అవధానిదికూడా తన యీడే. ఇద్దరూ కొన్ని సంవత్సరాలపాటు కలసి ఉద్యోగాలు చేశారు. ఒకరంటే ఒకరు చాలా అన్యోన్యంగా వుండేవాళ్ళు. అసలు నరసింహంగారికి వున్న స్నేహితులే తక్కువ. ఆయన జీవితకాలమంతా యిద్దరు ముగ్గురితో మాత్రం దగ్గరగా వుండేవాళ్ళు. వారిలో అవధాని ముఖ్యులు.
ఆ రోజుల్లో యిద్దరూ ప్రతి సాయంత్రం కలుసుకుంటుండేవాళ్ళు. ఆఫీసు విషయాలూ, కుటుంబ సమస్యలూ చర్చించుకుంటూ వుండేవాళ్ళు. వయసు మళ్ళినకొద్దీ శరీరాల్లో జవసత్వాలు తగ్గిపోయి మనస్సులో ఆప్యాయతలూ, ఆత్మీయతలూ వున్నా క్రమ క్రమంగా యిద్దరూ కలుసుకోవటం తగ్గిపోయింది.
నరసింహంగారు వెళ్ళేసరికి అవధాని ముందుగదిలో మంచంమీద పడుకుని వున్నాడు. స్నేహితుడ్ని చూడగానే అతని మొహం సంతోషంతో వికసించినట్లయింది.
"రా, నరసింహం" అన్నాడు. అతని గొంతు అదోలా ధ్వనించినట్లయింది.
గదిలో ఇద్దరు ముగ్గురు మనుషులున్నారు. నరసింహంగార్ని చూడగానే లోపలకెళ్ళిపోయారు.
"ఏం జరిగింది?" అన్నాడు.
అవధాని నవ్వాడు. ఆ నవ్వులో ఓ రకం బాధ, విషాదం మేళవించినట్లయినాయి.
"నాకు హై బి.పి. వుందికదూ! ఒక్కరోజు కాలూ చెయ్యీ పడిపోయే లక్షణాలు కనిపించాయి. మాటకూడా సరిగ్గా రాలేదు. పక్షవాతవేమో అనిపించింది. అనిపించటమేమిటి? పక్షవాతమే. అదృష్టవశాత్తూ దానంతట అదే సర్దుకుంది. "డాక్టరుగారొచ్చి చూస్తున్నారనుకో_ కాలూ చెయ్యీ కదులుతున్నాయి. మాట చాలావరకూ వస్తోంది" అన్నాడు అవధాని.
అతను చాలా దిగులు పడిపోతున్నట్లు కనిపించాడు.
"నీకేం ఫర్వాలేదులేరా. తగ్గిపోతుంది" అన్నాడు నరసింహంగారు ధైర్యం చెబుతున్నట్లుగా.
"తగ్గిపోతుందిలేరా. తగ్గిపోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే...వయసు కూడా మళ్ళింది కాబట్టి.
"ఏం జరిగిందిరా?'
అవధాని తమ మాటలు ఎవరికైనా వినబడతాయేమోనన్నట్లు అటూ యిటూ చూశాడు. ఆ దగ్గరలో ఎవరూ లేరు.
"ఏమిట్రా?" అన్నారు నరసింహంగారు. ఆయనకు అవధాని మొహంలో చాలా మార్పు కనిపించింది. చివరిరోజులు వచ్చేశాయి కదా, చావంటే భయపడుతున్నాడేమోననుకున్నాడు.
"ఏరా! చావంటే భయంగా వుందా?" అన్నాడు.
అవధాని మెల్లగా నవ్వాడు. ఆ నవ్వులో బాధవుంది. విషాదముంది.
"చావంటే భయంలేనివాడు ఎవరైనా వుంటార్రా?"
నరసింహంగారు పాతకాలంనాటి రోజులు నెమరువేసుకుంటున్నాడు. చిన్నతనంలో అవధాని చాలా అందగాడు. శృంగార ప్రియుడు కూడా. ఇంటికొచ్చిన బంధువులైన ఆడవాళ్ళతో, యిరుగు పొరుగు స్త్రీలతో సరస సల్లాపాలు సాగిస్తూ వుండేవాడు. అవకాశమొస్తే వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేందుకు కూడా వెనుకాడేవాడుకాదు. అవకాశమొస్తేకాదు, అవకాశాలు సృష్టించుకునేవాడు. ఎంతోమంది కాపరాలు చేస్తోన్న ఆడవాళ్ళతో కూడా అతని శృంగార కలాపాలు నిర్విఘ్నంగా సంవత్సరాల తరబడి కొనసాగుతూ వుండేవి. భార్యకు ఏమాత్రం సుస్తి చేసినా, "మీ అమ్మా వాళ్ళింటికి వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. పాపం యిక్కడ ఇంటి చాకిరితో అలిసిపోతున్నావు" అని లేనిపోని ప్రేమనంతా వొలకబోసి పుట్టింటికి పంపించేవాడు. ఆమె తిరిగి వచ్చేవరకూ ఇంట్లో తన కార్యక్రమాలు కొనసాగిస్తూ వుండేవాడు.
వయసొచ్చాకకూడా_వొంట్లోని శక్తి వుడిగేవరకూ అతనిలో యీ చిలిపి చేష్టలు పోలేదు.
అవధాని జీవితాన్ని ప్రేమించాడు. మధ్యలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కున్నా అతను జీవితాన్నెప్పుడూ ద్వేషించలేదు. జీవితంపట్ల అతనికి విముఖత్వం ఏర్పడలేదు.