Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 14


    ట్రైన్ నెమ్మదిగా ఆగింది.

    బ్రీఫ్ కేస్ తో దిగుతూ వుండగా శంకరాభరణం మావయ్య వెతుక్కుంటూ రావటం కనిపించింది.

    "వచ్చేవా" సూట్ కేస్ అందుకొంటూ అన్నాడు.

    "నీ ఫోన్ కాల్ రాకపోతే.... ఫోన్ లో రాకపోతే ఒట్టే' అని బలవంతం చెయ్యకపోతే, వచ్చేవాణ్ణి కాదు."

    "నాకు తెలుసోయ్. అందుకే ఫోన్ చేసేను."

    ఇద్దరూ స్టేషన్ బైటకి వచ్చారు.

    మిత్ర ఆగి చుట్టూ చూసేడు. ఇరవై రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ రావటం. ఏదో చిత్రమైన స్పందన.

    "నువ్వు పుట్టిందిక్కడే" అన్నాడు. "మీ అమ్మకి కాన్పు కష్టమైతే ఈ వూరుకార్లో తీసుకొచ్చేం. ఆ రోజుల్లో మంచి డాక్టర్లు ఎక్కువమంది వుండేవారు కాదు."

    రిక్షా బస్ స్టాండ్ లో ఆగింది. వర్షం పడటంవల్ల నేలంతా చిత్తడిగా వుంది.

    రిక్షావాడికి డబ్బులిస్తూ, "రాజమండ్రి అంటే చిత్తడికి పెట్టింది పేరు" అన్నాడు. మిత్రకి ఆ భావం కలుగలేదు. ఏదో అస్పష్టమైన ఆప్యాయతా, ప్రేమా కలిసిన భావం.... మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో కదిలి, ప్రపండ వేగంతో పరుగెత్తి, గంగలా పెల్లుబికీ, మందాకినిలా నెమ్మదిగా మనసంతా పరచుకొని మెటీరియలిజంని అసత్ఖ్యాతివాదం పరపరా కొస్తోంది.

    "యానం యానం యానం" అరుస్తున్నాడు క్లీనరు.

    ఎక్కి కూర్చున్నారు ఇద్దరూ.

    కొంచెం సేపటికి బస్ కదిలింది.

    "మీ నాన్నని మాతోపాటూ వుండిపొమ్మన్నాను. వినలేదు. ఏముంది కలకత్తాలో? సంపాదించాడనుకో! కానీ నన్నడిగితే కలో గంజో వున్నవూళ్ళో తాగటంలోనే సంతృప్తి వుందంటాను."

    అతను వినటంలేదు.

    పచ్చటి పొలాలూ, కదిలివెళ్తూన్న కొబ్బరిచెట్లూ....సాయంత్రం కావస్తూంది. పదహారేళ్ళ అమ్మాయి పైట ఆరేసుకుంటే ఆకాశం నీలంగా మారింది. సూర్యుడు సిగ్గుతో ఎర్రబడిన మొహాన్ని భూదేవి వక్షోజాల మధ్య దాచుకోవటానికి కొండల మధ్యకి చేరుకుంటున్నాడు. చల్లటి పిల్లగాలి మనసు సేద తీరుస్తూంది.

    బస్ యానంలో ఆగింది.

    "తొందరగా దిగు- పడవెళ్ళి పోతుంది."

    శంభు ఒక్కగెంతులో దూకబోయి జారేడు.

    బలమైన చేతులు ఆపేయి.

    "ఇది మీ ఊరు కాదు. జాగ్రత్త" నవ్వేడు మావయ్య.

    ఇద్దరూ రేవువైపు నడవసాగేరు.

    "గోదావరికి అటువైపు మనవూరు. మీ అమ్మ, నేనూ ప్రతిరోజూ బడికి ఇటువైపు వచ్చేవాళ్ళం. వర్షాకాలం కట్టలు తెంచుకొని ప్రవహించేది గోదావరి. ఇద్దరం ఏడో క్లాసులో మానేసేమనుకో" నవ్వేడు.

    ఆయన చేతులకేసీ, నాగలి పట్టిన భుజాలకేసీ చూసి కళ్ళు తిప్పుకొన్నాడు శంభు.

    "నువ్వు ఎక్కువగా మాట్లాడవేమిట్రా?" హఠాత్తుగా అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడి నవ్వుతూ "అదేంలేదు మావయ్యా" అన్నాడు.

