Previous Page Next Page 
అష్టావక్ర పేజి 16


    ఆమె తల నేలకి తగిలి స్పృహ తప్పినట్టయింది. కానీ వెంటనే తేరుకుంది.

    ఈ లోపులో రంగప్రసాద్ చివుక్కున లేచాడు. అతడి చేతికి ఏ ఆయుధమూ దొరకలేదు సమయానికి. పక్కనే వున్న కుర్చీ అందుకుని బలంగా ఆ జాగిలాన్ని కొట్టాడు. కాని ఎద్దుమీద వర్షం పడ్డట్టు దాని ప్రభావం కుక్కమీద లేకపోయింది. వెనుకనుంచి తాకిడి తగలటంతో అది కేదారగౌరిని వదిలి, రెట్టించిన కోపంతో అతడి మీదకు దూకింది. కుర్చీతో సహా అతడు ఆ వూపుకి వెనక్కి పడ్డాడు. వెనుక గచ్చుకి తల తగిలి అదిరి పోయింది.

    ఆ క్షణమే అతడికి అర్ధమయింది. తను దాన్ని ఎదుర్కోలేననీ, మరణం ఖాయమని! అరుద్దామనుకున్నాడు. కానీ నోటమాట రాలేదు. క్రమక్రమంగా నెమ్మదిగా అతడి కళ్ళు మూతలు పడసాగాయి. వెనుగ్గా తల అదిరిన దెబ్బకి స్పృహ తప్పసాగింది. కుక్క మీదకి రావటం తెలుస్తూంది. అంతే! ఏం జరిగిందో తెలీదు. ఆ తరువాత ఐదు నిముషాల వరకూ అతడలాగే వున్నాడు. అంతలో మొహంమీద నీళ్ళు పడ్డాయి. కళ్ళు తెరిచాడు. జాగిలం లేదు.

    ఆమె ముందుకు వంగి- అతడివైపు ఆందోళనతో చూస్తూంది.

    అతడు చప్పున లేచి కూర్చున్నాడు. అతడికా పరిస్థితిని జీర్ణం చేసుకోవటానికి కొంచెంసేపు పట్టింది.

    "ఏమైంది" అని అడిగాడు.

    "అది వెళ్ళిపోయింది ఎవరో పిలిచినట్టు" అంది. ఇద్దరూ వెంటనే ఏమీ మాట్లాడుకోలేదు. ముందు ఆమే, నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ "నా పేరు కేదారగౌరి. సిద్ధార్థ...." అంటూ ఏదో చెప్పబోతూంటే, "నాకు తెలుసు" అన్నాడు మధ్యలోనే. "రావే ప్రోగ్రాంకి వచ్చినప్పుడే చూశాను. అదీగాక సిద్ధార్థ నా స్నేహితుడు" అన్నాడు.

    అతడు తమ పెళ్ళికి వచ్చాడో లేదో ఆమెకు గుర్తులేదు.

    "అత్తయ్యకి సాయంత్రం నుంచి గుండెల్లో నొప్పి. ఇప్పుడే చెప్పింది. అందుకే వచ్చాను".

    "అరెరె, అలాగా. పదండి" అని తొందర తొందరగా చెస్ట్ తీసుకున్నాడు. ఆమెకి ఆశ్చర్యం వేసింది. మరణం అంచువరకూ వెళ్ళివచ్చి కూడా అంత నిబ్బరంతో వ్యవహరించగలగటం! ఎంతో మానసిక స్థయిర్యం వుంటేగానీ అది సాధ్యంకాదు. ఆమె కళ్ళముందు భీకర జాగిల రూపం ఇంకా మెదులుతూనే వుంది.

    "ఈ రోజు నా ప్రాణం రక్షించారు" అన్నాడు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుంటూ. ".... ఎవరో పేషెంట్ అనుకుని తలుపు తీసేసరికి మీదకు దూకింది. రేప్రొద్దున్నే చూడాలి. బహుశా పిచ్చికుక్క అనుకుంటాను. షర్టు వుండబట్టి అదృష్టవశాత్తు గోళ్ళు లోపలికి దిగలేదు".

    "అసలింత పెద్దకుక్కని చూడటం ఇదే మొదటిసారి".

    "ఈ రోజు సమయానికి మీరు రాకపోయి వుంటే నేనీ లోకంలో వుండేవాడిని కాను" మెట్లు దిగుతూ వుంటే అన్నాడు. ".... మీకు నా కృతజ్ఞతలు. మొట్టమొదటిసారి మా ఇంటికొచ్చినప్పుడు ఇలాటి ఆతిథ్యం లభించినందుకు మాత్రం క్షమించండి".

