Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 14

 

      "మరెప్పుడూ కారు ఉపయోగించను. గుడికి వెళ్ళాలంటే బస్సులోనే వెళతాను" అంది ఉక్రోషంగా.
   
    "ఆ పనిచేసి రక్షించు. అయినా పతియే ప్రత్యక్ష దైవమని తెలిసి ఇలా గుళ్ళవెంబడి తిరుగుతారేం మీ ఆడవాళ్ళు?"
   
    పక్కనుంచి రాజేష్ భార్య "ఆ ఆడవాళ్ళలో నన్ను చేర్చకండి వినయ్" అంది నవ్వుతూ.
   
    నిర్మలకు ఒళ్ళు మండిపోయింది. విసురుగా "మరి మా పతిదేవుల దృష్టి మరో ఆడదాని మీదకు మళ్ళకూడదని ఆ దేవుడ్ని ప్రార్దించక తప్పదు కదా" అంది.
   
    రిటార్డు ఆమెకి దేవుడిచ్చిన వరం.
   
    రాజేష్ కి ఆమె రెండో భార్య, ఆవిడకు కూడా అది రెండో పెళ్ళి. ఆశ్చర్యమేమిటంటే ఆవిడ మొదటి భర్తకు విడాకులిప్పించి వీళ్ళద్దరికీ పెళ్ళి చేయించింది వినయచంద్రే. ఆవిడకు, వినయచంద్రకు కూడా ఏదో సంబంధం వుందనే లోకం అనుమానం.
   
    ఆమె ఉద్దేశ్యం అర్ధంకాగానే వినయచంద్ర కోపంతో కుతకుతలాడిపోయాడు. అతని చేయి విసురుగా పైకి లేచింది.
   
    ఇంతలో "మమ్మీ వాడు చూడు" అన్న సాహితి అరుపుకి ఆశ్చర్యంగా చూశారంతా.
   
    రాజేష్, కొడుకు ఉయ్యాల్లో పడుకున్న పమేలా దగ్గరకు వెళ్ళి కాలు పట్టుకుని తలక్రిందులుగా చేసి ఊపుతూ నవ్వుతున్నాడు. లోపల కనిపిస్తున్న దాని ప్యాంటీని చూసి షేమ్ షేమ్ అంటున్నాడు సరదాగా.
   
    రాజేష్, అతడి భార్యా ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకుంటున్నారు. సాహితి పరుగున వెళ్ళి దాన్ని లాక్కుంది. తిరిగి తీసుకొబోయిన వాడిని ఎడాపెడా కొట్టింది. వినయచంద్ర ఆశ్చర్యంనుంచి తేరుకుని పరిగెత్తుకెళ్ళి సాహితి రెండు బుగ్గల మీదా బలంగా కొట్టాడు.
   
    నిర్మల విసురుగా వెళ్ళి అతడ్ని పక్కకి తోసి సాహితిని దగ్గరకు తీసుకుంది.
   
    "మమ్మీ నాకా బొమ్మ కావాలి" ఏడుస్తున్నాడు రాజేష్ కొడుకు వాడెక్కడ దాన్ని లాక్కుపోతాడోనని గట్టిగా కావలించుకుంది సాహితి ఆమెకు దుఃఖం రావటం లేదు. భయం దాన్ని జయించింది.
   
    "రేపే కొనిపెడతా. కారొచ్చినట్లుంది. పదండి పోదాం. ఈ ఇంట్లో ఇంటి యజమానికే కాదు, వచ్చిన అతిథులకీ మనసు పాడవుతుంది" అంటూ గేటువైపు దారితీశాడు వినయచంద్ర.
   
    "మమ్మీ! వాడు ఎలా చేశాడో చూడు పమేలాను. అలాగేనా ట్రీట్ చేసేది? దాని కాలు పైకెత్తి షేమ్ చేశాడు రాస్కెల్" వెక్కెక్కి ఏడుస్తూ దాని జట్టు, బట్టలు సరిచేసింది.
   
    నిర్మల బాధగా ఆమెని దగ్గరికి తీసుకుంది. పమేలాని ఎవరయినా బొమ్మలా చూస్తే సహించలేదు సాహితి. అంత ప్రాణనేస్తమైపోయిందది.
   
    "అలాగేనమ్మా! ఈసారి వాడు మనింటికొస్తే బాగా కొడదాం."
   
