"సారీ ఆంటీ! నాకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నేను పిక్చర్ కు రాను. కళ్యాణి మోడల్ పేపర్లు తెస్తానంది. అవి రాసుకొని డిస్కస్ చేసి వస్తాను...అక్కడ నీకు ఇబ్బందిగా ఉంటుంది. పని పిల్లను తీసుకుని నువ్వు పిక్చరుకు వెళ్ళకూడదూ..." ఉపాయంతో ఆలోచించి అంది మాట మారుస్తూ.
సాహితికి ఉన్నట్టుండి చదువు మీద ఇంత శ్రద్ధ కలిగినందుకు క్షణం ఆశ్చర్యపోయింది బిందుమాధవి.
"సరే! సరాసరి కళ్యాణి ఇంటికి వెళ్లి పని అవగానే వెంటనే రావాలి. మధ్యలో నాకు ఫోన్ చేయి. మరచిపోకు!" అంది హెచ్చరికగా.
"అలాగే...ఫోన్ చేస్తాను..." అంటూ సాహితి హుషారుగా పార్కుకు బయలుదేరింది.
* * * *
అనుకున్న వేళకంటే పది నిమిషాలు ముందుగానే పార్కుకు వచ్చింది సాహితి.
అక్కడ చెదురుమదురుగా స్కూలు పిల్లలు ఆటలాడుకుంటున్నారు.
సమ్రాట్ వస్తున్న జాడ లేదు.
కాలం మాత్రం యధావిధిగా దొర్లిపోతున్నది.
సంధ్య చీకట్లు కమ్మాయి.
సాహితి అసహనంగా తను కూర్చున్న చోటు నుంచి లేచింది.
కళ్యాణి ఇంటికి వెళుతున్నట్టు తను అబద్దమాడింది. బిందుమాధవి మధ్యలో ఫోన్ చేయమంది. తను ఇంతవరకు ఆ విషయం ఆలోచించలేదు.
సరిగ్గా బిందుమాధవి కళ్యాణికి ఫోన్ చేసి, తను వచ్చిందా అని అడిగితే తన పని గోవిందా!
అప్పటికీ సమ్రాట్ రాకపోగా, తను ఆడిన చిన్న అబద్ధం ఇక ఏ అవాంతరానికి దారితీస్తుందోనని మనసులో మధనపడసాగింది.
సరాసరి అదే క్షణాన సమ్రాట్ హడావుడిగా స్కూటర్ దిగి, స్టాండ్ వేశాడు.
దూరంగా ఉన్న మొక్కల మధ్య నుంచి నడచి వస్తున్న సాహితి దగ్గరకు పరుగు పరుగున వచ్చి, తన ఆలస్యానికి క్షమాపణ చెప్పాడు.
సాహితి తన ముఖానికి పట్టిన చిరుచెమటను చేతి రుమాలుతో తుడుచుకుంది.
"ఇప్పుడే వస్తాను, నేను వచ్చేవరకు ఎదురు చూడండి!" అంటూ అతని సమాధానం కోసం ఎదురుచూడనైనా చూడకుండా విసవిసా పార్కు గేటు దాటింది.
ఆమె ప్రవర్తన అర్థంకాక సమ్రాట్ ఆలస్యంగా వచ్చినందుకు తనను తాను క్షణం తిట్టుకున్నాడు.
తిరిగి వస్తుందో, రాదోనన్న అనుమానం అతని మనసును కలవర పెడుతున్నది.
సాహితి రాకకోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ కూర్చోవడం కన్నా తను ప్రస్తుతం చేయగలిగిందేమీ లేదనిపించింది. పార్కులో మారుమూల ప్రదేశం చూసుకుని లైటు ఉన్నచోట కూర్చున్నాడు.
చేతిలో ఉన్న డైరీ తీశాడు.
ఆ రోజున టపాలో వచ్చిన అభిమానుల ఉత్తరాలను ఒకొక్కటీ తీసి చూశాడు.
సమ్రాట్ దృష్టి ఒక ఉత్తరం మీద ఆగిపోయింది. అది పరిచయమైన చేతి రాతగా లేదు.
తన రచనల సృష్టి అమోఘం. తను రాసిన ప్రతి అక్షరం యువత మనసును రంజింపచేస్తున్నది.
