Previous Page Next Page 
అశ్వభారతం పేజి 15


    ఉలిక్కిపడ్డాడు అనురాగ్. అర్ధంకానట్లు చూసాడు.

    "ఆషా రాత్రి ఫోన్ చేసింది. స్టూడియోకి వెళ్ళేసరికి తండ్రి డెత్ బాడీ కనిపించలేదట. హత్యజరిగిన ఆనవాలేం దొరకలేదట. హత్యే జరిగింది అనుకుంటే ఆ బాడీతో ఎవరికి అవసరం? ఏం అవసరం? దాంతో ఆషా తన తండ్రి బ్రతికి ఉన్నట్లుగానే భావిస్తోంది. పూర్తి వివరాలు ఆషా వస్తేగాని తెలియదు. ఆషా ఈ సాయంత్రం వస్తున్నట్లుగా ఫోన్ చేసింది. ప్రస్తుతానికి వాళ్ళ నాన్నగారి స్టూడియోని లాక్ చేసిందట.

    అనురాగ్ కి అంతా అయోమయంగా అనిపించింది. సుదర్శన్ దివ్యతేజ హత్య చేయబడ్డట్టు చెప్పాడు.

    పైగా అది పేపర్ లో కూడా వచ్చిందన్నారు.తనా హత్యచేయలేదు మరెవరో చేసుండొచ్చని చెప్పాడు. మరి అదృశ్యం సంగతేమిటి....?!

    సుదర్శన్ గురించి పూర్తి వివరాలు త్రివేణికి చెప్పలేకపోయాడు అనురాగ్_ఆలోచిస్తుండి పోయాడు.


                              *    *    *


    శుక్రాచార్య ఫోన్ ఎత్తి శశాంక కాన్ఫిడెన్షియల్ కి నెంబర్ డైల్ చేసాడు. ప్రక్కనే ఉన్న భరత్ శుక్రాచార్యవేపు చూస్తూనే తన ఆలోచనల్లో తనున్నాడు.

    "హలో....నేను శశాంకతేజ్ దత్త గారితో చాలా అర్జంటుగా మాట్లాడాలి...." అంటుండగానే అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం.

    మరలా ఓపిగ్గా ఎత్తాడు ఫోన్.

    ఈసారి సూటిగా అసలు విషయంలోకి వస్తే మంచిదనుకున్నాడు శుక్రాచార్య.

    "విశ్వదత్తను లీగల్ గా విడిపించే పధకం ఒకటి మా దగ్గరుంది" కాస్తంత ఆగాడు శుక్రాచార్య.

    ఈసారి అవతల ఫోన్ పెట్టేయలేదు. కాని మాటలేం వినిపించలేదు. తనన్న మాటలు అవతల వ్యక్తిని అలర్ట్ చేసినట్లుంది. అందుకే అసలు వ్యక్తికి ఫోన్ ఇచ్చేందుకుగానీ, కాల్ ని నమ్మాలావద్దా అనే సందిగ్ధంలోగాని పడి ఉండవచ్చనిపించింది శుక్రాచార్యకు.

    "ఎవరు మీరు? ఎలా తప్పించగలరు? నాకు జోకులేసే వాళ్ళంటే చాలా కోపం_సింపుల్ గా వాళ్ళను చంపేస్తాను...." కరుగ్గా ఉన్నాయి శశాంక మాటలు.

    "నాకు నా ప్రాణాల మీద ఆశ ఉంది...."

    "అంటే జోకు కాదన్నమాట, వెల్ ఎవరు మీరు? ఎలా తప్పించగలరు?"

    మనిషి వివత్కరమైన పరిస్థితుల్లో కాళ్ళు పట్టుకోటానికైనా సిద్ధపడతాడనటానికి శశాంక గొప్ప నిదర్శనం.

    శుక్రాచార్య ఏదో మాట్లాడబోయేంతలో సడన్ గా ఫోన్ ని తన చేతిలోకి తీసుకున్నాడు భరత్.

    "మేమెవరం అన్నది అనవసరం....ఎలా అన్నది కూడా....మీకు కావాల్సింది మీ కొడుకు బయటకు రావటమే. అవునా?"

    ఇదే మరో సమయంలో ఎవరన్నా ఇలా మాట్లాడి ఉంటే వాళ్ళ జీవితాలకి లెక్కలు కట్టేవాడేకాని ప్రస్తుతం తనున్న పరిస్థితి వేరు.

