ఆవేశంలో రొప్పుతూ బృహస్పతి లేచి నిలబడ్డాడు. "ఒరేయ్! రాజకీయ లక్షణాలు నీకూ వచ్చేసాయిరా. పోతే- మిగతా వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా వస్తే, నీకా నాలుగు రోజులలోనే వచ్చేసాయి. నిన్ను నమ్మి నేను చాలా మోసపోయాను. నేనే తెలివైన వాడినన్న గర్వం నాకు చాలా ఉండేది. భగవంతుడా! ఇప్పుడేం చేయను?"
"అంతా నేనే- అన్న గర్వం నశింప చేసుకోవడమే రాజకీయాల్లో మొదటి పాఠం నాయనా! లేకపోతే మాజీ మహానాయకుడి ముద్దుల భార్యలానో, తనయుడి పెళ్ళిలో తన అట్టహాసాన్ని నిరూపించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రిణిలానో మట్టిగొట్టుకుపోతావు. పోతే- నమ్మి మోసపోయానన్నావ్. 'మరేం చేయనూ' అని వాపోయావు. నమ్ముతూనే ఉండు నాయనా! అదే నువ్వు చేయవలసినది."
* * *
"బాబూ! ఈ అమ్మాయి నా మనవరాలు. పేరు నివాళి. పూర్తిపేరు ప్రశాంత నివాళి."
ధ్యానముద్రలో వున్న బాబా కళ్ళు విప్పాడు. ఆ అమ్మాయిని చూసి ఒక్కసారి విచలితుడయ్యాడు. నివాళి అంటే అర్చన. నిజంగానే ప్రశాంతమైన అర్చనలాగే వున్నది ఆ అమ్మాయి. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, ముగ్ధ మోహనంగా వుంది.
"స్వామీ! ఇంకో నెలరోజుల్లో దీని పెళ్ళి. మీ ఆశీర్వాదం కోసం తీసుకొచ్చాను. మంగళప్రదమైన వివాహం జరగాలని దీవించండి" అన్నది ముసలమ్మ.
బాబా ఆమెవైపు ఓ క్షణం కన్నార్పకుండా చూసాడు. "నీకో దుర్వార్త అవ్వా! ఆ అమ్మాయికి వితంతు యోగం వుంది. వివాహం జరిగిన వారం రోజుల్లో భర్త మరణిస్తాడు."
అవ్వ గొల్లుమంది. నివాళి బిత్తరపోయి చూస్తోంది.
బాబా కళ్ళు మూసుకుని, ధ్యాన ముద్రలో రెండు క్షణాల పాటు వుండి, తిరిగి కళ్ళు తెరిచాడు. "అయితే దీనికో పరిష్కార మార్గం వుంది. సహస్ర రజతపత్ర యజ్ఞం చెయ్యాలి. రెండు రోజుల ఏకాంతసేవలో యాగం పూర్తిచేస్తే ఫలితం దక్కుతుంది. వివాహ సమయం వారం రోజులు కూడా లేదంటున్నారు కాబట్టి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది."
ఆ ముసలమ్మ భయంతో వణుకుతూ "ఇక ఆలోచించేదేమున్నది స్వామీ! సౌభాగ్యం కన్నా మరేది ముఖ్యం? రేపే యాగం ప్రారంభించండి. ఆ అమ్మాయి కట్నం కోసం తీసి వుంచిన డబ్బు వున్నది. మగపెళ్ళివారి కాళ్లావేళ్ళాపడి బతిమాల్తాను. అమ్మాయి అదృష్టవంతురాలు. ఆఖరి నిముషంలో మీ కంట పడింది. లేకపోతే నా చిట్టితల్లి బ్రతుకు నాశనమై వుండేది" అంది.
"చాల్చాలు. పొగడ్తలతో సమయం వృధా చెయ్యక రేపు డబ్బిచ్చి అమ్మాయిని పంపించు" అన్నాడు బాబా.
జనం మధ్యలోంచి ఇదంతా చూస్తున్న బృహస్పతి "ఆపండి" అంటూ గట్టిగా అరిచాడు. జనమంతా ఒక్కసారి అతడి వైపు తిరిగారు.
