Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 15


    స్నానం చేసి వచ్చేసరికి కంచాల్లో భోజనం. గోంగూర, ఆవకాయ! కట్లెట్టూ- ఫోర్కు కాదు.

    "నువ్వు చాలా నిశ్శబ్దంగా వుంటావేమిట్రా?" భోజనం చేస్తూంటే అడిగాడు.

    "ఇంట్లో ఒక్కణ్ణేగా-" నవ్వాడు శంభు.

    భోజనం చేశాక పుస్తకాలు అందించాడు. "నీకేం తోచదని కరణంగారింటి నుండి తెప్పించాను."

    స్ట్రేంజర్స్ వెన్ వుయ్ మీట్. డ్రీమ్స్ డై ఫాస్ట్.

    తెరిచిన బీరువాలోంచి తొంగిచూస్తున్న శ్రీహర్ష నైషధం, మనుచరిత్ర.

    -పుస్తకాలు ప్రక్కన పెట్టేశాడు.

    రోజంతా ప్రయాణం చేయటం వల్ల నిద్ర ముంచుకు రాసాగింది. అది గమనించి "పడుకోరా" అన్నాడు.

    ఎత్తయిన పందిరిమంచం. సున్నం కొత్తగా వేసిన గోడల మీదనుంచి వస్తున్న గమ్మత్తయిన వాసన.

    ఫానులేదు. గోదావరి గాలే రివ్వున.

    ఆలోచనల్తోనే నిద్రపట్టింది.

    ప్రొద్దున్న వరకూ మెలకువ రాని నిద్ర.

    పొద్దునంటే పొద్దునకాదు. తెలతెలవారుతూంటే-

    చిన్న ధ్వని. నాదం.

    కళాకారుణ్ణి ఎక్కడున్నా తట్టిలేపే నాదం.

    ఆశ్చర్యంతో లేవబోయాడు. కానీ లేవలేదు. ఒక అలౌకిక స్థితిలో అలానే వుండిపోయాడు. తరంగాలు తరంగాలుగా ఆ ధ్వని అతని కర్ణపుటాలను తాకుతోంది.

    గాంధారంలో ప్రారంభమైన ఆ ఆలాపన, పంచమ దైవతాల మధ్య సంచారం చేస్తుంది. ఆరోహణాక్రమంలో షడ్జమాలనందుకొంది. అతడలాగే వెల్లకిలా పడుకొని, తలక్రింద చేతులు పెట్టుకొని పై కప్పు కేసి చూస్తూ వింటున్నాడు.

    కళ్ళూ వింటున్నాయి.

    చెవులకు తోడైన కళ్ళు.

    లీలగా రూపు సంతరించుకుంటూన్న తొలి సంజెఛాయల్లో పుంపోంకిక్కల గీతాన్ని మైమరపించే నాదం.

    కిటికీలోంచి ఒక వెలుగురేఖ లోపలికి పడుతోంది.

    పంచమ దైవతాలనుంచి రిషభంలోకి వచ్చిన ఆలాపన మధ్య మధ్యలో గాంధారాన్నీ దైవత్వాన్ని పరామర్శిస్తూంది.

    భూపాల రాగఛాయ తొలి వెలుగుకి స్వాగతం పలుకుతూంది.

    పొగమంచి నెమ్మదిగా విడిపోతోంది.

    రాత్రంతా కురిసిన మంచులో బద్ధకంగా నిదురపోయిన మల్లెమొగ్గ తొలి ఉషస్సులో బద్ధకంగా వళ్ళు విరుచుకుంటూంది.

    అంతర గాంధారం వరకూ వెళ్ళి దైవతాన్ని అందుకున్నట్టే అందుకుని వదిలేసిన ఆ గానం.... నెమ్మదిగా షడ్జమానికి జారి.... ఆగిపోయింది.

    నిశ్శబ్దం.

    నిశ్శబ్దం కూడా ఆలాపన చేస్తోంది. ఏ వీణతీగె పలికించలేని నాదం ట్రాన్స్.

    గది గోడలు కూడా ఆ అలౌకిక స్థితిలో అలానే వుండిపోయాయి.