    "ఎందుకమ్మా? ఎందుకలా ట్రీట్ చేశాడు వాడు? వాడి కేమన్నా పిచ్చా?"
   
    "మగవాడు కదమ్మా అంతే! ఆడవాళ్ళని ఏడిపించడంలోనే వుంది వాళ్ళ ఆనందమంతా" ఓదార్చుతూ లోపలకు తీసుకెళ్ళింది. సాహితి చిన్నపిల్లనీ, అటువంటి పిల్లలకి "సెల్ఫ్ పిటీ" బోధించకూడదనీ, అంతంత పెద్దమాటలు మాట్లాడకూడదనీ నిర్మలకి తెలీదు. చాలా ఇళ్ళల్లో ఈవిధంగా జరుగుతూ వుంటుంది.
   
    ఆ రాత్రి సాహితికి బాగా జ్వరమొచ్చింది. నిద్రలో ఒకటే కలవరింతలు రాజేష్ కొడుకు వచ్చి బలవంతంగా లాక్కెళ్ళి పమేలాని ఉరి తీస్తున్నట్లు, తండ్రి, రాజేష్ దూరంగా నిలబడి నవ్వుతూ చూస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది. తను ఏడుస్తుంటే తండ్రి వీధిలోకి గెంటేశాడు. తను, పమేలా దిక్కులేని వాళ్ళలా రోడ్లమీద అడుక్కుంటున్నారు. వీధిలో పిల్లలంతా పమేలాని ఇచ్చెయ్యమని వెంటపడ్డారు. ఇవ్వకపోతే రాళ్ళతో కొడుతున్నారు.
   
    ఆ సంఘటన, ఆ తర్వాత జ్వరం సాహితి మనసుమీద బలమైన ముద్ర వేశాయి. ఆమె కోపం ఆమెలో ద్వేషాన్ని రగిలించలేదు. భయాన్ని రేకెత్తించింది. ఏమీ చేయలేని అసహాయత పిరికితనాన్ని పుట్టించింది.
   
    ఇవి రెండూ ఇక జీవితాంతం ఆమెని వదలిపోలేదు.
   
                                  2
   
    "అమ్మా! ఎవరో వచ్చారు" చెప్పాడు సింహాచలం. చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తింది నిర్మల. టైం రాత్రి తొమ్మిదవుతోంది.
   
    "ఇప్పుడా? అత్తయ్యగారు లేరని చెప్పు"
   
    "చెప్పానమ్మా! మీతో మాట్లాడాలంటున్నారు" అన్నాడు. నిర్మల విసుగ్గా లేచి బయటికొచ్చింది.
   
    సోఫాలో కూర్చున్న వ్యక్తిని ఎక్కడో చూసిన గుర్తు.
   
    "నేను పరమహంసని. గుర్తుపట్టలేదా?" నవ్వుతూ అడిగాడతడు. నిర్మలకు గుర్తొచ్చింది. వినయచంద్ర క్లాస్ మేట్ అతడ్ని పెళ్ళిలో చూసిందంతే.
   
    "నమస్తే!" వచ్చి సోఫాలో కూర్చుంది యిబ్బందిగా.
   
    "ఏడీ వీడు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనబడడం లేదు. ఈ టైంలో ఇంటికొస్తాడని, ఆ నాలుగూ మొహంమీదే అడిగి దులుపుదామని వచ్చాను."
   
    "ఇంకా ఇంటికి రాలేదు" అంది నిర్మల ముక్తసరిగా.
   
    అతడు తలెత్తి ఆమెవైపు చూశాడు.
   
    "వచ్చేవరకూ కూర్చుంటాను. రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నాను. మీకేం అభ్యంతరం లేదుగా" అన్నాడు నవ్వుతూ.
   
    దూరంగా ఎక్కడో ఒక తీతువుపిట్ట వికృతంగా అరుస్తూ వెళ్తోంది. "అభ్యంతరం దేనికి? కూర్చోండి భోజనం చేశారా- చేస్తారా?"
   
    "భోజనమైంది. ఓ కప్పు టీ ఇస్తే సంతోషిస్తాను."
   
    "దానికేం భాగ్యం" నిర్మల సింహాచలాన్ని పిలిచి చెప్పింది.
   
    "మీకో పాప అని విన్నాను. ఏదీ?" అడిగాడతను.
   
