ఖంగారు పడిపోయాడు భాగవతార్. అతడికంటికా ఫైల్ పడగలు విప్పి బుసలు కొడుతున్న ఏడుతలల నాగరాజులా, పళ్ళు పటపట నూరుతూ వికటాట్టహాసం చేస్తూన్న పిశాచిలా కనిపించింది. వొళ్ళంతా చెమటలు పట్టాయి. చేతుల్లోంచి ఫైల్ జారిపోయి కాగితాలన్నీ పైన తిరుగుతూన్న సీలింగ్ ఫాన్ గాలికి నాలుగు పక్కలకి ఎగిరిపోయాయి. మరింత ఖంగారుపడుతూ జనం మధ్యలోకి చొచ్చుకుంటూ పోయి ఎగురుతూన్న కాగితాలు అందుకోడానికి ప్రయత్నిస్తూంటే మృదుల సాయం చెయ్యబోయింది. మరింత నెర్వస్ గా "వద్దు-వద్దు. నువ్వు రాకు. అలా కూర్చో" అని మృదులను దూరంగా చెయ్యిపట్టుకుని లాక్కెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి మళ్ళీ కాగితాలవేట మొదలుపెట్టాడు. తలో మూలకెగిరి ఉత్తరంవైపు కాగితాలు యేరుకోబోతూంటే దక్షిణంవైపు మరొకవేపు ఎగిరిపోతున్నాయి. ఇతని అవస్థచూసి పాసెంజర్స్ లో కొందరు నవ్వుకుంటున్నారు- కొందరు చిరాకుపడ్డారు- కొందరు సాయం చెయ్యబోతే-
"వొద్దు, వొద్దు ఆ కాగితాలు తియ్యకండి," అని గట్టిగా అరిచేసాడు. అందరూ తలలు తిప్పి తనవేపు చూసేసరికి సంకోచపడి నర్వెస్ గా అయిపోతూ ఎవరూ అడక్కుండానే, "దటీజ్ మై పర్సనల్ ఫైల్", అని ఎవరికో సంజాయిషీ యిచ్చి కాగితాలన్నీ చేతికందినట్లు ఫైల్ లో కూరసాగాడు. ఈ ప్రయత్నంలో ఇద్దరు ముగురికీ ఢీ కొట్టాడు. ఒకడి కాళ్ళ సందులో దూరి కాలి దెబ్బతిన్నాడు. మరొకడి ఎయిర్ బేగ్ మీదుగా ముందుకొంగి అతడు కసురుకుంటే బిక్కచచ్చిపోయి, "నా పేపర్" అని గొణిగాడు. దాదాపు పదిహేను నిముషాలు ఎయిర్ పోర్ట్ లౌంజ్ లో కురుక్షేత్రంలో అభిమన్యుడిలాగ తిరిగేసాడు. చుట్టుపక్కల కాగితాలేమీ కనపడలేదు. కొన్ని కాగితాలు పోయాయేమోనని అనుమానం వచ్చింది. కాని ఎటు చూసినా సామానులు- మనుష్యులు- వీటిమధ్య ఇంకా జాగ్రత్తలు వెతికేందుకు అవకాశం లేదు. ఫైల్ చంకన పెట్టుకుని రేగిన జుట్టుతో- చెమటలు పట్టిన వొంటితో- కాందిశీకుడిలాగ మృదుల దగ్గిరకొచ్చి, "పద," అన్నాడు బిక్కమొహంతో. అప్పటివరకు రుమాలు నోటికడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకుంటోంది మృదుల లేచి, "ఫైల్ ఇలా యియ్యి. నేను పట్టుకుంటాను," అంది. "వొద్దు, వొద్దు. అది పరసనల్ ఫైల్" ఖంగారు ఖంగారుగా లౌంజ్ లో అందరికీ సంజాయిషి యిచ్చుకున్న అలవాటుతో అవే మాటలు చెప్పాడు.
"పర్సనల్ ఫైల్ అయితే నాకు చెప్పడానికేం?"
"పర్సనల్ - పర్సనల్ అంటే అఫీషియల్."
