Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 14


    "రోడ్ మేటా... రూమ్మేట్సని విన్నాంగానీ, యిదెక్కడి కొత్త పదమండి..." ఆశ్చర్యపోయింది మేరి.

 

    "ఇద్దరం కల్సి రోడ్లన్నీ 'సర్వ్' చేస్తాంలెండి... అందుకు... ఏవిటీ ఆఫీసుకు సెలవిచ్చారు గదా... మళ్ళీ ఎందుకొచ్చారు?" అడిగాడు ఆంజనేయులు.

 

    "నేనూ... మీలాగే... సింగిల్ గా రూంలోనే వుంటున్నానండీ... బోర్ కొట్టేస్తోంది... సిన్మాకెళదామని బయల్దేరి... దారిలోనే ఆఫీసు కదా ఎవరయినా వుంటారేమోనని చూడటానికొచ్చాను... తీరా చూస్తే మీరున్నారు. పనేం లేదుకదా... సిన్మాకెళదాం... కంపెనీగా రాగూడదా..." అనడిగింది మేరీ.

 

    "పనేం లేదా... నేనిక్కడుంటే పనిలో వున్నట్టేనండి. ఆఫీస్ ని నాకప్పగించి బాస వెళ్ళిపోయాడు... ఇవాల్టికి నన్నొదిలేయండి.." మొహమాటంగా అన్నాడు ఆంజనేయులు.

 

    "అయితే రేపొస్తారా..." వస్తానని అనకపోతే వదిలేటట్టు లేదని నిశ్చయించుకొని-

 

    "ష్యూర్... ష్యూర్" అన్నాడు బలవంతంగా నవ్వుతూ.

 

    వెళ్ళిపోయే ముందు ముఖం మీద మొఖం పెట్టి....

 

    "నిజం చెప్పండి ఆంజనేయులుగారూ... మీకు పెళ్ళి కాలేదు కదూ..."

 

    "కాలేదండీ బాబూ..."

 

    "నిజం..."

 

    "నిజంగా నిజమండి"

 

    "అయితే ఎవర్నయినా ప్రేమించారా...?"

 

    "ప్రేమా... లేదండీ... అలాంటిదేం లేదు. గాడ్ దుర్యోధనుడి సాక్షిగా నిజం..."

 

    "గాడ్ దుర్యోధనుడా... ఆయనెవరు?"

 

    "అదో పెద్ద కథ... తర్వాతెప్పుడైనా చెప్తాను... ముందు మీరు వెళ్ళండి... సిన్మాకి లేటైపోతుంది..."

 

    తప్పదన్నట్టుగా బయటికొచ్చింది మేరీ. సిన్మాకెళుతూ దార్లో ఆలోచించింది.

 

    కుర్రవాడు బుద్ధిమంతుడు, అమాయకుడు, చాదస్తపు మగాడు. ఉద్యోగస్తుడు. ఇలాంటివాడ్ని తను దార్లోకి తెస్తే గనుక, 'నా సామిరంగా'

 

    'రేపట్నించి గురుడికి లైనెయ్యాలి' అనుకుంది జాయ్ ఫుల్ గా.

 

    అదే సమయంలో....

 

    మళ్ళీ నిద్రలోకి జారుకోబోతున్న ఆంజనేయులు మెదడులోనో, బుర్రలోనో ఓ ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది.

 

    ఆ ముత్యాలముగ్గు బిల్డింగులోకి తను ప్రవేశించాక, వారం రోజుల లోపల తనకో భార్య కావాలి... ఇంత అర్జంటుగా భార్య దొరకదు కాబట్టి. అవసరమైతే ఈ 'మేరీ'ని తను భార్యగా చూపించడానికి వీలుగా 'మేరీ'తో తను కొంచెం, కొంచెమంటే కొంచెం 'ఫ్రెండ్ షిప్' చేస్తే చాలా బావుంటుంది.

 

    "తప్పేం లేదు... కదా... ఆహా... అంజిబాబూ... నీ బుర్రే... బుర్ర... ప్రాబ్లమ్ ఎలా ఫ్లవర్లా విడిపోయిందో" అని అనుకుని ఆ ఆనంద కరమైన వార్తని ఆనందంతో చెప్పేయాలని అలా లేచి రోడ్డు మీద కొచ్చేశాడు ఆంజనేయులు.


                                                     *    *    *    *


    మరో ఇరవై నిమిషాల తర్వాత శివం రోడ్లోని టెలీఫోన్ బూత్ దగ్గరున్నాడు ఆంజనేయులు.

 

    కానీ ఆ బూత్ లో సుధాకర్ మాత్రం కనిపించలేదు. ఆ బూత్ లో ఇంకెవడో వున్నాడు.