    "అఫ్ కోర్స్....అయితే వెంటనే నన్ను కలవండి...."

    "అవసరం మీది_మీరే మమ్మల్ని రప్పించుకోవాలి గనుక మీ కారు అబిడ్స్ లోని దక్కన్ ఆప్టికల్స్ దగ్గరకు పంపించండి. బై...." అంటూనే ఫోన్ కట్ చేసాడు భరత్.

    శుక్రాచార్య ఆశ్చర్యంగా భరత్ వేపు చూస్తుండిపోయాడు.

    ఒక కరోర్ పతితో సయితం నిర్భయంగా, నింపాదిగా, దబాయింపుగా ఎలా మాట్లాడగలిగాడు భరత్....!!!


                              *    *    *


    భరత్ ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. శుక్రాచార్య నిలబడి రోడ్డంతా జలంలా పారున్న జనంవేపు చూస్తున్నాడు.

    గమ్మత్తుగా ఉందీ వ్యవహారం!

    శశాంక తేజదత్త కోటీశ్వరుడు బ్రహ్మాండమైన పలుకుబడిగల వ్యక్తి అతని కొడుకును తాను రక్షిస్తామనగానే, కలుస్తామనగానే వెంటనే ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు.

    తాము అపరిచితులు.

    ఇందులో ప్రమాదం ఏదీ రాదు కదా! వస్తే.... తప్పించుకోవటం ఎలా!

    అదే ప్రశ్న భరత్ శుక్రాచార్యని వేసాడు.

    శుక్రాచార్య చిన్నగా నవ్వాడు.

    "తాగేవాడికి తూలతాననే భయం ఉండకూడదు."
   
    అది కాదు....

    "శశాంక మనుషులు కారులో వస్తారు. మనల్ని ఎలా గుర్తుపడతారు....ఎలా.... ఏదైనా గుర్తులు చెప్తే బావుండేదేమో.... కనీసం వారి కారు నెంబరయినా అడిగినా బావుండేదేమో."

    భరత్ సందేహం వెల్లుగ్రక్కాడు.

    "నిజమే...." శుక్రాచార్య అన్నాడు.

    "ఇప్పుడెలా" భరత్.

    శుక్రాచార్య మాట్లాడలేదు. ఎదురుగా రోడ్డుకు ఒక ప్రక్కగా వచ్చి ఆగిన అందమైన మారుతీ కారువేపు చూస్తున్నాడు.

    ఆ కారు నీలం రంగులో అందంగా వుంది. అందులో ఒకే ఒక అమ్మాయి నెమలిలా వుంది. ఆ అమ్మాయి కారు డోరు తీసుకుని బయటికొచ్చింది. నిలబడి అటూ ఇటూ చూసింది.

    ఆ అమ్మాయి చాలా పొడవుగా వుంది. ఎర్రగా వుంది. బాల్డ్ హెయిర్ గాలికి ఊగుతూ ముఖమ్మీద పడుతోంది. సల్వార్, పైజమా వేసుకుని వుంది. అందమైన ఆమె కళ్ళకున్న అతి అందమైన కళ్ళద్దాలను తీసి అటూ ఇటూ చూస్తోంది.

    శుక్రాచార్య భరత్ కి ఆ అమ్మాయిని చూపించాడు.

    భరత్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

    "మనకోసమేనా?"

    "కావచ్చు"

    "శశాంక అమ్మాయినే ఎందుకు పంపించాడు" భరత్ సీరియస్ గా ప్రశ్నించాడు.

    "ముందా అమ్మాయి మనకోసమే వచ్చిందని రుజువుకానీ" శుక్రాచార్య అన్నాడు.

    "మనం వెళ్ళి పలకరిస్తే" భరత్ అన్నాడు.

    ఆ అమ్మాయి__

    ట్రాఫిక్ హైలాండ్ దగ్గరున్న పోలీస్ కానిస్టేబుల్ వేపు వెల్తోంది.

    "కళ్ళజోడు షాపు ఇటుంటే ఆ అమ్మాయి" అటువేపు ఎందుకు వెళ్తోంది.

    భరత్ సందేహం....

    ఆ అమ్మాయి శశాంక మనిషి కాదేమో!

