Previous Page Next Page 
అష్టావక్ర పేజి 14


                         11


    డాక్టర్ రంగప్రసాద్ కౌంటర్ వైపు విసుగ్గా చూశాడు. విమానాశ్రయం తాలూకు కౌంటర్ అది. అయినా జనం అక్కడ సంతలలోకన్నా హీనంగా వున్నారు.

    ఇంకొంచెంసేపట్లో విమానం బయల్దేరబోతూ వుండగా ఓ తెల్లచొక్కా యువకుడు హడావుడిగా సీటు నెంబర్లు వెతుక్కుంటూ రావడం గమనించాడు. అతడు వచ్చి రంగప్రసాద్ పక్కనే కూర్చున్నాడు.

    విమానం బయల్దేరింది.

    "రష్... హెవీ రష్" అన్నాడు అతడు మాట కలుపుతూ.

    "అవును".

    "నాకు టిక్కెట్టు దొరకదనే అనుకున్నాడు".

    రంగప్రసాద్ మాట్లాడలేదు.

    "కౌంటర్ వెనుకవైపు నుంచి ఎవరికో టిక్కెట్టు ఇస్తూ వుంటే వెళ్ళి గట్టిగా దెబ్బలాడాను".

    "అవును, చూశాను".

    "దాంతో గొడవ చెయ్యొద్దని చెప్పి ఒక టిక్కెట్టు నా చేతిలోనూ పెట్టాడు".

    "బైదిబై- మీ పెరూ?"

    "ప్రసాద్, డాక్టర్ రంగప్రసాద్".

    "నా పేరు షాడో....వైట్ షాడో".

    రంగప్రసాద్ అదిరిపడి చూశాడు.

    "కంగారుపడకండి. పదహారణాల తెలుగువాడిని. పేరు రవి. 'సైన్స్ ఇండియా' లో పని చేస్తున్నాను. చిన్న చిన్న మాజిక్కులు చేస్తూ వుంటాను. మెజీషియన్ గా నా పేరు- రచయితలకి కలం పేరు లాగా- వైట్ షాడో అన్నమాట. నిజానికి రవి అంటే వైట్ షాడోయే కదా".

    ఆ మాటలకి నవ్వుతూ రంగప్రసాద్ అతడివైపు పరిశీలనగా చూశాడు. తనకన్నా అతడికి దాదాపు అయిదు సంవత్సరాలు తక్కువ వుంటాయి. కానీ జీవితం తాలూకు ఎత్తుపల్లాలు ఇంకా అతడి మొహంలో ప్రతిబింబించటం లేదు. పెళ్ళి కాలేదనుకుంటా. అందుకే హుషారుగా వున్నాడు.

    "మీరు డాక్టర్ కదా- ఎక్కడ?" 

    "కృష్ణాపురంలో...."

    "పి.హెచ్.సి.లోనా?"

    "కాదు. ప్రయివేటు ప్రాక్టీసు".

    "మీరు ఎంబీబియస్సా?"

    "అవును. తరువాత ఎమ్మెస్ చేశాను"

    రవి అతడివైపు తలతిప్పి, "ఎమ్మెస్ చేసి కృష్ణాపురం లాటి అతి చిన్న ఊర్లో ప్రాక్టీసు చేస్తున్నారా? అది మీ స్వంత ఊరా?" అని అడిగాడు ఆశ్చర్యంగా.

    "కాదు. మా వాళ్ళంతా చాలా కాలం క్రితమే గుంటూరులో సెటిల్ అయ్యారు".

    "మరి మీరెందుకు అంత చిన్న ఊళ్ళో ప్రాక్టీసు పెట్టారు?"

    చాలా చిన్న ప్రశ్న ఇది. కానీ సమాధానం జీవితమంత పెద్దది. డబ్బు ఇచ్చేదానికన్నా ఆత్మసంతృప్తి అమాయక బీదప్రజల సేవలో వస్తుందని చెపుతాడా....? తనకే చాలా హేయమైన సమాధానంగా తోచింది అది. చుట్టూ పొలాలు-పొలాల మధ్య ఊరు. ఊరి మధ్యలో అందరూ గౌరవించే డాక్టరు... అది అహాన్ని సంతృప్తి పరుస్తుందని చెపుతాడా? అవతలి వారికి అర్ధం కాకపోవచ్చు... 'తృప్తి ముఖ్యం. అది చిన్న ఊరా పెద్ద ఊరా అన్న సమస్య కాదు' అంటేనో...