"అమెరికానుంచి తిరిగి రాగానే ఇండియన్ గవర్నమెంటు నీకు ప్రత్యేకించి యేదేనా అఫీషియల్ ఫైల్ పంపించిందా?" అడుగుతూనే ఫకాలున నవ్వింది మృదుల. మృదుల సాధారణంగా పట్టినపట్టు వదలదు. ఫైల్ నుంచి ఆమె దృష్టి ఎలా మళ్ళించాలని ఆలోచిస్తూ, "బొంబాయిలో నీకు కారెలా వచ్చింది?" అడిగాడు.
"ఈ కారు లాయర్ యశోధరాదేవిది. ఆవిడ మా కరదీపిక. అంతర్జాతీయ మహిళా సంస్థకి అధ్యక్షురాలు."
"అయితే నేనొస్తున్నట్లు ఆవిడకెలా తెలుసు? మింగియార్ ఇక్కడిక్కూడా వచ్చి మీకందరికీ థాట్ రీడింగ్ నేర్పిస్తున్నాడా?"
నవ్వింది మృదుల.
"నిజం చెప్పేయమంటావా?"
కూర్చున్నవాడు బిగిసిపోయినట్లేయ్యాడు భాగవతార్.
"చెప్పు" అన్నాడు ఎరుపుకు తిరుగుతూన్న కళ్ళతో.
"ముందుగానే హెచ్చరిస్తూన్నాను. నేను చెప్పబోయే విషయం నీకు బాధ కలిగిస్తుంది."
"చెప్పు", సీరియస్ గా- కరుగ్గా అన్నాడు భాగవతార్.
అతని ముఖంలోకి చూసి చెయ్యి నోటి కడ్డుపెట్టుకొని నవ్వి చెప్పింది.
ఇవాళ దేవకి అమెరికా నుంచి వస్తూన్నట్లు యశోధరాదేవికి కబురంపింది. దేవకిని కరదీపిక కార్యాలయానికి తీసుకురమ్మనమని కారిచ్చి నన్ను పంపింది. గమ్మత్తుగా నువ్వు కనపడ్డావు. ఎందువలనో దేవకి రాలేదు."
భాగవతార్ కళ్ళల్లో ఎరుపు యెగిరిపోయింది. నీలినీడలు కమ్ముకున్నాయి. "ఓగాడ్!" అని రెండు చేతులతో మొహం కప్పుకున్నాడు.
లాయర్ యశోధరాదేవికి ఎనభై యేళ్ళు. అయినా పరిపూర్ణ ఆరోగ్యంతో వుంది. ఈ రోజుకి ఆవిడున్నంత చురుగ్గా, సమర్ధంగా చిన్నపిల్లలు కూడా పని చెయ్యలేరు. ఆడదానిని సమాజం అన్నివిధాలా అణచివుంచాలని ప్రయత్నించే రోజుల్లో స్త్రీకి విద్య అవసరమా, అనవసరమా- అని చర్చలు సాగే రోజుల్లో తనదైన వ్యక్తిత్వానికి ఊపిరి పోసుకోవాలని విలవిలలాడిపోయిన మహిళ యశోధరాదేవి. చదువు, సంస్కారము వున్న యింట్లో పుట్టింది యశోధర. ఆ కారణంవల్లనే ఆ రోజుల్లోనే మెట్రిక్యూలేషన్ పాసయ్యాక పెళ్ళి జరిపించారు పెద్దవాళ్ళు, హిందూ కుటుంబాలలో జరిగే అన్ని పెళ్ళిళ్ళలో లాగానే వరుడు రూపురేఖలు- ఆస్తిపాస్తులు- చదువు- కుటుంబ మర్యాదలు యివన్నీ ఆలోచించి పెళ్ళిచేసారు. యశోధర స్థానంలో వున్న మరో స్త్రీ అయినా తను చాలా అదృష్టవంతురాలనని అనుకొని, సుఖంగా తిని పడుకొని కాలం గడిపేసేది కాని యశోధర మాత్రం తినడం- పడుకోవడం- బట్టలు కట్టుకోవడం- యిదే జీవితంకాదు ఏదో చెయ్యాలి. ఆ రోజుల్లోనే యశోధర పెద్దమ్మ కూతుర్ని, అందంగా లేదన్న కారణంతో ఆమె భర్త వొదిలేసి మరో పెళ్ళి చేసుకున్నాడు. ఆడదానికి పతి పాదసేవే శరణ్యమనే బోధలు జీర్ణం చేసుకున్న ఆ అమ్మాయి సవతికి- సవతి బిడ్డలకి సేవలు చేసుకుంటూ భర్తదగ్గిరే వుంటానని ప్రయాణమైయ్యింది. ఈ రకమైన ఆదర్శాన్ని అర్ధం చేసుకోలేని యశోధర. "అతడు నిన్ను వొదిలేసి మరెవరినో పెళ్ళి చేసుకుంటే అతనికీ నీ సవతికి- సవతి పిల్లలకి సేవలు చేస్తానని బయలుదేరుతున్నావు. నీకవమానంగా లేదా!" అని అడిగింది. ఆవిడ నిట్టూర్చి "ఆడదానికి ఎన్నుంటే యేం లాభం? అవన్నీ సాగుతాయా యేం లాభం? అవన్నీ సాగుతాయా అభిమానపడి నేను చెయ్యగలిగిందేముంది? ఇక్కడుంటే. వదినలకి అన్నదమ్ముల పిల్లలకి సేవలు చెయ్యాలి. ఈ చాకిరీ యేదో అక్కడే చేసుకుంటే కనీసం మొగుడింట్లో పడుందన్న గౌరవమైనా దక్కుతుంది"సమాధానం చెప్పిందావిడ నిరాశగా. ఆవిడ మాటల్లో చేదు నిజాన్ని గుర్తించింది యశోధర మనసు. ఆడదానికి జరుగుతూన్న అన్యాయానికి ఆవిడ మనసు విలవిల్లాడిపోయింది. ఎలాగైనా స్త్రీకి న్యాయం చేకూర్చాలనే తపన ఆమెలో లాయర్ కావాలనే సంకల్పానికి దారితీసింది. కాలేజీలో చేరి చదువుకుంటానని యింట్లో వాళ్ళనడిగింది. అదేదో వినకూడని ఘోరమైన మాట విన్నట్లు బుగ్గలు నొక్కుకుని మూతులు విరుచుకున్నారు భర్తతో సహా అందరూ. అయినా ఆవిడ సంకల్పం చెదరలేదు. చదువుకుంటే నిన్ను వదిలేస్తానన్నాడు భర్త. ఆవిడ నవ్వుకుంది.నా చదువుకోసం అవసరమైతే నేనే వొదిలేస్తాను అనుకుంది మనసులో. పుట్టింటివారు కూడా యశోధర చదువుకోసం సంసారాన్ని వొదిలేయడానికి సుముఖత చూపించలేదు. సాధారణ హిందూ కుటుంబాలలో మరీ దారుణమైన పరిస్థితులెదురయితే తప్ప సంసారాలు పాడు చేసుకోవడానికి ఆడపిల్లల తల్లిదండ్రులెవరూ యీనాటికి వొప్పుకోరు. యశోధర ఎవర్ని లెక్క చెయ్యలేదు. ఎవరి అండ కోరలేదు. అత్తవారిల్లు వొదిలేసి మెడ్రాస్ కి వచ్చి కాన్వెంట్ హాస్టల్లో చేరి తిరిగి చదువు ప్రారంభించింది. కూతురి పట్టుదల గుర్తించిన తండ్రి చేయూతనిచ్చాడు. యశోధర భర్త రెండో పెళ్ళి చేసుకోవాలనప్పుడు తన ఆమోదాన్ని వ్రాతపూర్వకంగా యిచ్చేసింది యశోధర. లాయర్ గా పట్టా పుచ్చుకుని స్థిర సంకల్పంతో తన జీవితధ్యేయం నెరవేర్చుకోడానికి నల్లకోటుతో కోర్టులో ప్రవేశించింది. ప్రధానంగా స్త్రీలకి జరుగుతున్న అన్యాయాల గురించి వాదించి స్త్రీ జాతికి న్యాయం చేకూర్చాలనేది యశోధర ఆశయం.