    "లోపలుంది పిలుచుకొస్తాను" వెళ్ళింది నిర్మల.
   
    పరమహంసని చూడగానే ఎవరికైనా గౌరవం కలుగుతుంది. అతడు చాలా బీదవాడని, కష్టపడి చదివి పైకొచ్చాడని మామగారు ఎప్పుడూ చెపుతూండేవాడు. ఆయనే అతడి చదువుకి సహాయం కూడా చేశారు. ఆ కృతజ్ఞత అతడిలో పోలేదు అనుకుంది నిర్మల.
   
    ఇంతలో పమేలాని ఎత్తుకుని బయటికొచ్చింది సాహితి.
   
    "రామ్మా బేబీ! నీ పేరేమిటి?" దగ్గరకు తీసుకున్నాడు.
   
    "సాహితి నా ఫ్రెండ్ పేరు పమేలా. నమస్తే అంకుల్" బొమ్మ రెండు చేతులు కలుపుతూ అంది సాహితి.
   
    "వెరీగుడ్! నీ కోసం చిన్న కానుక తీసుకొచ్చానమ్మా చాలా బీదవాడు ఈ అంకుల్" జేబులోంచి చిన్న ప్యాకెట్ తీసి అందించాడు.
   
    "ఏమిటిది అంకుల్?"
   
    "మినీ పియానో, బటన్ నొక్కితే సంగీతం వస్తుంది" తీసి చూపించాడు.
   
    "బావుంది అంకుల్. థాంక్యూ! మా పమేలా పుట్టినరోజు వస్తోంది. ఆ రోజు వాయిస్తా దీన్ని."
   
    పరమహంస పాపవైపు ఆప్యాయంగా చూశాడు. అతడి కళ్ళు ప్రేమనే వర్షిస్తుంటాయి.
   
    "అలాగేలే వెళ్ళి పడుకో" పంపించింది నిర్మల. ఈ లోపులో టీ వచ్చింది.
   
    "పిల్లలంటే నాకు యిష్టం" టీ సిప్ చేస్తూ అన్నాడు.
   
    "మీకు వివాహమైందనుకుంటాను- పిల్లలు లేరా?"
   
    "ఉన్నారు. ఇద్దరూ అబ్బాయిలే కానీ వాళ్ళతో సంతోషంగా గడిపే అదృష్టం నాకు లేదు" అన్నాడతను విచారంగా.
   
    అతడి నిస్తేజమైన కళ్ళు, ప్రతీ భావాన్ని వేదాంతపరంగానే బహిర్గతం చేస్తుంటాయి అవి.
   
    "అదేం?" ఆశ్చర్యంగా అడిగింది ఆమె.
   
    "అదంతేలెండి. నాలాంటి జీవితం పగవాళ్ళకు కూడా వద్దు. నా భార్యకు ఎప్పుడూ జబ్బే వాళ్ళమ్మ దగ్గరే వుంటుంది."
   
    "ఓహో" మరేం మాట్లాడాలో తోచలేదామెకు.
   
    "వీడింకా రాలేదేం? ఎప్పుడూ యింతేనా?" అడిగాడు.
   
    "అప్పుడప్పుడూ త్వరగా వస్తుంటారు" అంది నిర్మల. అతడు చాలాసేపు మాట్లాడాడు.
   
    పది గంటలయినట్లు గడియారం సంగీతం వినిపించింది.
   
    "మనిషి జీవితం చాలా విచిత్రమైంది నిర్మలగారూ! కావలసింది దొరకదు. దొరికినదాన్ని అనుభవించలేం. అందని దాని కోసం అర్రులు చాస్తాం" ఆలోచనల్లోంచి తేరుకుంటూ అన్నాడు పరమహంస.
   
    నిర్మల మాట్లాడలేదు. తన ముఖంలో భావాలు కనిపించకుండా తల దించుకుంది. అలా దించుకోవడం వల్ల ఆమె దృష్టి అకస్మాత్తుగా తన పైటమీద పడింది. ఆమెది చాలా ఆరోగ్యవంతమైన శరీరం ఎన్నిసార్లు పైట నిండుగా కప్పుకున్నా అది ఎత్తులకి దారి చూపిస్తూనే వుంటుంది. ఆమె చప్పున సరిచేసుకుంది.

 Previous Page Next Page