Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 16


    "సారీ, ఇన్ స్పెక్టర్! ఫోన్ చేసి వెంటనే రమ్మన్నారంటే మరేదైనా అర్జంటు పనేమో ననుకున్నాను. మీకు తెలుసు కదా. నేను బిజీ రైటర్ ని. నాకు కాలం చాలా విలువైనది. ఇందుకోసమే పిలిపించినట్టయితే ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు."
    సమ్రాట్ కుర్చీలోంచి లేచాడు.
    "మీతో మాకేమీ పనిలేదు. తమరిక దయచేయవచ్చు!" వస్తున్న కోపాన్ని దిగమింగుతూ అన్నాడు ఇన్ స్పెక్టర్ వీరేష్.
    బిందుమాధవికి అతని ఆవేశం అర్థమైంది. తనకు సంబంధం లేని విషయంలో కూడా పోలీస్ ఆఫీసర్ నైతిక బాధ్యత ఫీలవుతున్నందుకు అతన్ని ప్రశంసించకుండా ఉండలేక పోయింది.
    రచయితగా సమ్రాట్ తన బాధ్యతను విస్మరించాడు. తను కూడా ఆ అభాగ్యుల విషయం పట్టించుకోకపోతే ఎంతో పవిత్రమైన వృత్తికే కళంకం కలుగుతుంది. ఇద్దరు స్త్రీల జీవితాలు నాశనమవుతుంటే తను చూస్తూ ఊరుకుంటుందా?
    "ఇన్ స్పెక్టర్! రచయిత లందరూ స్వార్థపరులే అయితే ఈ సమాజం ఈపాటికి పూర్తిగా భ్రష్టుపట్టిపోయేది. వాళ్ళిద్దరికీ చౌకబారు సాహిత్యం చదవడం వలన నష్టం జరిగింది. కాదనను, దానికి ఆ రచయిత విధిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. కాని అతను స్వార్థంతో తప్పించుకుపోయాడు. అతను విస్మరించిన బాధ్యతను నేను స్వీకరిస్తాను. చెప్పండి. వాళ్ళకు నన్నే సహాయం చేయమన్నా చేస్తాను."
    ఆమె మాటలకు ఇన్ స్పెక్టరు ముఖం విప్పారింది.
    "థాంక్యూ మేడమ్! మీ ఆదర్శాలు మీ రచనల ద్వారా తెలుసుకున్న వాళ్ళకు రక్షణ కల్పించి, వీళ్ళ కాపురాలు చక్కదిద్దండి!"
    "అలాగే, కాలమే వాళ్ళ జీవితాలను చక్కదిద్దుతుంది. అంతవరకు వాళ్ళిద్దరినీ మా ఆశ్రమంలో చేర్పిస్తాను" అంది మనస్పూర్తిగా బిందుమాధవి.
    సమస్యకు పరిష్కారం దొరికిందని ఇన్ స్పెక్టరు వీరేష్ హృదయం తేలికయింది.
    ఆకాశంలో మబ్బులు తేలిపోయాయి.
    చంద్రుడు విజయగర్వంతో వెలుగుతున్నాడు.


