గౌతమి రాకతో అతని మూడ్ పాడయింది.
సాహితితో మనసు విప్పి ఎన్నో విషయాలు మాట్లాడాలని ఎంతో ఆశతో వచ్చాడు. ఆ అవకాశం వచ్చినా, ప్రస్తుతం అతని మనసు బాగాలేనందున ఏమీ మాట్లాడలేకపోయాడు.
'పొద్దుపోయింది, యిక ఇంటికి వెళ్తా'నని సాహితి పట్టుపట్టింది.
చేసేది లేక మౌనంగా తల ఊపాడు సమ్రాట్.
సాహితి హడావుడిగా వెళ్ళిపోయింది.
సమ్రాట్ తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు.
* * * *
ఎవరు ఎన్ని విధాల ప్రయత్నించినా రవికుమార్ జాడ తెలియడం లేదు.
ఈ కేసులో దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండగా, ఇన్ స్పెక్టరు వీరేష్ నెత్తిన మరొక ఉపద్రవం వచ్చిపడింది.
పట్టపగలు పట్టణంలో అదృశ్యమైన ఇద్దరు గృహిణుల గురించి అసెంబ్లీ రాబోయే సమావేశాలలో ప్రతిపక్షాలవారు నిలదీసి అడుగుతారని తెలిసిన ఉన్నతాధికారులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, కేసు పూర్వాపరాలను తెలియజేయవలసిందిగా ఇన్ స్పెక్టరుకు ఉత్తర్వు జారీ చేశారు.
అయితే, ఈ కేసులోనూ ఏ ఒక్కరినీ అనుమానించడానికి ఆధారాలేమీ లభించటంలేదు.
పట్టపగలు నడిరోడ్డున ఇద్దరు వివాహిత స్త్రీలను ఎవరైనా కిడ్నాప్ చేస్తే చుట్టుపక్కల వారికి తెలియకుండా ఉంటుందా?
తన దర్యాప్తులో భాగంగా గృహిణుల ఫోటోలను తన సిబ్బందికి ఇచ్చి విచారించమని అన్ని ప్రాంతాలకు పంపాడు వీరేష్. వాళ్ళెవరూ యింకా తిరిగి రాలేదు.
అధికారుల నుంచే కాక, ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి కూడా ఈ కేసులో గృహిణుల ఆచూకీ వెంటనే తెలుసుకోవాలన్న ఒత్తిడి ఎక్కువయింది.
ఇన్ స్పెక్టరు ఆలోచనలో ఉండగా స్టేషన్ ముందు కారు ఆగింది.
హెడ్ కానిస్టేబుల్ కారు దిగి, ఛాతీ ఎత్తుకుని వచ్చి ఇన్ స్పెక్టరుకి స్మార్ట్ గా శాల్యూట్ చేశాడు.
కనిపించకుండా పోయిన గృహిణు లిద్దరూ అతని వెనుకే కారు దిగారు!
వీరేష్ తోపాటు స్టేషన్ సిబ్బంది అంతా హాయిగా గాలి పీల్చుకున్నారు.
ఇన్ స్పెక్టరు ఆ వివాహిత స్త్రీల వద్ద స్టేట్ మెంట్ రికార్డు చేశాడు. వెంటనే ఫోన్ తీసి రెండు నంబర్లకు డయల్ చేశాడు.
* * * *
"కళ విలువ తెలిసిన ప్రతి ఒక్కరిలోనూ స్పందన ఉంటుంది.
అది కలిగినప్పుడు ప్రభావితమై పుట్టిన ఏ సాహిత్యమైనా సమాజానికి మేలు చేకూరుస్తుంది. కాని అందుకు విరుద్ధంగా సాహిత్యం పుట్టుకు వస్తే వ్యక్తులేకాక, యావత్ వ్యవస్థే పతనమైపోతుందనడం అతిశయోక్తి మాత్రం కాదు."
ఇన్ స్పెక్టరు వీరేష్ రచయితలు బిందుమాధవి, సమ్రాట్ తో సాహిత్యం గురించి అనర్గళంగా మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు.
