Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 15


    "ఛా... ఛా... ఎప్పుడయినా అనుమానించానా భాయ్? పటిష్టమయిన భద్రతా ఏర్పాట్ల మధ్యనున్న వ్యక్తిని అసాసినేట్ చేయటం చాలా ప్రమాదకరమని, జాగ్రత్తగా ఉండమని హితవు చెబుతున్నానంతే" అతని కంఠంలో తొంగి చూసిన నిజాయితీని జోహ్రా పసిగట్టాడు.
    
    "థాంక్యూ ప్లాన్ నెంబర్ ఒన్ ని రేపు అమలుపరుస్తారు. దీనిలో నా రిస్క్ చాలా తక్కువ. నేను క్షేమంగా బయటపడే మార్గాలు ఎక్కువ."
    
    వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే తెల్లవారి పోయింది. మరికొద్ది సేపటికి జోహ్రా అక్కడి నుంచి కదిలి, క్లబ్ బయటకు వచ్చి అప్పటికే సిద్దంగా వున్న టాక్సీ ఎక్కాడు.
    
    అది జుహు కేసి దూసుకుపోయింది. జోహ్రా చాలా ప్రమాదకరమయిన వ్యక్తి.
    
    రాటుతేలిన ప్రొఫెషనల్ కిల్లర్.
    
    ఏ ఆయుధాన్నయినా గురి తప్పకుండా ప్రయోగించగల దిట్ట ఎంతటి ప్రమాదకరమయిన ఉచ్చులోంచి అయినా పాదరసంలా జారుకోగల తెలివితేటలు అతని సొత్తు.
    
    జోహ్రా ఎప్పుడూ మరొకర్ని సంప్రదించడు. తోడు తీసుకోడు. మార్క్స్ మెన్ పనుల్ని కూడా తనే చూసుకుంటాడు.
    
    కిల్లింగ్ బిజినెస్ లోకి కొత్తగా దిగిన ఎమెచ్యూర్ జోహ్రా దగ్గర పని చేసేందుకు ఉత్సాహపడతారు. ఎదురు డబ్బులిచ్చయినా ఒకటి, రెండు అసాసినేషన్స్ లో జోహ్రాతో పనిచేయాలనుకుంటారు.
    
    టాక్సీ వేగంగా జుహు కేసి దూసుకుపోతోంది. జోహ్రా తన ప్రక్కనే ఉన్న తన పార్టనర్ తో పార్సీలో మాట్లాడసాగాడు.
    
    "లుకౌట్ మెన్.... సిగ్నల్ మెన్.... ఇద్దరూ అక్కర్లేదు" జోహ్రా బేస్ వాయిస్ లో అన్నాడు.
    
    "మరెలా మనకు తెలుస్తుంది.....?" జోహ్రా పార్టనర్ ఖలీల్ ఆశ్చర్యపోతూ అడిగాడు.
    
    "దేవానంద్ ఇంటి మలుపుకి ఎదురుగా, దూరంగా విక్టరీ కోర్టు అపార్టుమెంట్సు బిల్డింగ్ వుంది. సిగ్నల్ మెన్ ని ఆ అపార్టుమెంట్సు టెర్రస్ మీద ఉండే ఏర్పాట్లు చేయి. స్క్వేర్ టైప్ టార్చ్ లైట్ కి ఒక నైలాన్ తాడు కట్టి అతనికివ్వు. ముందుగా అతను బైనాక్యులర్స్ సహాయంతో మాస్టర్ ఫైలట్స్ ని చూస్తాడు. చూడగానే అప్పటివరకు తన చేతిలో ఉమ్చుకున్న లైట్ ని చిన్నగా టెర్రస్ మీంచి క్రిందకు జారవిడుస్తాడు. చెట్టుమీద ఉన్న నాకు ఆ లైట్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే నాకు సిగ్నల్. ఆ సిగ్నల్ ని చూస్తూనే నేను అలర్ట్ అయిపోతాను.
    
    చందనా థియేటర్ కి ఒకింత అవతల నువ్వు రెండు వాహనాలతో సిద్దంగా ఉండాలి.
    
    నాకెప్పుడైతె సిగ్నల్ మెన్ నుంచి సిగ్నల్ వస్తుందో, నేను వెంటనే నా దగ్గరున్న టార్చ్ లైట్ ని రెండుసార్లు నీవుండే దిశకేసి వెలిగిస్తాను. ఆ మరుక్షణం నీవు బయలుదేరి చందనా థియేటర్ మీంచి దేవానంద్ ఇంటికేసి వెళ్ళే మార్గంలోకి రావాలి.
    
    నీ వాహనం, దాని వెనుకే వచ్చే మరో వాహనం ఎదురుకాగానే మాస్టర్ ఫైలట్స్ వేగం మందగిస్తుంది. దాంతో ఆటోమేటిగ్గా మాస్టర్ రోల్స్ రాయిస్ వేగం కూడా మందగిస్తుంది.
    