    "మీ అమ్మ కూడా అంతే, ఎక్కువ మాట్లాడేది కాదు. దాని కెన్ని విషయాలు తెల్సుననీ! ఐనా గుంభనంగా వుండేది. నీకు తెలీదురా అబ్బీ. మీ అమ్మకి కలకత్తా అసలు ఇష్టంలేదు. చిన్నప్పటినుండీ దానితో కలిసి తిరిగినవాణ్ణి, దాని మనసు నాకు తెలియదూ. ఈ గోదార్నీ, తన చిన్న పల్లెటూర్నీ ఎంతగా ప్రేమించిందో అది! అయినా మీ నాన్నతో నోరువిప్పి ఒక్కమాటంటేనా.... గుండెల్నిండా ఆశని దాచుకొన్నట్టుంది.... చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక్కటంటే ఒక్కమాట- 'అస్థికల్ని గోదావరిలో కలపమ'ని అన్నది. నాకు తెలుసు దాని ప్రాణం ఎంత కొట్టుకుందో" ఆగి అన్నాడు. "బురదలో పుస్తకాలు పట్టుకొని నడిచి వచ్చేవాళ్ళం. కాలువలో పడవ కనబడగానే ఒక్క పరుగుతో వెళ్ళి కూర్చునేది."

    అమ్మ! పరికిణీ కట్టుకొని.... చెరుగ్గడ నముల్తూ.... కాలవగట్ల వెంట పరుగెత్తిన అమ్మ! నాన్నతో కలిసి కలకత్తా వెళ్లిపోతూ తల్లీ గోదావరికి కన్నీటితో వీడ్కోలు చెప్పిన అమ్మ!

    "ఎందుకురా ఏడుస్తున్నావ్?"

    "అబ్బే, ఏం లేదు మావయ్యా."

    చెయ్యి చాచి దగ్గిరగా తీసుకొంటే రొమ్ముల్దాకా వచ్చిన తల....భుజాలచుట్టూ ఆశ్రయమిచ్చిన కోటలా బలమైన చెయ్యి.

    "రండి బాబూ రండి. ఇంకెవరైనా వున్నారా!" అరుపులకి ఆలోచన్లు చెదిరి అటు చూసేడు.

    గోదావరి.

    నిండుగా- ముత్తయిదువలా గోదావరి.

    అల్లరి ఆడపిల్ల పెళ్ళయ్యాక గాంభీర్యాన్ని సంతరించుకున్నట్టు, కొండల మధ్య అల్లరిగా పారే సెలయేరు జీవనదై గాంభీర్యాన్ని నింపుకొన్నది.

    చెయ్యి పట్టుకొని పడవెక్కేడు.

    పడవ తాడు విప్పేడు.

    ఒక్కొక్క కెరటమే వచ్చి పడవని తాకి వయ్యారంగా పక్కకి తప్పుకొంటూంది.

    రెల్లుగడ్డి గాలికి హొయలుగా వూగుతుంది.

    నీటిమీద నురగ పడవకి దారిస్తూ పక్కకి తొలిగింది.

    చీకట్లు నెమ్మదిగా అలుముకొంటున్నాయి.

    ఎర్రటి కిరణాలు తెల్లటి నీటిమీద అలలు అలలుగా పడి పరావర్తనం చెందుతున్నాయి.

    .... యేతామెత్తి యెదురెదురుగా కూకుండి.
    తెల్లారబోతుంటే సెందురుణ్ణితిట్టు నా ఎంకి.


    మోచేతిమీద వాలి, పడవ అంచున కూర్చుని ప్రకృతిని చూస్తున్నాడు అతడు.

    మంజీరనీ, శబరినీ, ప్రాణహితనీ, ఇంద్రావతిని తనతో కలుపుకొన్నది. ఏమీ ఎరగనట్టు సాగరాన్ని చేరుతున్నది.

    ఎర్రటి జాడని వదిలి సూర్యుడు పడమట కొండల్లోకి వెళ్లిపోయేడు. తెల్లటి కొంగల గుంపొకటి నదిని దాటుతూంది. నీలి మేఘం హడావుడిగా ఉత్తరం కేసి సాగిపోతూంది.

    ....రమ్య గౌతమి జలాల్లో కొన్ని వేల విద్యుద్దీపాలు.

    ఎవరీవిడ రుధమిల్లంలో ఇన్ని కాంతి లతాంతుల్ని తురిమారు ?

    ఎత్తిన తెరచాప.... వత్తిన దీపం, అత్తలమైన గాలి, ఉత్తల పడి ఎత్తరమై అత్తిరి కత్తిరిల్లి ఒత్తిగిల్లిన కెరటం.

    పిండార బోసినట్టు పడ్తూన్న వెన్నెల.

    "శంభూ"

    "ఏం మావయ్య?"