"రచయిత అంటే అపర బ్రహ్మ! అతని ధ్యేయం కేవలం ధనార్జనే కాకూడదు. సెక్స్, క్రైం, థ్రిల్లర్, హార్రర్ వంటి చౌకబారు రచనలతో యువతను తాత్కాలికంగా వెర్రెక్కించే రచయితలు మొదట పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. కాని ఆ రచయితలు జీవితాలను నాటకీయంగా చిత్రీకరిస్తే వాటిని చదివిన పాఠకులు పిచ్చి భ్రమలలో పడి నష్టపోరా? అందుకు బాధ్యులు రచయితలు కారా? అటువంటి రచనలు తాత్కాలికంగా వెలుగులోకి వచ్చినా, కొంత కాలానికి కాలగర్భంలో కలసిపోక తప్పదు. సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించవలసిన బాధ్యత రచయితలకు లేదా?"
ఇన్ స్పెక్టర్ వీరేష్ ఆవేశంగా అడిగాడు.
సమ్రాట్ కు అతని ఆంతర్యం బోధపడింది.
అతను అన్నదంతా తన రచనలకే చెందుతుంది.
ఇన్ స్పెక్టరు తనను స్టేషన్ కు పిలిపించింది అందరి ముందు తనను దోషిలా నిలపడానికేననిపించింది.
"చూడండి, ఇన్ స్పెక్టర్! స్వతహాగా అసలు మనిషే స్వార్థపరుడు. ఒకవిధంగా ప్రతి మనిషీ వ్యాపారే. మీరూ ఉద్యోగం చేస్తున్నారు. సంపాదన కోసం కాదా? జీతం తీసుకోకుండా ప్రజాసేవ అంటూ ఉద్యోగం చేయగలరా? రాజకీయ నాయకులు కూడా ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ గద్దె నెక్కుతున్నారు. నిజంగానే ప్రజాసేవ చేయాలంటే పదవులే కావాలా? స్వచ్చంద సేవా సంస్థలు ఎన్ని ప్రజాసేవ చేయడం లేదు."
"అలాగే ఆదరించే పాఠకులున్నప్పుడు సమకాలీన సమాజంలో వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు రచనలు చేయడం నేరమా?"
"అటువంటి రచనలు చదివి ఆనందపడిన పాఠకుడు తన సంతృప్తిని రచయితకు పంచి ఇస్తున్నాడా? అది సాధ్యమా? కొందరు పాఠకులు రచనలు చదివి నష్టపోతున్నారంటున్నారు. దానికి బాధ్యత రచయితది ఎలా అవుతుంది?"
" 'యువతుల అదృశ్యం' అనే మీ నవలను చదివి, ఆ థ్రిల్ కోసమే మేము మీరు రాసినట్టు చేశాం. కాని మీరు రాసినట్టు మమ్మల్ని ఎవరూ అభినందించలేదు. మా కాపురాలు నిలుస్తాయా? మా జీవితాలు సర్వనాశనం అయితే అందుకు బాధ్యత మీరు వహిస్తారా?"
గృహిణు లిద్దరూ సమ్రాట్ ను నిలదీశారు.
సమ్రాట్ వెంటనే సమాధానం చెప్పలేక క్షణం తత్తరపడ్డాడు. కొద్దిసేపటికి తనను తాను సర్దుకున్నాడు.
"చూడండి, శ్రీమతులూ! రచయిత రాసినట్టు చేశాం, నష్టపోయాం అంటున్నారు. నేను మిమ్మల్ని అలా చేయమని ప్రోత్సహించడానికే ఆ నవలను రాశానంటారా? అయినా, మీరేమన్నా పసిపిల్లలా? అజ్ఞానులా?"
"వాల్మీకి రామాయణం రాశాడు. రామాయణం కూడా నవలే! సీతను రాముడు అనుమానించినప్పుడు తను అగ్నిప్రవేశము చేసి తన పవిత్రతను నిరూపించుకుంది ఆమె. భర్త అనుమానించిన ప్రతి భార్యా అదేవిధంగా అగ్నిప్రవేశం చేసి తను పతివ్రతనని నిరూపించుకుంటుందా? అవన్నీ రచనలకే పరిమితం. ఇందులో నా బాధ్యత ఏముంది?"
గృహిణులిద్దరూ అతని మాటలకు అవాక్కయ్యారు.