 

    ఇక్కడ కూడా అర్జెంట్ గా మానేశాడా... అని ఆ బూత్ లో భూతంలా కూర్చున్న ఓ ముసిలాడ్ని అడుగుదామని నిర్ణయించుకుని ముందుకు నడుస్తున్న ఆంజనేయులు భుజమ్మీద ఓ చెయ్యి పడింది.

 

    తల తిప్పి చూశాడు. ఎదురుగా ఆనందం!

 

    "ఇదేనా... నువ్వు పని చేసే బూత్..." అడిగాడు ఆంజనేయులు.

 

    "ఇదే... అరగంట క్రితం వరకూ నేను పనిచేసిన బూత్..."

 

    ఆ మాటకు అవాక్కయ్యాడు ఆంజనేయులు.

 

    "అప్పుడే గొడవ పడ్డావా? వాడు నిన్ను తన్ని తగిలేశాడా?" అనుమానంగా అడిగాడు ఆంజనేయులు.

 

    "కంగారు పడకురా...పిచ్చికన్నా... ప్రతిభ ఒకచోట ఆగదు... ఒకచోట దాగదు... ఉదయం నీ దగ్గర్నించి డ్యూటీ కొచ్చి కూర్చున్నానా? రెండు గంటలు గడిచాక... ఓ వ్యక్తి నా దగ్గరకొచ్చాడు. నన్ను, నా పని తనాన్ని నిశితంగా పరిశీలించాక, నీలాగ కస్టమర్లతో పర్సనల్ 'టచ్'ని పెంచుకునేవాడే నాకు కావాలి... వాడి కోసమే నేను పేపర్లలో ఎడ్వర్టేజ్ మెంట్లు వేయిస్తున్నాను... రా... నా మెడికల్ షాపులో పన్చేద్దూగాని రా... అని" ఉన్న పళాన తీసుకుపోయాడు. సాలరీ థౌజెండ్ రూపీస్... అప్పుడే మూడు వందలు ఎడ్వాన్స్ కొట్టేశాం... పద... దిల్ దునియా... మందే రాజ్యం పద" అన్నాడు రెచ్చిపోతూ ఆనందం.

 

    వరసగా ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు చూసేసి, బస్టాండ్ లో తెల్లవారేవరకూ గడిపేసి అక్కడ ఓ ఆటో ఎక్కారు.

 

    "ముషిరాబాద్..." ఠీవిగా చెప్పాడు ఆనందం.

 

    "ఇల్లన్నాక సామాన్లతో దిగాలి కదరా... నిన్నెలా వున్నావో ఇవాళ కూడా అలాగే వుంటే ఎలాగరా... ఒక చాపైనా లేకపోతే ఆవిడ మనల్ని అనుమానించవచ్చు" బెంగగా అన్నాడు ఆంజనేయులు.

 

    "ఓ.కే... చాప సాంక్షన్ డ్" అని కోఠీ చౌరస్తాలో ఓ చాప, ఓ దిండు కొనుక్కుని మళ్ళీ ఆటో ఎక్కారు ఇద్దరూ.

 

    సరిగ్గా ఎనిమిది గంటలకు-

 

    ఆ బిల్డింగ్ ముందు ఆటో ఆగింది.

 

    అప్పటికే గూర్ఖాతో 'అవుట్ హౌస్'లో వాళ్ళుంటారని చెప్పడం వల్ల ఆటో ఆగ్గానే-

 

    గూర్ఖా వినయంగా సెల్యూట్ చేసి, గేటుని బార్లా తెరిచాడు.

 

    "డ్రైవర్... ఆటోని లోపలకు పోనీ... ఈ బిల్డింగ్ ఎవరిదో అనుకుని చూస్తున్నావా? మాదేలే" అని లోన మెట్ల దగ్గర ఆటో ఆపాక-

 

    ఒకరు చాపని, ఇంకొకరు దిండుని చంకల్లో పెట్టుకుని దిగడం చూసి-

 

    భుజంగరావు నవ్వుకుంటూ లోన్నించి వచ్చాడు.

 

    ఆటోవాడు పిచ్చెక్కిపోయి వెళ్ళిపోయాడు.

 

    "సామానూ అవీ వెనక బండిలో వస్తున్నాయా..." గేటు వేపు చూస్తూ అడిగాడు భుజంగరావు.

 

    "సామానా..." ఇద్దరూ ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు.

 

    "డబుల్ కాట్ మంచాలవీ, బరువు కదాని... ప్రస్తుతానికి అక్కడే వదిలేసేమండీ... తీరుబడిగా తెచ్చుకోవచ్చు కదండీ... ఇప్పుడు ఎనిమిది గంటలకు ముహూర్తం మంచిదని పురోహితుడు చెప్పడంతో ఆదరా బాదరాగా వచ్చేసేమండీ" సర్దుబాటు చేసేశాడు ఆనందం.

 Previous Page Next Page