"ఇదంతా మోసం! కేవలం మన అజ్ఞానం మీద ఆడుకునే చర్య. మొహం చూడగానే విధవరాలు అవుతుందని తెలియటం ఏమిటి? దానికి వెండి ఆకులతో యజ్ఞం ఏమిటి? ఈ దొంగస్వామిని కిందికి లాగండి" ఆవేశంగా అన్నాడు.
"ఇలా దగ్గరికి రా నాయనా!" స్వామిజీ చిరునవ్వుతో బృహస్పతి పిలిచాడు. "నీకు నా మహిమల మీదా, శక్తులమీదా నమ్మకం లేనట్టుందే!"
"లేదు.... ముమ్మాటికీ లేదు. ఇంకా చెప్పవలసి వస్తే గతంలో నువ్వు నా...."
బృహస్పతి మాటలు పూర్తికాకుండానే బాబా తన కమండలంలోని నీళ్ళు తీసి అతడి మొహం మీద బలంగా కొట్టాడు. ఆ నీరు వేదండ భయద శుండాదండ నిర్వాంత ఝరియై వచ్చి బృహస్పతి మొహాన్ని తాకింది.
బృహస్పతి వెనక్కి విరుచుకు పడిపోయాడు. అతడికి స్పృహ తప్పింది.
జనమంతా నిశ్చేష్టులై ఆ దృశ్యాన్ని విభ్రమంగా చూడసాగారు. ఐదు నిముషాల తర్వాత బృహస్పతి కళ్ళు విప్పాడు. లేచి కూర్చుని చుట్టూ చూసాడు. అతడి కళ్ళు నిస్తేజంగా వున్నాయి.
"నేనెక్కడున్నాను?" అన్నాడు అస్పష్టంగా.
"ఇక్కడే నాయనా! నీ ప్రజలమధ్య" అన్నాడు బాబా కరుణ నిండిన స్వరంతో.
బృహస్పతి వెంటనే మాట్లాడలేదు. రెండు చేతుల వేళ్ళూ జుట్టులోకి చొప్పించి, తల బలంగా విదిలించి, లిప్తపాటు అచేతనంగా ఆలోచనలో మునిగిపోయాడు.
"ఏం జరిగింది బాబూ?"
"నేను..... నేను మరణించాను."
"జీవితం మరణం మిధ్య నాయనా! ప్రాణాలు పోసేదే తప్ప నా కమండలంలోని నీటికి ప్రాణాలు తీసే కాఠిన్యం లేదు. ఏం జరిగిందో సవివరంగా చెప్పు."
"విన్నవించుకుంటాను స్వామీ! నా మూర్ఖత్వం పటాపంచలయింది. నేను ఊర్ద్శలోకాలు చూసి వచ్చాను. బ్రతికి మళ్ళీ బట్టకట్టాను." జనం అంతా అవాక్కై అతడి మాటలు వింటున్నారు.
"అవును స్వామీ! నాకు నా గత జన్మ గుర్తొచ్చింది. ఆ జన్మలో నేను డాకూ మంగళ్ సింగ్ ని."
ఒక్కసారిగా జనంలో కలంకలం చెలరేగింది. ఒకేసారి జనమమతా గుసగుసలాడడం మొదలు పెట్టడంలో, వింటినుంచి వందబాణాలు వదిలిన శబ్దం అక్కడ గాలిలో వ్యాపించింది.
బాబా చెయ్యెత్తి సైగ చేయడంతో తిరిగి నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలోంచి బృహస్పతి కంఠం అక్కడున్న వారందరికీ వినిపించేలా ప్రతిధ్వనించింది.