    ఆమె కాస్త సిగ్గుతో "నేను చేసినదేముంది? ఈ మాత్రం ఎవరైనా చేస్తారు. మీరు మా ఇంటికొచ్చినప్పుడు నేనా స్థితిలో వుంటే మీరు చెయ్యరా ఏమిటి?" అంది.

    ఆమె అంత చొరవగా మాట్లాడటం అతడి మనసులో ఒక ఆత్మీయతా భావాన్ని రేపింది. ఒక చిన్నపిల్లలాగా తోచింది ఆమె! ఆ అర్ధరాత్రి, చెట్ల ఆకుల వెన్నెల నీడ మధ్యనుంచి ఆమె అలా మోకాలిమీద చెయ్యి ఆన్చుకుని నడుస్తూ వుంటే సముద్రపు వడ్డున వంగి వంగి ఆల్చిప్పలు ఏరుకుంటూ పరుగెత్తే చిన్నపిల్లలు గుర్తొచ్చారు.

    "ఏమిటీ? చెయ్యరా?"

    "ఏమిటి చెయ్యటం?" ఆలోచన్ల నుంచి తేరుకుంటూ అడిగాడు.

    ఆమెకు నవ్వొచ్చింది. ఆపుకుని, "ఈ ఊరుకి ఏకైక డాక్టరు మీరు. మాకేదైనా కష్టంవస్తే మీరు ఆదుకోరా అంటున్నాను" అంది.

    అతడు నవ్వలేదు. ఇంటిముందు ప్రహరీ తడిక దగ్గరికి లాగి, తాడుతో ముడివేస్తూ "కేవలం నేను మీ ఋణం తీర్చుకోవటంకోసం మీకే కష్టమూ రాకూడదనే కోరుకుంటాను" అని క్రిందపెట్టిన చెస్ట్ అందుకున్నాడు. "....ఒకవేళ అలాంటి కష్టమేగానీ వస్తే అందరికన్నా ముందు నేనుంటాను సరేనా"- అన్నాడు.

    ఇద్దరూ నడవసాగారు.

    మలుపు తిరిగి అలా వాళ్ళు వెళ్ళగానే, ఇంటి వెనుకవైపు చీకటిలోంచి నిశ్శబ్దంగా రాకేష్ బయటకు వచ్చాడు. అతడి మొహం జేగురు రంగుకి మారి వుంది. మూర్తీభవించిన కౄరత్వంలా వున్నాడు.

    ఆ సమయంలో అలా వచ్చింది ప్రపంచంలో మరెవరైనా సరే- ఒక్క కేదారగౌరి కాకపోతే, అతడు తన జాగిలాన్ని వెనక్కి పిలిచి వుండేవాడు కాదు.


                                                       13


    "నిర్ణయాలు తీసుకునే హక్కు ఉస్సోక్ లో కేవలం మహాద్రష్టకే వుంది రాకేష్. ఇంకెవరికీ లేదు. నీ స్వంత నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉస్సోక్ కి అపచారం చేశావ్. దీనికి నీ సంజాయిషీ కావాలి".

    రాకేష్ మాట్లాడలేదు.

    రంగప్రసాద్ మీద జరిగిన హత్యాప్రయత్నం గురించి మహాదష్టకి రాగానే తెలిసింది. రాకేష్ ని పిలిపించి నిలదీశాడు.

    రాకేష్ ని మహాదష్ట పిలుస్తున్నాడని చెప్పిన వ్యక్తి- రెడ్ స్కెలిటన్. ఈ తంతు గురించి వివరించాడు.

    దోషిని నిలబెడతారు. ముగ్గురు రెడ్ స్కెలిటన్స్ వుంటారు. నిర్ణయాధికారి మహాదష్ట. శిక్ష మాత్రం చాలా కఠినంగా వుంటుంది.

    "నేనేమీ తప్పు చేయలేదు" అన్నాడు రాకేష్. ".... డాక్టర్ రంగప్రసాద్ వ్రాసిన వ్యాసంతో అప్పుడే కొందరి దృష్టి ఈ గ్రామంమీద పడింది. ఇప్పుడిక కృష్ణాపురాన్ని అందరూ గమనిస్తారు. మరో ఒకటి రెండు పుట్టుకలు ఇలాటివి జరిగితే ఇక గగ్గోలు ఎత్తిపోతారు జనం. అందుకనే డాక్టర్ ని చంపెయ్యాలనుకున్నాను. దాంతో విషయం చల్లారి పోతుంది".