రాతి హృదయంలో కలిగిన స్పందన ప్రేమ మార్గానికి దారి చూపుతుంది. ఆ తరువాత ప్రేమ గీతాలను ఆలపిస్తోంది.
అలానే కళ్యాణి మనసు పొరలలో పుట్టిన ప్రేమ, హృదయంలో కలిగిన అనుభూతి తోడై అక్షర రూపంగా వెలసిందే ఆ ప్రేమలేఖ.
చదువుతున్న సమ్రాట్ ముఖంలో చిరునవ్వు చోటు చేసుకుంది.
అది ఒక అభిమాని రాసిన ఉత్తరమన్న తృప్తి వలనో, లేక ఒక స్త్రీ తనకు ప్రేమలేఖ రాసిందనే సహజమైన పురుషాహంకారమో తెలియదు.
"గుడ్ ఈవెనింగ్!"
ఆ పిలుపుకు ఉలిక్కిపడి తలెత్తాడు సమ్రాట్.
ఎదురుగా చిరు మందహాసంతో గౌతమి.
ఈ వేళప్పుడు ఇక్కడకు గౌతమికాని, తనకు పరిచయమున్న మరెవరైనాగాని వస్తారని తను ఊహించలేదు.
ఒకవేళ సాహితి, గౌతమి కూడబలుక్కుని వచ్చారా అని చుట్టూ చూశాడు. సాహితి వచ్చిన జాడేమీ లేదు.
"హలో, యంగ్ లేడీ! ఇలా వచ్చావేం? ఎంతసేపయింది వచ్చి?"
"తమరు ఆ ఉత్తరం చదవడం మొదలుపెట్టి ఆనంద డోలికలలో తేలియాడుతున్నప్పుడు" అంది కొంటెగా.
"అమ్మ దొంగా! నన్ను స్టడీ చేస్తున్నావన్నమాట!"
"ఎక్కడనుంచి ఆ ప్రేమలేఖ?" అడిగిన క్షణంలోనే ఆమె ముఖం ఎర్రబారింది.
"అభిమానులెందరో రాస్తుంటారు. వాళ్ళందరి గురించి నీకెందుకులే!" అంటూ ఉత్తరాన్ని మడిచాడు.
"నన్నోసారి చూడనివ్వండి!" అంటూనే అతని చేతిలో నుంచి ఉత్తరాన్ని లాక్కుని పరుగుపెట్టింది.
సమ్రాట్ భారంగా నిట్టూర్చాడు.
ఉత్తరాన్ని చదివి గౌతమి తనను అపార్థం చేసుకోవచ్చు. తనకు నమ్మకమా రాసిన ఉత్తరం గౌతమి చేతికి వెళ్ళినందుకు కళ్యాణి తనను అసహ్యించుకోవచ్చు.
ఆనక అభిమానుల మధ్య మనస్పర్థలు ఏర్పడితే, తనెంతవరకు బాధ్యుడు?
తను ఉత్తరాలు బయటకు తీసుకురావడం, ఆ ప్రదేశంలో చదవడం పొరపాటే. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు.
పార్కులో గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. పార్కులో ఉన్నవాళ్ళను వాచ్ మన్ టైమ్ అయిపోయిందని బయటకు పంపుతున్నాడు.
సమ్రాట్ వెళ్ళడానికి లేచాడు విసుగ్గా.
సాహితి అప్పుడే అక్కడకు వచ్చింది. సమ్రాట్ ను చూసి క్షణం ఆమె కళ్ళు మిలమిల మెరిశాయి. అతనికి ఆ మాత్రం శిక్ష చాలనుకుంది.
సాహితిని చూసిన సమ్రాట్ మౌనంగా ఉండిపోయాడు. ఆమెకు అతని మూడ్ అర్థమయింది.
"సారీ! మీరు ఆలస్యం చేయడం వల్లనే ఇలా జరిగింది. ఆంటీకి అబద్ధం చెప్పి యిక్కడకు వచ్చాను. మధ్యలో ఫోన్ చేయమని షరతు. ఫోన్ చేసి వస్తున్నాను. అయినా, ఆడపిల్లలకు ఇంటి దగ్గర ఉండే ఆంక్షలను రచయితలు ఆమాత్రం అర్ధం చేసుకోలేరా?" సంజాయిషీగా అంది సాహితి.