Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 14


    పాలిపోయిన లలిత ముఖంలోకి చూసి ప్రసన్నంగా నవ్వింది.
    "పాపం! మాధవరావు గారితో ఎక్కడికో వెళ్దామని ప్రోగ్రాం వేసుకున్నట్టుగా ఉన్నావు. నా మూలంగా అంతా పాడయింది. అయామ్ వెరీసారీ లలితా! నాకు తెలియకుండానే ఎప్పటికప్పుడు నీకు అడ్డుపడుతున్నాను. నిన్నిలా కష్టపెట్టటం నాకు కష్టంగానే ఉంది. నేనేం చెయ్యను చెప్పు! నిజం చెపుతున్నాను. నేను నీకోసం ఏమైనా చెయ్యగలిగితే సంతోషంగా చేస్తాను. నువ్విలా బాధపడుతోంటే చూడలేను!"
    కంఠంలో ఎక్కడలేని ఆప్యాయతా ధ్వనింపచేస్తూ అంది రాగిణి.
    లలిత సమాధానం చెప్పలేదు. వంచిన తల ఎత్తకుండా అలాగే కూచుంది.
    మాధవరావు ఒక్కసారి రాగిణిని లలితను చూశాడు. వెంటనే లేచి "మిస రాగిణి! ఇప్పుడు నాకు మీతో మాట్లాడే తీరిక లేదు. తర్వాత రండి! కమాన్ లలితా!" అంటూ చెయ్యి పట్టుకుని కార్లో కూచోబెట్టి పక్కన కూచుని డైవర్ తో "పోనీయ్!" అన్నాడు.
    యజమాని మూడ్స్ బాగా అర్ధంచేసుకున్న డ్రైవర్ వెంటనే కారు స్టార్ట్ చేశాడు.
    అనుకోని ఈ సంఘటనకు కొయ్యబొమ్మలా నిలిచిపోయింది రాగిణి మాత్రమే కాదు. మణిమాల కూడా! ఒక్కటే తేడా! రాగిణి కళ్ళు నిప్పులుపోశాయి. మణిమాల కళ్ళలో నీళ్ళు ఉబికాయి.
    తన చేతిలో చల్లగా మంచులా ఉన్న లలిత చెయ్యి వదిలేసాడు మాధవ్. అంతవరకు తనచెయ్యి మాధవ్ చేతిలో ఉందనే స్పృహ కూడా లేని లలిత సిగ్గుపడి మాధవ్ కు ఎడంగా జరిగి వంటి నిండా పైట కప్పుకుంది.
    "థేంక్స్!" అంది.
    "దేనికి, థేంక్స్!" అల్లరిగా అడిగాడు. బిత్తరపోయి చూసిన లలితను చూసి పకపక నవ్వాడు.
    మాధవరావు సాధారణంగా నవ్వాడు. అతనలా నవ్వటం మొదటి సారిగా విన్న లలితకు ఆ నవ్వులో ఏదో సంగీతం వినిపించినట్లయింది. రాగతాళాలకు అతీతమయిన సహృదయం ధ్వనించే సంగీతమా ఇది?
    అంతలోనే గంభీరంగా మారిపోయిన మాధవరావు "రాగిణి మీకు తెలుసా?" అన్నాడు.
    "తెలుసు!"
    "ఎలా తెలుసు?"
    "నా స్నేహితురాలు!"
    కొంచెంసేపు మాధవరావు మాట్లాడలేదు తరువాత అన్నాడు.
    "ఒక స్నేహితుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అలాంటి స్నేహాలు మీకు మంచివికావు."
    "మీబోటి వారికేనా అలాంటి స్నేహాలు మంచివి?" వెటకారంగా అనేసి నాలిక కరచుకుంది లలిత. భయంగా మాధవరావును చూసింది.
    మళ్ళీ నవ్వాడు మాధవరావు.
    ఆ నవ్వు వింటున్న కొద్దీ తనలో ఏదో కొత్త శక్తి వచ్చి చేరుకుంతున్నట్లు అనిపించసాగింది లలితకి.
    "క్షమించండి!" అంది.
    "మీ మాటలు ఒక రకంగా నిజమే! మాబోటివారికే అలాంటి స్నేహాలు మంచివి. నేరస్థులని ట్రాప్ చెయ్యటానికి వాళ్ళని ఉపయోగించుకుంటాం మేము!" స్నేహ స్వరంతో అన్నాడు మాధవరావు. లలితలో కుతూహలం పెరిగింది.
    "రాగిణిని కూడా అలాగే ఉపయోగించుకుంటున్నారా?"
    "లేకపోతే, ఆవిడతో నాకేం అవసరం? ఆఫీసర్ రాజు గవర్నమెంట్ డబ్బును దుర్వినియోగం చేస్తున్నాడని తెలిసింది. అతడు ప్రాస్టిట్యూట్స్ తో హోటల్స్ లో గడుపుతాడని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. అతన్ని ట్రాప్ చెయ్యటానికే రాగిణి ని ఉపయోగించుకుంటున్నాం."
    గుండె ఝల్లుమంది లలితకు.
    మారినలలిత ముఖ కవళికలు గమనిస్తూ "అదేమిటి అలా అయిపోయారు? అన్నట్లు రాగిణి మీ స్నేహితురాలన్నారు కదూ! భయపడకండి! ఆవిడకేమీ జరగదు!" అన్నాడు.
    లలిత క్షణాలలో సర్దుకుంది. తన పక్క ఉన్న వ్యక్తి పోలీస్ ఆఫీసర్. ముఖం చూస్తూ మనసు చదవగల ప్రజ్ఞాశాలి. తను హెచ్చరికగా ఉండాలి. ఉన్నట్లుండి "డ్రైవర్! లలితమ్మగారి ఇంటికి పోనీయ్!" అన్నాడు మాధవ్.
    లలిత చాలా సంతోషించింది. మణిమాల లేకుండా ఇలా మాధవరావుతో లలిసి పిక్నిక్ కి వెళ్ళాలని లేదు లలితకి.
    "మీ ఇంటికి వెళ్దాం! మీకు అభ్యంతరం లేకపోతే, ఒక్కసారి వీణ వాయించింది. వినేసి ఇంటికి కెళ్ళిపోతాను. నాకు చాలా పనులున్నాయి." అన్నాడు మాధవ్ లలితతో.
    "తప్పకుండా రండి. మీరు నా వీణ వింటాననటంకంటే నాకు కావలసిన దేముంది?" సంతోషంగా అంది లలిత.
    