    "ఓహో అలాగా" వ్యంగ్యంగా అన్నాడు మహాదష్ట. ".... అప్పుడు మరిక కృష్ణాపురంలో పిల్లలు పుట్టరా?"

    "మనకి కావాల్సింది కేదారగౌరి కడుపున పుట్టబోయే అష్టావక్రుడు! అంతేగానీ మిగతావాళ్ళు కాదు. వాళ్ళని కడుపులోనే చంపెయ్యటమో లేక వాళ్ళ తల్లుల్ని చంపెయ్యటమో చేస్తే ఈ రహస్యం....." అతడి మాటలు పూర్తికాలేదు. చెంప చెళ్ళుమంది.

    రాకేష్ నిర్విణ్ణుడయ్యాడు.

    "కుట్టి సైతాన్ ఈ ప్రపంచంలోకి రావటానికి ముందుగా పంపే అనుచరుల్ని కడుపులోనే చంపుతావా? ఉస్సోక్ సభ్యుడివై యుండీ నీకీ ఆలోచన ఎలా వచ్చింది?"

    రాకేష్ చెంప తడుముకున్నాడు.

    రెడ్ స్కెలిటన్స్ నిర్వికారంగా ఈ తంతు చూస్తున్నారు.

    "రాకేష్! మొదటినుంచీ నీ సంగతి గమనిస్తున్నాను. అవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు! ఉస్సోక్ లో కేవలం మహాదష్ట మాత్రమే సూచన్లు ఇస్తాడు. దాన్ని అంతా అనుసరిస్తారు. అర్ధమైందా?"

    అర్ధమైంది! రాకేష్ అంటే ఏమిటో కూడా నీకు తెలీదు మహాదష్టా! ఇంతకు ఇంతా తీర్చుకుంటాను. అసలు ఈ క్షణమే నీ మీదకు లంఘించి నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చినా నన్ను అడ్డుకునేవారు ఎవరూ లేరు. ఉస్సోక్ కి కాబోయే సర్వాధికారిని ఎవరూ ఆపలేరు. కాని యిది కాదు సమయం.ముందుంది.

    రాకేష్ మనసులోని భావాల్ని చెదురుస్తూ మహాదష్ట అన్నాడు- "రంగప్రసాద్ వ్రాసిన వ్యాసం తాలూకు ప్రభావం దేశంమీద ఎంత వుందో మనకు తెలీదు. ఎంతయినా వుండనీ నష్టమేముంది? క్షుద్రగణాల శక్తిని ఈ మనుష్యులు ఎదుర్కొనగలరా? రాబోయే నాలుగు జననాల్ని ఆపగలరా? ఎవరూ ఆపలేరు! అప్పుడేం చేస్తారు? కృష్ణాపురంలో వున్న గర్భిణీ స్త్రీ లందర్నీ ఊరు ఖాళీ చేయమంటారా? లేక హేతువు కోసం పరిశోధనలు చేస్తారా? హ్హహ్హహ్హ.....వాళ్ళకే మతిపోతుంది. పోనీ, పిచ్చెక్కి పోనీ" అతడు నవ్వు ఆపి సీరియస్ గా అన్నాడు.

    "ఈ లోపుగా అష్టావక్ర ఆగమనం గురించిన వార్త జనంలోకి వదులుతాం. అప్పటికి మరి కొద్దిరోజులు మాత్రమే వుంటుంది. క్షుద్ర గణాధిపతి తన పరివారాన్ని తీసుకుని భూమ్మీదకు దిగేసమయానికి ప్రజలు అతడికి ఆహ్వానం పలికేలా మనమే తయారుచెయ్యాలి. తెలివైన వాళ్ళం అనుకునేవాళ్ళూ, హేతువు కోసం అన్వేషించే వాళ్ళూ తమ అన్వేషణలో కొట్టుకుంటూ వుంటారు. ఒక్కొక్క దృష్టాంతరం బైటపడేకొద్దీ ప్రజలు ఉస్సోక్ ని నమ్మడం ప్రారంభిస్తారు. కేవలం వారు మాత్రమే అష్టావక్రుడి ప్రపంచంలో బ్రతుకుతారు. మిగతావారు మరణిస్తారు. ఒక విధంగా ప్రజలే ఆ మిగతావారిని చంపుతారు...."

    అతడు చెప్పినది సబబు అన్నట్టు రెడ్ స్కెలిటన్స్ తలలూపారు. రాకేష్ మాట్లాడలేదు.

