ఏదైనా సాయం చెయ్యాలి మా కృష్ణాపురం ప్రజలకి.... అది మీ సైన్స్ ఇండియా చేస్తుందనే నమ్మకంతో- రంగప్రసాద్, ఎమ్మెస్".
రవి ఎగిరి గంతేశాడు.
ఆ పేజీల కట్ట పట్టుకుని ఎడిటర్ రూమ్ లోకి దారితీశాడు.
"ఏమిటిది" నిరాసక్తంగా అందుకుంటూ ఎడిటర్ కాగితాన్ని విప్పి చదవటం మొదలుపెట్టాడు. మొదటి పేజీ చదవగానే కుర్చీలో ముందుకు వంగాడు. రవి అతడినే చూస్తున్నాడు. అతడి మొహంలో రంగులు తొందర తొందరగా మారుతున్నాయి. సీరియస్ గా, తొందర తొందరగా చదవసాగాడు.
చదవటం పూర్తిచేసి, కాగితాలు టేబుల్ మీద వదిలి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. రవి ఆత్రంగా అతడివైపు చూడసాగేడు. ఈ కొత్త ఎడిటరు యువకుడు! సైన్సు బాగా చదువుకున్నవాడు. అతదికిచ్చే ముందు తన వ్యాసం చదివివుంటే బావుండేది. అందులో ఏం తప్పువుందో...
"ఎలా వుంది" అని అడిగాడు.
ఏదో లోకంలో వున్నవాడిలా ఎడిటర్ కళ్ళు విప్పాడు. నెమ్మదిగా అన్నాడు- "ఈ వ్యాసంలో వున్న విషయాలేగానీ నిజమై వుంటే, 'సైన్స్ ఇండియా' ప్రపంచానికో సంచలనమైన వార్త అందివ్వబోతుంది. భారతదేశపు యావత్ ప్రజల దృష్టి కృష్ణాపురం మీద పడబోతుంది" అంటూ కాగితాల కట్ట చేతిలోకి తీసుకున్నాడు. ".... ఈ డాక్టరెవరోగానీ చాలా శ్రమపడ్డాడు. తనకున్న పరిధిలో తాను చేసానన్నాడుగానీ అది తప్పు. ఏ సైంటిస్ట్ అయినా ఇంతకన్నా ఏం చెయ్యగలడు? రేడియో ఆక్టివిటీ పరిశోధించాడు. ఆ పిల్లల్ని కన్న తల్లుల్ని పరీక్షించాడు. వాళ్ళ భర్తల స్పెర్మ్ పరిశీలించాడు. ఎక్కడా తప్పులేదు. కానీ వరుసగా నాలుగు జననాలు మైగాడ్!" అంటూ తలెత్తాడు. "ఈ నెల మనం ఆ ఫోటోలే కవర్ పేజీగా వేద్దాం. "ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తుంది? అని చివర్లో కొన్ని వాక్యాలు చేర్చు. "కృష్ణాపురాన్ని పరిశీలించటానికి సైన్స్ ఇండియా తరపున జెనెటిక్స్ కి సంబంధించిన సలహాదారు కృష్ణాపురం నేడే ప్రయాణమవుతున్నాడని, అతడి ఫోటో వెయ్యి క్విక్ ఇదంతా ఈ నెల సంచికలోనే రావాలి".
పది రోజుల తర్వాత ఆ నెల సైన్స్-ఇండియా సంచిక మార్కెట్ లో విడుదల అయింది.
ముందు చిన్న కుదుపు. ఆ తరువాత అది ప్రచండ దావానలమయింది.
12
రాకేష్ మొహం ఎర్రగా వుంది. అతడి ఎదురుగా ఇద్దరు రెడ్ స్కెలిటన్స్ వున్నారు. ముందు సైన్స్-ఇండియా పత్రిక వుంది.
"రంగప్రసాద్..." అన్నాడు పళ్ళు కొరుకుతూ. "ఎంతో రహస్యంగా, చాపక్రింద నీరులా మా పని మేము చేసుకుపోతున్న తరుణంలో మా చర్యల్ని బయటపెట్టావు. దేశం దృష్టి ఈ కృష్ణాపురం మీద పడేటట్టు చేశావు. దీనికి తగిన ఫలితం అనుభవించక తప్పదు. ఉస్సోక్ నీ మీద చర్య తీసుకుంటుంది" అంటూ రెడ్ స్కెలిటన్స్ వైపు తిరిగాడు. "ఈ రాత్రికే అతడు మరణించాలి....ఈ రాత్రికే".
"మహాదష్ట అనుమతి తీసుకోకుండా మనిషిని చంపటం ఉస్సోక్ ఆచారం కాదు రాకేష్".