    భరత్ ఆలోచనలు.

    ఆ అమ్మాయి పోలీసును ఏదో అడిగింది. పోలీసు ఏదో చెప్తున్నాడు.

    ఆప్టికల్స్ దుకాణం వేపే చూపించాడు పోలీసు.

    ఆ వెంటనే ఆ అమ్మాయి దక్కన్ ఆప్టికల్ వేపు తిరిగింది.

    రోడ్డు క్రాస్ చేసి, జనం మధ్య నుంచి మెరుపులా, నీలిమేఘంలా దక్కన్ ఆప్టికల్ ముందుకొచ్చి అటూ ఇటూ చూసి లోనకెళ్ళింది. ముందుద్వారం దగ్గరున్న శుక్రాచార్య, భరత్ లకు దాటుకుని.

    భరత్ నిరుత్సాహంగా ఆమెవేపు చూచాడు.

    "కళ్ళద్దాలు కొనుక్కోడానికేమో"

    "బయటికే అందామనుకున్నాడు. మళ్ళీ శుక్రాచార్య ఏమనుకుంటాడోనని నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

    ఒకవేళ శశాంక దగ్గర్నించి వచ్చిన అమ్మాయి అయినా తనెలా అక్కణ్ణించి వచ్చినదాన్నని అపరిచితులతో చెప్పుకుంటుంది.

    గుర్తులెలా?

    ఇదో సమస్య.

    శుక్రాచార్య ఆమెనే చూస్తున్నాడు.

    ఆమె__

    కౌంటర్ దగ్గరున్న వ్యక్తితో మాట్లాడుతోంది.

    అతను ఫోన్ తీసిచ్చాడు.

    ఆ అమ్మాయి చేతి వేళ్ళు సూదుల్లా, సూటిగా చక్కగా ఉన్నాయి.

    ఆ వేళ్ళవేపు చూశాడు శుక్రాచార్య పరీక్షగా__సూటిగా__

    "ఆ అమ్మాయి మనకోసమే వచ్చింది" అన్నాడు భరత్ వేపు తిరిగి.

    "ఎలా" ఆశ్చర్యంగా అడిగాడు భరత్.

    ఆ వేళ్ళ కదలికలు ఏ నెంబరుకు ఫోన్ చేశాయో నాకు తెలుసు.

    అది శశాంక నెంబర్!

    ఆశ్చర్యపోవడం భరత్ వంతయింది.

    శుక్రాచార్య ఇంత తెలివైన వాడా!

    "మరి పలకరిద్దామా"

    "వద్దు"

    "ఆ అమ్మాయి మనల్ని పలకరిస్తుంది."

    "ఎలా...." అడుగుదామనుకున్న భరత్ ప్రశ్న అతనిలోనే ఉండిపోయింది.

    ఇంతలో అమ్మాయి__

    ఎవరితోనో మాట్లాడ్డం పూర్తి కావడం....పర్సులోంచి డబ్బులు తీసి కౌంటరులోని వ్యక్తికివ్వడం....

    వెనక్కి తిరిగి ద్వార బంధం దగ్గరికి రావడం....

    శుక్రాచార్య అదే సమయానికి ముందుకి కదలడం క్షణాల్లో జరిగాయి.

    ఆ అమ్మాయి కళ్ళవేపే చూశాడు శుక్రాచార్య ఒక్క క్షణం.

    ఆ అమ్మాయికి మాత్రమే వినిపించేట్టుగా ఒక నెంబర్ చెప్పాడు.

    అది ఆ అమ్మాయి చేసిన ఫోన్ నెంబర్.

    ఆ మాట ఆ అమ్మాయిని ఆశ్చర్యంలో ముంచలేదు.

    చిర్నవ్వు నవ్వింది.

    "మీతోపాటు ఇంకోవ్యక్తి వుండాలనుకుంటున్నాను"

    మెట్ల దగ్గర నిలబడ్డ భరత్ పక్కకొచ్చి నిలబడ్డాడు.

    ఆ అమ్మాయి అతనివేపు చూసింది.

    "రండి" అంటూ ముందుకు కదిలింది.

    నాగిని హొయలుకు ఆకర్షితులై వెళ్ళే మంత్రగాళ్ళులా....

    శుక్రాచార్య, భరత్ కదిలారు.

 Previous Page Next Page