Previous Page Next Page 
తదనంతరం పేజి 14


    ఆ ఇల్లు అసలు తండ్రి సంపాదించింది కూడా కాదు. తాతగారు సంపాదించింది. ఆయన పోతూ పోతూ కొడుక్కి అనుభవించడానికేగాని, అమ్మకమూ అవీ చెయ్యటానికి వీల్లేకుండా వీలునామా రాసి పోయాడు.


    మనవల హయామొచ్చింది.


    ఆ ఇంట్లో సగభాగం ఖాళీస్థలం రూపంలో వుంది. మిగతా సగం శిథిలావస్థలో వున్న గదుల రూపంలో వుంది. ఇన్నాళ్ళూ ఆ గదుల్లోనే ఎవరి వీలు ప్రకారం వాళ్ళు సర్దుకుని, వండుకోటానికి ఎవరి స్థలాలు వాళ్ళు కేటాయించుకుని, అలా కుదరనప్పుడు ఒక వంటింటిలోనే యిద్దరు చొప్పున విడివిడిగా వంటలు చేసుకుని_ కాలం నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆఖరివాడు కూడా మేజరయ్యాడు. ఆస్తి పంచుకోవాలని వేడి అందరకూ కలిగింది. ఎంత సక్రమంగా పంచుకుందామన్నా_కొందరకు ఖాళీ స్థలమొస్తుంది. కొందరకు పోర్షన్లు వస్తాయి. పంపకాలు తెగటం లేదు. అందరిలోకి పెద్దవాడు సౌమ్యుడు. కాని అతని భార్య చాలా గడుసుది. ఎవరిమట్టుకు వారు పంపకాల విషయంలో తమకన్యాయం జరిగిపోతున్నట్లు భావించేవారు. అందులో తెగింపున్న వారెవరూ లేరు. సంవత్సరాలు గడిచిపోతున్నా సమస్య పరిష్కారం కావటంలేదు. మొగవాళ్ళు రాజీకొద్దామన్న ధోరణి ప్రదర్శించినా ఆడవాళ్ళు పడనివ్వడంలేదు. ఒక్కోసారి పెద్ద ఎత్తున పోట్లాటలు జరిగేవి. నెలలతరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్ళు కాదు. అయిదుగురు కొడుకుల్లో ఆర్థికంగా ఒకరూ పైకి రాలేదు. ఒకరికీ సరిగా చదువు అబ్బలేదు. అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళే. అందరివీ చాలీ చాలని బ్రతుకులే.


    పెద్దవాడి పేరు రాజశేఖరం. అతనికి నలభయి అయిదేళ్ళుంటాయి. నలుగురు పిల్లలు. అందరూ కూతుళ్ళే. ముగ్గురు పుట్టాక ఆపరేషన్ చేయించుకుందామనుకున్నాడు. కాని సుపుత్రుడు కలుగుతాడన్న ఉద్దేశంతో భార్య సీతాదేవి పడనివ్వలేదు. దాని గురించి యిద్దరి మధ్యా కొంతకాలం మనస్పర్థలొచ్చాయి. చివరికతను లొంగిపోక తప్పలేదు.


    నాలుగోసారి కూడా ఆడపిల్లే పుట్టింది.


    కాన్పుకూడా చాలా కష్టమయింది. చివరకు సీతాదేవి తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భర్త ఆపరేషన్ చేయించుకోటానికి ఒప్పుకుంది.


                                                        *    *    *    *


    ఉదయం తొమ్మిదిన్నరకు రాజశేఖరం ఆఫీసుకెళ్ళడానికి తెమిలి భార్యను అన్నం పెట్టమన్నాడు.


    "కూరా, పులుసూ యింకా కాలేదు. పూజ చేసుకుంటే ఆలస్యమైపోయింది" అంది సీతాదేవి.


    "పోన్లే. దారిలో టిఫిన్ తిని వెడతాను" అన్నాడు రాజశేఖరం.


    "అబ్బో! వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే. నేనేదో ఖాళీగా వున్నట్టు."


    ఆమెకు యితరులెంత సాఫీగా మాట్లాడుతున్నా అందులో తప్పులు కనిపిస్తూ వుంటాయి.

    
    "నేనేం వ్యంగ్యం కోసం అనలేదు. నీకిబ్బంది కలిగించటం యిష్టంలేక..." అన్నాడు.


    అతను చెప్పింది నిజమే. అతను మనసులో వున్నది వున్నట్లుగా చెప్పినా ఆమె దోషిలా మాట్లాడుతుంది.


    "ఓ పావుగంట కూచుంటే ఏమవుతుంది? ఈలోగా కూరా అవీ చేసేస్తాను."


    "మా ప్రొప్రయిటర్ నిన్నకూడా ఆలస్యంగా వచ్చానని తిట్టాడు"


    "తిడితే ఎదిరించలేరా?"


    "మనం తప్పుచేసి ఎదిరించాలా?"


    "మనం అంటే నేను తప్పు చేశానన్నమాటేగా. సంవత్సరాల తరబడి వండిపెడుతున్నా ఒక్కపూట ఆలస్యమయేసరికి ఎంత హడావుడి చేస్తారండీ? నన్ను నేరస్థురాలిగా ఎత్తి చూపుదామనేగా"


    ఇహ వాగ్వివాదం మొదలుపెడితే దానికి అంతు వుండదని అతను హతాశుడై నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సీతాదేవి చక చక వంట చెయ్యటం మొదలుపెట్టింది.

 Previous Page Next Page