                                 *    *    *    *


    ఆఫీసు గదిలోకి అడుగుపెట్టిన కళ్యాణికి ఆ పరిసరాలన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి.
    ఎన్నడూ లేనిది నేడు ఆ గది అంతా తీర్చిదిద్దినట్టుంది. గదికి తెరలు, కిటికీ తెరలు తగిలించి వున్నాయి. తివాచీ పరిచి వుంది. ఒక మూల కలర్ టీ.వి., వి.సి.ఆర్., మరొక పక్కన ఎయిర్ కూలరు.
    పుస్తకాలన్నీ చక్కగా తీర్చిదిద్దినట్టు రాక్స్ లో పేర్చి వున్నాయి.
    రెండవ గదిలో కొత్త తెలుగు టైపు మిషన్, వచ్చేవారికి కుర్చీలు వేసి వున్నాయి.
    ఇంత చక్కగా ఆ గదిని ఎవరు సర్దారో కళ్యాణికి అర్థం కాలేదు.
    ఆఫీసు అటెండరు ఆ గదిలో రివాల్వింగ్ చైయిర్ లో కూర్చున్న కళ్యాణిని చూశాడు. ఆ అపరిచిత వ్యక్తిని చూడగానే అతని ముఖంలో రంగులు మారాయి.
    "ఎవరు మీరు? సరాసరి వచ్చి మా బాస్ చైర్ లోనే కూర్చున్నారే?"
    అతని ప్రశ్నలకు కళ్యాణికి ఒళ్లు మండిపోయింది.
    తను వచ్చేటప్పటికి అక్కడ ఎవ్వరూ లేరు. తను సరాసరి లోపలకి వచ్చి కూర్చుంది. ఇక్కడ ఇన్ని మార్పులు చేర్పులు ఉంటాయని తను కలగనలేదు.
    "నేనేమీ కొత్త వ్యక్తిని కాను. ఈ రోజునే నువ్విక్కడ చేరి రూల్స్ మాట్లాడుతున్నట్లున్నావు. రానీ మీ బాస్ ను నేనే అడుగుతాను.అసలు నువ్వే పెత్తనాలకు వెళ్లావు?"
    ఆవేశంగా ఆమె అడుగుతుంటే అతను ఖిన్నుడయ్యాడు.
    సరిగ్గా ఆ క్షణంలోనే అనూష ఆఫీసులోకి అడుగుపెట్టింది. కళ్యాణిని చూడగానే ఆమెకు విషయం సూక్ష్మంగా అర్థమయింది.
    కాఫీ తీసుకురమ్మని అటెండరును బయటకు పంపింది.
    కళ్యాణి అసహనంగా అటు ఇటు కదిలింది.
    "అక్కడ విసుగ్గా ఉంటే యిక్కడకు రండి...యిక్కడ న్యూస్ పేపర్లు, మాగ్ జైన్స్ ఉన్నాయి..." ఆహ్వానిస్తూ అంది అనూష.
    కళ్యాణి రెప్ప వాల్చకుండా అనూషకేసి చూసింది. అక్కడ నుంచి కదలలేదు.
    అటెండరు రెండు కప్పులలో కాఫీ పోసి అనూష టేబుల్ మీద పెట్టాడు.
    "రండి కాఫీ తీసుకుందురుగానీ" అంది అనూష.
    "అక్కరలేదు!" ఉక్రోషంగా అంది కళ్యాణి.
    అప్పటికింకా సమ్రాట్ రాలేదు. అనూషకు చికాకేసింది.
    ఆడపిల్లకు అంత గర్వం పనికిరాదు. ఎంత సాతంత్ర్యం ఉంటే మాత్రం సరాసరి సమ్రాట్ కుర్చీలో కూర్చుని అహంకారమంతా చూపిస్తుంది.
    "మీకేమైనా పని ఉంటే చూసుకురండి. లేదా ఏదైనా విషయం ఉంటే నాతో చెప్పండి. సమ్రాట్ గారు రాగానే తెలియజేస్తాను." అంది అనూష విసుగ్గా.
    "మీతో మాట్లాడే విషయం కాదు. నేనే సమ్రాట్ తో వ్యక్తిగతంగా మాట్లాడాలి."
    "ఈపాటికి ఆయన రావలసిందే! ఒక్కొక్కసారి బాగా ఆలస్యం అయితే, అసలు రారు, ఏకంగా సాయంత్రమే వస్తారు."
    "వచ్చేవరకు ఉంటాను. ఆయనతో మాట్లాడిన తర్వాతే వెళతాను. నాకు లేని బాధ మీకెందుకంట?" ఉడుక్కుంటూ అంది కళ్యాణి.
    ఆమె వింత ప్రవర్తనకు విసుక్కున్నా లాభంలేదనిపించింది అనూషకు.
    వాళ్ళ సహనాన్ని ఇక పరీక్షించరాదన్నట్టు సమ్రాట్ వచ్చాడు. కళ్యాణిని చూసి ఆశ్చర్యపోయాడు.
    "వీళ్ళెవరు? నన్ను అవమానించడానికే వీళ్ళనిక్కడ పెట్టారా?" కళ్యాణి ఆవేశంగా అడిగింది.
    ఏం జరిగిందో అర్థంకాక సమ్రాట్ క్షణం అనూషను, అటెండరును మార్చి మార్చి చూశాడు.
    "వాళ్ళవేపు చూస్తే వాళ్ళేం చెబుతారు? వాళ్ళ తప్పులను అంగీకరిస్తారా?" కళ్యాణి మళ్ళీ విరుచుకుపడింది.
    "అసలేం జరిగింది కళ్యాణీ?"
    "మీకు మీ అభిమానుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ముందు వాళ్ళనిద్దరినీ పనిలోంచి తీసేయండి." ఆవేశంగా విసవిసా బయటకు నడిచింది కళ్యాణి.

 Previous Page Next Page