అతను దినపత్రిక యింట్లో చదవడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరూ పత్రిక తెప్పించరు. ఆసక్తి లేక కాదు. డబ్బు ఖర్చు పెట్టటం ఇష్టంలేక. కొంతకాలం అన్నదమ్ములందరూ కలసి న్యూస్ పేపర్ తెప్పించుకొందామని నిర్ణయించుకుని, అలా చెయ్యసాగారు. దాంతో అనేక సమస్యలెదురయినాయి. ఇల్లు యింటికి పెద్దవాడు కాబట్టి, మొదట ఆర్డర్ పెట్టింది అతనే కాబట్టి రాజశేఖరం పేరుతో వుండేది. మొదట అతను డబ్బు కట్టేసి తర్వాత డబ్బులు కోసం తమ్ముళ్ళకి కబురుచేసేవాడు. వాళ్ళు వినీ విననట్లు ఊరుకునేవారు. ఒక్కనెలకూడా సజావుగా డబ్బెవరూ కట్టలేదు. పైగా పేపరు ఎవరిచేతికందితే వాళ్ళు ఎగబడి లాక్కొనేవారు. తర్వాత చదువుకుందామనుకునే వారికి అదెప్పుడూ దొరికేదికాదు. చిత్రంగా మాయమైపోయేది. ఒక్కోసారి అవశేషాలు మాత్రం దొరికేవి. ఈ బాధపడలేక రాజశేఖరం పేపరు తెప్పించటం మానేసి వీలయితే ఆఫీసులో చదువుకోవటం మొదలుపెట్టాడు. ఈ దేశంలో మనుషులు ఎంత చిన్న సమస్యని పెద్దదిగా చేసుకుని అశాంతి పాలవుతుంటారో చెప్పటానికి యీ ఉదాహరణ చాలు.
దాదాపు యిరవై నిముషాలయాక సీతాదేవొచ్చి "లేవండి" అంది.
రాజశేఖరం మౌనంగా వెళ్ళి కంచంముందు కూర్చున్నాడు.
కూరలో ఉప్పెక్కువయింది. పులుసులో అసలు ఉప్పే లేదు.
అయినా ఒక్కమాటకూడా అనక త్వర త్వరగా భోజనం చేశాననిపించుకుని, ఆఫీసుకు బయలుదేరాడు.
5
నరసింహంగారు సాయంత్రం అయిదు గంటలకు బయటకు బయలుదేరారు.
"ఎక్కడికి?" అనడిగింది పార్వతమ్మ.
"అవధానిలేడూ? వాడికి వంట్లో బాగాలేదట చూసొస్తాను"
"అయ్యో! అంది పార్వతమ్మ" జాగ్రత్తగా వెళ్ళి రండి. చేతికర్ర తీసుకెళతారా?
"అక్కరలేదు" అంటూ నరసింహంగారు యింట్లోంచి బయటికొచ్చాడు.
రోడ్డు మీదికొచ్చి నడుస్తున్నాడు.
అవధాని యిల్లు కృష్ణలంకలో వుంది. నరసింహంగారు మెల్లగా బందర్ రోడ్ కొచ్చి, మునిసిపల్ స్టేడియందాటి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దాటి బందర్ కాలవ వంతెనదాటి కృష్ణలంకలోకి వచ్చాడు.
కృష్ణలంక ఎంత మారిపోయింది! ఒకప్పుడు కృష్ణానది వరదలు పెద్ద సమస్యగా వుండేవి. కనీసం ఏటా ఒకసారి వరదలొచ్చి లంకలోని పూరిళ్ళూ, వేలకు వేలు మునిగిపోయి వేలకొద్ది జనం తమ ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి పారిపోతూ వుండేవాళ్ళు. ఎన్ని పధకాలు వేసినా ప్రభుత్వం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వుండేది. ఆ వరదలూ, భీభత్సం, ఒకప్రక్క నిరాశ్రయులైనవారు విలపిస్తోంటే, వింత చూడటానికి కృష్ణలంక కట్టమీదకు వేలమంది జనం గుమిగూడుతూ వుండేవారు. తాను కూడా సైకిలేసుకుని. యీ చివర్న మొదలుపెట్టి, కనకదుర్గ గుడిదాటి, గట్టు వెనక్కి వెళ్ళి దాదాపు రెండు మూడు మైళ్ళు సైకిలు తొక్కుకుంటూ, సాధ్యం కానిచోట నడిపించుకుంటూ, ఆ భీభత్సాన్నిచూసి వచ్చేవాడు. తర్వాత తర్వాత నాగార్జునసాగర్ రావటం, కృష్ణానదిమీద ప్రకాశం బ్యారేజ్ రావటం...వీటివల్ల నదీ ప్రవాహానికి అడ్డుగోడలు పడిపోయి, ఉధృతం అదుపులోకి వచ్చి వరదల సమస్య తీరిపోయింది.
నరసింహంగారు కృష్ణలంక గట్టుదిగి కొంతదూరం నడిచి అవధాని యింటికి వెళ్ళాడు.