"నాన్సెన్స్...." అన్నాడు రాకేష్. "ఒకవైపు వాళ్ళు వచ్చేస్తూవుంటే ఇంకా అనుమతి ఏమిటి? రంగప్రసాద్ పరిశోధనల తాలూకు వివరాలు వారికి పూర్తిగా అందకూడదు. ఈ లోపులో మనం, నీళ్ళలో పాదరసం కలపటం లాటి పన్లు చేయాలి. వాళ్ళు మరింత అయోమయంలో పడాలి. ఈ పుట్టుకల వెనుక ఏదో సహేతుకమైన కారణం వున్నట్టు భ్రమకలగజేయాలి. అష్టావక్రుడి జననం వరకూ మనం ఈ విధంగా ఆగర్భశిశువుని రక్షించుకోవాలి. అందుకు మొదటి మెట్టుగా ఇప్పటికే సాక్ష్యాధారాలు సంపాదించిన రంగప్రసాద్ ను చంపెయ్యాలి... ఈ పనికి మీకు మహాదష్ట అనుమతి అవసరం అయితే, ఆ పని నేనే చేస్తాను. మన జాగిలం సాయంతో- ఈ రోజు అర్దరాత్రి పన్నెండింటికి...." అంటూ గట్టిగా అరిచాడు.
ఒక కుక్క ఆ గదిలోకి ప్రవేశించింది. అది కుక్కలా లేదు. నిలువెత్తు మనిషిలా వుంది. కళ్ళు అగ్నిగోళాల్లా వున్నాయి. వ్రేలాడుతున్న నాలుకనుంచి చొంగ కారుతుంది. ఏనుగు మెడలోకైనా సులువుగా చొచ్చుకుపోయేలా పళ్ళు సూటిగా వున్నాయి. ఆజ్ఞ దొరికితే చాలు ఎదుటి మనిషిని చీల్చి చెండాడాలన్నంత కసి దాని మొహంలో వికృతంగా భయంకరంగా కనబడుతూంది. అది రాకేష్ దగ్గిరకు వచ్చి నిల్చుంది.
రాకేష్ దాని మెడమీద చెయ్యి వేసి నిమిరాడు.
ఆ క్షణం ఆ ఇద్దరిలోనూ తేడా కనబడటంలేదు. మొహంలో భావాలకి సంబంధించినంత వరకూ.
* * * *
పన్నెండవటానికి ఇంకా అయిదు నిముషాలుంది!
రంగప్రసాద్ తన ఇంట్లో ముందు గదిలో కుర్చీలో కూర్చుని మెడికల్ మాగజైన్ చదువుకుంటున్నాడు.
అప్పుడు వినిపించిందో శబ్దం, బయట తలుపుని ఎవరో గోళ్ళతో గీసిన శబ్దం. అతడు తలెత్తి చూశాడు.
నిశ్శబ్దం!
పొరపాటు పడ్డానేమో అనుకుని తిరిగి పుస్తకం మీద దృష్టి నిలిపాడు. మళ్ళీ వినిపించింది శబ్దం ఈసారి మరింత స్పష్టంగా....
ఆ..హ్వా....ని...స్తు...న్న...ట్లు...
"ఎవరదీ" అంటూ లేచి, తలుపు దగ్గిరకి నడిచాడు.
చిన్న గురక లాంటి శబ్దం బయట. ఆస్తమా రోగి గొంతులోంచి వచ్చినట్టు పిలుపు-
అతడి గడియ తీశాడు.
తలుపు తీయబోతూ ఒక క్షణం ఆగి- "ఎవరదీ" అన్నాడు. అవతల్నుంచి జవాబు లేదు.
అతడు తలుపు వెనక్కి లాగబోయాడు.
అతడు పూర్తిగా తెరిచీ తెరవకుండానే అది లోపలకు తోసుకు వచ్చింది. దాన్ని వూహించని అతడు అడుగు వెనక్కి వేశాడు.
మనిషెత్తు వుందా జాగిలం. దాని కనుగుడ్లు రక్తంలో తడిసి నానినట్లున్నాయి. అతడు వూహించటానికి కూడా అవకాశం యివ్వకుండా గాలిలోకి ఎగిరి అతడి మీదకు దూకింది.
దాని గోళ్ళు అతడి భుజంలో దిగబడ్డాయి. అతడి మొహానికి దగ్గిరగా దాని మొహం వచ్చింది. ఒక రకమైన దుర్వాసన అతడిని ఆవరించింది. కానీ దాన్ని గుర్తించే స్థితిలో లేడు. ఒక విధమైన షాక్ తో నిశ్చేష్టుడైపోయాడు. దాని మొహం నెమ్మదిగా అతడి మెడని చేరుకుంది. పళ్ళు మెడలోకి దింపటానికి ఆయత్తమయ్యాయి.
* * * *
"అత్తయ్యా" అంది కేదారగౌరి ఆందోళనగా. ఆమె మాట్లాడలేదు. కానీ బాధని నొక్కిపట్టినట్టు ముఖకవళికలు చెపుతున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చినట్టు గౌరి లేచి, "నేను డాక్టర్ ని పిలుచుకొస్తాను" అంది.