    ఎన్నో కచేరీలు చేసినవాడూ, అందరిచేత ఓహో అనిపించుకున్న వాడూ అయిన ఆ సితారు కళాకారుడు ఒక మారుమూల విసిరేసినట్టూ వున్న పల్లెలో, ఒక చిన్న పాకలో, ఆ ప్రభాత సమయాన వినిపించిన నాదాన్ని విని, తనకి వచ్చిన విద్య అందులో సగం కూడా వుండదని ఆ క్షణం అనుకొన్నాడు.

    చాలాసేపు అలానే పడుకుని, కొమ్హెం తెల్లవారిన తరువాత లేచాడు.

    బాగా వెలుగొచ్చింది.

    ముందు గదిలోకి వచ్చాడు.

    మూలగా తివాచీ మీద వీణ.... నిండుగా ముత్తయిదువులా.

    ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.

    దూరంగా ఎక్కడో లేగదూడ 'అంబా' అని అరుస్తూంది.

    వీణ దగ్గరగా వెళ్ళి మోకాళ్ళమీద కూర్చున్నాడు.

    అమాయకమైన తీవెలు. మౌనంగా ఆర్ద్రంగా - ఎన్నో స్వరాల్ని తమలో దాచుకుని గుంభనంగా!

    ఎవరన్నారు తీవెలు మాట్లాడలేవని?

    చూపుడు వేలుతో లాలనగా స్పృశించాడు.

    గదిలో నిశ్శబ్దం అందంగా చెదిరింది.

    గుమ్మం దగ్గర కదిలిన సవ్వడి.

    తల తిప్పి చూస్తే గుమ్మం దగ్గర అన్నపూర్ణ.

    చెయ్యి వీణమీద వుంచి అలానే ఆమెను చూస్తున్నాడు అతడు.

    మూసిన కిటికీ సందులోంచి ఏటవాలుగా కిరణం పడుతుంది.

    పొద్దున్నే తలంటుకోవటంవల్ల ముంగురులు గాలికి లీలగా వూగుతున్నాయి.

    తెల్లటి ఓణి- పచ్చటి పరికిణీ. చుట్టూ గులాబీల మధ్య ముద్దబంతి పువ్వులా!

    'బాగున్నావా అన్నపూర్ణా' అందామనుకున్నాడు.

    గుండె గొంతులో కొట్టుకుంటుంది.

    అరక్షణం కలిసి వీడిన చూపులు.

    క్షణం అసత్యం కాదు.

    మిగిలిన నిశ్శబ్దం పూర్వపు స్నేహితుడు.

    ఆమె లోపలికి వెళ్ళిపోయింది.


                                                    *    *    *


    "ఎవరూ? మన అన్నపూర్ణ కొడుకు కదూ" కనపడని చూపుతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంది ఒక ముసలమ్మా.

    "చిట్టెలుకలా వుండేవాడు. ఎలా తయారయ్యాడో!"

    అతడి సిగ్గూ, మొహమాటమూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అక్కడుండాలో లోపలికి వెళ్ళాలో తేల్చుకోలేకపోతున్నాడు.

    "ఎంతమంది పిల్లలు నాయనా?"

    వెనుకెవరో పెదవులు విడివడనట్టు నవ్విన ధ్వని. తల తిప్పి చూస్తే వెనుక అన్నపూర్ణ.

    వాళ్ళని తప్పించుకుని బయటకు నడిచాడు.

    బాగా చీకటి పడింది.

    చీకటి నల్లటి పైట చెరుగును పల్లెమీద కప్పుకుంది.

    ఇంటివెనుక దూరంగా గట్టు, గోదావరి పాయ రెల్లుగడ్డి మొదట్లో చేరి ఆగి ఆగి అరుస్తున్న కీచురాయి.

    గట్టుమీదున్న చెట్టు మొదట్లో కూర్చున్నాడు.

    నీళ్ళు స్థబ్దంగా కదులుతున్నాయి.

    దూరంగా ఏదో పిట్ట ఆగి ఆగి అరుస్తూంది.

    నీళ్ళల్లో చంద్రుడు మెరుస్తున్నాడు.

    ఏదో అస్పష్టమైన వేదన.

    అతడు గొంతు కదిపాడు.

    పదాల్లేవు రాగమే. మాటల్లేవు భావమే.