"డాకూ మంగళ్ సింగ్ గా ఎన్నో పాపాలు చేసి, పాతిక సంవత్సరాల క్రితం ఇదే ప్రదేశంలో పోలీసుల దాడిలో మరణించిన నేను - యమలోకానికి వెళ్ళాను. చంబల్ లోయలో ఎన్నో హత్యలూ, మానభంగాలూ, ఘాతకాలూ చేసి, రక్తపాతం సృష్టించిన నేను, యముడి దగ్గరికి తప్ప మరెక్కడికి వెడతాను? నా పాపాల లిస్ట్ చూసిన చిత్రగుప్తుడు, నాకే శిక్ష విధించాలో తెలియక సలహా ఇచ్చేందుకు కొట్టుమిట్టులాడాడు. 'ఖండ ఖండాలుగా నరికి, సలసలా కాగే నూనెలో వేయించడం.... ఏనుగుల చేత తొక్కించడం.... లాంటి శిక్షలన్నీ వేసినా కూడా, మరికొన్ని పాపాలు మిగిలిపోతాయి' అన్నాడు. యముడు కూడా ఏం చెయ్యాలో తోచనట్లు ఆలోచనలో పడ్డాడు. వారి సందిగ్ధావస్థను చూసి, నేను చేతులు జోడించి ఇలా అన్నాను. "....స్వామీ! వైవస్వంతా! శ్రాద్ధదేవా! కృతాంతా! దండధరా! కాలనేమీ! నీవు ఘటానఘట సమర్ధుడివి! చేసిన పాపాలకి శిక్షే పరిష్కారం కాదని నీకు చెప్పాగలిగేటంతటి గొప్పవాడిని కాదు. కానీ నాకో అవకాశం ఇచ్చి చూడండి. నేను చేసిన పాపాలు అన్నిటికీ సరిపడు శిక్ష మీ యమలోకపు శిక్షాస్మృతిలోనే లేదంటున్నారు కదా! అందువల్ల తిరిగి నన్ను భూలోకం పంపించండి. ఎన్ని పాపాలు చేసానో అన్ని మంచిపన్లు చేస్తాను. బందిపోటుగా ఎన్ని వేలమంది ప్రజలకి అన్యాయం చేసానో.... నాయకుడిగా అందుకు వందలరెట్లు ప్రజలకి సేవ చేసుకుంటాను. నిస్వార్ధంతో ఒక్కొక్క మంచిపనీ చేస్తూ, నా ఒక్కొక్క పాపాన్నీ హరింపచేసుకుంటాను. సంపూర్ణ మానవుడిగా నా జీవితం పరిసమాప్తం చేసుకుని తిరిగి మీ దగ్గరికి వస్తాను. ఈ మధ్య సమయంలో నేను ప్రజలకి ఏ మాత్రం అన్యాయం చేసినా.... నాలో ఏమాత్రం స్వార్ధం తొంగి చూసినా.... నా పాపాలు ఏ కొద్దిగా మిగిలినా.... మీరే శిక్ష విధించినా దానికి సిద్ధమే! అన్నాను. యముడికి నా అభ్యర్ధన ముదమైనది...... ఆమోదమైనది" బృహస్పతి చెప్పడం ఆపి జనం వేపు చూసాడు.
జనం శిలా ప్రతిమల్లా చేతనావస్థకి అతీతులై వున్నారు. అతడు తిరిగి కొనసాగించాడు.
"తిరిగి జన్మించమని అనుజ్ఞ ఇచ్చాడు యముడు. పాతిక సంవత్సరాల తర్వాత, నేను ఎక్కడైతే మరణించానో, అక్కడే నాకు ఒక మహాయోగి పరిచయమవుతాడనీ, అతడి సంకల్పంతో గతజన్మ గుర్తు వస్తుందనీ చెప్పి పంపాడు...." అంటూ వెళ్ళి హనుమంతరావు కాళ్ళమీద తల ఆన్చాడు బృహస్పతి.
"స్వామీ! నన్ను క్షమించండి. మూర్ఖుడినై మీ శక్తిని శంకించాను" అంటూ భక్తితో ప్రణమిల్లాడు.
"నేను చేసినదేమీ లేదు బాబూ! నిమిత్త మాత్రుణ్ణి. నావల్ల నీ మనోనేత్రం తెరుచుకునేలా వ్రాసి పెట్టి వున్నది. దానినే విధి అంటారు. నన్ను నమ్మక అనవసరంగా గొడవ పెట్టుకున్నావు. అలాటి అపనమ్మకాలు మాని ఈ క్షణం నుంచీ పునీతుడవై నువ్వు ప్రజలకు సేవ చేయి. భగవంతుడి అండదండలు నీకెలాగూ వున్నాయి కదా! పాపం, ఇంతకాలం ఈ ప్రజల స్వార్ధరహితుడైన నాయకుడి కోసం వేచి ఉన్నాను. మొహం వాచి వున్నారు. వారిని సరియైన బాటలో నడిపించి, భారతదేశంలో బీదతనాన్ని రూపు మాపు. కేవలం ఐదు పైసలకే కిలో బియ్యాన్నివ్వు. చెరకు పంటనీ, ద్రాక్షతోటల్నీ నిషేధించు. వాటిలో కూడా మద్యం వుంది. ప్రజల జీవితాన్ని సుఖప్రదం చేయడానికి అవతరించిన నీకు, గతజన్మ పేరు కలిసి వచ్చేలా 'మంగళ్ బృహస్పతి' అని పేరు పెడుతున్నాను."