    "అన్నట్టు మా మాగ్ జైన్ లో ఒక వ్యాసం ప్రచురిస్తే ఎలా వుంటుంది?" అన్నాడు.

    "ఏం వ్యాసం?"

    "ఒక ఎమ్మెస్ గోల్డ్ మెడలిస్ట్- నలభై ఏళ్ళ డాక్టరు- కేవలం బీదప్రజలకు సేవ చేయటం కోసం ఒక చిన్న పల్లెటూరులో ప్రాక్టీసు పెట్టి- తన ఆశయానికి అడ్డు వస్తుందేమోనని- పెళ్ళి చేసుకోకుండా- ఇదీ వ్యాసం... ఎలా వుంది".

    "నా మొహంలా వుంది. నేను వివాహం చేసుకోక పోవటానికి కారణం అదేమీ కాదు".

    "మరేమిటి?"

    రంగాప్రసాద్ మౌనం వహించాడు.

    చాలా సున్నితమైన సమస్య... మనసుకి సంబంధించినది. చెప్తే అవతలివాళ్ళు అర్ధం చేసుకోలేనిది. చేసుకున్నా నవ్వేసేది.

    "చెప్పరేం?"

    రంగప్రసాద్ మాట మార్చి "మీరు వ్యాసం వ్రాస్తానంటే మరో ఆసక్తికరమైన విషయం చెపుతాను" అన్నాడు.

    షాడో ఉత్సాహంగా "ఏమిటది" అని అడిగాడు.

    "మా ఊరు కృష్ణాపురంలో కొద్దినెలల తేడాతో రెండు వికృత జీవాలు పుట్టాయి. సాధారణంగా పదివేల కేసుల్లోనో ఒకటిగా రావలసిన కేసు, ఒక ఊళ్ళో కొద్ది తేడాలో రెండు పుట్టడం చిత్రంగాలేదు".

    షాడో ఎగిరి గంతెయ్యబోయాడు. "-చాలు ఈ మాత్రం ఇస్తే చాలు... వ్రాసేస్తాను. నాకా చచ్చిపోయిన పిల్లల ఫోటోలు కావాలి. వీలైతే వాళ్ళ తల్లుల ఫోటోలు కూడా...."

    "ఆగాగు. చూసిరమ్మంటే కాల్చివచ్చేటట్టు వున్నావే..."

    "ఏం, అలా వద్దా".

    "నేను చెప్పింది జెనెటిక్స్ మీద వ్యాసం వ్రాస్తూ దీన్ని ఉదాహరణగా ఇవ్వమని. అంతేకానీ, దీన్నే ఫోటోలతో, అభూత కల్పనలతో వ్రాయమని కాదు".

    "జెనెటిక్స్ కీ దీనికీ ఏమిటి సంబంధం?"

    రంగప్రసాద్ తెల్లబోయాడు. "జెనెటిక్స్ తెలీదా?"

    "ఊహు తెలీదు. ఎక్కడో నాలుగైదుసార్లు విన్నానంతే-"

    "జెనెటిక్స్ అంటే ఏమిటో తెలియకుండా సైన్సు పత్రికలో పనిచేస్తున్నావా" ఆశ్చర్యంగా అడిగాడు.

    "ఏమీ తెలియనివాడే ఆ సబ్జెక్టు గురించి బాగా వ్రాయగలడు. దానికేం గానీ ఇది చెప్పండి... పిల్లలు అపసవ్యంగా పుట్టటానికీ జెనెటిక్స్ కీ ఏమిటి సంబంధం?"

    రంగప్రసాద్ బోర్డింగ్ స్లిప్ మీద పెన్ తో పిచ్చిగీతలు గీస్తూ చెప్పసాగాడు. "మనింట్లో పెద్దవాళ్ళు అంటూ వుంటారు- 'అచ్చు వాళ్ళ నాన్న నోట్లోంచి వూడిపడ్డాడే' అని... కానీ ఇది ఎలా సాధ్యమా అని చాలా మంది ఆలోచించరు. అచ్చుగుడ్డినట్టుండే ముక్కు, నోరు, కళ్ళు- అన్నీ తండ్రిలాగానో తల్లిలాగానో పుట్టటానికి కారణం 'జీన్'. దీనికి సంబంధించిన శాస్త్రమే జెనెటిక్స్..." అని ఆగాడు.