    "ఏడు గర్భాల విచ్చిన్నపు అట్టహాసంతో కుట్టి సైతాన్ భూమ్మీదకు అడుగిడుతున్న సమయాన తెలిసో తెలియకో డాక్టర్ రంగప్రసాద్ ఈ వ్యాసాన్ని రాశాడు. రాయనీ! ప్రపంచం కంపించిపోనీ!! ఉస్సోక్ ప్రతిష్టని ఇనుమడింపచేయటానికే ఇదంతా జరుగుతూంది. జరగనీ!!!" గట్టిగా నవ్వేడు. అంతలో అతడి నవ్వు ఆగిపోయింది. రాకేష్ వైపు సూటిగా చూస్తూ అన్నాడు. "ఇదంతా ఆలోచించకుండా నువ్వు నీ మిడిమిడి జ్ఞానంతో నిర్ణయాన్ని తీసుకున్నావు. ఉస్సోక్ చరిత్రలో ఎవరూ చేయని పనిని చేశావు. మహాదష్ట అనుజ్ఞ లేకుండా మరణ ప్రయత్నం చేశావు రాకేష్....! దీనికి నువ్వు శిక్షార్హుడివి".

    అక్కడ సూదిపడితే వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించింది.

    ఆ నిశ్శబ్దంలోంచి మహాదష్ట కంఠం వినపడింది- "రాకేష్! అష్టావక్రాగమనాన దేశపు టయిదు అంశాల్లో తరువాత అంశాన్ని నువ్వొక్కడివే ఒంటరిగా నిర్వర్తించబోతున్నావు. క్షుదక్ష యజ్ఞాన్ని నువ్వు చేయబోతున్నావు! దానికి కావల్సిన వనరులన్నీ నువ్వు- నీ అంతట నువ్వే సమీకరించుకోవాలి!"

    ఏదో అనుకున్న రాకేష్ విస్మయంతో తలెత్తాడు.

    ఎంతో ఉత్సాహంతో ఉస్సోక్ నిర్వహించవలసిన యజ్ఞం ఇది. కేవలం తన నొక్కడినీ చెయ్యమంటున్నాడు. అతడికి బిస్తాలో దొరికిన పత్రం జ్ఞాపకం వచ్చింది.

    ఎవరైతే ఈ అయిదు అంశాల్నీ స్వయంగా పూర్తి చేస్తారో వారే అష్టావక్రుడి సామ్రాజ్యంలో, అతడికి సహచరులై రాజ్యమేలుతారు.

    ఈ విషయాన్ని తను వెల్లడి చేయకపోవటం మంచిదయింది.

    కేవలం తనతో ఈ పని పూర్తి చేయించాలని ఎక్కడో వుంది. అందుకే మహాదష్ట నోట ఇటువంటి శిక్ష వెలువడింది.

    అతడికి సంతోషం వేసింది. అంతలో మహాదష్ట అన్నాడు.

    "రాకేష్! క్షుదక్ష యజ్ఞమంటే సామాన్యమైనది కాదు. ఇప్పటినుంచే దానికి కావలసిన వస్తువులు సేకరించాలి. చాలావరకూ అందులో అలభ్యమైనవి. గొప్పపూర్ణ రక్తంనుంచీ అప్పిధార వరకూ నువ్వే స్వయంగా సమీకరించుకోవాలి. నిష్టలో వుండాలి. అష్టావక్రుడు తల్లి గర్భంలో ప్రవేశించిన మూడో నెలలో జరపవలసినది ఈ యజ్ఞం. గణాధిపతులకు ఏమాత్రం అసంతృప్తి కలిగించినా, లేక యజ్ఞ నిర్వహణలో ఏ లోపం కలిగినా, అక్కడి కక్కడే నిర్వాహకుడి రక్తం పీల్చి వేయబడుతుంది. మన వంశపు మూల పురుషుడైన కాద్రా అనే మహామాంత్రికుడు ఇలాగే మరణించాడు. మంత్రం మధ్యలో సరీగ్గా ఉచ్చరించలేకపోవటంతో అక్కడే చుట్టూ గాలిలో తిరుగుతూ అప్పటివరకూ వినమ్రులై వున్న గణ దేవతలు తిరగబడి తమ అధినేత రక్తాన్నే పీల్చివేశాయి. కాబట్టి రాకేష్ జాగ్రత్త! అన్నట్టు నీకు మరో విషయం చెప్పాలి. ఈ యజ్ఞానికి అయ్యే ఖర్చు ఉస్సోక్ భరించదు. ఆర్ధికపరంగా కష్టమైన, ప్రాణాంతకమైన ఈ యజ్ఞాన్ని నిర్వర్తించటమే నీకు ఈ రోజు ఉస్సోక్ వేస్తున్న శిక్ష..."

 Previous Page Next Page