అయితే ఆమెకు త్వరలోనే ఒక విషయం అర్ధమైంది. సమాజంలో యెన్నెన్నో రకాలుగా అన్యాయానికి గురవుతున్న ఆడవాళ్ళు ఎందరో వున్నా- "నాకు అన్యాయం జరిగింది" అని ముందుకొచ్చి చెప్పుకునే ఆడవాళ్ళు మాత్రం చాలా తక్కువ. వాళ్ళల్లోనూ కోర్టులవరకూ వచ్చేవారు మరీ తక్కువ పాయింటు అయిదు సున్నాలు ఒకటి శాతం అని చెప్పుకోవచ్చు. ఉసూరుమని పోయింది యశోధర. ఎంతో చెయ్యాలని వుంది. చేని ఏం చెయ్యగలదు? ఈ ఆడవాళ్ళు యిరుగుపొరుగు అమ్మలక్కలతో మొగుడిమీద - అత్తగారిమీద నేరాలు చెప్పుకోడానికి మించి యేమీ ఆలోచించటంలేదు.
తలవని తలంపుగా ఆమెకి ఒక విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఏదో కోర్టుకేసు సందర్భంగా ఆవిడ ఏలూరు వెళ్ళవలసి వచ్చింది. ఆనాటికి ఏలూరు లాంటి టౌన్స్ లో ఆడవాళ్ళు నేరుగా బసచేయతగ్గ హోటల్స్ ఏమీలేవు. తెలిసిన లాయర్ ఆహ్వానం మీద అతడి యింట్లో బసచేసింది. భోజన సమయంలో వడ్డిస్తోన్న వంటమనిషిని చూసి నివ్వెరపోయింది. ఆవిడ తన భర్త రెండో భార్య. ఆవిడని తన గదిలోకి పిలిపించుకుని వివరాలు అడిగింది.
యశోధర సవతికి పిల్లలు పుట్టలేదన్న కారణంతో భర్త మూడోపెళ్ళి కూడా చేసుకున్నాడు. కొన్నాళ్ళు భర్త యింట్లోనే వంట మనిషిగా గడిపింది. ఒకరోజు ఆవిడకి తీవ్రంగా జ్వరం వచ్చింది. తగిన మందు మాకు- ఆలనాపాలనా లేక టైఫాయిడ్ లోకి దింపింది. ఆరోగ్యంగా వున్నన్నాళ్ళూ ఆవిడచేత సకల సేవలు చేయించుకున్న ఇంట్లోవాళ్ళు, ఆమె అతీగతీ పట్టించుకోకపోగా అంటురోగమని పేరుపెట్టి గవర్నమెంటు హాస్పిటల్ లో పడేసి చేతులు దులుపుకున్నారు. ఆయుద్దాయం గట్టిగా వుండబట్టి బతికి బయటపడ్డ ఆవిడకి భర్త యింటికి వెళ్ళాలనిపించలేదు. హాస్పిటల్ లో డాక్టరే ఇక్కడ వంటమనిషిగా పనిచూపించాడు. జీతం బత్తెం లేకుండా భర్త యింట్లో పడివుండడం కంటే జీతమిస్తూ తనని గౌరవంగా చూస్తూ మూడుపూటలా కడుపునిండా తిండిపెట్టే యీ యింట్లో వుండడమే ఎంతో బాగుందావిడకి.
అంతా విని కదిలిపోయింది యశోధర. మెడ్రాస్ వచ్చాక కూడా తీవ్రంగా ఈ విషయాలే ఆలోచించసాగింది. ఆ ఆలోచనల ప్రతిఫలమే "కరదీపిక సంస్థ" కరదీపిక మహిళాసంస్థలో మొట్టమొదటి సభ్యురాలు యశోధర సవతి. సంగీతంలో ప్రవేశము- ప్రావీణ్యమూ వున్న సవతికి ఒక సంవత్సరంపాటు బాగా సంగీతం నేర్పించి అప్పటి ఆడపిల్లల గవర్నమెంటు స్కూల్లో సంగీతం టీచర్ గా చేర్పించినప్పుడు యశోధర పొందిన ఆనందం వర్ణనాతీతం. అప్పటివరకు కోర్టులో ఆవిడ సాధించిన విజయాలు, పొందిన ప్రశంసలు- ఏవీ ఆమెకంత ఆనందాన్ని కలిగించలేదు. అలా ప్రారంభమైన కరదీపిక సంస్థ క్రమక్రమంగా శాఖోపశాఖలుగా విస్తరిల్లి అంతర్జాతీయ సంస్థగా రూపుదిద్దుకుంది.
* * *