    "ఒక పురుషుడు స్త్రీని కలిసినప్పుడు అతడిలోంచి ఆమెలోకి ప్రవహించే స్పెర్మ్ లో కొన్నివేల సూక్ష్మకణాలుంటాయి. అందులో కేవలం ఒకటి మాత్రం ఎప్పుడో ఒకసారి అండాన్ని చేరుకుని ఫలదీకరణకు దారితీస్తుంది. ఈ క్షణంలో పురుషుడి తాలూకు అంశాలన్నిటికీ ప్రాతినిధ్యం వహించే 23 క్రోమోజోములు చంద్రమండలం మీద అడుగు పెట్టిన తొలి మానవుడు భూమి తాలూకు వస్తువుల్ని అక్కడ మన జ్ఞాపకార్ధం వదిలినట్టు, పురుషుడు తన వారసత్వపు ఛాయల్ని జీన్స్ రూపంలో స్త్రీలోకి వదులుతాడన్నమాట అంటే, తన ముక్కు, కళ్ళరంగు, ఎత్తు తెలివితేటలు... అన్నీ".

    "ఉదాహరణకి బాగుంది-"

    "ఈ 23 క్రోమోజోమ్స్ తోపాటు మరో ముఖ్యమైన అంశం ఒకటుంది. అది రెండు రకాలు. ఒకటి X, రెండోది Y. వీటిని సెక్స్- క్రోమోజోమ్స్ అంటారు. స్త్రీ అండంలో కేవలం X క్రోమోజోమ్ మాత్రమే వుంటుంది. పురుషుడిలో అలా కాకుండా కొన్ని వీర్యకణాల్లో X, కొన్ని కణాల్లో Y వుంటాయి. రతి సమయంలో పురుషుడి తాలూకు 'X' వున్న వీర్యకణంస్త్రీని చేరుకుంటే, స్త్రీలో వున్న X తో కలిసి XX అవుతుంది. అప్పుడా దంపతులకి ఆడపిల్ల పుడుతుంది.

    అలా కాకుండా పురుషుడి Y వున్న వీర్యకణం స్త్రీని చేరుకుంటే అది XY అవుతుంది. అప్పుడు మొగపిల్లవాడు పుట్టి, దంపతులకు సంతోషం కలిగిస్తాడు. ఇక్కడివరకూ ఇదంతా స్వభావసిద్ధమైన, ప్రకృతి సిద్ధమైన చర్య.! ఇక్కడినుంచి, ప్రకృతి వైపరీత్యాలు ప్రారంభం అవుతాయి. ఒకోసారి రెండు మూడు ఎక్స్ క్రోమోజోములు గానీ రెండు వై క్రోమోజోములు గానీ ఫలదీకరణలో ఇమిడిపోతాయి. అప్పుడే వస్తుంది చిక్కంతా..." అంటూ స్లిప్ మీద వ్రాశాడు.

    XX - అందమైన ఆడపిల్ల.

    XY - ముచ్చటైన మొగపిల్లవాడు.

    XXY - క్లెయిన్ ఫెల్టర్ సిండ్రోమ్... స్త్రీలలాగా రొమ్ములు పెరగటం. (స్త్రీ అంశం వున్న పురుషుడు)

    XXXXX - పెంటా ఎక్స్ సిండ్రోమ్...

    21 క్రోమోజోమ్ ఎక్కువుంటే - డౌన్స్ సిండ్రోమ్ - మంగోలియన్ జాతి ఆకారాలు- చాలా పొట్టిగా వికృతంగా పుట్టి కొంతకాలమయ్యాక బ్లడ్ క్యాన్సర్ తో మరణించటం".

    "ఒక్క నిముషం" అంటూ ఆపాడు షాడో. "సైన్సుకి సంబంధించిన వివరాలు వ్రాయటానికి మా దగ్గిర మనుష్యులు వున్నారు. నాకు కావల్సిందల్లా సెన్సేషనల్ వార్త మాత్రమే. అది ఇవ్వండి చాలు".

    "అయితే నువ్వు కొంతకాలం ఆగాలి" అన్నాడు రంగప్రసాద్. "మరీ రెండు కేసుల్లో దీన్నో ప్రముఖ వార్తగా ప్రకటించడం హాస్యాస్పదంగా వుంటుంది. నాకు రాబోతున్న డెలివరీ కేసులు మరో రెండు తొందర్లో వున్నాయి. అది కూడా చూద్దాం. అప్పుడయితే ఫోటోలు కూడా వెయ్యొచ్చు".

    "రాబోయే రెండు కూడా ఇలాటివే అవుతాయి అని వూహిస్తున్నారా మీరు?"

    "కాకూడదనే వూహిస్తున్నాను. అయితే మాత్రం అది చరిత్ర సృష్టిస్తుంది. గిన్నీస్ వరల్డ్ లోకి ఎక్కాల్సినంత వార్త అవుతుంది".

