"పుట్టిన పాతిక సంవత్సరాల తరువాత వచ్చావు. ఇంకా ఎన్నో చెయ్యాలి. కానీ ఈ బీదరికం వున్నది చూశావూ- చాలా భయంకరమైనదిరా! ఆప్యాయతల్ని చూపించే మార్గాలన్నిటినీ మూస్తుందిరా అది."
"మావయ్యా, ప్లీజ్" అతడి కంఠం వణికింది.
"మీ అమ్మే వుంటే సంవత్సరం సంవత్సరం రావలసిన వాడివి కదరా నువ్వు" ఆపై మాటరాలేదు.
ఎత్తుగా గంభీరంగా వుండే మావయ్య.
ఆప్యాయతతో గుండెల్ని కదిలించే మావయ్య.
గుండె లోతుల్లో అమ్మ మెదిలింది. ఎడ్ల మెడలో మువ్వ కదిలింది.
ముందు మావయ్య. వెనక అతడు.
బండి ఎక్కబోతూ వెనుదిరిగి చూశాడు. గుమ్మం దగ్గిర అన్నపూర్ణ, కదలకుండా అచేతనంగా మౌనంగా.
ఆమె కళ్ళల్లో తడిని చూసి విచలితుడయ్యాడు.
అతడి పెదవులు అస్పష్టంగా కదిలాయి. వెళ్ళొస్తానన్నమాట గొంతు దాటి బయటికి రాలేక ఆగిపోయింది.
అతని చూపులే చెప్పాయి 'వెళ్ళొస్తానని'
వంచుకున్న తల, దించుకున్న కళ్ళు, అంతలోనే అల్లలాడి, క్షణం పైకి లేచి దిగిపోయిన ఆమె కనురెప్పలే సమాధానం చెప్పాయి.
కదిలిపోతున్న బండివెంట చూపులూ పయనించాయి. పయనమైన వాడికి గోదారి వీడ్కోలు చెప్పింది.
* * *
రైలు వచ్చి ఆగింది.
కంపార్టుమెంటులో సూట్ కేస్ పెట్టి శంభు బయటకు వచ్చాడు.
"వెళ్ళగానే ఉత్తరం వ్రాయి."
"అలాగే మావయ్యా."
వెళ్ళి అరటిపళ్ళు కొని తెచ్చి ఇచ్చాడు. "మీ నాన్నని కూడా రమ్మని వ్రాయాలి ఒకసారి."
"తప్పకుండా."
"బట్టలు కుట్టించుకో, బాగా లేవని వదిలెయ్యకు."
"ఇంకోసారి అలా అన్నావంటే...."
"సర్లే. సర్లే."
గార్డు విజిల్ వేశాడు.
"వెళ్ళొస్తాను మావయ్యా."
"మంచిదిరా, మళ్ళీ ఎప్పుడొస్తావ్?"
"నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడే. కానీ ఈసారి ఉట్టి బట్టలు పెడితే వూరుకోను."
నవ్వాడు. "మరేం కావాలి?"
గార్డు జండా వూపుతున్నాడు.
"ఏం కావాలన్నా ఇస్తావా?"
"చెప్పరా, నా దగ్గర నీకా స్వాతంత్ర్యం లేదూ."
........
"మాట్లాడరా!"
.........
మాట్లాడాలి, ఇన్నాళ్లు ఈ మాటలు రానితనంవల్ల కోల్పోయినదంతా ఇప్పుడు పొందాలి.
".... నాకు .... నాకు అమ్మ వీణ కావాలి మావయ్యా."
"దానికేరా తీసుకెళ్లు. అది మీదేగా" అతడి కళ్ళల్లో లీలగా విషాదం. పదహారేళ్ళగా కూతురు సాధన చేసుకుంటున్న వీణ.
"తీసుకెళ్ళరా."
"వీణతోపాటూ నీ కూతురు కూడా కావాలి మావయ్యా."
రైలుకూత. ప్లాట్ ఫారం అంతా హడావుడి.
"శంభూ -ఒరేయ్ ఏమిట్రా...ఏమిట్రా నువ్వు నువ్వు" మాటతడబడుతూంది. కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
రైలు కదిలింది.
"వద్దు మావయ్యా. ఇంకేం చెప్పకు. నా నిర్ణయం మారదు. నిర్ణయానికి రావటానికే కొంచెం ఆలస్యం పట్టింది."
రైలు వేగం పుంజుకున్నది. పై కండువాతో కళ్ళు తుడుచుకుంటూన్న మావయ్య దూరంగా అదృశ్యమైపోయాడు. శంభు మనసంగా ఎక్కడో విహరిస్తున్నట్టూ వుంది. వచ్చి సీట్లో కూర్చున్నాడు. ఎదురుగా ఒక వృద్ధ దంపతుల జంట.