    జెనరల్ ట్రాఫిక్ అడ్డు తగిలిందనే వాళ్ళు భావిస్తారు. కాని వాళ్ళు అప్పటికే అలర్టు అవుతారు. నీవు ఏర్పాటు చేసే వాహనాలు కొద్ది క్షణాల్లోనే మాస్టర్ వాహనాల్ని దాటి వెళ్ళిపోవాలి.
    
    ఆ కొద్ది సమయం చాలు నాకు...." జోహ్రా ట్రాన్స్ లో ఉన్నట్లుగా చెప్పుకుపోయాడు.
    
    "పథకం బాగానే ఉంది. కాని నేను, నువ్వు ఎలా తప్పించుకోగలం?" ఖలీల్ సాలోచనగా అడిగాడు.
    
    "నేను షూట్ చేసే లోపే మాస్టర్ వాహనాలకు ఆపోజిట్ డైరక్షన్ లో నీ వాహనం మెరుపు వేగంతో వెళ్ళిపోవాలి. అదే మాత్రం ఆలస్యమైనా నీ వాహనాన్ని, నీ వెనుక వచ్చే వాహనాన్ని, మాస్టర్ కి సంబంధించిన సెక్యూరిటీ కమెండోస్ అనుమానించే ప్రమాదం ఉంది.
    
    ముందయితే పర్వాలేదు. నేనెప్పుడయితే షూట్ చేస్తానో అప్పుడు నా దిశకు కొన్ని గన్స్, నీ దిశకు కొన్ని గన్స్ పేలటం ఖాయం."
    
    "అయితే మరి నా పరిస్థితి అంత క్షేమకరమైనది కానట్లుగానే తోస్తోంది. సీన్ లో నేను లేకుండా మాస్టర్ వాహనాల వేగాన్ని తగ్గించే ఏర్పాట్లు చేస్తాను. అది సరే... మరి నీవెలా తప్పించుకోగలవు?" ఖలీల్ ఒక నిర్ణయానికి వస్తున్నాడు.
    
    "మెషిన్ గన్ తో రోల్స్ రాయిస్ టాప్ ని గురి చూసి కాలుస్తాను. బుల్లెట్స్ రిలీజ్ అయిన మరుక్షణం చెట్టునుండి క్రిందకు వేలాడదీసుకునే నైలాన్ తాడు ద్వారా జారిపోతాను. ఆ నైలాన్ తాడుకి గ్రీజ్ అప్లయ్ చేసి ఉంటుంది కనుక క్షణాల్లో నేను కిందుంటాను. ఆ మరుక్షణం గేటు కేసి పరుగెత్తి అక్కడ సిద్దంగా ఉండే జీప్ లో బీచ్ కేసి దూసుకుపోతాను. నాకేం ఫరవాలేదు. నువ్వు అరేంజ్ చేసే కార్ల గురించే సీరియస్ గా ఆలోచించాలి. ఆ కార్లను నడిపే డ్రైవర్స్ సెక్యూరిటీ కమెండోస్ చేతుల్లో ప్రాణాలు వదిలినా వదలవచ్చు."
    
    "నో.... ప్రాబ్లమ్.... ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. అయితే ఇందులో చిన్న సవరణ."
    
    "ఏమిటది....?"
    
    "దేవానంద్ ఇంటి గేటుముందు జీప్ ని స్టార్టు చేసి నీకోసం సిద్దంగా నేనుంటాను."
    
    "ఓకే." జోహ్రా, ఖలీల్ ప్రపోజల్ కి ఒప్పుకున్నాడు.
    
    "కొన్ని సందేహాలున్నాయి." ఖలీల్ కి ప్రతి విషయంలోనూ సందేహ మొస్తుంటుంది.
    
    "తీర్చుకో" అన్నాడు జోహ్రా టాక్సీలోంచి బయటకు చూస్తూ.
    
    "నా లెక్క ప్రకారం మనకు తెలిసిన మాస్టర్ ప్రోగ్రామ్ ప్రకారం 6-45కి మాస్టర్ కారు దేవానంద్ ఇంటి మలుపు దగ్గరకు వస్తుంది. అప్పుడు చీకటి పడుతుందా? చీకటి పడకపోతే విక్టరీ కోర్టు అపార్టుమెంట్సు టెర్రస్ మీద ఉండే సిగ్నల్ మేన్ ఇచ్చే సిగ్నల్ లైటు నీకు కనిపిస్తుందా? ఒకవేళ కనిపించినా, చెట్టు గుబురులో ఉండి నువ్వు ఇచ్చే సిగ్నల్ చందనా ధియేటర్ కి అవతలవేపు సిద్దంగా ఉండే వెహికల్స్ డ్రైవర్స్ కి కనిపిస్తుందా?
    
    అలా కనిపించనప్పుడు, వాళ్ళు మాస్టర్ వెహికల్స్ కి ఎదురుపడటం ఆలస్యమైతే ఏమిటి పరిస్థితి?"

 Previous Page Next Page