ఆనందావేశం పట్టలేని ఒక యువకుడు "జై మంగళ బృహస్పతికీ" అని అరిచాడు. మిగతా ప్రజల గొంతులు పెద్ద చప్పుడుతో దానికి జత కలిపాయి.
9
గుంటలో పడి, పెద్ద చప్పుడుతో కారాగింది. వెనుక వస్తున్న కార్లు, ముందున్న మోటారు సైకిళ్ళూ ఆగాయి. మంత్రిగారు కారు దిగారు. కారు చక్రం పైన విరిగి వేలాడుతున్న షాక్ అబ్జార్బర్ తాలూకు ఇనుప ముక్కను చూస్తూ "సెక్రటరీ! ఎవడయయా ఈ రోడ్డు వేసిందీ?" కోపంగా అడిగాడు.
"రోడ్లు- భవనాల మంత్రిగా మీరు వున్నప్పుడు 'బుద్ధిలేని పాలెం బైపాస్ రోడ్డు' కంట్రాక్టు ఇచ్చింది మీ బావమరిదిగారికే సార్!" అన్నాడు సెక్రటరీ వినయంగా.
మంత్రి గతుక్కుమని ,వెంటనే సర్దుకుంటూ "రోడ్ల తప్పులేదయ్యా! కారుదే తప్పు. ఈ షాక్ అబ్జార్బర్ ఇంత బలహీనంగా తయారుచేసింది ఎవడంటా?" గతుకుల్లో పడి విరిగిపోయిన స్ప్రింగ్ ని చూస్తూ అన్నాడు.
"మీ మామగారు కేంద్రమంత్రిగా వున్నప్పుడు కార్ల కాంట్రాక్టు ఆయనే సైన్ చేసారు సార్!"
మామగారి ప్రసక్తి రాగానే కళ్ళు మూసుకున్నాడు. దివంగతులైన మామగారి ప్రసక్తి ఎప్పుడొచ్చినా అలా మూసుకోవడం ఆయనకి అలవాటు. అయితే అది భక్తో, తొందరగా పోయినందుకు కృతజ్ఞతో ఆయనకే తెలీదు. కళ్ళు తెరిచేసరికి ఏం చేద్దామన్నట్టు పియ్యే ఎదురుగా నిలబడి ఉన్నాడు.
"ఏసీ కారు లేకుండా ముందుకెట్లాగయ్యా సాగేదీ?" చిరాకుపడ్డాడు మంత్రి.
"మరి 'ప్రజల వద్దకు పాలన' అంటే అదే కదండీ."
"మాపై ఆయన దాన్ని ఏ ఉద్దేశ్యంతో పెట్టాడో నాకైతే తెలీదుగానీ, సెక్రటరీ! ఈ పీ.వీ.పీ. అనేది ఎందుకో తెలుసా? మనం ప్రజలని వాళ్ళమానాన వాళ్ళని వదిలేసామనుకో.... వాళ్ళ బతుకేదో వాళ్ళు బతికేస్తారు. వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడతారు. అట్లా వాళ్ళని బతకనివ్వకుండా ఉండడం కోసం మనం వాళ్ళ ఊరు వెళతాం. 'మేము మిమ్మల్ని పాలిస్తున్నామర్రా' అని గుర్తుచేస్తాం. వాళ్ళు మనల్ని మర్చిపోకుండా 'మనం పాలకులం' అని హెచ్చరిస్తాం. 'ప్రజల వద్ద పాలన' అంటే అదన్నమాట!.... ప్రజలు మహజర్లిస్తారు....మనం పరిశీలిస్తామంటాం. ఆ మాత్రం దానికే మొహం వాచిన ప్రజలు మన మొహం చూసినందుకే సంతోష పడిపోతారు. అది చాలదా వాళ్ళకి? నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే చెప్పు."