కిటికీలోంచి బైటకు చూస్తున్నాడు.
వేగంగా దాటిపోతున్న చెట్లనీ గుట్టల్నీ చూడటంలేదు.
పచ్చటి పొలాలు.
పచ్చటి పరికిణీ కట్టుకున్న అమ్మాయి.
నీళ్ళలో పద్మాలు. పద్మాల్లాంటి కళ్ళు.
లయగా రైలు ధ్వని, గొబ్బిళ్ళ పాట.
ఏమిటది? "కొలని దోపరికి గొబ్బియళ్ళో" కదూ.
తనని చూసి నవ్విన నవ్వు.
చీకట్లో హరికేన్ లాంతరు తీసుకొచ్చి....
ఆప్యాయతని ఇంత చిన్న చిన్న విషయాలే పట్టించేస్తూ వుంటాయి.
మరి అపుడు మాటలెందుకు? అవును. మాటలెందుకు?
మనసులోని కల్మషం మూట విప్పటానికి తప్పితే....!
అతడికొక-గొప్ప సత్యం అర్ధమయింది. ఒక గొప్ప రహస్యం శోధించబడింది.
పెదవులమీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది.
తన మనసుని తను ఇంకోలా అర్ధం చేసుకున్నాడు.
"నింఫొ ఫోబియో" అన్నాడొకడు. "సైప్రైటిస్" అన్నాడొకడు.
ట్రైన్ ఆగింది.
అప్పుడే ఏలూరొచ్చిందా?
మూడు గంటలు గడిచాయా? ఎంత తీయటి ఆలోచనలు! ప్రతి కదలికా, ప్రతి సంఘటనా- మననం చేసుకుంటున్నకొద్దీ హాయినిచ్చే అనుభూతులు.
మళ్లీ నవ్వు వచ్చింది.
ఎదురుగా కూర్చున్న ముసలమ్మా భర్తవైపు తిరిగి గుసగుస లాడింది.
"చూశారా అతణ్ణి!! క్షణం బైటకు చూస్తాడు. క్షణం కళ్ళు మూసుకుంటాడు. మాటిమాటికీ తనలో తను నవ్వుకుంటాడు."
ఆ వృద్ధుడు ఆప్యాయంగా శంభుని చూస్తూ బోసినోటితో ముసిముసిగా నవ్వి "ప్రేమలో పడ్డాడేమో" అన్నాడు.
* * *
"కంగ్రాచ్యులేషన్సు గురూ! పెళ్ళి చేసుకోబోతున్నందుకు పార్టీ- ప్రేమలో పడ్డందుకు నాకు స్పెషల్ పార్టీ - బైదిబై ఏం మాట్లాడుకున్నారు గురూ!"
"ఏమీ మాట్లాడుకోలేదు" నవ్వాడు శంభు.
"నీలాటి జడుడ్ని కదిలించిందీ అంటే ఆ అమ్మాయి మంచి మాటకారి అయి వుండాలనుకున్నాను" నిరాశ ధ్వనించింది.
"ఊహూ. లేదు."
"ఒక్కమాట."
"ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదు. నా వుద్దేశ్యం మాటలకి ఇంటిన్సిక్ వాల్యూ లేదని, మనసులోని మంచి భావాన్ని చెప్పే శక్తి మాటలకి లేదు."
అతడి కళ్ళు వెలుగుతో ప్రకాశిస్తున్నాయి.
"పెళ్ళవకముందంటే తప్పించుకున్నావ్. కానీ పెళ్ళయ్యాక?.... అప్పుడేం చేస్తావు? మాట్లాడాలి. స్వీట్ నథింగ్ చెప్పాలి!! చెయ్యబోయే గోంగూర పచ్చడినుంచీ తేవాల్సిన చీపిరికట్ట వరకూ చర్చించాలి. అసలే నీకు మాట్లాడడం చేతకాదు. కనీసం వినటమన్నా నేర్చుకో. సోదట్...."
"మా మధ్య ఆ సమస్య రాదు."
"ఏం? ఎందుకని రాదు?"
సితారు తీవెని వేళ్ళతో అలవోకగా కదిపేడు. ముత్యాల జల్లులా కురుస్తూన్న ధ్వని తరంగాల మధ్య అతనన్నాడు.
"అన్నపూర్ణ మూగది కాబట్టి."
యమన్. యమన్ కళ్యాణ్. జై జయవంతి, హంసధ్వని. కీర్వాణి. శివరంజని, కళ్యాణి, భైరవి, ముఖారి, వరాళి.
ఏ రాగమైతేనేం? తీవె ఒక్కటే.
ఏ భావమైతేనేం? మనసు ఒక్కటే.
మరి మాటలెందుకే మనసా?
* THE END *