక విచిత్రమైన సంతృప్తి లభించే సన్నివేశాలు అసంభవం కాదు కాని చాలా అరుదు ! గుండెలు పగిలేలా వెక్కి వెక్కి ఏడుస్తోన్న నీరజ తన మనసులోని అల్లకల్లోలం మధ్య రేఖామాత్రంగా కురిసే అనిర్వచనీయమైన సంతృప్తిని గురించి తనను చూసుకొని తానే తెల్లబోయింది.
మనకు అత్యంత ఆత్మీయులైన వ్యక్తులు __ వారి వియోగం మనమే మాత్రం భరించలేనంత ప్రేమాస్పదులు__ఏ విధంగానూ నయంకాని వ్యాధికి గురయి __ అహోరాత్రులు బాధతో అలమటిస్తోంటే... చూసి సహించలేము. ఆ బాధను ఏ విధంగానూ తొలగించలేము. మన చేతులతో మనం విషమిచ్చి చంపలేము, సరికదా ఎన్ని రకాల మందులైనా వాడి ఎలా అయినా ఆ ప్రాణాలు నిలబెట్టాలనే ప్రయత్నిస్తాము. కానీ ఆ వ్యక్తులు మరణించినప్పుడు__ దుర్భరమైన వేదన కలిగినా ఆవేదనలో అంతర్లీనమయి ఏదో రిలీఫ్ తోచక మానదు.
జరిగితే బాగుండుననుకోంటున్నది తన చేతులతో తను చెయ్యలేనిది....తీరా జరిగినప్పుడు ఏమాత్రం భరించలేనిది__జరిగినపుడు ఎలా ఉంటుందో అలా ఉంది నీరజ మనసు...
ఆరోజు... ఎంతో అందంగా అలంకరించుకొని అద్దం ముందు నిలిచినపుడు... తనలో ఎక్కడో ఏదో లోపం తోచింది. ఆ అలంకరణలో ఏదో వెలితి కనిపించింది. ఆ వెలితి ఏమిటో ఆ లోపం ఎక్కడో మాత్రం అర్ధంకాలేదు ! ఎలా అర్ధమవుతుంది ? మొదటినుంచీ అందరిలో అందగత్తెగా ప్రసిద్ధి పొందింది. దానికితోడు అలంకరణ సామాగ్రి అమరించుకోగలిగే స్థోమత ఉన్న కుటుంబం....పచ్చని శరీరం మీద ఎఱ్ఱని చిన్నా క్రేప్ చీర మెరిసిపోతోంది. పెట్టుకున్న ఎఱ్ఱ రాళ్ళ నెక్లెస్ లో రాళ్ళు అటు చీర రంగుతో పోటీపడి మెరుస్తూ...ఇటు చెక్కెళ్ళ కాంతుల ముందు ఓడిపోతున్నాయి. ఉంగతాలు తిరిగిన ముంగురులు అందంగా చెదిరిపోతున్నాయి. పచ్చని పాల భాగంపైన ఎఱ్ఱని కుంకుమ ఎదుటివాళ్ళను సవాల్ చేస్తున్నట్లు మెరుస్తోంది. ఎఱ్ఱని గాజులు__ ఎఱ్ఱని చెప్పులు... ఎఱ్ఱరాళ్ళ దుద్దులు__ మామూలుగా ఈ అలంకరణ ఎంతో బాగుంటుంది నీరజకు. ఆ సంగతి నీరజకూ తెలుసు. అందుకే ప్రత్యేకించి ఆరోజు ఎఱ్ఱసెట్ బయటకు తీసింది.
అయినా ఏమిటిది? నిలుపుటద్దంలో ప్రతిఫలించే అందమైన ఆ రూపంలో కనిపించీ కనిపించని ఆలోపమెక్కడ?