    "అప్పుడు ఆ వార్తని ముందు పట్టుకున్నందుకు మా పత్రికకి మంచి పేరొస్తుంది" నవ్వాడు.

    అంతలో విమానం లాండ్ అయింది. రవి తన అడ్రసున్న కార్డు అందిస్తూ "మీరు వెంటనే వివరాలు పంపుతారుగా" అన్నాడు.

    "వెంటనే కాదు. రెండు మూడు నెలల్లో... అదయినా, అలాటి కాన్పులు సంభావిస్తేనే... లేకపోతే చిన్న విషయాన్ని అనవసరంగా కొండంతలు చేసి ప్రజల్ని భయపెట్టినట్టు అవుతుంది".

    ఇద్దరూ సీట్లలోంచి లేచారు.


                   *    *    *    *


    "డియర్ వైట్ షాడో...

    మనం అనుకున్నట్టు ఫోటోలు పంపుతున్నాను. ఈ ఊళ్ళో పరిస్థితి ఉద్రిక్తంగా, అయోమయంగా వుంది. ఈ రెండు కాన్పుల్లో కూడా వికృతమైన శిశువులే పుట్టారు. అంతకుముందు నేను చెప్పానే- గర్భస్థ మృతశిశువును గురించి... ఆ ఫోటో కూడా అదృష్టవశాత్తూ దొరికింది. దాన్ని కూడా పంపుతున్నాను.

    ఆరు నెలల పరిధిలో ఒక చిన్న పల్లెటూళ్ళో నాలుగు వికృత జననాలు! సైన్స్ చరిత్రలో గానీ, ప్రపంచ చరిత్రలో గానీ ఊహకందని విషయం ఇది. ఇక్కడ లోకలో పేపర్లు దీన్ని వార్తగా ప్రచురించాయే తప్ప ప్రాముఖ్యత ఇవ్వలేదు. నాకు ఒకటే అనుమానం. ప్రభుత్వం దృష్టి ఇంకా ఎందుకు పడలేదా అని. ఈపాటికి మరో దేశంలో అయితే ఎన్నో ప్రయోగాలూ, పరిశోధనలూ ప్రారంభమయి వుండేవి. ఈ నాలుగు వికృత జననాల పట్ల ప్రజలు భయంతో వణికిపోతున్నా ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడం శోచనీయం.

    పోతే, ఆ గ్రామంలో వ్యక్తిగా, కాస్త విజ్ఞానవంతుడిగా నేను చెయ్యగలిగినంతా చేశాను. ఆంధ్రప్రదేశ్ లో వున్న అతి తక్కువ హెల్త్ మ్యూజియాలలో కెల్లా మంచిదైన గుంటూరు కాలేజీలో వివరాలు సేకరించాను. మ్యూటేషన్స్ కి కారణమైన పాదరసం. తాగే నీటిలో ఏదైనా కలిసిందేమోనని పరీక్షలు చేయించాను. అటువంటిదేమీ లేదు. ఎక్స్ రే ప్రసక్తి లేదు. గర్భస్థ శిశువుకి హాని కలిగించే రేడియో ఆక్టివ్ కిరణాల్ని బహిర్గతపరిచే వస్తువు లేమైనా గ్రామపు పొలిమేర్లో పడివున్నాయేమో అని గమనించాము. అలాటిదేమీ లేదు. ణా పరిధిలో నేను చేయగలిగినదంతా చేశాను. ఏమీ లాభం లేకపోయింది. ఇక్కడ ప్రజలు భయంతో కకావికలై పోతున్నారు. మరో యిద్దరుస్త్రీలు ప్రసవానికి సిద్ధంగా వున్నారు. రకరకాల రూమర్లు పాకుతున్నాయి. ఈసారి ప్రసవం జరిగేటప్పుడు ణా ఆస్పత్రి ముందు జనం వందల సంఖ్యలో గుమిగూడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేనేం చెయ్యాలో నాకు అర్ధంకావటం లేదు. నేను సేకరించిన వివరాలు, కన్ జెనిటల్ మాల్ ఫార్మేషన్స్ కి వివిధ రకాలైన కారణాలు- ఏ హేతువుకీ అందని కృష్ణాపురపు విచిత్ర జననాలు, ఎరిత్రోబ్లాస్టోసిస్ కి దారితీసే వివరాలూ అన్నిటితో కలిపి నలభై పేజీల వ్యాసం పంపుతున్నాను. మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడు.

 Previous Page Next Page