                                             10
    
    పకపక నవ్వాడు రాజు. షాక్ తిన్నట్లుగా చూస్తోన్న లలిత ముఖం చూసి మరింత విరగబడి నవ్వాడు. పొంగి పొంగి  కెరటాల్లా వస్తోన్న నవ్వును ఆపుకోవటానికి విశ్వప్రయ్తాహ్నం చెయ్యవలసి వచ్చింది.
    "లాభంలేదు లలితా! ఏం లాభంలేదు!" నవ్వు నాపుకునే ప్రయత్నంలో నవ్వుమధ్య అస్పష్టంగా అన్నాడు.
    లలితకు అతని మాటలు అర్ధం కావటంలేదు.
    "ఏమనుకుంటున్నావ్ నువ్వు? నువ్వు చెప్పిన మాటలు విని రాగిణిని వదిలేసి.... నిన్ను పెళ్ళి చేసుకుని..." మళ్ళీ నవ్వాడు రాజు.
    అర్ధమయిపోయింది లలితకు! తనను తానెంత నికృష్ట స్థితిలోకి దిగ జార్చుకుందో, ఒక్కసరిగా అర్ధమయిపోయింది. "రాగిణిని నేను వదిలెయ్యటానికి నువ్వింత శ్రమపడక్కర్లేదు లలితా! రాగిణి ని నేను పెళ్ళి చేసుకుంటానా? ఎవరు చెప్పారు నీకు? నేను... ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ని రాగిణి ని పెళ్ళి చేసుకుంటానని అనుకున్నావా? మినిస్టర్లు తమ కూతుళ్ళనిస్తామని వస్తున్నారు. కలెక్టర్లు సంబంధాలు కలుపుకోవాలని కబుర్లు పంపుతున్నారు. నేను ఎవరిని పడితే వాళ్ళని పెళ్ళి చేసుకుంటానా?"
    పకపక నవ్వుతున్నాడు రాజు.
    హఠాత్తుగా లేచి బయటకు నడిచింది లలిత.
    మాధవరావు రాజును ట్రాప్ చెయ్యటానికి రాగిణిని ఉపయోగించుకుంటున్నాడని తెలిసిన క్షణంనుంచీ లలిత స్థిమితంగా ఉండలేకపోయింది. ఒక్కక్షణం "అంతే కావాలి శాస్తి. అనుభవించనీ!" అనిపించక పోలేదు. కానీ అలాంటి ఆలోచన వచ్చినందుకు తనమీద తనకే చికాకు కలిగింది.
    రాజు తనను నిర్లక్ష్యం చేసినంత మాత్రాన రాజు నాశనం కోరుకోగలదా? ఇలాంటి రహస్యం తెలిసిన తరువాత .... రాజును రక్షించగలిగే శక్తి తన చేతుల్లో ఉండీ చూస్తూ ఊరుకోగలదా?
    రాజును కలుసుకుని తనకు తెలిసిన రహస్యం రాజుకి చెప్పేసింది?
    రాజు విని పకాలున నవ్వాడు. 'ఈ రకంగా నన్ను రాగిణికి దూరం చేద్దామనుకుంటున్నావా?" అని పరిహాసం చేశాడు!
    ఇదీ ఒకందున మంచికే జరిగింది. ఇప్పుడు తన మనసు చాలా తేలిగ్గా ఉంది! తన ఎదురుగా పకపక నవ్వే ఆ రాజు తను ప్రేమించిన రాజు కాదు. తన కెన్నడూ పరిచయంలేని తన ఊహలకందని ఎవరో అతి సామాన్య వ్యక్తి.
    రాజు తెలివి తక్కువ వాడు కాదు, అందుకే లలిత మాటలు నమ్మలేకపోయాడు. తనుచేసిన నేరమేమీ లేదు. గవర్నమెంట్ డబ్బు తను వాడుకున్నదీ లేదు. ఆ రోజు రాగిణితో తనను చూడగానే లలిత ముఖం ఎలా అయిపోయింది? అఫ్ కోర్స్! లలిత తనను ప్రేమించింది! చాలా మంచిది! సందేహం లేదు! అయితే మాత్రం! తనలాంటి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ కి లలితలాంటి భార్య ఏం బాగుంటుంది? ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? ఎందుకైనా మంచిది! రాగిణిని కదిలించి చూడాలి!

 Previous Page Next Page