ఆనాడు ఎంత ఆలోచించినా అర్ధంకాలేదు ! ఈనాడు విశ్వం వ్రాసిన ఉత్తరం చదువుతోంటే స్పురించింది, లోపం కాని ఆ లోపం...
కొన్ని కొన్ని ఇన్ స్టింక్ట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. నిండా నీళ్ళో పాలో ఉన్న గ్లాసు చేతులోకి తీసుకోబోతున్నప్పుడు ఎందుకో, ఏమిటో క్రిందకు జారిపోతుందేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి...అలాగే జారి పడుతుంది కూడా. అప్పుడు పొరపాటున పడిందన్న భావన కాక కావాలని జారవిడుచుకున్న లాంటి భావన కలుగుతుంది... ఇంకొంచెం ముందే హెచ్చరిక ఉండి ఉంటే... మరికాస్త జాగ్రత్తగా ఉంటే... జారిపడి ఉండేది కాదేమోనన్న ఊగులాట వదులుకోలేదు మనసు...
విశ్వం దగ్గిరనుంచి అలాంటి ఉత్తరాన్ని ఏనాడూ ఆశించలేదు నీరజ. తీరా ఆ ఉత్తరం అందుకున్నాక... విభ్రాంతితో__ విషాదంతో... తలమునక లయ్యాక .... ఇలాంటిదేదో జరుగుతుందని తనకిదివరకే తోచినట్లనిపించింది.... ఇంతకూ తనే కారణమో? ఇదంతా తను చేజేతులా చేసుకున్నదేనా ?
యశోధరతో తను మాట్లాడిన మాటలు తనలోని అహంకారాన్ని చాటుతున్నాయా? ఆర్ద్రభావాన్ని చాటుతున్నాయా? అసలు యశోధర పట్ల తాను చూపినది అసూయా? సానుభూతా ?
విశ్వం బూట్స్ పాలిష్ చేస్తోన్న యశోధర అనుకోకుండా వచ్చిన నీరజను ఉలికిపడింది. ఏదో తప్పుడుపని చేస్తూ దొరికిపోయిన నిజాయితీ పరురాలిలా ముడుచుకు పోయింది.
యశోధర ఎంత తొట్రు పడిందో నీరజ అంత తెల్లబోయింది.
"విశ్వం బూట్స్ నువ్వు పాలిష్ చెయ్యటం దేనికి? ప్యూన్ లేడూ?" అంది.
యశోధర మాట్లాడలేదు. ఆ బూట్లవంకా బ్రష్ వంకా చూస్తూ అలాగే కూచుంది.
యశోధర దీనమైన ముఖం చూసే సరికి నీరజలో ఏదో అభిమానం పొంగుకొచ్చింది... "నువ్విలాంటి పనులు ఎందుకు చెయ్యాలి యశో! ఎవరో పరాయి దానిలా ఉండద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు! నువ్వు నాలా ఈ ఇంట్లో పిల్లవి ! లేనిపోని భావాలు పెట్టుకోకు ! ఆ బూట్లు అలా పడెయ్యి. నేను పాలిష్ చేయిస్తాను !"
నలుపులో కలిసే కాంతికాని చామనచాయరంగు ముఖంలో దిగుళ్ళ కారణంగా కళ పోగొట్టుకున్న కళ్ళలో నీళ్ళు నిండాయి యశోధరకు ...
పాలిష్ చేసేవాళ్ళు లేరనికాదు__ఇదొక పని అనుకొని నేను చెయ్యటం లేదు... చెయ్యాలని అనిపించి... అలా చెయ్యటంలో నాకేదో ఆనందం కలగబట్టి..."