    "రైలయింది, బస్సయింది, పడవ అవుతూంది. తరువాత బండి. మొత్తానికి అన్ని బాధలూ అనుభవిస్తున్నావ్."

    "అదేం లేదు మావయ్యా. ఈ పడవ ఇలా వెళ్ళడం ఎంత బావుందో-"

    "వాటర్ వాటర్. ఎవ్విరివేర్"

    శంభు కళ్ళలో ఆశ్చర్యం.

    "నీకు తెలుసా మావయ్యా?"

    "వర్డ్స్ వర్తూ, కోలెరిడ్జి తెలియటానికి బియ్యే ఎమ్మేలు చదవాలట్రా?"

    మళ్ళీ నిశ్శబ్దం. నీళ్ళని కోస్తున్న ధ్వని. చెక్కమీద నుంచి వస్తూన్న తడచిన గాలి, ఒక పక్కగా వాలి దూసుకుపోతున్న నావ.

    మావయ్య సన్నటి కూనిరాగం- "నొల్లని నినుగని ఉడికేను. నీ చిల్లర చేతుల జిమిడేను."

    "మావయ్యా."

    "ఏరా-"

    "శంకరాభరణంకదూ-"

    "కాదురా, ముఖారి."

    "శంకరాభరణంలా వుందే-"

    "నేనేం పాడినా అలానే వుంటుందనే కదరా నాకా పేరు పెట్టేరు" వెన్నెల్లో నవ్వు మెరిసింది.

    పడవ అవతలి తీరం చేరుకుంటూంది. దూరంనుంచి చీకట్లో కొబ్బరిచెట్లు.... ఆకులు వింజామరల్లా, ఆకారాలు అరవిచ్చిన కంజాతాల్లా ఆహ్వానిస్తున్న ఆడపడుచుల్లా వున్నాయి.

    "మావయ్యా?"

    "ఏరా?"

    "నాకు- నాకు అమ్మ జ్ఞాపకం వస్తూంది మావయ్యా."

    చుక్కాని తిప్పగానే గిర్రున తిరిగిన పడవ చిన్న సంఘటనతో మలుపు తిరిగిన మనిషి జీవితంలా తీరం చేరింది.


                       *    *    *


    మెడలో మువ్వల్ని గలగల్లాడించుకొంటూ ఎడ్లు వడివడిగా నడుస్తున్నాయి. వీపు వెనుక గడ్డి వెచ్చగా వుంది. చిన్న కుదుపులతో బండి ముందుకు వెళుతూంటే చీకటి నీడలు వెనక్కి వెళుతున్నాయి. ఎక్కడ చూసినా కొబ్బరిచెట్లే.

    ఇంటిముందు బండి ఆగింది.

    "జాగ్రత్తగా దిగరా-బురద".

    బెల్ బాటమ్ పాంటు పైకెత్తి నెమ్మదిగా అడుగు క్రిందికి పెట్టాడు.

    చిరుచీకట్లలో ఆశ్రమంలా పాక వెన్నెల వెలుగులో తలలూపుతున్న బంతిచెట్లు, కాలిబాటలో వేసిన నాపరాళ్ళు.

    ఈ ముంగిలిలోనేగా తన తల్లి ప్రాతఃకాలాన లేచి మార్గశిరమాసంలో రంగవల్లుల్ని తీర్చిదిద్దింది. ఈ ముంగిలినేగా చలిని లెక్కచేయకుండా ఇల్లు ఇల్లు తిరిగి గుమ్మడిపూలు గొబ్బిళ్ళు చేసింది. ఈ ప్రాంగణంలోనేగా గోరింటాకు పెట్టుకొని తలంటుపోసుకొని ఉయ్యాలలూగుతూ అట్లతద్దె జరుపుకొంది.

    "ఆగిపోయావేంరా-"

    "ఏం లేదు మావయ్యా-"

    "బాగా చదువుకొన్నవాడివి. పట్నాలలో పెరిగినవాడివి. నిన్ను చాలా బాధపెడుతున్నాను కదరా."

    "లేదు.... ఇది....ఇదంతా చాలా బావుంది."

    "నిన్ను తీసుకొచ్చేనన్నమాటేగానీ నాకు భయంగానే వుందిరా. ఆడదిక్కులేని ఇల్లు. నిన్ను సరీగ్గా చూసుకోకపోతే మీ నాన్న నా చర్మం వలుస్తాడు."

    మిత్ర ఆగేడు. గదిలో ఒకమూల గుడ్డ విప్పిన వీణ.

    అమ్మది.

    "స్నానం చెయ్యరా. వేణ్ణీళ్ళున్నాయి" తువ్వాలందిస్తూ అన్నాడు.   

 Previous Page Next Page