    మనసులో నుంచి వాక్యూమ్ ని బైటకు తీసి కంట నీరు తెప్పించే ఆలాపన. అది హిందూస్థానీ మల్హరా- కర్ణాటకలో వరాళా? ఏదైతేనేం?....

    ఒంటరి తనపు మసక వెన్నెల రాత్రిలో, ఓదారుస్తున్నట్టు పక్కన పంట కాలువ.

    దూరంగా ఎవరో వస్తున్న అలికిడి. చూస్తే చేతిలో హరికేన్ లాంతరుతో అన్నపూర్ణ.

    అతను నొచ్చుకున్నాడు.

    అతని కోసమే వచ్చినట్టు ఆమె ఆగింది. ఆతనేదో చెప్పబోయి ఆగాడు....

    మాట రాలేదు.

    సంజె పెదవుల ఎరుపు.... కడలి అంచున విరిగి- సంజె పరికిణి చెరుగు.... ఎడద లోతుల మెరసి-

    నీటి కొంగల నిదుర ఎర్రగా పాకింది - బాతురెక్కల నీడ బరువుగా సోకింది.

    ఆమె వెనుదిరిగింది.

    మౌనంగా వెనకే అతడు.

    కిన్నెరసానిలా వయ్యారంగా జడ, శబరిలా సన్నగా నడుము, గోదారి కెరటంలా చీరె చెంగు!

    చాలా తొందరగా వచ్చేసిన ఇల్లు.

    ఆ రాత్రి చాలా ఆలస్యంగా నిదురపోయాడు. కానీ తెలతెలవారుతూ వుండగానే మెలకువ వచ్చేసింది.

    లేచి వాకిట్లోకి వచ్చాడు.

    అయిదారుగురమ్మాయిలు ఉత్సాహంగా వంగుతూ లేస్తూ చేతులు కలుపుతూ, ప్రపంచంలోని అమాయకత్వాన్నీ, ఆనందాన్నీ స్వంతం చేసుకుని పాడుతున్నారు.

    కొలని దోపరికి గొబ్బియ్యళ్ళొ....
    యదుకుల స్వామికి గొబ్బియ్యళ్ళొ....

    అతడు ద్వారబంధానికి ఆనుకుని నవ్వుతూ చూస్తున్నాడు.

    వింత వింత ముగ్గులు, రంగు రంగుల పూలు.

    గుమ్మడి, బంతి చేమంతి పేడముద్దల మీద పూలు గుచ్చేసి గొబ్బెమ్మలు.

    దూరంగా అటునుంచి వస్తూన్న జంగందేవర ఇటునుంచి బుడబుక్కలవాడు.

    మధ్యలో భోగిమంటలు.

    కొండ- గొడుగులో గోవుల గాచిన
    కొండుక శిశువునకు గొబ్బియ్యళ్ళో గొబ్బియ్యళ్ళో-

    పాడుతూ పాడుతూ తిరుగుతున్న గుంపులోంచి అతణ్ణి చూసిన అన్నపూర్ణ చప్పున ఆగిపోయింది.

    క్షణం కనబడీ కనబడనట్టూ నవ్వు. ప్రక్కనున్న పిల్ల మోచేతితో పొడిస్తే ఉలిక్కిపడి మళ్ళీ కదిలింది.

    గొబ్బియ్యళ్ళో గొబ్బియ్యళ్ళో.

    ఆమె పాడటంలేదు. తలవంచుకొని అందరితోపాటు అడుగులు వేస్తూ వుంది. మొహంలో నవ్వుమాత్రం అలాగే వుంది.

    వీణ తీగె మీటితే శబ్దం. పెదవి నవ్వు కదిలితే నిశ్శబ్దం.


                        *    *    *   


    బట్టలు సర్దుకుంటూంటే మావయ్యొచ్చాడు.

    "శంభూ"

    ఆగి వెనక్కి తిరిగాడు. చేతిలో ప్యాకెట్టు.

    "ఏమిటి మావయ్యా?"

    "బట్టల్రా."

    కొంచెం నొచ్చుకున్న స్వరంతో "ఇప్పుడెందుకు మావయ్యా ఇవన్నీ" అన్నాడు.  

 Previous Page Next Page