ఆమె బాధని ఓర్చుకుంటూ "ఇంత రాత్రి ఏం వెళ్తావమ్మా" అంది.
"దూరం ఏముంది అత్తయ్యా! నాలుగు అడుగులు వేస్తే ఆయనిల్లు వస్తూంది" అంది.
సాయంత్రం కొద్దిగా గుండెల్లో పోటు లాటిది వచ్చింది ఆమెకి. నిరక్ష్యంగా వూరుకుంది. రాత్రి పదయ్యేసరికి అది ఎక్కువైంది. దగ్గిరలో కుర్రవాళ్ళు ఎవరూ లేరు. కోడలు వెళ్తానంటే వద్దని వారించింది. మరింత సమయం గడిచేసరికి అది విషమించినట్టు అనిపించింది.
సిద్ధార్థ ఊరిలో లేడు.
గౌరికి ఊరు కొత్తేమీ కాదు.
ఆమె మోకాళ్ళమీద చెయ్యివేసి, కుంటుతూ నడుస్తూ సందు మలుపు తిరిగింది. మిగతా వాటితో పోల్చుకుంటే ఆ వీధి విశాలంగా వుంది. అందులో ఆ ఇల్లు కాస్త విసిరేసినట్టు వుంది.
ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ లా కట్టిన కంచె తాలూకు తలుపు తీసుకుని ఆవరణలోకి ప్రవేశించింది.
అర్ధరాత్రి కావస్తూ వుండటం వల్ల ఎక్కడా చడీ చప్పుడు లేదు.
ఆమె మెట్లు ఎక్కింది. తలుపు వేసే వుంది.
ఎక్కడైనా కాలింగ్ బెల్ వుందేమో అని చూసింది. కానీ అటువంటిదేమీ కనపడలేదు.
ఇంతలో లోపల్నుంచి దబ్బున ఎవరో పడిన శబ్దం వినిపించింది. దేన్నో లాగిన శబ్దం.....
చప్పున మరో మెట్టెక్కి ఆమె లోపలికి తొంగిచూసింది. ఆమె గుండె ఆగిపోయినట్టయింది. గొంతునుంచి సన్నటి కేక బయటికి వచ్చింది.
అతడు వెల్లకిలా పడివున్నాడు. రెండు చేతుల్తోనూ దాన్ని తోసెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని ఛాతీమీద రెండు కాళ్ళూ వేసి మెడలోకి పళ్ళని దింపుతూంది ఆ జాగిలం. నిలువెత్తు జాగిలం ముందు అతడి శక్తి ఆగటం లేదు.
ఆమె గొంతునుంచి వచ్చిన సన్నటి కేకకి, తన ప్రయత్నంలో సఫలీకృత మవబోతూన్న జాగిలం, వెనక్కి తల తిప్పింది. మొహంలో రక్తమంతా ఇంకిపోగా, శిలాప్రతిమలా నిలబడి వుంది కేదారగౌరి. ఎదుటి దృశ్యం ఆమె నోటి మాటను హరించివేసింది.
ఒక్కక్షణం దానికళ్ళు ఆమెని నిశితంగా పరిశీలించాయి. అది వెనుదిరుగటమేమిటి? ఒక్క గెంతులో గాలిలోకి ఎగరటమేమిటి? రెండూ రెప్పపాటు కాలంలో జరిగిపోయాయి.
అప్పటివరకూ దాని పళ్ళు తన మెడలోకి దిగపడకుండా వుండటానికి చేతుల్తో ప్రయత్నిస్తూన్న రంగప్రసాద్ అకస్మాత్తుగా దాని దృష్టి తననుంచి మరలటాన్ని గమనించి చకితుడయ్యాడు. అంతలో అతడు గుమ్మంలో వున్న అమ్మాయిని చూశాడు. ఆమెను గుర్తుపట్టాడు కూడా. సిద్ధార్థ వివాహానికి వెళ్ళలేదు కానీ ఆమెను స్టూడెంట్ గా ఆ ఊళ్ళో చాలా సార్లు చూసాడు. 'ఇద్దరమూ కలిసి మీ యింటికి వస్తాము' అని సిద్ధార్థ రెండు మూడుసార్లు అన్నా ఆమె ఎక్కువకాలం పట్నంలో వుండటంతో అది కుదరలేదు.
అతను చూస్తూ వుండగానే ఆ కుక్క ఆరడుగులు గాలిలోకి ఎగిరి కేదారగౌరిమీదకు దూకింది. అరవటానికి కూడా సమయంలేక ఆమె కుప్పకూలిపోయింది. అందులోనూ ఒక కాలు బలహీనమయినదేమో అసలు నిలదొక్కుకోలేకపోయింది.