అదిరిపడింది నీరజ. విస్తుపోయి చూసింది యశోధరను... స్పష్టంగా చెప్పకపోయినా నీరజ విశ్వాన్ని __ పెళ్ళి చేసుకోబోతున్నట్లు అందరికీ తెలుసు ... యశోధరకూ తెలుసు__అలాంటిది... నీరజ భావాలు చదివినట్లు గబగబ సమాధానం చెప్పింది... "నేను నీతో అబద్ధాలాడలేను నీరజా ! నేనంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు ! నువ్వు లేకపోతే నేనేమయిపోయే దానినే! అందుకే నీతో అబద్దాలాడలేను... అయినా అబద్దమాడవలసిన అవసరమేముందీ ? నేను ఏ విధంగానూ నీకు అడ్డురాను ! అదికాదు, రావాలనుకున్నా రాలేను__ఎవరికీ తెలియకుండా ఈ మూలగదిలో నేనే బూట్లు పాలిష్ చేసుకుంటే ఎవరికి నష్టం ?"
అప్పటికప్పుడు యశోధర చేతులోంచి ఆ బూట్లు లాగేసుకోవాలనిపించింది నీరజకు. ఆపని చెయ్యలేకపోయింది. ఆ పనేకాదు-యశోధర ముఖం చూస్తూ యశోధరకు కష్టం కలిగించే ఏ పనీ చెయ్యలేదు. విధి విలయతాండవం చేసి ముక్కలు ముక్కలు చేసిన ఆ గుండెమీద మరొక దెబ్బ, ఎంత చిన్నదయినా సరే-కొట్టగలిగే కరుకుతనం తనకులేదు.
అక్కడినుండి వెళ్ళిపోయింది. మనసులో ఏదో బరువు... మనసు మోయలేని భావమేదో చేరుకొంది అక్కడ... యశోధరపై సహజంగా ఉండే జాలి సానుభూతి పోలేదు కాని వాటికి మరో వెక్కస భావం తోడయింది...
చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది యశోధర... తండ్రి స్వార్ధపరుడు. అలసుడు. తన సుఖం తాను చూసుకొనే వాడే తప్ప__ఆడపిల్లకు తండ్రిననీ ... ఆ పిల్ల బాధ్యత తనదనీ ఏనాడూ అనుకొనేవాడు కాదు. సంపాదించిందంతా తగలేసేవాడు....తనమీద ప్రత్యేకించి ఏ అభిమానమూలేని తండ్రిని యశోధరే అమితంగా అభిమానించేది. యశోధరకు పెళ్ళి చేయాలని ప్రయత్నించకపోగా చదువు కూడా చెప్పించలేదా మహానుభావుడు. వీధిబళ్ళో చదువుకొన్న థర్డుఫారంతోనే ఆగిపోయింది యశోధర చదువు... చివరకు తండ్రి కూడా చచ్చిపోయాడు... పాతికేళ్ళ వయసులో... చెప్పుకోదగిన అందచందాలు లేని... ఆస్తిపాస్తులు లేని ... చదువు కాని లేక ఒంటరిగా నిలిచిపోయింది యశోధర ... చావుకొచ్చిన బంధువుల్లో సుందరమ్మగారి కన్ను యశోధరమీద పడింది. ఇంటెడు చాకిరీ చేసుకోలేక సతమతమవుతోంది. కలిగిన కుటుంబమయినా నౌకర్లూ, చాకర్లూ ఉన్నా ... ఎక్కడికక్కడే కనపడని పని....నలుగురిలా దర్జాగా మహిళా సభలకు వెళ్ళాలన్నా ... మీటింగుల్లో మాట్లాడాలన్నా కుదిరి చావడం లేదు. యశోధర లాంటి పిల్ల కాస్త ఇల్లు కనిపెట్టుకుంటే తనక్కాస్త ఊపిరితిరుగుతుంది. ఆ పిల్లకి ఆధారం చూపించిన ఘనతా దక్కుతుంది. ఆ అమ్మాయికి ఇంతకంటె మంచి దారి దొరుకుతుందా? తనైనా బండలు మొయ్యమనటం లేదు, సినిమా సూర్యకాంతంలా రాచిరంపాన పెట్ట బోవటం లేదు.